ఆర్ధిక ఎమర్జెన్సీ అమలులో ఉందా?

346

ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్
పక్షం రోజులకే వేతనాల్లో కోతనా?

రెండు రాష్ట్రాల్లో ఉద్యోగుల జీతాలలో కోత
హైకోర్టును విడిచిపెట్టారేం?
ఏపీలో ఐఏఎస్‌ల అభ్యంతరాలు
పెన్షనర్లు, కింది స్థాయి ఉద్యోగుల గతేమిటి?
ధనిక రాష్ట్రంలోనూ ఈ కోతల దరువేమిటన్న విపక్షాలు
ప్రభుత్వమే ఇలా చేస్తే ఇక ప్రైవేటు మాట వింటుందా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

రెండు రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి

ఒకటి ధనిక రాష్ట్రం. మరొకటి అప్పుల్లో ఉన్న రాష్ట్రం. అయినా మార్చి నెల ఆదాయానికి
ఢోకా లేదు. మధ్యలో వచ్చిన కరోనా కల్లోలం ఖజానాను గుల్ల చేసింది. ఫలితం.. ధనిక
రాష్ట్రం-పేద రాష్ట్ర అధిపతుల కన్ను ఉద్యోగుల జీతాలపై పడింది. ఇంకేం? ఎవరితో
సంప్రదించకుండా, ఏకపక్షంగా జీతాల్లో కోతకోసి పారేశారు. దానికి వాయిదా అని ముద్దు
పేరు పెట్టారు. చివరాఖరకు పెన్షనర్లను కూడా  విడిచిపెట్టలేదు. అవుట్ సోర్సింగ్, నాలుగో
తరగతి ఉద్యోగుల గోస సరేసరి. పాపం.. హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బందే పుణ్యం చేసుకున్నట్లున్నారు. ఇవన్నీ చూస్తుంటే..
తెలుగు రాష్ట్రాల్లో అన ధికార ఆర్ధిక ఎమర్జెన్సీ ఏమైనా  విధించారా? రాష్ట్రపతి చేయాల్సిన ఆ పనిని, ఇద్దరు ముఖ్యమంత్రులు
ఒకరి స్ఫూర్తితో మరొకరు అనధికారికంగా అమలు చేస్తున్నారా? అన్న చర్చ  తెరపైకి వస్తోంది.

తెలంగాణలో ఇలా..

కరోనాను నియంత్రించేందుకు, అవసరమైతే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సైతం సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. బడ్జెట్‌లో లేకపోయినా నిధులు వెచ్చిస్తున్నామని, ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు క్లాసు ఇచ్చి మరీ వెల్లడించారు. కానీ, అంతలోనే తెలంగాణ ప్రభుత్వ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నామని ప్రకటించారు. ఆ కోతలు ఎన్నాళ్ల దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. తెలంగాణలో 4,49,516 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రభుత్వ, ఒప్పంద ఉద్యోగులు 4,30,674 మంది ఉన్నారు. 2.5లక్షల మంది పించనుదారులున్నారు. వీరికి ప్రతినెల 3,500 కోట్లు వెచ్చిస్తున్నారు. అయితే, వీరి జీతాల్లో కోతల వల్ల 1700 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుంది.
తక్కువ వేతనాలకు పనిచేసే అవుట్‌సోర్సింగ్, హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ సహాయకులు, వీఆర్‌ఏలు, విద్యావలంటీర్ల జీతాలలో 10 శాతం కోత పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పించన్లలో పదిశాతం కోత పడుతుంది. ఇక సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు,  స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసు అధికారుల వేతనంలో 60 శాతం కోత విధించింది. దీనిని ప్రభుత్వం, కోత అని కాకుండా వాయిదాగా చెబుతున్నప్పటికీ.. నెలవారీ జీతాలపై ఆధారపడే ఉద్యోగులు మాత్రం, ఈ నెల జీతం తగ్గించి ఇస్తున్నందున,  అది కోతగానే భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్

అయితే, దీనిపై తెలంగాణ  ఉద్యోగ సంఘాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ధనిక రాష్ట్రమని చెప్పుకునే ప్రభుత్వం, కేవలం 15 రోజుల్లోనే దివాలా తీసిందా అని రాజకీయ, ఉద్యోగ, ఉపాధ్యా, కార్మిక సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.  ఆర్ధిక ఎమర్జెన్సీ విధించినప్పుడే ప్రభుత్వానికి ఇలాంటి అధికారం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే తాము ఒకరోజు జీతం విరాళంగా ప్రకటించామని గుర్తు చేస్తున్నారు. మార్చిలో రిటైరవుతున్న వారికి సైతం, ఈ నిబంధన వర్తింపచేయడం దారుణమంటున్నారు. తాము అద్దెకు ఉంటున్న యజమానులు సగం అద్దె తీసుకోరని, పాలు, కిరాణాషాపుల వాళ్లు సగం డబ్బులిస్తామంటే ఎలా అంగీకరిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీన్నిబట్టి,  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ప్రభుత్వం ప్రచారం చేసుకున్నంత,  గొప్పగా ఏమీ లేదని అర్ధమవుతోందంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అటు ఉద్యోగ సంఘాలు, సీఎస్‌ను కలసినా ప్రయోజనం కనిపించలేదు. చివరకు ఈ వ్యవహారం కోర్టుకెక్కేలా కనిపిస్తోంది.

