నిజాముద్దీన్.. నిజం సమాధి చేసింది!

423

నిజాముద్దీన్…ఇప్పుడు ప్రజల నెత్తిన పిడుగు
దేశాన్ని ప్రమాదంలో నెట్టేసిన మత సమావేశం

పెరుగుతున్న ‘లెక్క’లేని తనం
లాక్‌డౌన్‌లోనూ ఆగని మత ప్రచారం
ఢిల్లీ నుంచి గల్లీల వరకూ..
(మార్తి సుబ్రహ్మణ్యం)

అబద్ధం తాత్కాలికంగా గెలిచినా, నిలకడగానయినా నిలిచేది నిజమే. ఈ డైలాగు చాలా సినిమాల్లో విన్నాం. అది ఒకప్పుడు నిజమే
కావచ్చు. కానీ, ఇప్పుడు కాదు.  నిజం కాళ్లు కడుక్కుని వచ్చే లోగా, అబద్ధం అనే వైరస్ దేశం మొత్తం పాకి, మనుషులను
కబళిస్తున్న భయానక పరిస్థితి. నిజాముద్దీన్ నుంచి మొదలైన కరోనా వైరస్..వాయువేగంతో దేశం నలుమూలలకు విస్తరిస్తూ,
ప్రజలు-పాలకులను భయపెడుతోంది.

ప్రజల నెత్తిన నిజాముద్దీన్ పిడుగు

లాక్‌డౌన్ ఫలితంగా, కరోనా కలవరం తగ్గుముఖం పడుతున్న సమయంలో.. మరో 15 రోజుల తర్వాత, లాక్‌డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తివేస్తారని సంబరపడుతున్న సమయంలో, హజ్రత్ నిజాముద్దీన్ నుంచి పుట్టిన వైరస్, ప్రజల నెత్తిన పిడుగులా పేలింది. ఢిల్లీ నిజాముద్దీన్‌లో, ఇస్లాం మత ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన వందలాది మందికి వైరస్ సోకిందన్న నిజం, ఇప్పుడు జాతిని కలవరపెడుతోంది. అక్కడికి వెళ్లిన వారు, ఆ నిజాన్ని దాచి ఎవరికీ అందకుండా ఆడుతున్న అబద్ధాలు, జనం ప్రాణాలమీదకు తెస్తున్నాయి. నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మార్చి 10న తబ్లీఘి-జమాత్‌కు మలేసియా, ఇండోనేసియా, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, కిర్జిస్తాన్‌తో పాటు మరికొన్ని దేశాలకు చెందిన మత ప్రచారకులు హాజరయ్యారు. వారి నుంచే ఆ సమావేశానికి హాజరయిన వారికి వైరస్ అంటి, అది అందరికీ పాకింది.  చివరకు ప్రాణాలమీదకు తెచ్చింది. ఇటీవల ఏపీ-తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారిలో, అక్కడికి వెళ్లివచ్చిన వారే కావడం చూస్తే.. లెక్కలకు అందకుండా తిరుగుతున్న వారి వల్ల, ఎంత ప్రమాదం పొంచి ఉన్నదో స్పష్టమవుతోంది.

అన్ని కేసులకూ అదే కేంద్రం

నిన్న ఢిల్లీలో నమోదైన 25 కేసుల్లో, 18 కేసులు నిజాముద్దీన్ నుంచే కావడం.. ఏపీలో తాజాగా పరీక్షించిన 164 కేసుల్లో17 పాజిటివ్, అందులో నిజాముద్దీన్ నుంచి వారే 14 మంది ఉండటం, మిగతా ముగ్గురు మక్కా,మదీనా నుంచి వచ్చిన వారే కావడం.. కరీంనగర్‌లో బయటపడ్డ ఇండోనేసియా వాసులు కూడా తబ్లీఘ్-ఈ-జమాతేకు హాజరైన వారే కావడం చూస్తే..  దేశం రెండోసారి ఎంత ప్రమాదంలో చిక్కుకుందో అర్ధమవుతుంది.

