కృష్ణారెడ్డి ‘మేఘా’లలో వెళ్లారా? రోడ్డు మార్గంలో వెళ్లారా?

573

రెండు రాష్ట్రాలకు పదికోట్ల  సాయంపై ప్రశంస
స్వయంగా ఇద్దరు సీఎంలకు చెక్కు అందజేత
మరి ఆయనను క్వారంటైన్‌కు పంపించారా? లేదా?
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సినీ ప్రముఖులంతా సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు
నేరుగా ఇచ్చింది మేఘా కృష్ణారెడ్డి ఒక్కరే
                (మార్తి సుబ్రహ్మణ్యం)

ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పాలకులకు ఆయన ఇష్టుడు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకోవడం, వాటిని వేగంగా పూర్తి చేయడం ఆయన కంపెనీ ఘనత. అందుకే దేశంలో ఇన్‌ఫ్రా కంపెనీలన్నీ నష్టాలతో పడకేసినా, ఆయన కంపెనీ మాత్రం కాసులతో కళకళలాడుతుంది. సంపాదన ఒక్కదానిలోనే కాదు, సామాజికసేవలోనూ ఆయన ముందుంటారు. ఆయన తన గ్రామాన్ని దత్తత తీసుకుని, అక్కడి ప్రజలకు సకల సౌకర్యాలు సమకూర్చారు. దేవాలయాలు నిర్మించారు. గ్రామాలకు మంచినీటి సౌకర్యం సరేసరి. అలాంటి గొప్పవ్యక్తి, కరోనాపై యుద్ధం ప్రకటిస్తున్న ప్రభుత్వాలకు పదికోట్ల రూపాయల విరాళం ఇచ్చి, తన మానవత్వాన్ని చాటుకుని, అందరి మన్ననలు అందుకున్నారు. అయితే, ఆ సందర్భంలో ఆయన నిబంధనలు పాటించారా? లేదా? విరాళమిచ్చినందుకు, ఆయనకొక్కరికే ప్రభుత్వాలు ఏమైనా మినహాయింపు ఇచ్చాయా? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఆ మేరకు పనులులేక ఇళ్లలో ఉండిపోయిన పేద వారికి అనేక వరాలు ప్రకటించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కరోనా వైరస్‌పై చేస్తున్న యుద్ధాన్ని చూసిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు, సినీ ప్రముఖులు.. ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటిస్తున్నారు. వారితోపాటు పారిశ్రామిక దిగ్గజాలు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటించి, సామాజిక బాధ్యత నిర్వర్తిస్తుండటం అభినందనీయమే. సమాజం వారికి చాలా ఇచ్చింది కాబట్టి, అందులో కొంత సమాజానికి తిరిగి ఇవ్వడం మెచ్చదగిన అంశమే.

రెండు రాష్ట్రాలకు పదికోట్ల  సాయంపై ప్రశంస

ఈ విషయంలో మేఘా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి ముందున్నారు. కరోనా విపత్తును
ఎదుర్కొనేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి
సహాయనిధి కింద, తలా ఐదు కోట్ల రూపాయల చెక్కును స్వయంగా ఇద్దరు ముఖ్యమంత్రులనూ
కలసి అందించారు. సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కూడా, ఈ విధంగా స్వయంగా
కాకుండా, ముఖ్యమంత్రి సహాయ నిధికి నేరుగా  తమ విరాళాలు అందించారు. సాధారణంగా
ఇలాంటి భారీ విరాళాలు ఇచ్చే సమయంలో, వారు స్వయంగా ముఖ్యమంత్రులను కలసి
ఇస్తుంటారు. కానీ, కరోనా ప్రభావం విస్తరించకూడదని ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి.
ఫలితంగా రోడ్లన్నీ మూసుకుపోయాయి. వాహనాలు కూడా అనుమతించడం లేదు. చివరకు
సరిహద్దులు కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని కఠిన వైఖరి అవలంబిస్తుండంతో,
వారంతా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా విరాళాలు పంపి, ఆ విషయాన్ని మీడియాకు
వెల్లడించారు.

 

స్వయంగా ఇద్దరు సీఎంలకు చెక్కు అందజేత

అయితే, మేఘా కృష్ణారెడ్డి ఒక్కరే ఇద్దరు సీఎంల వద్దకు స్వయంగా వెళ్లి, చెక్కులు ఇవ్వడాన్ని..  ఇప్పటివరకూ విరాళాలు ఇచ్చిన ప్రముఖులను ఆశ్చర్యపరిచింది. తొలుత హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ఉన్న, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు 5 కోట్లరూపాయల చెక్కు అందించిన కృష్ణారెడ్డి.. వెంటనే తాడేపల్లిలో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లి, ఆ రాష్ట్రానికి 5 కోట్ల రూపాయల చెక్కును జగన్మోహన్‌రెడ్డికి అందించడం అన్ని పత్రికల్లోనూ వచ్చింది. ఇది చూసి విరాళాలు ప్రకటించిన ప్రముఖులు ఆశ్చర్యపోవలసి వచ్చింది. ఎందుకంటే, ముఖ్యమంత్రుల నివాసం వరకూ వెళ్లాలంటే ముందు అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. తర్వాత అసలు అక్కడి వరకూ వెళ్లాలన్నా, రోడ్డుపై ఉన్న పోలీసులు అనుమతించాలి.

