కరోనాపై నిజాలు చెబుతున్నారా?

728

ఏపీలో వైద్యులకు అందని రక్షణ కిట్లు
డాక్టర్లకు వారానికోసారి మాస్కులా?
కేసీఆరే నయమన్న ఓ డాక్టర్ వీడియో హల్‌చల్
క్వారంటైన్ సెంటర్లలో రోగుల నిరసన దీక్షలు
ఆలస్యంగా మృతుల లెక్కల్లో మతలబేమిటి?
బాబు, కన్నా, పవన్ అనుమానం
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘పేరుకే 150 పడకల ఆసుపత్రి. కనీస సౌకర్యాలు కరవు. డాక్టర్లకే ఒక మాస్క్ ఇచ్చి, దానిని 15 రోజులు వాడమంటున్నారు. మళ్లీ దానికి సంతకం కూడా తీసుకుంటున్నారు.  తెలంగాణలో ఆ కేసీఆరే నయం. డాక్టర్లకు అన్ని సౌకర్యలు చూస్తున్నారు. ఇక్కడ పోలీసులు మమ్మల్ని దొబ్బెయ్యమంటున్నారు. డాక్టర్లంటే అంత లోకువా? డీసీహెచ్‌కు చెబితే జాబ్ మానేయమంటారు. ఒక ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ ఆసుపత్రిని విజిట్ చేయరు. ఆసుపత్రి దుస్థితిపై జిల్లా కోఆర్డినేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. గైనకాలజిస్టు కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నాం. అనుభవం లేని జూనియర్ వైద్యురాలితో ఆపరేషన్లు చేయిస్తున్నారు. కరోనా విజృంభణపై అవసరమైతే ప్రధానికి ఫిర్యాదు చేస్తా’.. ఈ విమర్శలు ‘గుడివాడ నీయమ్మమొగుడుమంత్రి’ చెప్పినట్లు ఏ సన్నాసిదో, చైనా గాడిదో, విపక్ష నాయకుడిదో కాదు. స్వయంగా.. కరోనా యుద్ధక్షేత్రంలో మొదటి వరసలో నిలబడి, సమరం సాగిస్తోన్న ఓ వైద్య సైనికుడివి! ఇలాగైతే మొత్తం నర్సీపట్నం మొత్తానికి కరోనా వచ్చినా ఆశ్చర్యపోవలసిన పనిలేదన్న ఆ నర్సీపట్నం ప్రభుత్వ డాక్టర్ ఆందోళన.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో యుద్ధం చేస్తున్న  వైద్య నారాయణుల దుస్థితికి, మానసిక పరిస్థితికి అద్దం పడుతోంది.

నర్సీపట్నం ఆసుపత్రి ఉత్తరాంధ్రలో చివరలో ఉంటుంది. అక్కడ 150 పడకల ఆసుపత్రి ఉంది. అయితే, అక్కడ వైద్యులు లేరు. ఇప్పుడెవరైనా కరోనా అనుమానిత రోగులుంటే వారికి తొలుత చికిత్స, పరీక్షలు చేసేది అక్కడే. కానీ, తమకు కనీసం ఎన్-95 మాస్కు కూడా ఇవ్వడం లేదని, ఇలాగైతే నర్సీపట్నం మొత్తానికి కరోనా వచ్చినా ఆశ్చర్యపోవలసిన పనిలేదని, డాక్టర్ సుధాకర్‌రావు అనే అనస్తీషియాలజిస్ట్ చేసిన వ్యాఖ్య.. ఏపీలో కరోనా అనుమానితులకు వైద్యం చేస్తున్న డాక్టర్ల రక్షణకు అద్దం పడుతోంది. ఆ మేరకు సదరు డాక్టర్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, డాక్టర్లకు అన్ని రక్షణ చర్యలూ తీసుకుంటున్నారని చేసిన వ్యాఖ్య,  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పనితీరుకు అద్దం పడుతోంది.

 

 

నర్సీపట్నంలో ఆరోపణలు చేసిన వ్యక్తి అసలు డాక్టర్ ఏనా ? రాజకీయ నాయకుడా ?

సీఎంలను వాడు వీడు అంటున్న ఆ డాక్టర్ కి ఎంత బలుపు..

డాక్టర్ ఆరోపణ చేసిన ఆసుపత్రిలోనే 20పీపీఈలు ఉన్నాయి..

అసలు ఆ ఆసుపత్రి కరోనా ఆసుపత్రి కాదు..

*ఏపీలో 7 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు*

రోజుకు 1175 మందికి కరోనా పరీక్షలు..

24000 వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి..

ఎన్‌-95 మాస్క్‌లు,పీపీఈ కిట్స్‌ సమృద్ధిగా ఉన్నాయి..

ప్రభుత్వంపై దుష్ర్ఫచారం మానుకోవాలి.

-ఏపీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య

 

మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వకుండా వైద్యం చేయాలా?

ఏపీలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. కరోనా అనుమానితులకు చికత్సలు, పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బందికి, సరైన రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రధానంగా ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, గ్లౌజుల కొరత డాక్టర్లను పట్టిపీడిస్తోంది. ఇప్పటికే విశాఖలో కరోనాకు చికిత్స, పరీక్షలు చేస్తున్న నలుగురు జూనియర్ డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులకు కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడగా, అందులో ఇద్దరు స్టాఫ్ నర్సులు ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ల బదులు.. డిస్పోజబుల్ గౌన్లు, ఎయిడ్స్, డెలివరీ సమయాల్లో సిబ్బందికి ఇచ్చే డిస్పోజబుల్ గౌన్లతో.. చికిత్స చేస్తున్న దారుణ పరిస్థితి. ఇలాగైతే కరోనా రాదా? అని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈఎన్‌టి వైద్యులకే ఎన్-95 మాస్కులు, పీపీఈలు  ఇస్తున్నారంటే, వైద్య నారాయణులు ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారో స్పష్టమవుతోంది.

పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏపీవీవీసీ ఆసుపత్రులలో మరీ దారుణం. హెచ్‌డీఎస్ నిధుల నుంచి, క్లాత్ మాస్కులు కుట్టించుకోవాలని  ఏపీవీవీపి కమిషనే ఆదేశాలు ఇచ్చిందంటే.. మండల, పట్టణ స్థాయి ఆసుపత్రులు,  తమకు  ఏ స్ధాయిలో రక్షణ ఇస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 16 మంది సిబ్బందికి కలిపి 2 కిట్లు, వాటిలో 12  గౌన్లు మాత్రమే ఉన్నాయంటే, డాక్టర్లు ఏ స్థాయిలో తమ ప్రాణాలు పణంగా పెట్టి, కరోనా యుద్ధం చేస్తున్నారో అర్ధమవుతుంది. చివరకు గ్రామాల్లో పంచాయతీలకు నిధులు లేక, బ్లీచింగ్ కూడా చల్లలేని దుస్థితి ఉందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

లెక్కలపై ఎందుకీ ప్రతిష్ఠ?

ఇవన్నీ ఒక ఎత్తయితే.. అసలు కరోనా మరణాలపై ఏపీ సర్కారు నిజమే చెబుతోందా? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తొలిసారి అనుమానం వ్యక్తం చేయగా, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా అలాంటి అనుమానం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌దీ అదే దారి. యుద్ధం చేసే సైనికులకు అస్త్రాలు ఇవ్వకుండా యుద్ధానికి పంపిస్తారా? అని పవన్ ఇప్పటికే విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఒకరు, కృష్ణా జిల్లా బందురులో మరో కరోనా అనుమానితుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందితే, సోమవారం నాటికి గాని వారు కరోనాతో మృతి చెందినట్లు ప్రకటించలేకపోవడం దానికి నిదర్శనంగా చూపిస్తున్నారు.

విజయవాడ నుంచి అనంతపురం వరకూ..

విజయవాడలో తొలి కరోనా మృతిపైనా ప్రభుత్వం ఇలాగే దోబూచులాడింది. మార్చి 30న విజయవాడలో తొలి కరోనా అనుమానితుల్లో ఒకరు మృతి చెందారు. అయితే, కేంద్ర ఆరోగ్యశాఖ బలవంతంగా దానిని, కరోనా మృతిగా వెబ్‌సైట్‌లో పెట్టిన తర్వాతగానీ ఏపీ ప్రభుత్వం.. ఏప్రిల్3న, అంటే నాలుగురోజుల తర్వాత గానీ దానిని కరోనా మృతిగా ప్రకటించలేకపోయింది. మార్చి 30న గానీ రోగికి కరోనా వ చ్చినట్లు  నమూనాల్లో తేలలేదు. అప్పటి వరకూ అనారోగ్య సమస్యగా చెబుతూ, వైద్యం చేస్తున్న వైద్య సిబ్బంది.. రోగి మృతి వార్త తెలిసి ఆందోళన చెందారు.
– కర్నూలులో కరోనాతో మృతి చెందిన మరో రోగి విషయంలోనూ, ప్రభుత్వం ఇదే వైఖరి ప్రదర్శించింది. పాణ్యంకు చెందిన ఓ రోగి గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు.  ఆయనకు కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి, ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఆయన  శుక్రవారం ఐసోలేషన్ వార్డులో చనిపోయారు. అయితే, శుక్రవారం చనిపోతే, ఆదివారం గానీ రోగి.. కరోనాతో మృతి చెందినట్లు ప్రకటించలే క పోయారు. పైగా.. మృతదేహాన్ని తీసుకువెళ్లవచ్చని కూడా బంధువులకు  చెప్పారు. ఇంతకూ రోగి కరోనాతో మృతి చెందినట్లు,  ఆయన బంధువులకూ చెప్పలేదట. నిజానికి ఒక అధికారి పర్యవేక్షణలో మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి, విద్యుత్ దహనవాటిలో అంత్యక్రియలు చేయాల్సి ఉంది. అయితే, అన్ని రోజులు రోగికి వైద్యం చేసిన 30 మంది వైద్య సిబ్బంది,  ఇప్పుడు ఆసుపత్రిలోనే ఉన్న క్వారంటైన్‌లో ఉండటం మరో విషాదం. ఇంతకూ బాధితుడు,  గుండెజబ్బుతో చనిపోయారని ముందు రికార్డుల్లో రాశారట.

