ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది: దేవినేని

198

ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది – ముఖ్యమంత్రి గారు … సమీక్షలు ఆపి క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకోండి

చౌక డిపోల్లో సర్వర్ పనిచేయక ప్రజలు అవస్థలు – తెల్లవారుఝాము 4 గం.ల నుండి క్యూ లో ఉన్నా 11 లకు కూడా పంపిణి చేయకుండా మరుసటి రోజు రమ్మంటున్నారు

పేదవాడికి ఉచితంగా ఇవ్వాల్సిన ఈ పరిస్థితుల్లో పంచదార, గోధుమ పిండి కి రూ.30లు వసూలు చేస్తున్నారు

హుద్ హుద్ తిత్లీ వంటి సంక్షోభ పరిస్థితుల్లో చంద్రబాబు ఉచితంగా నిత్యవసరాలు పంపిణీ చేసారు

జాతీయ రహదారి జిల్లా నడిబొడ్డు ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో ఈ పరిస్థితులు ఉంటే ఇక పల్లెలు గ్రామాల్లో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి

హై లెవల్ కమిటీ, మంత్రులు ఏం చేస్తున్నట్లు ? ప్రాణాలను పణంగా పెట్టి ఆడవాళ్లు నిత్యవసరాలకు బయటకొస్తున్నారు వారి ఆరోగ్యాలను కాపాడాల్సిన భాద్యత లేదా ?

దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడే తరుణం కాదు మానవత్వంతో పనిచేయండి

ఇబ్రహీంపట్నం(ఫెర్రీ, కొండపల్లి):- ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షలు ఆపి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నం మండలంలోని ఫెర్రీ, కొండపల్లి గ్రామాల్లో చౌక డిపోలు, రైతుబజార్లను సందర్శించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దేవినేని ఉమాకు వివరించారు. తెల్లవారుఝాము 4 గంటల నుండి క్యూ లైన్ లో 11 గం.ల వరకు ఉన్నప్పటికీ వాలంటీర్లు, వీఆర్వోలు సర్వర్లు పనిచేయటం లేదు, ఆన్ లైన్ సరిగాలేదని సాకులు చెబుతూ పంపిణీ చేయక మరుసటి రోజు రమ్మని చెబుతున్నారని ఫెర్రీకి చెందిన దునకా రామలక్ష్మి, వెంకాయమ్మలు ఉమాకు తెలిపారు. పూర్తి నాసిరకం బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

 

వెంటనే దేవినేని ఉమా జాయింట్ కలక్టర్ తో మాట్లాడి స్థానిక పరిస్థితులను జేసీ వివరించి అక్కడ వారితో మాట్లాడించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జేసీని కోరారు. కొండపల్లి రైతుబజారు సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో హుద్ హుద్ తిత్లీ వంటి సంక్షోభ పరిస్థితుల్లో చంద్రబాబు ఉచితంగా నిత్యవసరాలు పంపిణీ చేసారని, పేదవాడికి ఉచితంగా ఇవ్వాల్సిన ఈ పరిస్థితుల్లో పంచదార, గోధుమ పిండి కి రూ.30లు వసూలు చేయటం సరికాదన్నారు. జాతీయ రహదారి జిల్లా నడిబొడ్డు ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో ఈ పరిస్థితులు ఉంటే ఇక పల్లెలు గ్రామాల్లో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని తెలిపారు. హై లెవల్ కమిటీ, మంత్రులు ఏం చేస్తున్నారని, ప్రాణాలను పణంగా పెట్టి ఆడవాళ్లు నిత్యవసరాలకు బయటకొస్తుంటే వారి ఆరోగ్యాలను కాపాడాల్సిన భాద్యత వీరికి లేదా అని ప్రశ్నించారు. దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడే తరుణం కాదని, మానవత్వంతో పనిచేయాలని ప్రభుత్వానికి సూచించారు.