వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు

505

కరోనా మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తోడ్పడేందుకు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి  ఎంపి ఫండ్స్ నుంచి కోటిరూపాయలు, సుజనా ఫౌండేషన్ నుంచి 50 లక్షలు తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కి ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్ లో అందజేశారు. ఇది కాకుండా ముంబై ఐఐటి అల్యూమిని అసోసియేషన్, తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ వీవర్స్ అసోసియేషన్ సహకారంతో పది లక్షల రూపాయలు విలువ గల ఫేస్ మాస్కులను ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బందికి సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు. ఎంపి ఫండ్స్ నుంచి ఇచ్చిన కోటి రూపాయల్లో ప్రభుత్వాసుపత్రులకు అవసరమైన పరికరాల కొనుగోలుకు సిఎంఆర్ఎఫ్ కు రూ.50 లక్షలు, పోలీసు సిబ్బంది అవసరాలకై డిజిపికి రూ.50 లక్షలు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా ఎంపి వైఎస్ చౌదరి మాట్లాడుతూ కరోనా నిర్మూలనలో వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారన్నారు. వీరితో పాటు పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. కరోనాపై పోరులో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలన్నారు.