ఉన్మాదమా?.. ‘అతి’ ఉత్సాహమా?

570

పోలీసులు, వైద్యులపై జమాతే కార్యకర్తల దాడులు
పోలీసులపై ఉమ్మేస్తున్న ఉన్మాదం
ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సుల పట్ల అసభ్య ప్రవర్తన
చికిత్సకు రమ్మంటే వైద్యులపై రాళ్ల దాడి
సోషల్ మీడియాలో సర్వత్రా ఈ అరాచక దృశ్యాలే
గాయపడుతున్న పోలీసు, వైద్యుల మనసు
కఠిన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర హోం శాఖ
(మార్తి సుబ్రహ్మణ్యం)

కఠిన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర హోం శాఖ

జాతీయ విపత్తు సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న పోలీసు, వైద్య
సిబ్బంది హృదయం ఉన్మాద చర్యలకు గాయపడుతోంది. ప్రాణాలు పోసేందుకు
ప్రయత్నించే వారిపై, అమానవీయంగా దాడులకు దిగే కిరాతక దృశ్యాలు
దర్శనమిస్తున్నాయి. వైరస్‌కు శలభాల మాదిరిగా కాలిపోకుండా, కాపాడేందుకు వస్తున్న
సేవామూర్తులను  శత్రువుల్లా చూస్తున్న అరాచక పరిస్థితి. సోషల్ మీడియాలో
దర్శనమిస్తున్న ఈ దృశ్యాలు, మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఆసుపత్రులపై దాడి చేయడం, పోలీసులపై కావాలని
ఉమ్మేయడం, చికిత్సకు రమ్మన్న వారిని రాళ్లతో తరిమివేసే రాక్షస ప్రవృత్తి పెరుగుతోంది. ఫలితం.. ఈ ఉన్మాద, ‘అతి’ ఉత్సాహ
చర్యలను  ఉక్కుపాదంతో అణచివేయాలని  కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలను ఆదేశించాల్సి వచ్చింది.

ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సుల పట్ల అసభ్య ప్రవర్తన

కరోనా వైరస్ అంటించిన నిజాముద్దీన్ తబ్లిగ్ జమాత్ కార్యకర్తలను పట్టుకుని, వారికి చికిత్స అందించడం ద్వారా.. ప్రాణాలు నిలబెట్టాలనుకుంటున్న ప్రభుత్వ ఆశయాన్ని, తబ్లిగ్ కార్యకర్తలు అనేక రాష్ట్రాల్లో ప్రతిఘటిస్తున్నారు. పట్టుకునివచ్చిన పోలీసులు,వైద్యులు, నర్సులపై అనాగరికంగా వ్యవహరిస్తున్న తీరు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో..ఐసోలేషన్ వార్డులో కరోనా చికిత్స పొందుతున్న జమాత్ కార్యకర్తలు, బయటకు వచ్చి నానా హంగామా చేశారు. అర్ధనగ్నంగా తిరుగుతూ నర్సులకు  అసభ్య సంకేతాలిస్తున్నారు. సిగరెట్లు, బీడీలు డిమాండ్ చేస్తున్నారు. దానితో మేజిస్ట్రేట్ ఆదేశాలతో వారిపై కేసులు నమోదు చేయాల్సి వచ్చింది.

పోలీసులపై ఉమ్మేస్తున్న ఉన్మాదం

నిజాముద్దీన్‌లో బస చేసిన వారిని క్వారంటైన్‌కు బస్సులో తరలిస్తున్న సందర్భంలో, అందులో ఉన్న  తబ్లిగ్ కార్యకర్తలు
వైద్యులపై ఉమ్మి వేస్తున్నారని స్వయంగా ఒక వైద్యుడు మీడియా ప్రతినిధికి ఫిర్యాదు చేసిన వైనం.. మరికొందరిని బస్సులో
తీసుకువెళుతున్న సందర్భంలో,  తబ్లిగ్ కార్యకర్త ఒకరు కావాలని ఎదురుగా ఉన్న పోలీసుపై ఉమ్మివేసిన దృశ్యాలు,  వారిలోని
దానవ లక్షణాలను బయటపెట్టాయి. ఇక ఢిల్లీ క్వారంటైన్‌లో ఉన్న   తబ్లిగ్ కార్యకర్తలు వైద్యులు, పోలీసులను నానా తిప్పలు
పెడుతున్నారు. తాము కోరింది పెట్టాలని డిమాండ్ చేయడమే కాకుండా, వారిపై తుమ్ముతు, ముఖం మీదకొచ్చి దగ్గుతున్నారు.
దీనితో వారంతా రక్షణ కల్పించాలని వేడుకుంటే, సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.

