సందేహం తీరింది!

562
భోగాది వెంకట రాయుడు

విజయవాడ: చాలా కాలంగా పట్టి పీడిస్తున్న ఓ సందేహం తీరింది. అధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్నందున….కలియుగం అంతమయ్యే తరుణం ఆసన్నమైందని మత ప్రచారకులు…డూమ్ సేయర్స్ అడపా దడపా చెప్పే భవిష్యత్ వాణిని విన్నప్పుడు….300 కోట్ల మందికి పైబడి ఉన్న ప్రపంచ జనాభా ఎలా అంతమవుతుందబ్బా అని ఆశ్చర్యం వేస్తూ ఉండేది. అణు యుద్ధం వస్తుందనుకున్నా….అది కొద్ది ప్రాంతాలకే పరిమితం అవుతుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలం లో అమెరికా దేశం జపాన్ లోని హిరోషిమా, నాగసాకి పై అణు బాంబులు వేసినా… ఆ రెండు ప్రాంతాలకు కొన్ని కిలో మీటర్ల వ్యాసార్ధం లోనే విధ్వంసం చోటుచేసుకుంది. మరే దేశానికి పెద్దగా ఇబ్బంది కలగ లేదు. పై పెచ్చు, ఇతర దేశాలు ఈ రెండు ప్రాంతాల పునర్నిర్మాణానికి బాసటగా నిలబడ్డాయ్ కూడా ! కనుక అణు యుద్ధం వల్ల కలి యుగం అంతం కాదని తేలిపోయింది. మహా అయితే కొన్ని ప్రాంతాలలో జన నష్టం.ఆస్తుల నష్టం జరుగుతుంది.
మరి కలి యుగం ఎలా అంతమవుతుందనే సందేహం మాత్రం అలాగే ఉండేది. తీవ్రవాదాల వల్ల కూడా కలి యుగం అంతమయ్యేది కాదు. పాకిస్తాన్ తల్లకిందులుగా తపస్సు చేసినా.. ఇండియా వెంట్రుక కూడా ఊడే అవకాశం లేదు. పాకిస్తాన్ భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న విధ్వసకర శక్తులు ఎన్ని దేశాలకు విస్తరించివున్నా కలి యుగానికి వచ్చిన ప్రమాదం ఏమీ కనిపించలేదు. ఇక జీవ రసాయనాలు. ప్రత్యర్ధ దేశాలపై పైచేయి సాధించడానికి కొన్ని దేశాలు జీవ రసాయన ఆయుధాలు రహస్యంగా తయారు చేశాయని…అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయంటూ వార్తలు వెలువడుతున్నప్పుడు మనసు కొంత ఆందోళనకు లోనవుతుంటూ ఉండడం సహజం ఎందుకంటే…వాటి ప్రయోగం వల్ల ఊహించడానికే భయపడేంత స్థాయిలో చిత్ర విచిత్ర సమస్యలు ఆయా ప్రాంతాలలోని అమాయక ప్రజలను చుట్టు ముడతాయన్న వార్తలు ఇందుకు కారణం. అయినప్పటికీ, ఈ జీవ రసాయనిక ఆయుధాలు కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం.అది కూడా ఒక్కసారి కి మాత్రమే పరిమితం. మరి వీటివల్ల కూడా కాళీ యుగం అంతమయ్యే అవకాశం లేదు.
సమాజం లో జరుగుతున్న అక్రమాలు…అన్యాయాలు జరుగుతున్న అన్యాయాలను ఎవరూ ఏకరువు పెట్టాల్సిన పని లేకుండా…ఎవరికి వారికే కళ్ళకు కట్టినట్టు కన పడుతుంటే…’కలియుగంరా బాబూ’అనుకోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. ఇదీ… అదీ అని కాకుండా…మనకు తెలిసిన ప్రతి రంగం లోనూ శిరస్సు నుంచి కాలి గోటి వరకూ… కర్ర ఉన్న వాడిదే బఱ్ఱె అన్న సామెత చందంగా అరాచకం…అన్యాయం రాజ్యమేలే దశ ను మనం ఇప్పుడు చూస్తున్నాం.ఇది ఇప్పుడు మనం చూస్తున్న వాస్తవం. ఇక ‘రేపు’ అనేది లేదు…ఉన్నది ‘ఈ రోజే’ అన్నట్టుగా జరుగుతున్న సమాజ గమనం చూస్తుంటేనే భయం వేస్తుంటే…. ఇక ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకున్న వారి పిల్లలు పెరిగి పెద్దయ్యే నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో….అంచనా వేయడం రాజమౌళి లాటి వీర క్రియేటివ్ డైరెక్టర్స్ కి కూడా సాధ్యం కాకపోవచ్చు. ఇటువంటి భావాలు మనసును తట్టి లేపినప్పుడల్లా….డూమ్ సేయర్స్ చెప్పే కలియుగాంతం ఎలా ఉంటుందో ఒక పట్టాన అర్ధమయ్యేది కాదు.
ఈ సందేహాలకు జవాబు లభించింది, కరోనా రూపం లో.
కరోనాకు ఏ పరిమితులూ లేవు. ఆ ప్రాంతం…ఈ ప్రాంతం అన్న తారతమ్యం లేదు. ధనిక…పేద తేడాలు లేవు. ‘అభివృద్ధి చెందిన’……’చెందని’ అనే తేడాలు లేవు. లక్ష రకాల వైద్య సమస్యలకు మందులు కనుక్కున్నాం అంటూ జబ్బులు చరుచుకునే దేశాలకు…శాస్త్రవేత్తలకు గర్వ భంగం చేసింది. నల్ల… తెల్ల… అనే తేడా లేకుండా చేసింది. నీకు వెయ్యి కోట్లున్నా…కరోనాకు గుడ్డి వెంట్రుక తో సమానం. మొత్తం విశ్వాన్ని కేవలం మూడు నెలల్లో తన పాదా క్రాంతం చేసుకున్నది కరోనా.
దివిసీమలో లో 1977 నవంబర్ 19 రాత్రి వచ్చిన సునామి విధ్వంసం ఇప్పటికీ చాలామందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.
ఆ కాలరాత్రి భావదేవరపల్లి అనే గ్రామంలో ఆరాత్రి వెయ్యి మంది నీళ్ళల్లో కొట్టుకు పోయారు.

