కాసులున్నా కోతలెందుకు?

170

మరి ఉద్యోగ సంఘాల మౌనమేల?
అంగీకరిస్తున్నామనడం లొంగుబాటేనా?
బాబు లెక్కలతో ఉద్యోగ సంఘాల ఉక్కిరిబిక్కిరి
జగన్ సర్కారును బోనెక్కించిన బాబు
ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తాయా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా కల్లోలం నేపథ్యంలో ఐఏఎస్ నుంచి వీఆర్‌ఓల వరకూ జీతాల్లో కోత విధించడానికి, జగన్ సర్కారు చూపించిన ప్రాతిపదికను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆక్షేపిస్తూ రాసిన బహిరంగలేఖ, ఉద్యోగ సంఘాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రభుత్వం వద్ద వేల కోట్ల ఆదాయం ఉన్నా, తమ జీతాల్లో కోత విధించిన జగన్ సర్కారు నిర్ణయాన్ని.. ఆనందంతో అంగీకరించిన తమ నేతలపై, అటు ఉద్యోగులు కూడా బాబు వెల్లడించిన వివరాల ఆధారంగా మండిపడుతున్నారు.

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై చంద్రబాబు నాయుడు పక్షాన ధూళిపాళ్ల నరేంద్ర  రాసిన లేఖ, ఉద్యోగ సంఘ నేతలను ఇరుకునపడేసింది. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పూర్తి వేతనాలు ఇవ్వలేమని చెప్పిన జగన్ సర్కారు, స్థాయిల వారీగా జీతాల్లో కోతలు పెట్టింది. దానిపై చర్చించేందుకు ఏపీఎన్జీఓ సంఘం, ఏపి సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపి ఐకాస అమరావతి నేతలు ముఖ్యమంత్రిని కలిసినా, ఎలాంటి ఫలితం ద క్కలేదు. పైగా రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దీనిని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్, అమరావతిలో నివాసం ఉంటున్న సచివాలయ ఉద్యోగులు, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, సంఘం అధ్యక్షుడు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ఆదాయ వాస్తవ పరిస్థితులు వివరిస్తూ, ఉద్యోగుల జీతాలలో కోత విధించడాన్ని తప్పు పట్టడంతో  వారిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. 2019-2020 ఆర్ధిక సంవత్సరంలో, 1.87 కోట్ల ఆదాయం ప్రభుత్వం చేతికి వచ్చిందని బాబు వెల్లడించారు. 2018-2019లో ఇవే నిధులు 1.57 లక్షల కోట్లు  మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. అంటే గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది 30 వేల కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నప్పటికీ, జీతాలలో ఎందుకు కోత విధించారని బాబు సర్కారును నిలదీశారు. 14వ ఆర్ధిక సంఘం నిధులు కూడా విడుదల చేసిన తర్వాత కూడా, జగన్ సర్కారు ఇంకా పేద బీదఅరుపులు ఎందుకు అరుస్తుందో.. అర్ధం కావడం లేదన్న ప్రశ్న, ఉద్యోగ వర్గాలకు సూటిగా తగిలింది.  నిజంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని తెలిసిన ఉద్యోగులు, కరోనా వల్ల ఖజానా మరింత బలహీనపడిందని ఇప్పటివరకూ భావిస్తూ వచ్చారు. కానీ, రాష్ట్ర ఆదాయం సంతృప్తిగానే ఉందని, వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో వస్తున్నప్పుడు, తమ జీతాల్లో కోత విధించడం ఎందకున్న చర్చ మొదలయింది. దానికితోడు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇంత విషమంగా ఉన్నప్పుడు చంద్రబాబు లేఖలో ప్రస్తావించినటు, తమకు ్ల కావలసిన కాంట్రాక్టర్లకు 6,400 కోట్లు, రెండునెలలోనే ఎలా చెల్లిస్తారన్న ప్రశ్నలు ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న ఉద్యోగులు, ఈ చర్చను మరింత పదునెక్కిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వత 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, ధనిక రాష్ట్రమైన తెలంగాణ కంటే ఫిట్‌మెట్ ఎక్కువ ఇచ్చారన్న ప్రచారం ప్రారంభించారు. హుద్‌హుద్, తిత్లీ వంటి తుపాన్లు వచ్చినా ఒక్కరోజు జీతం కూడా కోత విధించలేదని గుర్తు చేస్తున్నారు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరిస్తూ, జగన్ సర్కారు వద్ద ఇంకా 30 వేల కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని చంద్రబాబు బయటపెట్టిన వైనం,  ఉద్యోగ సంఘాలను సంకటంలో పడేసింది. ఇప్పటివరకూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేనందుకే, తాము జీతాల్లో కోతను అంగీకరించామని ఉద్యోగ సంఘ నేతలు, ఉద్యోగులకు చెబుతూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు.. ఆర్ధిక పరిస్థితులను బట్టబయలు చేసిన తర్వాత, ఉద్యోగులకు ఏ, సమాధానం చెప్పాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. దానిని అధికార పార్టీ కూడా ఇప్పటిదాకా ఖండించక పోవడం, ఉద్యోగ సంఘాలను మరింత కలవరపరుస్తోంది.

ప్రధానంగా ప్రభుత్వానికి గట్టి మద్దుతుదారుగా ఉన్న సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, దీనిపై ఏం మాట్లాడతారోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. వేతనాల్లో కోత విధించడాన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, కనీస స్థాయిలో కూడా వ్యతిరేకత వ్యక్తం చేయకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒకరకంగా చంద్రబాబు వెల్లడించిన వివరాలు.. ఏపీఎన్జీఓ, రెవిన్యూ, సచివాలయ సంఘ నేతలకు సంకటంగానే పరిణమించింది. మరి దానిపై వారు ఉద్యమిస్తారా? లేదా గత సర్కారుతో వ్యవహరించినట్లు లౌక్యంగా వెళతారా అన్నది చూడాలి.