నిజాముద్దీన్‌తో… ముస్లింలపై నిందల్లో నిజమెంత?

అమాయక ముస్లింలకూ తప్పని అపనిందలు
నాడు సిక్కులు, తమిళులు, కమ్మ వర్గంపైనా ఇలాంటి మరకలు
మత ఛాందసమే మరకలకు మూలమవుతున్న వైనం
(మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రపంచంలో అంతా మంచివాళ్లు ఉండరు. అలాగే అంతా చెడ్డవాళ్లూ ఉండరు. ప్రతి కులం, ప్రతి మతంలోనూ మంచివాళ్లు-
చెడ్డవాళ్లుంటారు. ఎక్కడైనా ఈ చెడ్డవాళ్లతోనే చిక్కులు. ఒక మతం లేదా కులానికి సంబంధించిన కొందరు తప్పు చేస్తే, ఆ మరక
సంబంధిత వర్గం మొత్తానికి పూయడం న్యాయమేనా? ఆ కారణంతో తప్పు చేసిన వారిని వదిలేసి, మొత్తం ఆ సమాజాన్ని
దోషిగా, అనుమానితులుగా చూడటం మానవత్వమా? కొందరు చేస్తున్న అరాచకత్వాన్ని, అరాగరిక, రాక్షసత్వ చర్యలను మొత్తం
ఆ మతానికే ఆపాదించి, వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయడం ధర్మమా?.. జమాత్ కార్యకర్తల వికృతకాండ సోషల్
మీడియా ప్రభావం, మారుతున్న సమాజ వైఖరితో నష్టపోతున్న అమాయక ముస్లింలు సంధిస్తున్న ప్రశ్నలివి. సామాజిక స్పృహ
ఉన్న వారి మనోభావాలివి.
మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారితో వివాదం మొదలు..
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న సమయంలో, ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లిన వారితో మళ్లీ ప్రమాదఘంటికలు మోగుతున్న వైనం, యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది. అప్పటివరకూ సాధారణ కేసలు నమోదయిన రాష్ట్రాల్లో, మర్కజ్‌కు వెళ్లిన వచ్చిన వారితోనే కరోనా కేసులు వందలకు చేరుకోవడమే దానికి కారణం. అయితే, దానికి మొత్తం ముస్లిములే కారణమన్న నింద, వారి వల్లే మహమ్మారి వెన్నాడుతోందన్న అపప్రద, వారంతా సమాజానికి వైరస్ కావాలనే అంటిస్తున్నారన్న ఆరోపణలు, సమాజంలో బలపడుతున్నాయి. ఈ అభిప్రాయం రాను రాను యావత్ ముస్లిం వర్గాన్ని, సమాజంలో అంటరానివారుగాను, దోషులుగానూ అనుమానంతో చూసే దురదృష్టకర పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి భావన, దేశానికి చేటు తెస్తుందన్న ఆందోళన సామాజికస్పృహ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది.
జమాత్ నేపథ్యం ఇదీ..
నిజానికి మర్కజ్‌కు వెళ్లడం తప్పు కాదు. హిందువులు గుళ్లకు, క్రైస్తవులు చర్చిలకు వెళ్లినట్లే ముస్లిములు మర్కజ్‌కు వెళ్లారు. క్రైస్తవ మత పెద్దలు నిర్వహించే కూటములు, పీఠాధిపతులు నిర్వహించే సత్సంగాలకు ఆయా మతాలవారు, పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. మర్కజ్లో కూడా జరిగింది అదే. ఆ మత ప్రచార సభను తబ్లీగీ ఈ జమాత్ నిర్వహించింది. మన దేశంలోనే పుట్టిన జమాత్ 150 దేశాల్లో విస్తరించింది. దానికి 20 మిలియన్ల మంది సభ్యులున్నారన్నది ఒక అంచనా. వాటి నిర్వహణకు అమీన్లు ఉంటారు. 1926-27లో మౌలానా మహ్మద్ ఇలియాస్.. ఢిల్లీ వద్ద, పంజాబ్-రాజస్థాన్-హర్యానా సరిహద్దులకు దగ్గరగా ఉన్న మేవాగ్లో ఈ సంస్ధను స్థాపించారు. ఆ కాలంలో ముస్లింలు, హిందువులు కలసి నమాజు చేసేవారని, అలాగే ముస్లింలు హిందువుల పండుగలు ఆచరించేవారని చెబుతుంటారు. అప్పట్లో సగం హిందు-సగం ముస్లిం పద్ధతులు పాటించే హిందువులు కూడా ఉండేవారు. ముస్లింలు నిజమైన ముస్లింలుగా జీవించాలని చెప్పడమే ఈ సంస్థ సిద్ధాంతం.
