ఢిల్లీ లో నిఘా.. నిద్రపోయిందా?

558

ఢిల్లీ పోలీసులు ఎందుకు మేల్కొనలేదు?
తేలని మర్కజ్ భక్తుల లెక్కలు

విదేశీయులు ఎక్కడికి వెళ్లినట్లు?
కేంద్ర-రాష్ట్రాల నిఘా సంస్థలు, ఇమ్మిగ్రేషన్, ఎస్‌బి ఏం చేస్తున్నట్లు?
ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ సమాచారం ఇచ్చిందా?
స్థానిక పోలీస్‌స్టేషన్లకు ఎస్‌బి సమాచారం ఇవ్వలేదా?
మార్చి 18నే తెలంగాణ పోలీసులు ఉప్పందించారా?
తెలంగాణ పోలీస్ సమాచారం ఇచ్చే వరకూ తెలియదా?
మౌలానా విదేశీయుల వివరాలు పోలీసులకిచ్చారా?
మౌలానా పరారీపై మరిన్ని అనుమానాలు?
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఢిల్లీ పోలీసులు ఎందుకు మేల్కొనలేదు?

దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి, తిరిగి జనజీవనం గాడిలో పడే సమయానికి పేలిన నిజాముద్దీన్ మర్కజ్ బాంబు, ఇప్పుడు జాతిని హడలెత్తిస్తోంది. మర్కజ్‌లో ప్రార్ధనలు చేసి వచ్చిన వారితో యావత్ దేశానికే ప్రమాదం వాటిల్లింది. మర్కజ్‌కు వచ్చిన విదేశీయుల ఆచూకీ గల్లంతవగా, దేశవ్యాప్తంగా అక్కడికి వెళ్లిన భక్తుల్లో, మరికొందరు కనిపించకుండా పోవడం గుబులురేపుతోంది. కరోనా ప్రమాదఘంటికలు తెలిసి కూడా.. కేంద్ర నిఘా సంస్థలు, ఢిల్లీ పోలీసులు, ఇమ్మిగ్రేషన్, స్పెషల్‌బ్రాంచి పోలీసులు ఎందుకు రాష్ట్రాలను అప్రమత్తం చేయలేకపోయారు? విదేశీయుల ఆనుపానులు తెలుసుకోవాల్సిన నిఘా సంస్థలు, ఎందుకు నిద్రపోయాయి? విదేశీయుల వివరాలను పోలీసులకు ఇవ్వాల్సిన ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ ఆ బాధ్యత నెరవేర్చిందా? లేదా? మరి ఇప్పుడు, తప్పించుకుపోయిన విదేశీయులను పట్టేదెవరు? తెలంగాణ పోలీసు అప్రమత్తం చేసే వరకూ మర్కజ్ వ్యవహారంపై, ఢిల్లీ పోలీసులు ఎందుకు మేల్కొనలేదు? ఇవీ తాజాపై తెరపైకి వచ్చిన ప్రశ్నలు.

కరోనా మహమ్మారి దేశాన్ని కబళించే పరిస్థితి ఉందని తెలిసి కూడా, నిజాముద్దీన్‌లో జమాత్‌కు అనుమతివ్వడాన్ని ఇప్పుడు  దేశమంతా  ప్రశ్నిస్తోంది. మార్చి 18న ఇండోనేషియా నుంచి టూరిస్టు వీసాలపై కరీంనగర్ వచ్చిన, 10 మంది మత ప్రచారకుల సంచారాన్ని..  తెలంగాణ పోలీసులు కనిపెట్టి, దానిని  కేంద్ర నిఘా సంస్థలకు సమాచారం ఇచ్చారు. దానితో మార్చి 24న మర్కజ్ పెద్దలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా చాలామంది మర్కజ్‌కు ప్రార్ధనల కోసం  వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు, తమ తాజా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం ప్రస్తావనార్హం. అంటే దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీ పోలీసు, నిఘా సంస్థలు, ఇమ్మిగ్రేషన్ ఈ అంశంపై పెద్దగా దృష్టి సారించలేదని స్పష్టమవుతోంది.

మౌలానా పరారీపై మరిన్ని అనుమానాలు?

