వాలంటైన్  పోయి.. క్వారంటైన్ వచ్చె ఢాం.. ఢాం!

0
2

క్వారంటైన్‌ లో.. హాయి హాయిగా
సర్వం.. సకుటుంబ సపరివార సమేతం
టీవీలు, సెల్‌ఫోన్లు, కిచెన్లు బిజీ బిజీ
ఇళ్ల నుంచే.. భారత్‌దర్శన్
కరోనా దెబ్బకు ఏకమైన కుటుంబ భారతం
         (మార్తి సుబ్రహ్మణ్యం)

ఫిబ్రవరి 14.. వాలంటైన్స్‌డే. ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులు ఏకాంతంగా, గంటల తరబడి
మనసులు కలబోసుకుని చేసుకునే, ఊసుల దినంగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ.. మార్చి
22 నుంచి భారతదేశ ప్రజలు, హోం క్వారంటైన్‌ డేను వరసపెట్టి విజయవంతంగా
నిర్వహించుకుంటున్న, తొలి అనుభవం ఇప్పుడే చూస్తున్నాం. ఒకరకంగా ఇది కూడా
వాలంటైన్స్‌డేనే!  అవును. వాలంటైన్‌డేలో ఆ ఒక్కరోజు మాత్రమే ప్రేమించుకుంటారు. కానీ, ఈ
హోం క్వారంటైన్‌ లో మనుషులు గంటలు, రోజులు, నిమిషాల తరబడి ప్రేమించుకుంటున్నారు.
కష్టసుఖాలు, ఈతిబాధలు కలబోసుకుంటున్నారు. రోజూ బిజీగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు,
నాయకులు పిల్లలతో ఆడుకుంటున్నారు. యావత్ భారతమే, సకుటుంబ-సపరివార, సమేతంగా
ఇళ్లకే పరిమితమయింది. ఆవిధంగా ‘హోం’ క్వారంటైన్ మనుషులు, వారి బంధాలను మహా సిమెంట్ మాదిరిగా బలోపేతం చేస్తోంది.

‘హోం’ క్వారంటైన్‌ లో.. హాయి హాయిగా

నిజం. మనిషి  రోజూ యాంత్రిక జీవనంలో పీకల్లోతు మునిగిపోయాడు. ఉద్యోగం, ఇతర పని ఒత్తిళ్లు, పోటీ జీవితంతో త నకు తాను బిజీగా మారి, కుటుంబానికి సైతం సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయాడు. ఆదివారమో, వారంతపు సెలవులు వచ్చినా, కుటుబానికి సమయం ఇచ్చే జీవుల సంఖ్య తక్కువేనన్నది ఓ సర్వే చెప్పిన సత్యం. ప్రధానంగా.. పోలీసులు, డాక్టర్లు, నర్సులు, జర్నలిస్టు వృత్తిలో ఉన్న వారికి,  ఏ రోజూ తమది కాదు. ఏ గంటా, ఏ నిమిషం  తమది కాదు. ఏదైనా విపత్తు వస్తే, అందులో వారూ భాగస్వాములు కావలసిందే. అలాంటి ప్రత్యేక జీవులు మినహా.. మిగిలిన వారందరికీ, హోం క్వారంటైన్ దేవుడిచ్చినది కాకుండా కరోనా ఇచ్చిన వరంలా మారింది.

కరోనా మహమ్మారి నుంచి, ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు ప్రధాని మోదీ, మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించారు. మళ్లీ ఆ మరుసటి రోజు నుంచీ, వచ్చే నెల 15 వరకూ లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి కర్ఫ్యూ ఎలా ఉంటుందన్నది, కొత్త తరం వారెప్పుడూ చూడలేదు. ఇప్పుడు కరోనా పుణ్యాన అది కూడా చూస్తున్నారు. ఇక లాక్‌డౌన్ అన్నది అందరూ కొత్తగా వింటూ, అనుభవిస్తున్న పదం. ఈ సందర్భంలో ప్రజలందరినీ ప్రభుత్వం హోం క్వారంటైన్‌ లో ఉంచింది. అంటే అత్యవసరమైన పనులుంటే తప్ప, మిగిలిన సమయంలో బయటకు తిరగకుండా.. ఎవరి కాళ్లు, చేతులు వారే స్వచ్ఛందంగా కట్టేసుకోవడమన్న మాట.

