పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చండి

90

* రేషన్, పించన్లు పంపిణీ చోట్ల ప్రజలు గుంపులుగా లేకుండా చూడండి
* ఏపి సిఎస్ నీలం సాహ్ని
అమరావతి: క‌రోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పూర్తిగా మెరుగుపర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. కరోనా వైరస్‌పై మంగళవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థను అన్నివిధాలా మెరుగు పర్చాలని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో సర్వే ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే వార్డు వాలంటీర్, ఆశా వర్కర్,వార్డు హెల్త్ సెక్రటరీల మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు.పట్టణ ప్రాంతాల్లో మూడు ఆంచలుగా చేపట్టాల్సిన చర్యలుపై మంగళవారం రాత్రికి అవసరమైన ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుందని సిఎస్ పేర్కొన్నారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. అంతేగాక ప్రతి వార్డుకు ఒక నోడల్‌ అధికారిని నియమించాలని ఆదేశించారు. అదే విధంగా ప్రజల్లో వ్యక్తి గత పరిశుభ్రత బిహేవియరల్ చేంజ్ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.హైరిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యంగా రెడ్ జోన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.కరోనా అనుమానితుల నుండి శాంపిల్స్ సేకరించే వైద్య సిబ్బందికి వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నిత్యావసర సరుకులు ప్రజలందరికీ నిర్దేశిత ధరలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.ఆయా ధరల పట్టికను ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.అదే విధంగా రేషన్ సరుకులు పంపిణీ చేసే చోట అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు.వలస కార్మికులకు వసతి ఆహారం వంటి సౌకర్యాలు కల్పించుటలో తగిన చర్యలు తీసుకోవాలని మెనూను సక్రమంగా అమలు చేయాలని సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఒకవేళ పాజిటివ్ కేసులు అధికంగా వస్తే వారికి తగిన వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రతి జిల్లాలో 5వేల పడకలను సిద్ధం గా ఉంచాలని కలెక్టర్లును ఆదేశించారు.ఇందుకై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలతోపాటు అందుబాటులో ఉన్న కళ్యాణ మండపాలు, స్టేడియంలు మొదలైనవి సిద్ధం గా ఉంచుకోవాలని అన్నారు. పాజిటివ్ కేసులను వెంటనే జిల్లా కోవిద్ ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. మెబైల్ శాంపిల్స్ టెస్టింగ్ నిర్వహణకు సంబంధించి సోమవారం జారీ చేసిన ఆదేశాలను సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. వీసీలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఆ శాఖ కమీషనర్ జిఎస్ఆర్కె విజయ్‌కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక కమీషనర్ కన్నబాబు, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.