తెలుగు రాష్ట్రాలకు  నిజాముద్దీన్ సెగ

నిజాముద్దీన్‌లో జరిగిన మత సమావేశానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ముస్లింలు వందల సంఖ్యలో హాజరయ్యారు. ఏపీలోని విజయనగరం జిల్లా నుంచి 3, విశాఖ రూరల్-1, విశాఖ సిటీ-41, తూర్పు గోదావరి-6, పశ్చిమ గోదావరి 16, రాజమండ్రి -21, కృష్ణా 16, విజయవాడ సిటీ-27, గుంటూరు  సిటీ-45, రూరల్ 43, ప్రకాశం 67, నెల్లూరు 68, కర్నూలు-189, కడప-59, అనంతపురం-73, చిత్తూరు 20, తిరుపతి 16..  మొత్తం 711 మంది హాజరయ్యారు. తెలంగాణ లోని… హైదరాబాద్‌లో 186 మంది, నిజామాబాద్-18, మెదక్-26, నల్లగొండ 21, ఖమ్మం-15, ఆదిలాబాద్- 10, రంగారెడ్డి-15, కరీంనగర్-17, మహబూబ్‌నగర్ -25, భైంసా- 11, నిర్మల్ 11 మంది పాల్గొన్నట్లు ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది.

ఇప్పుడు వారంతా ఏ రైళ్లలో నిజాముద్దీన్ వెళ్లి వచ్చారని తెలుసుకునేందుకు మల్లగుల్లాలు పడుతోంది.
తిరిగివచ్చిన వారంతా, తర్వాత ఎవరెవరితో కలిశారు? నిజాముద్దీన్ సమావేశ వివరాలు సహచరులకు చెప్పేందుకు, ఎంతమందితో సమావేశం నిర్వహించారు? వాటికి ఎంతమంది హాజరయ్యారు? వెళ్లిన వారిలో ఎంతమంది విందులు, వినోదాల్లో పాల్గొన్నారన్న విషయాలు తెలుసుకోవడం ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే బావమరిది కూడా, నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఆయన సహా -ఆయన భార్యకు వైరస్ సోకింది. అదృష్టవశాత్తూ ఎమ్మెల్యే, ఆయన కుటుంబానికి వైరస్ సోకలేదు. కానీ, ఆయన బావమరిది ఇచ్చిన విందుకు ఎంతమంది హాజరయ్యారన్న లెక్క ఇప్పటికీ తేలలేదు.

నిజాముద్దీన్ వెళ్లిన వారెవరో బయటకు రారేం?

నిజాముద్దీన్ సమావేశానికి.. కాశ్మీర్ నుంచి కరీంనగర్ వరకూ, చాలామంది ముస్లింలు హాజరయ్యార ని కేంద్రం గుర్తించింది. కానీ వారి వివరాలేవీ తెలియక ఆందోళనలో ఉన్న ప్రభుత్వానికి, వారెవరూ సహకరించే పరిస్థితి లేకపోవడ ంతో, మతపెద్దల ద్వారా, విజ్ఞప్తి చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వారిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స చేసేందుకు ప్రభుతాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, అక్కడి నుంచి వచ్చిన వారెవరూ నిజాన్ని అంగీకరించేందుకు, ముందుకు రాకపోవడం ప్రజల ప్రాణాలకు పెనుముప్పులా పరిణమించింది. కరీంనగర్, చీరాల, గుంటూరు, భీమవరం, ఆకివీడు ప్రాంతాల్లోని కొంతమంది ముస్లింలను మాత్రమే, నిజాముద్దీన్‌కు వెళ్లిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. మిగిలిన వారి సమాచారం, ఆనుపానులు బయటకు పొక్కకపోవడం ప్రభుత్వానికి సవాలుగా మారింది.
ఢిల్లీ నుంచి ఒంగోలు రైల్వే స్టేషన్‌లో 200 మంది, చీరాలలో 80 మంది దిగినట్లు చెబుతున్నారు. గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే
బావమరిది, ఆసుపత్రిలో చేరకముందు 130 మందిని కలుసుకున్నట్లు చెబుతున్నారు. అనంతపురం-కృష్ణా జిల్లాలకు చెందిన
మరికొందరు ఆయనతోపాటు వెళ్లినట్లు సమాచారం. మరి వారందరి వివరాలు ఎప్పుడు వెల్లడవుతాయి? వారిలో ఎంతమంది
పరారీ కాకుండా, ఇప్పుడు అందుబాటులో ఉన్నారు? అన్న ప్రశ్నలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.

