తెలంగాణ లో తెలుగుదేశం తెరమరుగయినట్లేనా?

781

తెలంగాణ ఎడిషన్‌లో కనిపించని పార్టీ ఆవిర్భావదినోత్సవ  వ్యాసం
దానినే ఖరారు చేసిన ఆంధ్రజ్యోతి

ఆంధ్రా పార్టీగా తీర్పు ఇచ్చేసిన రాజగురువు
మరి రాధాకృష్ణ లెక్కలో టీటీడీపీ లేనట్లే లెక్క
(మార్తి సుబ్రహ్మణ్యం)

దేశ రాజకీయాలను కుదిపేసి, దశాబ్దాల పాటు జాతీయ
రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ
దినోత్సవం నేడు. ఎన్టీఆర్ ఆలోచన నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ జన్మస్ధానం తెలంగాణ!
ఉమ్మడి రాష్ట్రంలో పోషించిన  అధికార, ప్రతిపక్ష పాత్రలకు, కేంద్ర స్థానం కూడా తెలంగాణ.
అలాంటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం దారుణంగా దెబ్బతింది. నేతలు పోగా,
మిగిలింది కార్యకర్తలే. అంతో ఇంతో మిగిలింది వాళ్లే.

 ప్రధానంగా హైదరాబాద్‌లో సీమాంధ్ర వాసులు, అనేక
కారణాలతో ఇంకా టీడీపీని గుర్తిస్తున్నారు. ఆ పార్టీకి పెద్ద
కార్యాలయమే ఉంది. ఇంకా మాజీ మంత్రులు చాలామంది
పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు పార్టీని
అంటిపెట్టుకునే ఉన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు
నాయుడు వారానికి రెండుసార్లు హైదరాబాద్‌లోనే ఉంటూ,
ఒకరోజు పార్టీ ఆఫీసుకు వస్తూనే ఉన్నారు.  తెరాస,
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కాకపోయినా, బిజెపి, సీపీఎం, సీపీఐ కంటే కొద్దిగా మెరుగైన
యంత్రాంగమే ఉంది. పైగా, తెలుగుదేశం పార్టీ తనకు తాను జాతీయ పార్టీగా ప్రకటించుకుంది.
కానీ, తెలుగుదేశం మానసిక మద్దతుదారైన ఆంధ్రజ్యోతి మాత్రం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ
లేదని ఖరారు చేయడమే ఆశ్చర్యం.

 

తెలంగాణ ఎడిషన్‌లో కనిపించని పార్టీ ఆవిర్భావదినోత్సవ  వ్యాసం

ఆదివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్‌లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి సంబంధించి ఒక వ్యాసం కనిపించింది. ప్రముఖ జర్నలిస్టు, తెలుగుదేశం పార్టీ వ్యవహారాలపై సాధికారికత ఉన్న.. అతికొద్దిమంది జర్నలిస్టులలో ఒకరైన, పూల విక్రమ్ రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. కానీ, అదే వ్యాసం తెలంగాణ ఎడిషన్‌లో మాత్రం భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించకపోవడం, ఆ పార్టీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ స్థానంలో కరోనాపై వ్యాసం కనిపించింది.  కరోనా కల్లోల సమయంలో కూడా తెలంగాణలోని ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కూడళ్ల వద్ద ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలలు వేసి నివాళులర్పించారు.

హైదరాబాద్‌లోని నగర పార్టీ కార్యాలయంలో, అఖిల భారత ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు పిన్నమనేని  సాయిబాబా సారధ్యంలో, ఏకంగా ఓ కార్యక్రమమే నిర్వహించారు. కరోనా పరిస్థితులలో కూడా రోడ్డు శుభ్రం చేస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికులకు సన్మానం చేసి, ఆర్ధిక సాయం అందించారు. కరోనా వల్ల పెద్దగా హంగామా చేయకుండా, ఎవరి ప్రాంతాల్లో వారు ఎన్టఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, ఎవరి ఇళ్లపై వారు జెండా ఎగురవేయాలని సాయిబాబా, నాయకులకు ఫోన్లు చేసి కోరిన ఫలితంగా.. కరోనా కల్లోల సమయంలో కూడా నగరంలో టీడీపీ జెండా కనిపించింది.

హైదరాబాద్ సహా తెలంగాణలోని ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కరోనా కారణంగా బయటకు రాలేక, తమ ఇళ్లపైనే జెండాలు ఎగురవేసుకుని, అభిమానం ప్రకటించుకున్న పరిస్థితి కనిపించింది.  చివరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా,  కొడుకు లోకేష్, మనుమడు దేవాన్ష్‌తో కలసి తన ఇంట్లోనే జెండా ఎగురవేశారు. ఇదంతా, ఆ పార్టీ జెండా మోసే కార్యకర్తల ప్రేమకు నిదర్శనం. ప్రతి శనివారం హైదరాబాద్ పార్టీ ఆఫీసులో తెలంగాణ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. తెలంగాణలో పుట్టిన పార్టీని, చంద్రబాబు పెద్దగా పట్టించుకోకుండా అనాధగా వదిలేసినా, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణ వల్ల పార్టీకి ప్రయోజనం లేకపోయినా.. నడిపించే నాధుడు లేకపోయినా, నల్లగొండ నుంచి ఆదిలాబాద్ వరకూ మిగిలిపోయిన కార్తకర్తలు, ప్రతి శనివారం బాబును కలిసేందుకు వస్తూనే ఉన్నారు.

మరి రాధాకృష్ణ లెక్కలో టీటీడీపీ లేనట్లే లెక్క

కానీ, తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం చేసే రాజగురువు లాంటి ఆంధ్రజ్యోతి మాత్రం.. అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీనే లేదని, దానికోసం  పత్రికల్లో స్థలం వృధా చేసుకోవడం తెలివైన పని కాదని తేల్చేసింది. పాపం..చంద్రబాబు నాయుడేమో త నది జాతీయ పార్టీ అనుకుని, రెండు రాష్ట్రాల్లో రెండు రాష్ట్ర కమిటీలను ఏర్పాటుచేసి, జాతీయ కమిటీ కూడా వేశారు. మరి ఆయన రాజగురువు రాధాకృష్ణ మాత్రం, తెలంగాణలోనే లేని తెలుగుదేశం చరిత్రను, అచ్చేసినందువల్ల స్థలం వృధా అని, ఆ పార్టీ ఆవిర్భావ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేసినట్లున్నారు. మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లు.. రాధాకృష్ణ కూడా తెలుగుదేశాన్ని ఆంధ్రాపార్టీకి పరిమితం చేశారు. బాబు గారూ… మీకు అర్ధమవుతోందా?