ఖాకీవనంలో.. కాఠిన్యం, కారుణ్యం!

551

అటు మానవత్వం, ఇటు అమానుషత్వం
పని ఒత్తిళ్లు ప్రజలపై చూపుతున్నాయా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘వాడు లేకపోతే నిమషం గడవదు. ఉంటే అదో చీదర’.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సామెత తరచూ వినిపిస్తుంటుంది. ఇప్పుడు కరోనా కల్లోలంలో, విధి నిర్వహణలో ఉన్న పోలీసుల చర్యలు  చూస్తే, ఈ సామెత నిజమేనేమో అనిపిస్తుంటుంది. కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు, కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. దాని అమలు కోసం పోలీసులు అహోరాత్రులు పనిచేస్తున్నారు. కరోనా వైరస్ బాధితులు తమపై ఉమ్మేస్తున్నా పళ్ల బిగువున వాటిని భరిస్తున్నారు. క్వారంటైన్‌కు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిని, వెతికి పట్టుకునేందుకు పాపం నానా పాట్లు పడుతున్నారు. గర్భిణులు కనిపిస్తే, తమ వాహనాలు ఇచ్చి నడుచుకుంటూ వెళుతున్నారు. ఇదంతా ఒక కోణం. కానీ మరో కోణంలో, జనంపై కోపంతో అకారణంగా లాఠీలు ఝళిపిస్తున్నారు.  జర్నలిస్టుల నుంచి, సాధారణ జనం వరకూ ఉత్తిపుణ్యానికి కోపం ప్రదర్శిస్తున్నారు. ఆగర్భశత్రువుల మాదిరిగా సామాన్యుడిపై కాళ్లు, చేతులు లేపుతున్నారు. ఫలితం.. ఇన్నాళ్లూ సంపాదించుకున్న పేరంతా, బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఇవీ..  రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఖాకీవనంలో కనిపిస్తున్న కాఠిన్యం, కారుణ్య దృశ్యాలు.

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రం ఆశయాలను,  ప్రజలు సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు. సామాజిక దూరం పాటించి, ఇళ్లలోనే ఉండటం ద్వారా, కరోనాను తరిమేయవచ్చన్న పిలుపును పాటించడం లేదు. ప్రత్యేకించి ఒక వర్గం, అసలు ఈ పిలుపును ఖాతరే చేయడం లేదు. మరి కొందరు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉన్నాం. అలాంటి వారిని దారికి తెచ్చేందుకు, పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వస్తోంది.

నిజానికి ఇది పోలీసులకు మాత్రమే పట్టిన బాధ్యత కాదు. సమాజం మొత్తానిది! అయితే, రోజుల తరబడి ఇళ్లలో బందీలుగా మారిన జనం, ఏదో ఒక సాకుతో రోడ్డుపైకొచ్చి, గీత దాటుతున్న వైనం, సమాజానికి హానికరంగా పరిణమించింది. దీనితో పోలీసులు సహజంగానే,  అసహనంతో లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా జనతా కర్ఫ్యూ నుంచి, ఇప్పటివరకూ కుటుంబాలకు దూరమై, తిండీ తిప్పలు లేకుండా డ్యూటీ చేయడం, పోలీసులలో ఒత్తిడి పెంచుతోంది. అన్నీత్యాగం చేసి తాము డ్యూటీలు చేస్తుంటే, జనం అర్ధం చేసుకోవడం లేదన్న క్రోధం దిశగా వారి మానసిక పరిస్థితి పయనిస్తోంది.  రాను రాను అసహన ంగా మారుతోంది.  అది చివరకు అమాయకులపైనా లాఠీ ఎత్తి, అకారణంగా దండించే వరకూ వెళుతోంది. మరి ఇక్కడ తప్పెవరిది? పోలీసులదా? ప్రజలదా? అదో పెద్ద చర్చ!

సమాజంలో మంచి-చెడు ఉన్నట్టే, పోలీసులలోనూ మంచి-చెడ్డ కనిపిస్తుంటుంది. అది వారి మనస్తత్వం బట్టి ఆధారపడి ఉంటుంది.  ఎందుకంటే, పోలీసులు కూడా మనషులే. వారేమీ మానవాతీతులు కాదు. బలహీనతలకు మినహాయింపు కాదు. కోప తాపాలు, రాగద్వేషాలు, సూయ, అసూయలు, ఆవేశకావేశాలకు  వారేమీ అతీతులు కాదు. కరోనా కల్లోలంలో ఈ దేశం ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలంటే, ముందు అది పోలీసులకే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే, వారు నిర్వర్తిస్తున్న బాధ్యత అలాంటిది. మిగిలిన ప్రభుత్వ శాఖలన్నీ సెలవు తీసుకుని, ఇంటిపట్టున్న ఉంటున్నా పోలీసులు మాత్రం, కుటుంబాలను త్యాగం చేసి విధులు నిర్వహిస్తున్నారు. అందుకు వారిని ఎంత అభినందించినా తక్కువే. అయితే.. ఆ ఒత్తిళ్లు, కసిని జనంపై చూపిస్తుండటమే వారి కీర్తిని కరగస్తోంది.

కారుణ్యంలో ముందు..

సికింద్రాబాద్‌లో ఒక గర్భిణి నడుచుకుంటూ వెళుతుంటే, చిలకలగూడ సీ.ఐ గంగిరెడ్డి తన వాహనం ఆపి మరీ, ఆ గర్భిణిని వాహనంలోకి ఎక్కించి, తాను నడుచుకుంటూ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. మెట్టుగూడలో చిక్కుకుపోయిన దాదాపు 70 మంది ఒడిషా వలస కూలీలకు.. ఆయన స్వచ్ఛంద సంస్థల సాయంతో, ప్రతిరోజూ భోజనాలు ఏర్పాటుచేస్తున్నారు. చిలకలగూడ పోలీసులు మానవత్వంతో చేస్తున్న సాయం అందరికీ స్ఫూర్తిదాయకమన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పోలీసులలో కనిపించే  మానవత్వానికి ఓ నిదర్శనం. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం, పర్వతాపూర్‌లోకి వచ్చిన గ్రామేతరులతో, ఎస్.ఐ భగవంతురెడ్డి గుంజీలు తీయించారు. దానికి కారణం వారు ఆ గ్రామస్తుల కట్టుబాట్లను ధిక్కరించి కంచెలు తొలగించడమే. సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే యశోద అనే మహిళా కానిస్టేబుల్, కరోనా సమయంలో తన వంతు సాయంగా 100 కిలోల బియ్యం అందించారు.

ఆంధ్రాలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్‌ఐ శాంతారాం, విజయవాడలో డ్యూటీ చేస్తున్నారు. అయితే, కరోనా సమయంలో ఆమె తల్లి విజయనగరంలో మృతి చెందారు. అయినా సరే, తాను డ్యూటీని విడిచిపెట్టి విజయనగరం రాలేనని చెప్పి, అంత్యక్రియల బాధ్యతను సోదరుడికి అప్పగించిన హృదయ విదాకరక ఘటన అందరినీ కంటతడిపెట్టించింది. కర్తవ్య నిర్వహణపై పోలీసులకు ఉన్న చిత్తశుద్ధి, అంకితభావానికి ఈ ఘటన మరో నిదర్శనం.  కాలినడకన చెన్నై నుంచి, యుపి వెళుతున్న వలస కూలీలకు విజయవాడలో డ్యూటీ చేస్తున్న ఎస్‌ఐ కె.తిరుపతిరాజు భోజనం పెట్టి, క్వారంటైన్‌కు తరలించి, తన ఔదార్యం చాటుకున్నారు. విజయవాడలో ఒక గర్భిణి అంబులెన్స్‌కు ఫోన్ చేసినా రాకపోవడంతో.. భవానీపురం సీఐ మోహన్‌రెడ్డికి ఫోన్ చేస్తే, ఆయన వచ్చి తన తన వాహనంలో  ఆమెను అమెరికన్ ఆసుపత్రికి పంపించిన వైనం అందరినీ మెప్పించింది. ఇది ఖాకీల కారుణ్యానికి ఒక ఉదాహరణ.