ఆంధ్రాలో అలా..

ఉద్యోగుల వేతనాలపై తెలంగాణ సర్కారు, అలా నిర్ణయం తీసుకున్నదో లేదో.. ఏపీలో జగన్  సర్కారు కూడా, కేసీఆర్ బాటలోనే నడిచింది. సీఎం నుంచి అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు, అసలు ఈనెల జీతమే చెల్లించరని ప్రభుత్వం ప్రకటించింది. పది రూపాయలు ఎక్కువ చెల్లించయినా, కొనుగోలు చేయండని ఇటీవలే ఆదేశించిన జగన్.. సర్కారు ఉద్యోగులకు జీతాలివ్వకలేక, వాయిదా ముసుగులో కోత విధించింది. మిగిలిన కోతలన్నీ తెలంగాణ తరహాలోనే విధించింది. దీని ద్వారా సర్కారుకు 2500 కోట్లు ఆదా కానుంది.

కాగా, జనవరి, ఫిబ్రవరిలో ఎంత ఆదాయం వచ్చిందో మార్చిలో కూడా అంతే వచ్చినా, జీతాల్లో ఎందుకు కోత విధించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ‘దేశంలో అన్ని రాష్ట్రాలూ జీతాల్లో కోత పెట్టడం లేదు. ఈ రెండు రాష్ట్రాల్లోనే కోత ఎందుకు పెడుతున్నారో అర్ధం కావడం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుకుని, జీతాల్లో కోత విధించారో చెప్పాలి. దీనిపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించా’లని చంద్రబాబు పార్టీ నేతల టెలీకాన్ఫరెన్సులో డిమాండ్ చేశారు.

ఐఏఎస్‌లలో అసంతృప్తి

అయితే, ఈ నిర్ణయంపై ఏఐఎస్ జూనియర్ బ్యాచ్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే మూడురోజుల జీతాన్ని విరాళంగా ప్రకటించామని గుర్తు చేస్తున్నారు. తమపై ఆధారపడిన కుటుంబాలు, నెలవారీ ఈఎంఐలతోపాటు, అమరావతిలో 25 లక్షలు పెట్టి భూములు కొనుగోలు చేసినందున, తమకు జీతం సరిపోదని వాపోతున్నారు. బాగా ఆదాయం ఉన్న శాఖల్లో, పనిచేసే ఐఏఎస్‌ల వేతనాల్లో  కోత విధించినా ఫర్వాలేదని, కానీ జీతాల మీదే ఆధారపడి జీవించే తమ వేతనాలపై, కోత విధించడం అన్యాయమంటున్నారు.

ఇక ప్రైవేటుపై పట్టు ఉంటుందా?

లాక్‌డౌన్ కారణంగా, ప్రభుత్వ-ప్రైవేటు ఉద్యోగుల వేతనాలలో కోత విధించవద్దని, కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా, స్వయంగా ఈ విషయం ప్రస్తావించారు. ప్రైవేటు కంపెనీలు, తమ ఉద్యోగులకు లాక్‌డౌన్ కారణంగా వేతనాల్లో కోత విధించవద్దని ఆదేశించారు. కానీ ఇప్పుడు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో వాయిదా పద్దతిన కోత విధించింది. ఈ నేపథ్యంలో, ఇక ప్రైవేటు సంస్థలు కూడా అదే విధానం పాటించి,  నిరోధించేందుకు ప్రభుత్వానికి ఏం నైతిక హక్కు ఉంటుంది? మీరు చేసేదే మేమూ అమలుచేస్తున్నామని ప్రైవేటు సంస్థలు చెబితే, అప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

హైకోర్టుకు మినహాయింపు ఇచ్చారేం?

ఆలిండియా సర్వీసులకు చెందిన అధికారుల వేతనాలలో సైతం.. వాయిదా పద్ధతిలో కోత విధించిన రాష్ట్ర ప్రభుత్వాలు, మరి లక్షల జీతాలు తీసుకునే హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సిబ్బందితోపాటు.. జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టుల న్యాయమూర్తులు, సిబ్బందికి మాత్రం మినహాయింపు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. వారి జోలికి వెళ్లకుండా, తమపై ప్రతాపం చూపించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

ఆర్ధిక సంక్షోభంలో ఉందా?

నిజానికి ఆలిండియా సర్వీసుల వారికి వేతనాలు ఆపే అధికారం గానీ, కోత విధించే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు లేవంటున్నారు. అసలు ఇలాంటి అనుభవం తమకు ఇదే తొలిసారని కొందరు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆర్ధిక ఎమర్జెన్సీ విధిస్తే, అప్పుడే మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని వివరిస్తున్నారు. రాష్ట్రపతి మాత్రమే ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటిస్తారని, కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ధిక సంక్షోభం ఉన్నట్లు.. ప్రభుత్వాల నిర్ణయాల ద్వారా స్పష్టమవుతోందని, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.