నేను రాజకీయం చేయను… కానీ మీరు సమర్థంగా పనిచేయాలని చెప్పాను: చంద్రబాబు
హైదరాబాదులో చంద్రబాబు మీడియా సమావేశం
కరోనా నిర్ధారణ పరీక్షలు తగినంతగా చేయలేకపోతున్నారని విమర్శలు
ఇప్పటికే అనేక లేఖలు రాశానని వెల్లడి
దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా నిర్వహించలేకపోతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాను ఈ విషయంపై రాజకీయం చేయబోనని, కానీ ప్రభుత్వం సమర్థంగా పనిచేయాలని చెప్పానని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం కరోనా విపత్తు నిర్వహణలో విఫలమవుతోందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన రీతిలో కరోనా పరీక్షలు చేయలేకపోవడం వల్ల, వాస్తవాలు మరుగునపడిపోయి ఎక్కడికక్కడ వ్యాపించే పరిస్థితులు వచ్చాయని వివరించారు. దాని పర్యవసానమే పదుల సంఖ్యలో కేసులు ఒక్కసారిగా వచ్చాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. కరోనా టెస్టు సెంటర్లు తక్కువగా ఉన్నందువల్ల, సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒక కరోనా వ్యక్తి బయటికి వెళితే 6 రోజుల్లో 3,600 మందికి వ్యాపింపచేయగలడని హెచ్చరించారు. కరోనాపై ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్రానికి అనేక లేఖలు రాశానని, ఇంకా రాస్తానని చంద్రబాబు చెప్పారు. కరోనా నివారణలో ఈ ప్రభుత్వానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner