రాహుల్.. ఓ మంచి బాలుడు!

477

రాహుల్ హుందాతనానికి అభినందలు
సర్కారు ప్యాకేజీని స్వాగతించిన వైనం

మార్పు మంచిదేనన్న బీజేపీ ఎంపీ గరికపాటి
(మార్తి సుబ్రహ్మణ్యం)

జాతీయ విపత్తు సమయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి, కేంద్ర నిర్ణయాలను
స్వాగతించిన కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనా
విపత్తును అరికట్టేందుకు.. నరేంద్ర మోదీ సర్కారు ప్రకటించిన లాక్‌డౌన్ నిర్ణయంతో, ఆర్ధికంగా
నష్టపోయిన వివిధ వర్గాలకు కేంద్రం ప్రకటించిన ఆర్ధిక  ప్యాకేజీ, ఆర్‌బీఐ ఈఎంఐలకు
సంబంధించిన ప్రకటించిన మారటోరియం నిర్ణయాలకు యావత్ భారతదేశం నుంచి ప్రశంసల
లభిస్తున్నాయి. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్ యువ రాజు రాహుల్‌గాంధీ కూడా.. కేంద్ర ఆర్ధిక
మంత్రి నిర్మలాసీతామన్ ప్రకటించిన ప్యాకేజీని స్వాగతించి, అందరి అభినందనలు అందుకున్నారు.

సర్కారు ప్యాకేజీని స్వాగతించిన రాహుల్

ఇప్పటివరకూ ప్రతి అంశంలోనూ నరేంద్రమోదీ సర్కారుపై
విరుచుకుపడే రాహుల్‌గాంధీ, కరోనా విపత్తుపై మోదీ
సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతించడం
విశేషం.  పేద-సామాన్య-మధ్య తరగతి వర్గాలకు ఆర్ధిక
ప్యాకేజీ ప్రకటించకుండా, చప్పట్లు కొట్టిస్తే ప్రయోజనం
ఏమిటని ఇటీవలే రాహుల్ ప్రశ్నించారు. ఈఎంఐలు,
రుణాలపై వడ్డీలను వాయిదా వేయాలని కాంగ్రెస్
అధినేత్రి సోనియాగాంధీ కూడా డిమాండ్ చేశారు. దానితో
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ లక్షా 75 వేల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించగా, ఆర్‌బీఐ
గవర్నర్ కూడా.. ఈఎంఐలపై మూడు నెలలపాటు మారిటోరియం విధిస్తున్నట్లు ప్రకటించి,
సగటు-మధ్య-ఉద్యోగ వర్గాల పెదవులపై చిరునవ్వులు పూయించారు.

దీనితో వైఖరి మార్చుకున్న రాహుల్, కేంద్రం ప్రకటించిన నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇది సరైన సమయంలో వేసిన అడుగు’ అని ట్వీట్ చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో విపక్ష నేత, ప్రభుత్వానికి బాసటగా నిలిచి, తన స్థాయి పెంచుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సాధారణ రాజకీయ నాయకుడి మాదిరిగా, పాలకులు ఏం చేసినా తప్పు పట్టడం కాకుండా, వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకుని వ్యవహరించిన రాహుల్ హుందాతనానికి అభినందలు వ్యక్తమవుతున్నాయి.

మార్పు మంచిదేనన్న బీజేపీ ఎంపీ గరికపాటి

రాహుల్ వ్యాఖ్యలను, బీజేపీ తెలంగాణ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు స్వాగతించారు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని స్వాగతించిన రాహుల్‌కు, గరికపాటి అభినందనలు తెలిపారు. ఈ ఒక్క  విషయంలో ఆయన హుందాగా వ్యవహరించారన్నరు.  ‘కరోనాపై మోదీ సర్కారు చేస్తున్న యుద్ధానికి, యావత్ భారత జాతి దన్నుగా నిలిచినందుకు దేశ ప్రజలకు అభినందనలు. ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ, దాదాపు 80కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇది దేశంలోని బడుగు, బలహీన, అట్టడుగు, కార్మిక, రైతు వర్గాలకు ఈ సమయంలో భరోసా ఇచ్చే ప్యాకేజీ. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ వృద్ధులు, మహిళలు, గ్రామీణ ఉపాథి కూలీలను విస్మరించకుండా ఇచ్చిన వరాలు వారికి మేలు చేస్తాయి. ఆర్‌బీఐ కూడా ఉద్యోగ, ప్రైవేట్ వర్గాల్లో పనిచేసే ఉద్యోగులకు మేలు చేసేలా, మూడు నెలల పాటు రుణాల చెల్లింపులపై మారిటోరియం విధించడం బట్టి, మోదీ ప్రభుత్వానికి ఆయా వర్గాలపై ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతుంది.

ఇక రాహుల్‌గాంధీ కూడా రాజకీయాలు పక్కకుపెట్టి, మోదీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసించడం అభినందనీయం. మార్పు ఎవరికైనా మంచిదే. దేశంలో కరోనా ఫలితంగా నెలకొన్న పరిస్థితిలను ఎదుర్కొనేందుకు.. కేంద్రం ఏం చేస్తుందో రాహుల్ గమనించిన తర్వాతనే,  ప్యాకేజీని స్వాగతించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషం’ అని గరికపాటి మోహన్‌రావు వ్యాఖ్యానించారు.