ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కేసీఆర్ కరోనా శాపాలు

327

పిచ్చిరాతలు, పిచ్చికూతలంటూ ఫైర్
(మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మళ్లీ కోపం వచ్చింది. ఎవరిమీద అనుకుంటున్నారు? ఇంకెవరు? ఆయన మాజీ మిత్రుడైన ఆంధ్రజ్యోతి రాధా..కృష్ణ మీద! ఎందుకంటారా? ఈ కరోనా కల్లోల సమయంలో కూడా సర్కారుకు సహకరించకుండా పిచ్చిరాతలు రాస్తున్నారంటూ, ఆంధ్రజ్యోతి పేరెత్తకుండానే దులిపిపారేశారు. తాజాగా కేసీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్, మామూలు కరోనా సీజన్ ప్రెస్‌మీట్‌కు భిన్నంగానే సాగింది. కేసీఆర్ కూడా, ప్రశ్నలు వేసిన జర్నలిస్టులతో గత వారం క్రితం మాదిరిగా కాకుండా, సరదాగా మాట్లాడారు.

కానీ, అంతలోనే ఆంధ్రజ్యోతి రాతలపై అగ్గిరాముడయ్యారు. ఇంత క్లిష్ట పరిస్థితిలో ప్రభుత్వం, పోలీసులు, వైద్యసిబ్బంది నానా చావు చస్తుంటే, సహకరించాల్సింది పోయి, పిచ్చిరాతలు రాస్తారా? అంటూ కన్నెర్ర చేశారు. అంతటితో ఆగకుండా.. ఇలాంటి వాళ్లకు కరోనా రావాలని మునిశాపం పెట్టారు. ‘సమాజానికి నర్సులు, పోలీసులు సేవచేస్తున్నారు. చివరకు బీడీ కార్మికులు కూడా సాయం చేస్తున్నరు.  ఈ టైమ్‌లో సహకరించాల్సిన పత్రికలు చిల్లరరాతలు రాస్తున్నాయి. చిల్లర రాతలనిఎందుకంటున్నాననంటే వాళ్లు దుర్మార్గాలు మానుకోవడంలేదు. తెలిసీ తెలియని పిచ్చిరాతలు రాస్తున్నారు. వైద్యులకు రక్షణ ఏదీ అని రాశారు. వైద్యులకు ప్రభుత్వం రక్షణ ఇవ్వక, ఈ పత్రికాయన ఇస్తాడా? ఏమైనా మైండు ఉండాల. ఎందుకు రాయాల. సంస్కారం ఉండాల. బుద్ధి, జ్ఞానం ఉండాల ఏమైన. పీపీఈ కిట్లు లేవని రాశారు.  మాదగ్గర 40 వేలున్నాయి. నీకు తెలుసా లెక్క? ఈ టైంలో మనోధైర్యం కల్పించాల్సిందిపోయి, డాక్టర్ల మనోధైర్యం కోల్పోయాలా వెకిలివార్తలు రాయడం. దేనికి  పనికివస్తుందండి?  వీళ్లా దేశాన్ని కాపాడేటోళ్లు?  దేశనికి పనికివస్తాయా ఈ ప్రతికలు? ఈ రాతలు?  ఇది దుర్మార్గం,  హేయం. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెడతవా? నీ బొందపెడతవా? చేతనైతే రెండు మంచి వార్తలు రాయి.  లేకపోతే ఇంట్లో పండుకో’ అని రాధాకృష్ణకు పరోక్షంగా ఘాటు శాపనార్థనాలు పెట్టారు.  వెకిలి, మకిలి, బుద్ధిలేని వార్తలు రాస్తున్నారని విరుచుకుపడ్డారు. దేశద్రోహులు, ప్రజాద్రోహులని మండిపడ్డారు. చివరాఖరకు.. ఇలాంటి వారిని ఊరికే విడిచిపెట్టమని, కేసీఆర్ చెప్పాడంటే ఖతర్నాక్ ఉంటుందని భవిష్యవాణి వినిపించారు.

ఇంతకూ కేసీఆర్‌కు,  ఆంధ్రజ్యోతిపై అంత ఆగ్రహం ఎందుకొచ్చిదంటే.. కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యులకు రక్షణ ఏదీ అన్న కథనం ఒకటి ఆంధ్రజ్యోతి తాజాగా ప్రచురించింది. అందులో వారికి రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని, వారిపై దాడులు జరుగుతున్నాయన్న కథనం వెలువడింది. దానితోపాటు.. ఉపాథికి ఉసురు తగులుతోందని, కరోనా భయంతో కూలీలు ఇల్లు కదలడం లేదని మరో కథనం ప్రచురించింది. ఇలా.. కరోనా సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకువస్తోంది. మిగిలిన పత్రికలు ఆ సాహసం చేయడం లేదు. అది వేరే కథ! అయితే.. ఆ వార్తలు, కథనాలు.. ధైర్యంగా సేవలందిస్తున్న వైద్యుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయన్నది కేసీఆర్ వాదన. ఆవేదన. రాజకీయాలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. అప్పుడు చూసుకుందామన్నది ఆయన హితబోధ!

మరి రాధాకృష్ణ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. సహజంగా రాదాకృష్ణ వీటిపై మళ్లీ ఎదురుదాడి చేస్తారు. ఎవరికీ భయపడేది లేదని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని ప్రతి సవాల్ చేస్తారు. ఆంధ్రజ్యోతి ఎవరికీ కొమ్ముకాయదని, దీన్ని సద్విమర్శగా తీసుకుని, లోపాలు సవరించుకునేందుకు ప్రయత్నించుకుంటే మంచిదని హితవు పలుకుతారు. ఎందుకంటే.. తెలంగాణ ప్రభుత్వం ఆయన పత్రికకు ప్రకటనలేమీ ఇవ్వడం లేదు. కాబట్టి, కొత్తగా కేసీఆర్ సర్కారు వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఏదో పోతుందన్న భయమూ లేదు. అందువల్ల ఉన్నది ఉన్నట్లు రాస్తే,  ప్రజల్లో క్రెడిబిలిటీ అయినా ఉంటుంది. అదీ ఆయన ఆయన లెక్క! అయినా.. ‘లెక్కల’ మాస్టారయిన రాధాకృష్ణ  ఫిలాసఫీ కేసీఆర్‌కు తెలియనిది కాదు. కేసీఆర్ సైకాలజీ రాధా..కృష్ణకూ కొత్తకాదు. తొలుత.. కేసీఆర్ సర్కారుపై మడమ తిప్పకుండా యుద్ధం చేసిన రాధాకృష్ణలో..  కేసీఆర్ యాగం తర్వాత మార్పు రాలేదూ?!  ఏదేమైనా.. విలేకరుల సాక్షిగా కేసీఆర్, ఆంధ్రజ్యోతిని పేరుపెట్టకుండా తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి, మళ్లీ.. ఈ తిట్లన్నీ ఇలాంటి వెకిలి-మకిలి వార్తలు రాసే వాళ్లకేనని మినహాయింపు కూడా ఇచ్చారు. దటీజ్ కేసీఆర్!