మర్కజ్ మౌలానాపై కేసుల కొరడా

కాగా.. మర్కజ్‌కు వచ్చిన వారి వివరాలు ఇవ్వని, మర్కజ్ మౌలానాపై ఢిల్లీ ప్రభుత్వం మండిపడింది. దానితో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. దేశంలో నమోదైన కాంటాక్ట్ కేసులన్నీ, వీరి నుంచి వ్యాపించినవేనని గుర్తించిన ఢిల్లీ పోలీసులు.. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలో తీసుకుని, క్వారంటైన్‌కు పంపించింది. అయినా వారు అక్కడ కూడా, సామాజిక దూరం అనే నిబంధనను పాటించడం లేదని, ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. అయితే.. తమ వద్దకు వచ్చిన వారిలో కొందరు, 24న ప్రభుత్వం నుంచి 17 వాహన పాసులు తీసుకుని వెళ్లిపోయారని,  లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వంతో సంప్రదింపులు ఫలించకపోవడంతో, మర్కజ్‌లో జనం ఉండిపోయారని మర్కజ్ నిజాముద్దీన్ ప్రకటించారు. జనతాకర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత ఎవరికి తోచిన మార్గంలో వారు వెళ్లిపోయార న్నారు.  తాము ఇప్పటికీ ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

చివరకు చేసేది అభ్యర్ధనలే

కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వాలకు సహకరించాల్సిన వారంతా, ఇప్పుడు మాయమయిపోయారు. దయచేసి వారంతా వచ్చి
రిపోర్టు చేస్తే, క్వారంటైన్‌లో సౌకర్యాలు సమకూర్చుతామని,  చివరకు ప్రభుత్వం అభ్యర్ధించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. ఆ
ప్రయత్నలు ఫలించకపోవడంతో, ప్రభుత్వమే మత పెద్దలను రంగంలోకి దించి, వచ్చి క్వారంటైన్‌లో చేరండని ప్రాధేయపడుతున్న
వైచిత్రి దర్శనమిస్తోంది. ఈ విషయంలో ఇప్పటివరకూ అన్ని పార్టీలూ, నిజాముద్దీన్‌కు వెళ్లిన వారు ముందుకొచ్చి తమ వివరాలు
ఇవ్వాలని కోరారు. అయినా ఫలితం శూన్యం. పైగా.. ఈ విషయంలో మైనారిటీ సంఘాలు చేస్తున్న వాదనలు, నిజాముద్దీన్ వెళ్లిన
వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాల బదులు, నిజాముద్దీన్ వ్యవహారంలో తమను దోషులుగా నిలబెట్టడాన్ని
ప్రశ్నిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ఎవరంతట వారే ముందుకువచ్చి, సహకరించాల్సిన
ఈ పరిస్థితిలో..  భయంతో  దాక్కుని, సమాజానికి హాని చేస్తున్న వారే, ఇప్పుడు నిజమైన ప్రమాదకారులు.

ఆగని చర్చి ప్రార్ధనలు

ఇక తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలులో ఉంది. అయినా వివిధ మతాలు తమ మత ప్రచారం ఆపడం లేదు. వీటికి సంబంధించి సోషల్‌మీడియాలో వస్తున్న వీడియోలు, ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. చర్చిలోకి వెళ్లిన వారిని పోలీసులు తరమివేస్తున్న దృశ్యాలు, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కమ్మచిక్కాల గ్రామంలో,  మినీ బస్సులో మత ప్రచారానికి వచ్చిన వారిని స్థానికులు అడ్డుకుని, పోలీసులకు అప్పగించిన సందర్భంలో జరిగిన వాదనలు, ఆదివారం ఫాదర్ తన ఇంట్లో మత ప్రార్ధనలు చేస్తూ,  పోలీసుల ఎదుట నిలబడిన దృశ్యాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అది, మిగిలిన మతాల మనోభావాలపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. కరోనాను తక్కువచేస్తూ శ్రీరామ కల్యాణానికి వెళదామని  మాట్లాడిన హరేరామ ఉద్యమ నాయకుడి వీడియో కూడా విమర్శలకు గురవుతోంది.