అబ్బే.. ఇదేం అమరావ ‘అతి’?

1
41

కరోనా కల్లోలంలోనూ అదే తీరు
(మార్తి సుబ్రహ్మణ్యం)

అతి సర్వత్రా వర్జయేత్.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ, అక్కడి రైతులు చేస్తున్న ఉద్యమానికి ఈ  సామెత సరిగ్గా సరిపోతుంది. అమరావతిలో రాజధాని నగర నిర్మాణం కోసం తాము భూములు ఇస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దానిని కాదని, విశాఖలో రాజధాని ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలపై, అమరావతి రైతాంగం భగ్గుమంది. భూములిచ్చిన రైతాంగం, వివిధ రూపాల్లో చేస్తున్న ఆందోళనలు శతదినోత్సవం దాటి, 103 రోజులకు చేరాయి. అన్యాయంపై గళమెత్తడం ఆక్షేపణీయం కాకపోయినా, జాతీయ విపత్తు సమయాల్లో కూడా అదే ధోరణి ప్రదర్శించడమే విమర్శలకు తావిస్తోంది. దీనివల్ల ఉన్న సానుభూతి కూడా మాయమయ్యే ప్రమాదం ఏర్పడింది.

కరోనా వైరస్ మహమ్మారికి మన దేశం కూడా బలి కాకుండా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. జనాలను అత్యవసర పనులుంటే తప్ప, రోడ్డుమీదకు రావద్దని హెచ్చరించాయి. నిజానికి, కరోనా వైరస్ ప్రమాదం ఎంత భయంకరంగా ఉందో పత్రికలు, టీవీ చానెళ్లు చూస్తే అర్ధమవుతుంది. విదేశాల్లో మృతుల సంఖ్య వందలు, వేలకు పెరుగుతోంది. ఆ ప్రమాదం మన దేశానికి రావద్దన్న ముందుచూపుతో, ‘ఆలస్యంగానయినా’ ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలకు దిగాయి. దానిని పాటించడం ద్వారా, కరోనా వైరస్ దరికి రాదన్నది డాక్టర్లు, శాస్త్రవేత్తల సలహా.

కానీ, అమరావతి పరిసర ప్రాంతాల రైతులు మాత్రం, సామాజిక దూరం పాటిస్తున్నామని చెప్పి, ఇంకా రాజధాని కోసం ఆందోళనలు కొనసాగించటం అతిగా అనిపిస్తోంది. దేశమంతా కరోనా వైరస్ ప్రత్యామ్నాయ చర్యల్లో బిజీగా ఉంది.  డాక్టర్లు, నర్సులు, పోలీసులు, జర్నలిస్టులు ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. జనం నిత్యావసర వస్తువుల కోసం ఎదురుచూస్తున్నారు. పనులు లేని కూలీలు వలస వెళుతున్నారు. ఈవిధంగా దేశమంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయి, పనులు ముగిసిన తర్వాత ఇళ్లకు పరిమితమవుతున్నారు. అయితే, అమరావతి పరిసర గ్రామాల రైతులు మాత్రం ఇంకా ‘సేవ్ అమరావతి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని, ఆందోళనలు నిర్వహిస్తుండటం ఎబ్బెట్టుగా అనిపించకమానదు.

ప్రభుత్వాలు ఇప్పుడు కరోనా వైరస్ ప్రత్యామ్నాయ మార్గాల్లో తలమునకలయి పోయాయి. ప్రజలు కూడా కరోనా వైరస్ వార్తలు, లాక్‌డౌన్ గడువు ఎప్పుడు ముగుస్తుందా అన్న విషయాలపై తప్ప, మరేమీ ఆలోచించే పరిస్థితిలో లేరు. పత్రికలు, టీవీ చానెళ్లు కూడా దానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అలాంటిది అమరావతి రైతులు మాత్రం, ఇంకా ఆందోళనలు నిర్వహిస్తుండటం అతిగా అనిపించకమానదు. పోనీ, అన్ని పత్రికలు, చానెళ్లూ ఏమైనా, మునుపటి మాదిరిగా ఆ ఆందోళనలకు, ఈ సమయంలో ప్రాధాన్యం ఇస్తున్నాయా అంటే.. అది కూడా లేదు. ఒకటి, రెండు పత్రికలు మాత్రమే అమరావతి రైతుల వార్తలు ప్రచురిస్తున్నాయి. అమరావతి అంశానికి మొన్నటి వరకూ విపరీతమైన ప్రచారం కల్పించిన ఆ పత్రికలే ఇప్పుడు, అప్పటి ప్రాధాన్యం ఇవ్వడం మానేసి, కరోనాపై దృష్టి సారించాయి. మరి ఇంత భయానక పరిస్థితిలో కూడా ఆందోళన చేయడం వల్ల, ఎవరికి ప్రయోజనం అన్నది ప్రశ్న. రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి, భూములివ్వడం అభినందనీయమే. అందుకు వారికి సరైన ప్రతిఫలం దక్కింది. ప్రభుత్వం కూడా కౌలు ఇస్తోంది. కర్నూలు రాజధానిగా ప్రకటించినప్పుడు, వ్యవసాయ భూములు ఇచ్చిన అక్కడి రైతులకు, అప్పట్లో దక్కిన నష్టపరిహారం శూన్యం. నిజమైన త్యాగం అది! మరి వారితో పోలిస్తే, అమరావతి రైతులు అదృష్టవంతులే కదా? ఉద్యమం, ఉద్యమ స్ఫూర్తి చల్లారకూడదన్న వ్యూహం మంచిదే అయినప్పటికీ, ఇలాంటి విపత్తు సమయంలో కూడా, దానిని కొనసాగించడం అతి అవుతుంది.

1 COMMENT