కాగా, తగ్లీబ్ జమాత్ చీఫ్ మౌలానా శనివారమే పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆయన దొరికితే భక్తులు, విదేశీయుల వివరాలు తెలిసే అవకాశం ఉంది. మర్కజ్‌కు  ప్రార్ధనల కోసం  వెళ్లివచ్చిన వారు అంటించిన కరోనా వైరస్  వల్ల సమాజానికి హాని జరుగుతోంది.  దాని వల్ల యావత్ ముస్లిం సమాజం ఒంటరిదవుతోందని తెలిసినప్పటికీ.. మౌలానా ఇప్పటివరకూ తనకు తెలిసిన సమాచారం, విదేశీయుల వివరాలు వెల్లడించకపోవడం ఒక రకంగా దేశద్రోహమే. నిజంగా మౌలానా నిర్దోషి అయితే, పరారు కావలసిన అవసరం లేదు. కానీ ఈ క్లిష్ట సమయంలో తప్పించుకుని పారిపోయారంటే, ఆయన చర్యలపై సహజంగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మౌలానా విదేశీయులను తన అధీనంలో ఉంచుకుని, వారికి బస ఏర్పాటుచేసినట్టయితే, ఆ విషయాలను వారి వీసా వివరాలతో సహా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మౌలానా అది కూడా చేయకపోవడం మరో నేరం.

కేంద్ర-రాష్ట్రాల నిఘా సంస్థలు, ఇమ్మిగ్రేషన్, ఎస్‌బి ఏం చేస్తున్నట్లు?

ఇక విదేశీయులు దేశంలోకి అడుగుపెట్టినప్పుడు, వారిపై బోలెడంత నిఘా ఉండాలి. ఒకవేళ వాళ్లు హోటల్‌లో దిగితే, అక్కడ ‘సీ’ ఫారంపై వారి వివరాలివ్వాలి. ఆ ఫారాన్ని హోటల్ యాజమాన్యం సంబంధిత పోలీసుస్టేషన్, స్పెషల్‌బ్రాంచికి అందించాల్సి ఉంటుంది. ఆ విషయంలో కూడా ఢిల్లీ యంత్రాంగం తమ బాధ్యత నెరవేర్చినట్లు లేదు. నిజంగా అదే చేసినట్టయితే, ఇన్ని సమస్యలు తలెత్తేవి కాదు. ఫారినర్స్ యాక్టు  ప్రకారం, టూరిస్టు వీసాపై వచ్చిన వారు అక్కడికే పరిమితం కావాలి. వారు మరెలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఇప్పుడు నిజాముద్దీన్‌కు టూరిస్ట్ వీసాతో వచ్చిన విదేశీయులంతా, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ విషయం కూడా, అక్కడ ఉన్న ఇంటలిజన్స్ విభాగం కనిపెట్టలేకపోయింది. ఒక చిన్న ధర్నా, లేదా సమావేశం, రాజకీయ పార్టీల సమావేశం  జరుగుతుందని ఉప్పందితేనే, అక్కడికి ఇంటలిజన్స్ విభాగం వాలిపోతుంది. మరి అన్ని వేల మంది హాజరైన మర్కత్‌లో, ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో ఢిల్లీ యంత్రాంగం, ఎందుకు విఫలమయిందన్నది ప్రశ్న.

విదేశీయులు ఎక్కడికి వెళ్లినట్లు?

ముందు మన దేశంలోకి వచ్చిన వారి వివరాలను, ఆ దేశపు రాయబార కార్యాలయం సమాచారం ఇవ్వాల్సి ఉంది. మరి ఆ విషయంలో ఆయా రాయబార కార్యాలయాలు, తమ బాధ్యతను నెరవేర్చాయా? లేదా? అన్నది మరో సందేహం. సహజంగా ఎవరైనా విదేశీయులు కనబడితే, వారిని అడ్డుకుని వీసా-పాస్‌పోర్టు తనిఖీ చేసే అధికారం, ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్‌కూ ఉంటుంది. కానీ, ఆ పని ఎంతమంది చేస్తున్నారు? ఆ విషయం ఎంతమంది పోలీసులకు తెలుసు? ఇమ్మిగ్రేషన్ విభాగం విదేశీయులను తనిఖీ చేసిన తర్వాత.. ఎయిర్‌పోర్టు నుంచి, వారు ఎక్కడికి వెళుతున్నారని తెలుసుకోవలసిన ఎస్‌బి విభాగం కూడా, ఈ వ్యవహారంలో విఫలమయినట్లు కనిపిస్తోంది.