సర్వం.. సకుటుంబ సపరివార సమేతం

ప్రపంచాన్ని కరోనా కల్లోలం వణికిస్తున్నప్పటికీ, దాని పుణ్యాన కుటుంబాలు కలసి, కష్టసుఖాలు కలబోసుకోసుకునేందుకు  ఈ హోం క్వారంటైన్ కారణమవుతోంది. ఇంట్లో నిమిషం కూడా ఉండని మగరాయుళ్లు, చక్కగా ఇంటిపట్టున ఉంటున్నారు. తమ పిల్లలు ఎలా చదువుతున్నారో కూడా పట్టించుకోకుండా, ఆ బాధ్యతను భార్యల మీద వదిలేసిన ‘మగా’నుభావులు, కరోనా పుణ్యాన ఆ పని కూడా చూస్తున్నారు. ఇళ్లలో ఆడవాళ్లు తెచ్చుకునే నిత్యావసర వస్తువులను, అంత ధరలు పెట్టి ఎందుకు కొన్నావని విరుచుకుపడే మగవాళ్లంతా,  ఇప్పుడు కూరగాయల మార్కెట్లు, కిరాణాషాపులకు స్వయంగా వెళ్లి, అక్కడి రేట్లను చూసి నోరెళ్లబెడుతున్నారు. అలాంటి వారికి ఇదో అనుభవం.

కుటుంబ ఖర్చులు ఎంతవుతున్నాయో ఎప్పుడూ తెలుసుకునే ప్రయత్నం చేయని జీవులు, ఈ
ఖాళీ సమయంలో ఆ పనికూడా చేస్తున్నారు. వంటింట్లో ఎక్కడ ఏమి ఉంటాయో కూడా తెలియని
వాళ్లకు , ఇప్పుడు ఏ డబ్బాలో ఏముందని కళ్లకు గంతకు కట్టినా చెప్పేంత విజ్ఞానం వచ్చేసింది.
అంతేనా? కరోనాతో మగరాయుళ్లకు బోలెడంత ‘కాలజ్ఞానం’ కూడా వచ్చేసింది మరి. ఎలాగంటే..
గోధుమలు, మ్యారీ బిస్కెట్లను తినడమే తప్ప, దానిపై పరిశోధన చేసే అవకాశం రాలేదు. దానిని
కూడా కరోనా కల్పించింది. ఒక మ్యారీ బిస్కెట్ ప్యాకెట్‌లో 22 రంధ్రాలు ఉంటాయని, కిలో
గోధుమలలో879 గింజలు ఉంటాయని, 5వ నెంబర్ స్పీడ్ మీద ఫ్యాన్ ఆన్ చేస్తే, అది ఒక
నిమిషం ఆరు సెకన్ల వరకూ తిరుగుతుందనే, అద్భుత విషయాన్ని కనిపెట్టేంత విజ్ఞానం తమ
సొంతం చేసుకుంటున్నారు. ఒక బట్టల సబ్బు, సర్ఫ్ ప్యాకెట్  వారానికి ఎన్ని వస్తాయి? ఒక
నూనె ప్యాకెట్ ఎన్ని రోజులకు వస్తుంది? బియ్యం ఎన్నిరోజులకు వస్తుందనే ‘వంటింటి విజ్ఞానం’
కూడా సొంతం చేసుకుంటున్నారు.

క్వారంటైన్‌ లో టీవీలు,సెల్‌ఫోన్లు, కిచెన్లు బిజీ బిజీ

అంతేనా? ఈ కరోనా ఖాళీ సమయంలో మగాళ్లు డాక్టర్, వంటమాస్టర్ల అవతారమెత్తుతున్నారు. యూట్యూబ్- వాట్సాప్ మెసేజ్‌లలో వచ్చే.. సరికొత్త వంటకాల సౌజన్యం, స్ఫూర్తితో ‘ఆ మాదిరిగా ముందుకు వెళ్లమని’ భార్యలను ప్రోత్సహిస్తున్నారు.కావలసినవి అడిగి మరీ చేయించుకుని తింటున్నారు.  ఇక జలుబు, దగ్గు, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు ఏమేం చిట్కాలు వాడాలో యూట్యూబ్‌లో చూసి, ఆ మేరకు మార్గదర్శనం చేస్తున్న ‘టెంపరరీ దన్వంతరీ’లయిపోతున్నారు. మొన్నటి వరకూ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే, టీవీలలో సీరియల్స్ పెట్టే ఆడవాళ్లపై అంత్తున లేచే మగాళ్లు, ఇప్పుడు ఎన్ని గంటలకు ఏ సీరియల్ వస్తుంది? ఏ న్యూస్ చానెళ్లలో ఎన్ని గంటలకు సినిమా వార్తలు వస్తాయి? చాగంటి, గరికపాటి ప్రవచనాలు ఏ చానెళ్లలో వస్తాయి? డాక్టర్ సందేహాలు ఏ చానళ్లలో వస్తాయని తెలుసుకునే పరిశోధకులవుతున్నారు. ఎటొచ్చీ మందుబాబుల పరిస్థితే పాపం దారుణంగా ఉంది. రోజూ పెగ్గులు వేస్తే గానీ, నరాలు పనిచేయని వారిప్పుడు.. ఆశ చావక, ‘ఓ పెగ్గు పోసి పుణ్యం కట్టుకోండ’ని, తోటి మందుభాయ్‌ల సాయం కోరుతున్నారు. అయితే కనుచూపుమేరలో.. కనీసం క్వార్టర్ కూడా దొరకదని తెలుసుకుని, బుద్ధిమంతుల్లా టీవీలకు అతుక్కుపోతున్నారు.

