తుగ్లీ జమాత్ వెనుక ఏం జరుగుతోంది?

నిధులు, వీసాలపై విచారణ
విదేశీయుల వీసాలు రద్దు?
కన్నేసిన కేంద్రం
(మార్తి సుబ్రహ్మణ్యం)
నిజాముద్దీన్ తుగ్లీ జమాత్ సమావేశం తెరవెనుక ఏం జరిగింది? ఏం జరగబోతోంది? అసలు అక్కడికి వచ్చిన విదేశీయులకు నిధులిచ్చిందెవరు?.. దీని వెనుక కదలికపై కేంద్రం కన్నేసింది. నిజాముద్దీన్ ఘటనపై హోం మంత్రి అమిత్‌షా రంగంలోకి దిగారు. అసలు ఈ ఘటన సహజమా? అసహజమా? అన్న అంశంపై కేంద్రం కన్నేసింది. ఒకేసారి కొన్ని వందల మంది అక్కడికి ప్రత్యేకించి కొన్ని అంశాలపై సమావేశమవడమే, అనేక అనుమానాలకు కారణమయింది. నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారిలో అనేక మంది వైరస్ సోకి, మృతి చెందడంపై మరోవైపు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో కుట్ర కోణం ఉందా? ఒకవేళ అదే నిజమైతే.. అందుకు వారు కూడా బలి అవుతారు కదా? అనే చర్చకూ తెరలేచింది.
నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మార్చి 10న తబ్లీఘి-జమాత్‌కు మలేసియా, ఇండోనేసియా, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్, కిర్జిస్తాన్తోపాటు మరికొన్ని దేశాలకు చెందిన మత ప్రచారకులు హాజరయ్యారు. అయితే, వారికి ఆ స్థాయిలో నిధులు ఇచ్చిన సంస్థలపై, ఇప్పుడు కేంద్రం కన్నేసింది. ఆ నిధులు ఇచ్చిన సంస్థలు ఏమిటన్న దిశగా ఆరా మొదలయింది. కొన్ని వేల మందితో జరిగిన ఆ సమావేశానికి హాజరయిన, విదేశీ ప్రతినిధులకు వీసా ఏర్పాట్లు చేయడం ఒకరిద్దరితో కుదిరే పనికాదు. దానితో దాని వెనుక ఎవరున్నారు? అసలు వీసా పొందేందుకు ఎవరి నుంచి అనుమతి కోరారు? అన్న అంశాలపై కేంద్ర నిఘా, రక్షణ దళాలు దృష్టి సారించాయి.
ఇప్పటి సమాచారం ప్రకారం.. జమాత్‌కు హాజరైన విదేశీయుల వీసాలు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగా 72 మంది ఇండోనేషియా, 34మంది శ్రీలంక, 33 మంది మియన్మార్, 28 మంది కర్గిస్ధాన్, 20 మంది మలేషియా, 9 మంది నేపాల్, 9 మంది బంగ్లాదేశ్, 7మంది థాయ్‌లాండ్, నలుగురు ఫిజీ, ముగ్గురు ఇంగ్లాండ్‌కు చెందిన వారితోపాటు, ఆఫ్ఘాన్, కువైట్, అల్జేరియా, సింగపూర్, ఫ్రాన్స్, జిబౌటీ దేశాలకు చెందిన వారి వీసాలు రద్దవుతాయి. కాగా మన దేశంలో అత్యధికంగా, తమిళనాడు నుంచి 500 మంది ఈ సమావేశానికి హాజరయినట్లు కేంద్రం గుర్తించింది.
అయితే ఈ మత సదస్సులో, ఇప్పటికే పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని.. దేశవ్యాప్తంగా వ్యతిరేకించే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సదస్సు నిర్వహించిన తబ్లిక్ ఏ జమాత్ సంస్థ.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, ఇప్పటికే ఆ వర్గాన్ని కూడగడుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇటీవల కేంద్రం అమలుచేస్తున్న చట్టాలు, మైనారిటీల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ, పలు సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.