నేరుగా ఇచ్చింది మేఘా కృష్ణారెడ్డి ఒక్కరే

తెలంగాణ పోలీసులు అనుమతిపత్రాలు ఇచ్చినప్పటికీ, ఏపీవాసులను జగ్గయ్యపేట చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు. ఏపీలోకి వెళ్లిన వారిని నూజివీడు క్వారంటైన్‌కు తరలించారు.  అదేవిధంగా తెలంగాణకు వెళ్లాల్సిన వారిని, ఆంధ్రా సరిహద్దుల వద్దే నిలిపివేసి, వెనక్కిపంపించారు. ఇన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్న సమయంలో, మేఘా కృష్ణారెడ్డి ఒక్కరే రెండు రాష్ట్రాల సీఎంలను నేరుగా ఎలా కలిశారు? అన్న చర్చ సోషల్‌మీడియాలో మొదలయింది. పదికోట్ల విరాళమివ్వడం అభినందనీయమే అయినప్పటికీ, ఇద్దరు సీఎంలను కలిసిన తర్వాత, ఆయనను నిబంధనల ప్రకారం క్వారంటైన్‌కు పంపించారా? లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరి మేఘా కృష్ణారెడ్డి ను క్వారంటైన్‌కు పంపించారా? లేదా?

ఒకవేళ అదే నిజమైతే తెలంగాణ సీఎంను కలిసిన తర్వాత, ఆయన హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం లేదా, హెలికాప్టర్ ద్వారా విజయవాడకు చేరాల్సి ఉంటుంది. సరిహద్దుల వద్ద ఎలాంటి వాహనాలకూ అనుమతి లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ.. మొన్న ఏపీ వాసులను నూజివీడు త్రిపుల్ ఐటీకి తీసుకువెళ్లి, క్వారంటైన్‌లో ఉంచినట్లు, మేఘా కృష్ణారెడ్డిని కూడా ఉంచాలి. మరి ఆ రకంగా కనీసం, ఆయన వారంరోజులయినా అక్కడ ఉండాలి. పోనీ హెలికాప్టర్ ద్వారా వెళ్లినా, ఇదే నిబంధనలు అనుసరించాల్సి ఉంది. ఆ ప్రకారంగా..  సీఎం వద్దకు వెళ్లి చెక్కు ఇచ్చిన తర్వాతయినా, ఆయనను క్వారంటైన్‌కు తరలించారా? లేదా? అని క్షేమం కోరుకునే వారు  సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆయన ప్రస్తుతం క్వారంటైన్‌లోనే ఉన్నారా? లేక ఇంట్లోనే ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.  ఇటీవల కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను, 15 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని స్వయంగా కలెక్టర్, సీఎంఓ ఆదేశించిన విషయం తెలిసిందే. మేఘా కృష్ణారె డ్డిని కూడా ఆ విధంగా క్వారంటైన్‌లో ఉంచారో లేదో మరి?!

2 COMMENTS

  1. […] మంత్రి మోపిదేవి వెంకట రమణ ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించింది. ఆయన ఒకవేళ ఏపీకి వస్తే,  ఆయనను కూడా క్వారంటైన్‌లో ఉంచుతామని ప్రకటించారు. దీన్నిబట్టి బయట రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో, జగన్మోహ్‌రెడ్డి ఏ వైఖరితో ఉందో స్పష్టమవుతోంది. కానీ, ఇటీవల మేఘా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి తాడేపల్లి వచ్చి, స్వయంగా జగన్‌కు చెక్కు అందించి వెళ్లారు. కరోనా నిబంధనలు ఉన్న సమయంలో, అసలు ఆయనను ఏపీ సరిహద్దులోకి ఎలా అనుమతించారు? మోపిదేవి చెప్పినట్లు… ఆయనను క్వారంటైన్‌కు పంపించకుండా, హైదరాబాద్‌కు ఎలా పంపించారన్న ప్రశ్నలకు ఎవరివద్దా జవాబు లేదు. ఇదికూడా చదవండి… కృష్ణారెడ్డి ‘మేఘా’లలో వెళ్లారా? రోడ… […]

  2. It’s perfect time to make some plans for the future and it is time to be happy. I have read this post and if I could I want to suggest you some interesting things or tips. Maybe you can write next articles referring to this article. I desire to read more things about it!