ఉమ్మినందుకు సౌదీలో ఉరి.. మన దగ్గరో మరి?!

138

కావాలని ఉమ్మినందుకు సౌదీ సర్కారు నిర్ణయం
ఢిల్లీలో పోలీసుపై ఉమ్మిన జమాత్ కార్యకర్త మాటో మరి?
దేశంలో మొదలయిన చర్చ
(మార్తి సుబ్రహ్మణ్యం)

సౌదీ అరేబియా.. అసలు సిసలు ముస్లిం మతాచారాలు పాటించే ఇస్లామిక్ దేశాల్లో అదొకటి. నీతి, నిజాయితీ, ధర్మంపై నిక్కచ్చిగా వ్యవహరించే దేశం అది. దొంగతనాలు జరిగితే రాళ్లతో కొట్టి చంపటం, చేతులు నరికడం వంటి కఠిన శిక్షల ద్వారా, మిగిలిన వారికి ఒక హెచ్చరిక సందేశం ఇస్తుంది. అందుకే సౌదీలో ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది. దొంగతనాలకు అవకాశం,  అవినీతికి ఆస్కారమే ఉండదు. చెడు సంస్కృతి, అడ్డదారి వ్యాపారాలు, మాఫియా,  ఇతర అసాంఘిక కార్యకలాపాలు అక్కడ కనిపించవు. సంప్రదాయాలను ఉల్లంఘించిన వారికి నరకమే. ఇన్ని కట్టుబాట్లు ఉన్న సౌదీ… ముస్లిం మతాచారాలను విధిగా పాటిస్తుంటుంది. అల్లా సూత్రాలు అమలుచేస్తుంది. మత సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, ఎంతటివారికైనా ఉరిశిక్ష విధిస్తుంది.

అచ్చం అలాంటి సంఘటనే, కరోనా కల్లోల సమయంలో జరిగింది. హెయిల్ ప్రాంతంలో ఉన్న ఒక షాపింగ్ మాల్‌లో.. ఒక వ్యక్తి ట్రాలీల వద్ద, కావాలని ఉమ్మివేయడాన్ని అక్కడి అధికారులు కనిపెట్టారు. దానితో అతడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. నేరం రుజువైతే, అతడికి ఉరిశిక్ష ఖాయమని ప్రాసిక్యూషన్ అధికారులు స్పష్టం చేశారు. ‘కావాలని సమాజంలో వైరస్ వ్యాపింపచేయడం, కల్లోలానికి కారణం కావడమనేది నేరం. దీనికి ప్రభుత్వ చట్టాల ప్రకారం ఉరిశిక్ష పడుతుంది’ అని వివరించారు.

కరోనా కల్లోలం తర్వాత సౌదీ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో, ఒక వ్యక్తి కావాలని ఉమ్మేయడాన్ని, ఆ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, అతడికి ఉరిశిక్ష వేసేందుకు సిద్ధమవుతోంది. మరి కరోనా భూతాన్ని ఎదుర్కొంటున్న భారతదేశంలోనూ, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారా? ఇప్పుడు ఉన్న చట్టాలు అందుకు అంగీకరిస్తాయా? అన్న చర్చకు తెరలేచింది. కరోనా భూతంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన యుద్ధానికి, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు.. యావత్ జాతి మద్దతుగా నిలిచింది. పోలీసులు, వైద్య బృందాలు కరోనా వైరస్ సోకిన వారిని, వెతికి పట్టుకుని మరీ చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో, జమాత్ కార్యకర్తలు అనేక చోట్ల వైద్యులు, పోలీసులపై తెగబడి చేస్తున్న దాడులను యావత్ భారతజాతి ఖండించింది. ముష్కరుల చర్యలకు వైద్య, పోలీసు సిబ్బంది బెంబేలెత్తుతున్నారు.

బస్సులో క్వారంటైన్‌కు తీసుకువెళుతున్న జమాత్ కార్యకర్త ఒకరు, తన ఎదురుగా ఉన్న పోలీసుపై కావాలని ఉమ్మేసిన వీడియో ఒకటి.. దేశప్రజల ఆగ్రహానికి గురిచేసింది. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులపై, జమాత్ కార్యకర్త పైశాచికకాండను అందరూ ఖండించారు. చివరకు కేంద్రం కూడా, ఈ చర్యపై కన్నెర్ర చేసింది. మరోవైపు.. ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్న, మరికొందరు జమాత్ కార్యకర్తలు నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటం, వైద్యులపై ఉమ్మేసి, తుమ్మడం వంటి అనాగరిక చర్యలతో బేజారెత్తిస్తున్న దృశ్యాలను చూసిన కేంద్రం, వారిపై కఠిన చర్యలు ఝళిపించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.సౌదీలో కేవలం.. షాపింగ్‌మాల్ ట్రాలీపైనే ఉమ్మినందుకు మరణశిక్ష విధిస్తుండగా, మన దేశంలో నేరుగా పోలీసులు, వైద్య సిబ్బందిపై కావాలని ఉమ్మేస్తున్న ముష్కరులను ఎందుకు ఉరి తీయరన్న వాదన, చర్చ దేశంలో మొదలయింది.

కరోనాపై ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బందికి సహకరించాల్సింది పోయి.. వారిపై అనాగరికంగా దాడులు చేస్తున్న జమాత్ కార్యకర్తలు గానీ, ఇతరులు ఎవరైనా గానీ.. వారిని ఉరి తీయాల్సిందేనన్న వాదన, కొద్దిరోజుల నుంచి పెరుగుతుండటం ప్రస్తావనార్హం. ఇప్పటికే కరోనా పీడితులకు చికిత్స చేస్తున్న పలువురు వైద్యులకు కరోనా సోకగా, అందులో కొందరు మృతి చెందిన విషాద ఘటనలను గుర్తు చేస్తున్నారు. అలాంటి వారిపై అనాగరికంగా దాడులకు దిగుతూ, ఉమ్మేస్తున్న అరాచకవాదులకు..  ‘ఉరే సరి’ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ వర్గాల పట్ల మత కోణంలో కాకుండా, చట్టాల అమలు విషయంలో, ముస్లిం దేశాలే ఈ విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తుంటే.. మన దేశంలో మాత్రం అలాంటి కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. అయితే, సౌదీ మతపరమైన దేశం కాబట్టి ఆ వెసులుబాటు ఉంటుందని, కానీ మన ప్రజాస్వామ్య దేశంలో దానికి సంబంధించి.. ప్రత్యేకించి చట్టం తీసుకువస్తే తప్ప,  అది సాధ్యం కాదని న్యాయవాదులు చెబుతున్నారు. ఏదేమైనా, వైద్య, పోలీసు సిబ్బందిపై ఈ ప్రమాద సమయంలో ఉమ్మేస్తున్న ఉన్మాదులకు సౌదీ తరహా శిక్షలే మంచిదన్న అభిప్రాయం వెల్లువెత్తుతోంది.

కాగా..  ‘ఢిల్లీ నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారు సహకరించకుండా, తప్పించుకుని తిరుగుతుంటే వారిని కాల్చిపారేయాలని’ హైదరాబాద్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ‘వివరాలు చెప్పని వారిని దేశద్రోహులుగా ప్రకటించాల’ని, కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.