తిరుమల వెంకన్నకు నిమిషం రెస్టు లేకుండా పూజలు చేసిన కాలంలో కూడా, కొంత విశ్రాంతి తీసుకున్న ఇంటర్‌నెట్‌కు ఇప్పుడు ఊపిరాడటం లేదు. ఆ మెయిల్, ఈ మెయిల్, జీ మెయిల్‌తోపాటు.. అమెజాన్, నెట్‌ప్లక్స్, యూట్యూబ్‌ల వాడకాలతో, ఇంటర్‌నెట్‌ను అరగదీస్తున్నారు.  మొత్తంగా అపార్టుమెంట్లు.. సీరియళ్లు, యూట్యూబ్ వంటకాలు, భక్తి ప్రవచనాలు, సినిమా పాటలు, న్యూస్ చానెళ్లలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ వారం రోజులకే ఇళ్లలో ఉన్న మగాళ్లకు ఇంత విజ్ఞానం వచ్చేస్తే..  ఇక వచ్చే నెల 15 వరకూ ఇలాగే వారి విజ్ఞానఝరి ఇలాగే కొనసాగితే, అప్పటికి ఎంతమంది సైంటిస్టులు, మరెంతమంది సైకాలజిస్టులు, ఇంకెంతమంది వంటమాస్టర్లు, హ్యూమనిస్టులు- హ్యూమరిస్టులు బయటకొస్తారో ఏమో చూడాలి!

అప్పటిమాదిదిరిగా.. ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల దేశానికి ఏం ప్రయోజనమని, చదువుకున్న పిల్లలకు క్లాసులిచ్చే చాదస్తులయిన తండ్రులు.. ఇప్పుడు వాళ్లు ఇంట్లోనే ఉంటేనే, దేశానికి ప్రయోజనమని చాటిచెప్పే అవకాశం, కరోనా కల్పించింది. రోజు వారీ బిజీ లైఫ్ నుంచి ఒక్కసారిగా, ఖాళీగా ఉన్న పెళ్లయిన యువ  జంటలు.. ఇప్పుడు నిర్నిరోధంగా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలూ వాడేస్తున్నారట. కరోనా వల్ల.. ఉత్తరప్రదేశ్‌లో ఓ పెద్ద కండోమ్ కంపెనీ ఉత్పత్తి చేయకపోవడంతో, వాటికీ బోలెడంత కొరత వచ్చిపడిందన్నది ఓ వార్త.

కరోనా దెబ్బకు ఏకమైన కుటుంబ భారతం

అదొక్కటేనా? నవ నాగరికత పుణ్యాన.. తెరమరుగయిపోయిన, పాత అలవాట్లను మళ్లీ మొదలుపెట్టడమే కాదు, వాటి గురించి ఎవరో పంపిన వాట్సాప్ సందేశాలను కూడా, ఫార్వార్డ్ చేసే సాంప్రదాయ శక్తుల అవతారమెత్తుతున్నారు. పసుపునీళ్లు-వేపమండలతో ఇంటిలో చల్లుతున్నారు. ఇంట్లోకి రాగానే చేతులు- కాళ్లు కడుక్కుంటున్నారు. కుక్కలు, పిల్లులను ఒళ్లో కూర్చో బెట్టుకునేవారంతా ఇప్పుడు, వాటికి దూరంగా ఉంటున్నారు. వేడిగా వండినవే తింటున్నారు.  శవాల వద్దకు వెళ్లేందుకే భయపడుతున్నారు. ఆవిధంగా ఒకప్పుడు బామ్మ, తాతలు చెప్పినవి, చాదస్తమనుకున్నవే.. ఇప్పుడు ప్రపంచానికి చాదస్తమయిపోయింది మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here