– ఇక కర్నూలులోనే రైల్వేలో పనిచేసే రాజస్థానీ యువకుడు కరోనా అనుమాన లక్షణాలు కనిపించాయి. అయితే  అతనిని మూడు రోజులపాటు ఐసోలేషన్ వార్డుకు పంపించకుండా, ఎం.ఎం-3 వార్డులో ఉంచి సాధారణ చికిత్స చేశారు. అంటే మాస్కులు, యూనిఫారం లేకుండానే చికిత్స అందించారు. కానీ ఆ తర్వాత ఆ రోగికి కరోనా పాజిటివ్ అని తేలటంతో, వైద్య సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. అదృష్టవశాత్తూ వారికి నెగటివ్ అని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అది వేరే విషయం.

– అనంతపురం జిల్లా హిందూపురంలో ఒకరు, కృష్ణా జిల్లా బందరులో మరో కరోనా అనుమానితుడు శనివారం మృతి చెందితే..  సోమవారం వారి మృతిని అధికారికంగా ప్రకటించారు.
ఈవిధంగా కరోనా మరణాలపై ప్రభుత్వం ఆలస్యంగా స్పందించడం, లెక్కలు కూడా ఆలస్యంగా ప్రకటిస్తుండటంతో, సహజంగానే ఏపీలో కరోనా మరణాల లెక్కలపై రాజకీయపార్టీల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

క్వారంటైన్‌లో కనీస సౌకర్యాలు లేక నిరసన దీక్షలు

కాగా, రాష్ట్రంలో అనేకచోట్ల ఏర్పాటుచేసిన క్వారంటైన్ సెంటర్లలో, కనీస సౌకర్యలు లేక.. కరోనా అనుమానిత రోగులు చివరకు నిరసన దీక్షలు చేసే పరిస్థితి ఏర్పడింది.
– ప్రకాశం జిల్లా కందుకూరులో  రెండు క్వారంటైన్ సెంటర్లలో ఉన్న రోగులు, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, అక్కడ తమకు కనీస సౌకర్యాలు లేవని నిరసన దీక్ష నిర్వహించారు. గత నెల 31న తమను తీసుకువచ్చి, వైద్య పరీక్షలు నిర్వహించారని, కానీ కనీస సౌకర్యాలు కల్పించకపోతే తామెలా జీవించాలి? మా జీవితాలతో ఆడుకుంటారా? అని ప్రశ్నిస్తూ, ఆందోళన వ్యక్తం చేసిన వైనం మీడియాలో వచ్చింది. వెంటనే జాయింట్ కలెక్టర్ స్పందించి,  హామీ ఇవ్వాల్సి వచ్చింది.

– అనంతపురంలోని ధర్మవరం  ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో క్వారంటైన్‌లో ఉన్న రోగులు, తమకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విరుచుకుపడ్డారు. నిరసనగా భోజనం మానేశారు. దానితో ఆర్.డీ.ఓ రంగంలోకి దిగి, దాతల ద్వారా నాణ్యమైన ఆహారం సమకూర్చాల్సి వచ్చింది.

– నెల్లూరు ఉమ్మారెడ్డిగుంటలో,  కరోనా అనుమానిత రోగి ఒకరు, తన లక్షణాలు చెప్పినా అక్కడి ఆసుపత్రిలో ఎవరూ చేర్చుకోలేదు. చివరకు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినా ఫలితం లేదు. దానితో అతను తన ఇంటిముందే కుప్పకూలిపోయాడు. చివరకు ఓ వైసీపీ నేత జోక్యంతో, అంబులెన్స్‌ను పిలిపించాల్సి వచ్చింది.

అందుకే.. లెక్కలపై నేతల అనుమానాలు!

ఈవిధంగా కరోనా మృతుల లెక్కలన్నీ ఆలస్యంగా వెల్లడిస్తుండటంతో.. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వాటిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కలపై తొలుత అనుమానం వ్యక్తం చేసిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. కరోనా మృతులపై వాస్తవాలు దాచిపెడుతోందని జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. వైద్యులకు రక్షణ కవచాలు ఇవ్వని వైనంపైనా ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మృతుల లెక్కలపై అనుమానం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. మృతుల సంఖ్యను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని ప్రశ్నించారు. విజయవాడ, కాకినాడ, రాజమండ్రి కరోనా మరణాలను ఆయన ఉదహరించారు. ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు కల్పించకపోవడం, డాక్టర్లకు కిట్లు కూడా సమకూర్చకపోవడం ఏమిటని మండిపడ్డారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా లెక్కలపై అనుమానం వ్యక్తం చేశారు. మృతుల లెక్కలు దాచి ఉంచాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి నాని మాత్రం చిన్న చిన్న సమస్యలను కూడా విపక్షాలు భూతద్దంలో చూపిస్తున్నాయని ఎదురుదాడి చేశారు.

1 COMMENT