చికిత్సకు రమ్మంటే వైద్యులపై రాళ్ల దాడి

కరోనా అనుమానితుడికి నచ్చచెప్పి క్వారంటైన్‌కు తీసుకువెళదామని వచ్చిన వైద్యులు, పోలీసులను అక్కడి స్థానికులు రాళ్లతో
దాడి చేసి తరిమివేస్తే, వారంతా ప్రాణభయంతో పరుగులు తీయాల్సిన దుస్థితి. నెల్లూరు జిల్లా మర్రిపాడులో.. కరోనా పరీక్ష
చేయించుకునేందుకు, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి బంధువులు తిరస్కరించారు. ఆ సమయంలో గ్రామంలోని పెద్దలంతా వారికి
అండగా నిలిచినా, చివరకు పోలీసుల హెచ్చరికలతో ఐదుగురు ఆసుపత్రికి వెళ్లారు. ఈ ఘటనలన్నీ, జాతీయ టీవీ చానెళ్లలో
చర్చనీయాంశంగా మారాయి.

రెండురోజుల క్రితమే, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స చేయించుకుంటున్న
వ్యక్తి ఒకరు మృతి చెందారు. దానితో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి
సోదరులు, వైద్యులపై దాడులకు తెగబడి, ఆసుపత్రిలో అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన
ఘటన వైద్య సిబ్బందిని భీతావహులను చేసింది. దీనిపై మంత్రి ఈటల, తలసాని
ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
తాజాగా కేంద్ర హోం శాఖ కూడా ఈ ఘటనపై స్పందించింది. వైద్యులపై దాడి చేసిన వారిని
కఠినంగా శిక్షించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది.  నిజానికి గాంధీ ఆసుపత్రిలో పోలీసులు, వైద్యులు కంటిమీద
కునుకులేకుండా పనిచేస్తున్నారు.

సోషల్ మీడియాలో సర్వత్రా ఈ అరాచక దృశ్యాలే

నేరుగా చికిత్సలందిస్తున్నందుకు వైద్యులకు, బయట బందోబస్తులో అక్కడే ఉంటున్న పోలీసులకు, కరోనా హాని ఉన్నప్పటికీ..
వారంతా లోపల ఉన్న రోగులకు రక్షణగా, మొక్కవోని దీక్షతో అక్కడ విధినిర్వహణ చేస్తున్నారు.  వారికి సహకరించాల్సిన రోగులు,
బరితెగించి దాడులకు తెగబడటాన్ని యావత్ సమాజం ఖండించింది. నిజామాబాద్‌లోనూ వైద్య సిబ్బందిపై, జమాత్ కార్యకర్తలు
ఇలాంటి అనాగరిక వైఖరినే ప్రదర్శించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం, గుడిమల్కాపురం గ్రామంలో ఒకరిని
ఐసోలేషన్ వార్డుకు, అంబులెన్స్‌లో తీసుకువెళుతున్న సందర్భంలో, అక్కడి మతపెద్దలు అడ్డుకున్న ఘటన వెలుగుచూసింది.

ఆదిలాబాద్  చిలుకూరి లక్ష్మీనగర్‌లో ఉన్న వ్యక్తి వివరాలు సేకరించేందుకు వెళ్లిన,  భారతి అనే ఆశా కార్యకర్తను ఆ కుటుంబం ఏకంగా లోపలికి లాగి, దాడి చేసింది. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. తమకు రక్షణ లేకపోతే విధి నిర్వహణ చేయలేమని ఆశా వర్కర్లు స్పష్టం చేయడంతో, వైద్య, పోలీసు అధికారులు వారికి భరోసా ఇవ్వాల్సి వచ్చింది.ఒంగోలు రిమ్స్  ఐసోలేషన్ వార్డులో ఉన్న వ్యక్తి పారిపోవడం కలవరపెడుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని మౌలాలిలో ఓ కుటుంబం, ఏకంగా పోలీసు అధికారి చొక్కా పట్టుకుని తిడుతున్న దృశ్యాలు, సోషల్ మీడియాలో చూసిన వారిని నివ్వెరపరిచాయి.ఇవన్నీ మన తెలుగురాష్ట్రాల్లో కనిపించిన దృశ్యాలు. ఇక మధ్యప్రదేశ్ ఇండోర్‌లో.. తత్పట్టిబఖల్‌కు చెందిన వ్యక్తులు వైద్యులపై దాడి చేయగా, ఇద్దరు గాయపడ్డారు.

గాయపడుతున్న పోలీసు, వైద్యుల మనసు

ఏరూపంలో.. ఎలా విరుచుకుపడుతుందో తెలియని కరోనా మహమ్మారిపై పోలీసులు,
వైద్యులు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో.. వారితో చేతులు కలిపి,
చేయూతనివ్వాల్సిన మనుషులు కొందరు, మృగాల అవతారమెత్తి.. తాము పోతూ, మిగిలిన
వారిని మృత్యుకోరల్లోకి నెడుతున్న ఉన్మాదంపై, సమాజమే స్పందించాలి. జాతి రక్షణకు
నడుంబిగించిన సేవామూర్తులపై జరుగుతున్న.. అమానవీయ, అనాగరిక దాడులను
నాగరిక సమాజం ఖండించాలి. లేకపోతే భవిష్యత్తులో రాజ్యమేలేది రాక్షసత్వమే!