అన్ని చోట్లా ఇస్తేమాలు..
అయితే 1927-30 మధ్య కాలంలో, ఈ సంస్ధ భారీ స్థాయిలో మత మార్పిడులను భారీ స్థాయిలో చేపట్టింది. అందులో సగం
ముస్లిం సిద్ధాంతాలు పాటించే, హిందువులను భారీ సంఖ్యలో మతం మార్చారు. వీరికి అమీర్ అధినేత. ఆయన మాటే శాసనం.
ఆయనకు సలహాలిచ్చే షురా మండలి ఉంది. ఇందులో పనిచేసే సభ్యులు.. దావా, అంటే ఆహ్వానం పేరిట ప్రతి గురువారం
బస్తీలకు వెళ్లి శుక్రవారం నాటి ప్రార్ధనలకు రావాలని ఆహ్వానిస్తుంటారు. ఇలాంటి వారంతా తమ జీవితాన్ని, మత ప్రచారానికే
అంకితం చేస్తారు. ఆరకంగా అనేక ప్రాంతాల్లో ఖురూజ్ పేరిట సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్
వంటి ప్రాంతాల్లో ఇటీవల ఇలాంటి సభనే నిర్వహించారు. శ్రద్ధాళువులంతా అక్కడ చేరతారు. దానినే ఇస్తేమా అంటారు. తాజాగా
వేములవాడ, సిరిసిల్ల, కరీంగనర్, జగిత్యాలలో సీఐఏకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సభలకు, ఇండోనేషియా నుంచి
హాజరయ్యారు. నిర్మల్‌లో ఇస్తేమా జరిగిన తర్వాతనే, ైభైంసా ఘటన జరిగి ఉంటుందన్న కోణంలో, పోలీసులు దర్యాప్తు కూడా
చేశారు. అది వేరే విషయం.
ఇదీ నిజాముద్దీన్‌లో మర్కజ్‌కు సంబంధించిన నేపథ్యం.
నిబంధనలకు అనుగుణంగానే మర్కజ్
అయితే, ఇప్పుడు కరోనా కల్లోల సమయంలో అక్కడికి వెళ్లిన వారి వల్లే, దేశానికి ప్రమాదం వాటిల్లిందన్న భావన మిగిలిన వర్గాలలో పెరుగుతోంది. నిజానికి ఆ కార్యక్రమం ముందుగానే ఖరారయింది. ఆ మేరకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. విదేశీయులకు వీసాలు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. అప్పటికే వైరస్ ప్రమాదఘంటిక మోగింది. అయినా విదేశీయులకు వీసాలు ఇచ్చారు. పోనీ వచ్చిన తర్వాత కూడా, వారిని మర్కజ్‌కు వెళ్లకుండా నిలువరించలేపోయారు. అక్కడికి పోలీసుస్టేషన్ కూడా కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం. అయితే, జనతాకర్ఫ్యూకు ఒకరోజు ముందు.. అది కూడా తెలంగాణ పోలీసులు హెచ్చరించి, అప్రమత్తం చేయడంతో, ఢిల్లీ పోలీసులు మౌలానాకు నోటీసు ఇచ్చారు. అప్పటికి కొంతమంది వెళ్లిపోయారని, మిగిలిన వారంతా లాక్డౌన్ వల్ల చిక్కుకుపోయారని మౌలానా ప్రకటించారు. వారి వివరాలివ్వకపోవడంతో, జాతీయ భద్రతా సలహాదారు దోవల్ రంగంలోకి దిగి, అందరినీ ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఇదంతా ఒక కోణం.
