అవును.. పులిరాజాకు కరోనా వచ్చింది!

640

(మార్తి సుబ్రహ్మణ్యం)

అప్పుడెప్పుడో.. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? అన్న ప్రకటన అందరినీ భలే ఆకట్టుకుంది. అసలు పులిరాజాకు ఎయిడ్స్ రావడమేమిటని అంతా నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోయారు. అది కొన్నేళ్లు జనం నోటిలో నానింది. ఇప్పుడు పులికి కరోనా వచ్చిందన్న వార్త కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమయింది. మనుషులకే కాదు. పులులకూ కరోనా వస్తుందా? గబ్బిలాల వల్లనే కరోనా వస్తుందనే ఇప్పటి వరకూ చాలామంది భావిస్తున్నారు. చైనా వాళ్లు గబ్బిలాలు, పాములు, కప్పలు తినే కరోనా తెచ్చుకున్నారన్న, మానసిక భావన చాలామందిలో ఉంది. అయితే, పులికి కరోనా రావడమేమిటన్న చర్చ ఇప్పుడు మొదలయింది.

 

ఇంతకూ ఏం జరిగిందంటే.. న్యూయార్క్‌ బ్రాంగ్జ్ జూపార్క్‌లో నదియా అనే నాలుగేళ్ల పులికి, కరోనా లక్షణాలున్నాయని జూ నిర్వహకులు కనిపెట్టారు. అసలు జూలో తన మానాన తాను మాంసం తింటూ, సందర్శకుల ఫొటోలకు ఫోజులిచ్చే పులిరాజాకు, కరోనా రావడమేమిటని ప్రపంచమంతా నోరెళ్లబెట్టింది. మరి ఏం జరిగిందని జూ అధికారులు ఆరా తీస్తే, సదరు పులిరాజా బాగోగులు చూసుకునే సంరక్షకుడి నుంచి, దానికి కరోనా అంటినట్లు తేల్చారు. ఒక్కపులిరాజానే కాదు, జూలోని సింహాలకూ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ దెబ్బతో మనదేశంలో కూడా, జూలో ఉన్న జంతువుల పట్ల జాగ్రత్తలు తీసుకునేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఎప్పటికప్పుడు వాటి లక్షణాలు గమనించాలని, జూ అధికారులను ఆదేశించింది. పాపం.. చివరకు జూలో ఉండే జంతువులకూ  కరోనా కలవరం తప్పలేదు. ఏం చేస్తాం?..  అంతా కరోనా కలికాలం!