ఢిల్లీ పోలీసులు చేయలేకపోవడం ఆశ్చర్యం

1992లో అయోధ్యలో జరిగిన శిలాన్యాస్‌కు హాజరయిన వారందరి వివరాలు, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.. కేవలం తమకు స్థానికంగా ఉన్న పరిచయాలు, వృత్తిపరంగా పెంచుకున్న సంబంధాల ఆధారంగా  కనిపెట్టారు. మసీదు కూల్చివేతలో ప్రత్యక్షంగా లేనప్పటికీ, అక్కడికి వెళ్లినందుకు వారందిరిపై సస్పెక్ట్ షీటు ఓపెన్ చేసి, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసిన ఘనత,  హైదరాబాద్ స్పెషల్ బ్రాంచి పోలీసులది. మరి ఇలాంటి పని ఢిల్లీ పోలీసులు చేయలేకపోవడం ఆశ్చర్యం.

ఇక రాష్ట్రాల పోలీసులు, నిఘా సంస్ధలు కూడా తమ రాష్ట్రం నుంచి ఎంతమంది, మర్కజ్‌కు వెళ్లారని కనిపెట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇమ్మిగ్రేషన్ విభాగం ఎంతమంది విదేశీయులు వచ్చారన్న విషయాన్ని, ఫారినర్స్ రీజనల్ రిజిస్టర్డ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ )కు అందించాలి. ఆ ప్రకారంగా ఎంతమంది విదేశీయులు వచ్చారన్న లెక్క ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ వద్ద ఉంటుంది. మరి  ఢిల్లీ పోలీసులు,  ముందుగానే ఆ దిశగా  ఎందుకు విచారణ చేపట్టలేదు? ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ కూడా తన విధి నిర్వర్తించిందా లేదా అన్నది  ప్రశ్న.  తెలంగాణలో ఇంకా 160 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

స్థానిక పోలీస్‌స్టేషన్లకు ఎస్‌బి సమాచారం ఇవ్వలేదా?

నిజానికి, దేశంలో డ్రోన్లు, కెమెరాలు, బగ్గింగ్ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. పోలీసులకు, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పోయాయి. గతంలో ఇలాంటి సాంకేతిక వ్యవస్థ అందుబాటులో లేనప్పటికీ, కేవలం ప్రజలు, వివిధ వర్గాల వారితో పెంచుకున్న సంబంధాల ఆధారంగానే, నిఘా వ్యవస్థ జయప్రదంగా నడిచేది. అప్పటి నిఘా దళపతులు కూడా.. కానిస్టేబుల్ నుంచి ఇంటలిజన్స్ ఎస్పీల వరకూ అందరినీ, వివిధ వర్గాలతో తరచూ మాట్లాడుతుండాలని సూచించేవారు. ముఖ్యంగా జర్నలిస్టులు, ప్రజాసంఘాలనేతలు, పార్టీల నాయకులతో వ్యక్తిగత సంబంధాలు నెరపాలని బోధించేవారు. హైదరాబాద్‌లో ఎక్కువకాలం నిఘా విభాగంలో పనిచేసిన కిషన్‌రావు, యోగానంద్, మాధవరావు వంటి సీనియర్ల హయాంలో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉందంటే, దానికి కారణం ఇదేనని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు నిఘా మెదళ్లు కే వలం.. కంప్యూటర్లకు పరిమితమవడంతో, కింది స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. కింది స్థాయిలో ఉండే వివిధ వర్గాల వారితో, మునుపటి మాదిరిగా ఎవరికీ సన్నిహిత సంబంధాలు లేవు.  పైగా, వివిధ రాష్ట్రాల్లో ఇంటలిజన్స్ దళపతులుగా ఉన్న వారిలో, ఎక్కువ మందికి స్థానిక భాష తెలియకపోవడం కూడా, సమాచారం తెలుసుకునేందుకు ఒక అవరోధంగా మారింది.  అటు ప్రభుత్వాలు కూడా, ఎక్కువగా రాజకీయ పార్టీల కదలికలు, వారి కార్యకలాపాలపైనే  ప్రాధాన్యత ఇవ్వడంతో, పోలీసు బాసుల ప్రాధాన్యం కూడా మారిపోయేందుకు ఒక కారణమవుతోంది.