దాచి ఉంచి.. దాడులు చేసి..
అయితే, అసలు అక్కడికి వచ్చిన విదేశీయులు, రాష్ట్రాల వారీగా వచ్చిన భక్తుల వివరాలు, సంఖ్యను పోలీసులకు చెప్పకుండా మౌలానా పరారు కావడంతోనే వివాదం మొదలయింది. అప్పటికే, మర్కజ్‌కు వెళ్లిన వారిలో 80 శాతం కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని తేలడంతో, సమాజంలో సహజంగానే ఆందోళన పెరిగింది. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చిన ఇతర మతాలకు చె ందిన వారికీ, కరోనా లక్షణాలు ఉండటంతో వారిని క్వారంటైన్లో ఉంచారు. వారిలో కొందరు కార్వంటైన్‌కు వెళ్లకుండా ముఖం చాటేశారు. కానీ పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, క్వారంటైన్లకు తరలించారు. మరి కొందరిని హోం క్వారంటైన్లలోనే ఉంచి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
కానీ, ఈ పని మర్కజ్‌కు వెళ్లిన ముస్లిములు చేయకపోవడమే వివాదానికి, విమర్శలకు తెరలేపింది. పైగా, వారిని గుర్తించి క్వారంటైన్‌కు రమ్మని కోరిన పోలీసులు, వైద్య సిబ్బందిపై అనాగరికంగా దాడులు చేస్తున్నారు. పోలీసుల ముఖంపై కావాలని ఉమ్మేస్తున్నారు. ఆసుపత్రుల్లో ఉన్న నర్సులకు అసభ్య, అశ్లీల సంకేతాలు చూపిస్తూ వేధిస్తున్నారు. ఆసుపత్రులు ధ్వంసం చేస్తున్నారు. తమకు అంటిన వైరస్‌ను, మిగిలిన వారికీ అంటించాలన్న రాక్షస మనస్తత్వాన్ని బయటపెడుతున్న వీడియోలన్నీ, సోషల్‌మీడియాలో ముస్లిములపై వ్యతిరేక భావనను పెంచడానికి కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిలో మత పెద్దలు రంగంలోకి దిగి, వారిని క్వారంటైన్లకు పంపించే ప్రయత్నం చేయకపోగా, గ్రామాల్లోకి వచ్చిన వైద్యులతో వాగ్వాదానికి దిగి, తరిమికొడుతుండటంతో ఆ భావన బలపడే ప్రమాదానికి దారితీస్తోంది.
క్వారంటైన్‌కు వెళ్లాలని చెప్పింది కొందరే..
ఒకరిద్దరు మత ప్రచారకులు మాత్రం.. క్వారంటైన్‌కు వెళ్లి, అక్కడే అల్లాను ప్రార్ధించాలని అభ్యర్ధించారు. కానీ, వారికంటే, స్థానికంగా ప్రభావం చూపే మత పెద్దలు మాత్రం, మతఛాందసవాదంతో ఉండటమే సమస్యలు సృష్టిస్తోంది. మైనారిటీ నాయకులు కూడా.. ఆరోగ్య కోణంలో కాకుండా, కేవలం మతం-రాజకీయ కోణంలోనే కరోనా మహమ్మారిని చూస్తున్నారు. కరోనా సాకుతో ముస్లిం వర్గాన్ని అణిచివేస్తున్నారన్న ప్రచారానికి పదునుపెట్టి, అమాయకుల మనసులో మతఛాందసం పెంచే ప్రయత్నం చేయడం క్షమార్హం కాదు. అసలు నిజాముద్దీన్‌కు వెళ్లిన వారంతా స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వెళితే, ఈ సమస్య వచ్చేది కాదు. ఈ తర హా వ్యక్తులు చేస్తున్న పైశాచికచర్యల వల్ల, తమతోపాటు తమ కుటుంబం కూడా కరోనాకు బలవుతుందని తెలుసుకోలేకపోతున్నారు.
