నాడు అద్వానీ.. నేడు అమిత్‌షా!

637

విదేశీయుల వీసాలపై ఈసారి ఆరేళ్ల నిషేధం?
కనిపించకుండా పోయిన వారిపై ఐబీ జల్లెడ
(మార్తి సుబ్రహ్మణ్యం)

టూరిస్టు వీసాలపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోనుంది. పర్యాటకులుగా వస్తున్న విదేశీయులు, భారతదేశంలో జరుగుతున్న మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున, వారిని నియంత్రించేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దీనికి కరోనా నేపథ్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ విషయంలో నాటి కేంద్ర హోం మంత్రి అద్వానీ బాటలో నడవాలని నేటి హోంమంత్రి అమిత్‌షా  నిర్ణయించుకున్నట్లు సమాచారం.

టూరిస్టు వీసాలతో భారతదేశంలో అడుగుపెడుతున్న వారిపై నిఘా కొరవడుతోంది. పర్యాటకులు సైతం నిబంధనలు పాటించకుండా, ఫారినర్స్ యాక్ట్‌ను అడ్డగోలుగా ఉల్లంఘిస్తుంటంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా రెండు ప్రధాన మతాలకు చెందిన వారు, టూరిస్టు వీసాలతో వచ్చి, వారి మత ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటుండటం, కొత్త సమస్యలకు దారితీస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిస్సహాయంగా ఉండిపోవలసిన పరిస్థితి కనిపిస్తోంది. వారికి కేంద్రప్రభుత్వమే, వీసాలు మంజూరు చే స్తుండటమే దానికి కారణం.

బుద్దదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆ రాష్ట్రంలో ఓ మతానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు విపరీతంగా జరిగాయి. దానిపై మరో మతానికి చెందిన నేతలు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసి, సీఎంను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు కురిపించాయి. దానితో భట్టాచార్య.. నాటి కేంద్ర హోం మంత్రి అద్వానీకి ఒక లేఖ రాశారు. టూరిస్టు వీసాలపై వచ్చిన విదేశీయులు, తమ రాష్ట్రంలో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున, అనేక సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల వీసా నిబంధనలపై దృష్టి సారించాలని  అద్వానీకి లేఖ రాశారు. దానితో వెంటనే స్పందించిన అద్వానీ, వీసా నిబంధనలు ఉల్లంఘించి మత కార్యక్రమాల్లో పాల్గొనే వారి వీసాలను, రెండేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, ఆ సమయంలో ప్రస్తుతం దేశంలోని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేత బావ, స్వయంగా మత ప్రచారకుడైన వ్యక్తి.. వారిపై విధించిన నిషేధాన్ని తొలగించేందుకు, తెరవెనుక చాలా ప్రయత్నాలు చేశారు.  ఆ మేరకు ఆయన హైదరాబాద్‌కు చెందిన ఓ బిజెపి ప్రముఖుడి ద్వారా చేసిన ప్రయత్నాలు  విఫలమయ్యాయి.  తర్వాత 2015 నుంచి 4200 మంది విదేశీయులను కేంద్రం బ్లాక్‌లిస్టులో పెట్టింది. 2020 జనవరి నుంచి ఇండోనేషియా, మలేషియా, బర్మా, మయన్మార్ తదితర దేశాలకు చెందిన 2 వేల మందిని రెండేళ్లపాటు బ్లాక్‌లిస్టులో పెట్టింది. అంటే ఇప్పటిదాకా, ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడే వారి వీసాలపై రెండేళ్ల పాటే నిషేధం విధించింది. కాగా ఇప్పుడు మర్కజ్ ఘటన నేపథ్యం, దేశాన్ని ప్రమాదంలో పడవేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆరేళ్లపాటు వీసాలు నిషేధించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీరియస్‌గా ఉన్నట్లు, ఆయన చర్యలు స్పష్టం చేస్తున్నాయి. మర్కజ్‌కు వచ్చి కనిపించకుండా పోయిన వారిైపై ఐబి జల్లెడ వేసి గాలిస్తోంది.

తాజాగా నిజాముద్దీన్ ఘటన తర్వాత, మర్కజ్‌కు వచ్చిన 960 మంది వీదేశీ తబ్లీగీలను కేంద్రం బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇరాన్, సౌదీఅరేబియా, దక్షిణాఫ్రికా, అల్జీరియా, మలేషియా, కిర్గిస్తాన్, ఆఫ్ఘాన్ నుంచి విదేశీయులు మర్కజ్‌కు హాజరయిన విషయం తెలిసిందే.