అయితే, సహనం నశించి అకారణంగా పోలీసులు చేస్తున్న వికృత చేష్టలు విమర్శలకు గురవుతున్నాయి. ఫలితంగా సమాజానికి వారు చేస్తున్న మంచి కూడా, ఈ వికృత చేష్టల ఖాతాలో కలసి పోయేందుకు కారణమవుతోంది. ప్రత్తిపాడులో పోలం పనులకు వెళుతున్న ఉప సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావును, ఎస్‌ఐ అకారణంగా లాఠీలతో కొట్టిన వైనం డీజీపీ వరకూ వెళ్లింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో ఒక ఐటి కంపెనీ ఉద్యోగిని, పోలీసులు ఆయన కొడుకు కళ్లెదుటే, గొడ్డును కొట్టినట్లు కొట్టిన వైనం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అకారణంగా ఆ వ్యక్తిని వ్యక్తిగత ద్వేషం స్థాయిలో  కొట్టినట్లు కనిపించిన ఆ దృశ్యాలు, పోలీసుల పరువు తీశాయి. అప్పటివరకూ పోలీసు మానవీయ చర్యలను అభినందించిన వారే.. ఆ దృశ్యాలు చూసి  ఖా‘కీచకంపై’ కన్నెర్ర చేశారు. దానిపై మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ప్రవర్తనతో వేలాది మంది కష్టం వృధా అవుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.  జిల్లా ఎస్పీ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇది ఖాకీల క్రూరత్వానికి పరాకాష్ఠగా నిలిచింది. తాజాగా విజయవాడలో చిత్తూరు జిల్లాలో పనిచేసే ప్రైవేటు ఉద్యోగిని కొట్టి, అతని వాహనం స్వాధీనం చేసుకుని, అతడిని బాపట్ల బస్టాండ్‌లో దింపేశారు. దీనితో మనస్తాపం చెందిన అతను, తన చావుకు పోలీసులే కారణమని సెల్ఫీలో చెప్పి, ఆత్మహత్య చేసుకోవడం, పోలీసుల కఠిన్యాన్ని స్పష్టం చే సింది. గుర్తింపు కార్డులు, సరైన కారణాలు చూపించినా, వాటిని వినే ఓపిక కూడా లేని, కొందరు పోలీసులు అకారణంగా లాఠీలు ఝళిపించడం పోలీసుల ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తోంది. గ్రామాల్లో పొలం పనులకు వెళుతున్న రైతులనూ చావబాదుతున్న దృశ్యాలు, సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి.

కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లో వార్తా సేకరణకు వెళ్లిన విలేకరులను, చావగొట్టిన పోలీసుల వికృతకాండపై జిల్లా ఎస్పీ మండిపడ్డారు. అయితే, విలేకరులు తమ విధినిర్వహణకు ఆటంకం కల్పించారంటూ పోలీసులు విచిత్రంగా కేసు నమోదు చేశారు. ఇటు హైదరాబాద్ అంబర్‌పేటలో, ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్చార్జి విధి నిర్వహణ ముగించుకుని వెళుతున్న సమయంలో, పోలీసులు అకారణంగా ఆయనపై దాడి చేసిన వైనం సీఎం కేసీఆర్ వరకూ వెళ్లింది. దానితో ఆయన అవన్నీ మనసులో పెట్టుకోవద్దని చెబుతూ, విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది. కరోనా సమయంలో జర్నలిస్టులు వార్తా సేకరణకు వెళ్లవచ్చని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, పోలీసు కమిషనర్లు చెప్పినా.. వారిపైడులు జరుగుతున్నాయి. అంటే పై స్థాయి ఆదేశాలు, కిందిస్ధాయికి చేరడం లేదన్నది స్పష్టమవుతోంది. ఇవ న్నీ పోలీసులలో కనిపిస్తున్న దానవత్వపు కోణాలు. వ్యక్తుల మానసిక పరిస్థితుల ఆధారంగా వ్యవహరించే ఇలాంటి ఘటనలపై తీర్పులిచ్చేదెవరు?