ముస్లింలపై పెను ప్రభావం?
ఈ పరిణామాలు, మత పెద్దల ఛాందసం.. కలసి వెరసి అమాయక ముస్లింల జీవనం, మనుగడ, సాంఘిక జీవనంపై పెను ప్రభావం పడేందుకు కారణమవుతోంది. నిజానికి మన దేశంలో ఉన్న ముస్లింలలో, 90 శాతం మంది నిరుపేదలు. వారిలో మతం పట్ల విశ్వాసం ఉన్న వారి సంఖ్య కూడా దాదాపు అంతే ఉంటుంది. అయినా.. హిందువులు జీవించే అనేక ప్రాంతాల్లో, వివిధ రకాల వ్యాపారాలు చేసుకుని కలసి మెలసి జీవించే దృశ్యాలు ఇప్పటికే కనిపిస్తుంటాయి. కానీ, ఈ తరహా ఉన్మాదం వారిలో అతి తక్కువే. రోజువారీ సంపాదనతో పొట్టపోసుకునే వారే ఎక్కువ. ఇప్పుడు వారే ప్రమాదంలో కనిపిస్తున్నారు. కొంతమంది మత ఛాందసులు చేస్తున్న వికృత చేష్టలకు, వాటితో సంబంధం లేని అమాయకులు, దోషులుగా నిలబడాల్సిన దురదృష్టకర పరిస్థితి ఏర్పడింది. కొందరు ఉన్మాదుల చ ర్యల ఫలితంగా, నిరుపేద- అమాయకుల జీవనోపాథి భవిష్యత్తులో ప్రశ్నార్ధకమవుతోంది.
గతంలోనూ ఇంతే..
గతంలో జరిగిన కొన్ని ఘటనలు కూడా, ఇంచుమించు ఈ పరిస్థితికి దగ్గరగానే కనిపిస్తున్నాయి. ఇందిరాగాంధీ కొందరు సిక్కు పోలీసుల చేతిలో హత్యకు గురయ్యారు. ఫలితంగా ఢిల్లీ సహా, సిక్కులు ఉండే ప్రాంతాల్లో నరమేధం జరిగింది. ఆ ఘటనతో సంబంధం లేని అమాయక సిక్కులు బలయ్యారు. వారి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. హిందువుల షాపులు, ఇళ్లలో అద్దెకు ఉన్న సిక్కులను ఖాళీ చేయించారు. కొన్నేళ్లకు.. రాజీవ్‌గాంధీని కొందరు తమిళ తీవ్రవాదులు హత్య చేశారు. ఆ తర్వాత.. ఆ ఘటనతో సంబంధం లేకపోయినా, దేశంలో ఉన్న తమిళులందరిపైనా దాడులు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కాపునేత వంగవీటి రంగాను, విజయవాడలో పాశవికంగా హత్య చేశారు. అప్పుడు విజయవాడ సహా, కోస్తాలో ఉన్న కమ్మ వర్గానికి చెందిన వారిపై ప్రతిదాడులు జరిగాయి. వారి షాపులు లూటీకి గురయ్యాయి. వాటిని పెట్రోల్ బాంబులతో పేల్చారు. ఈరకంగా.. ఒక వర్గానికి చెందిన కొందరు ఉన్మాదులు రాక్షసకాండకు పాల్పడితే, అందుకు ఆ చర్యలతో ఎలాంటి సంబంధం లేని.. అదే వర్గానికి చెందిన వారు మూల్యం చెల్లించుకోవలసి వ స్తోంది. మత,కుల నాయకులలో పేరుకుపోయిన ఈ పాశవిక ఆలోచనకు సమాధి కట్టకపోతే, సమాజం మరింత నష్టపోతుంది.