పొలాలలో ఉన్న ఒక పెద్ద చింత చెట్టుకు కొన్ని జీవాలు… కొమ్మల్లో చిక్కుకుని ఉండిపోయాయి. నవంబర్ 20. తెల్లవారాక చూసుకుంటే….ఆ కొమ్మల్లో కొందరు మనుషులు…ఆడవారు, పిల్లలతో పాటు కొన్ని పాములు కూడా పక్క పక్కనే ఉన్నాయి. చెట్టు దిగడానికి లేదు. కింద నీళ్లు ఉధృతంగా పారుతున్నాయి. తాము ఎక్కడ ఉన్నామో…..మనుషులకూ, పాములకు కూడా అర్ధం కాలేదు. ఆ చెట్టు మీదే…దాదాపు 18 గంటలు వేచి ఉన్న తరువాత…కిందికి దిగారు. విపత్తు కాలం లో పాములు, అవి కాటేస్తే చనిపోయే మనుషులు కూడా సహ జీవనం సాగించినట్టు…ఇప్పుడు దేశాలు కూడా ధనిక..పేద అనే బిల్డ్ అప్ కు తిలోదకాలు ఇస్తున్నాయి. కరోనా వైరస్ మానవాళిని తన గుప్పెట బిగించి బత్తాకాయ రసం పిండినట్టు పిండుతుంటే…. వివిధ రంగాలకు చెందిన ప్రపంచ మేధావులు.. వీర మేధావులు…మహా మేధావులు.. భయంతో ఆశ్చర్య చకితులవుతున్నారు. భయంతో వణికి పోతూ బట్టలు తడిపేసుకుంటున్నారు.
అంటే…ఒక విషయం మాత్రం అర్ధమైంది. ఒక సందేహం తీరింది. కలియుగాంతానికి కరోనా ఒక్కటి సరిపోతుంది. దానికి సాయం కావలసి వస్తే…మరికొన్ని వైరస్ లు తలా ఓ చెయ్యి వేస్తే సరి పోతుంది.
ఇప్పుడు మళ్లీ ఓ సందేహం
మరి…వెయ్యి అబద్దాలాడి…వెయ్యి అకృత్యాలు చేసి…వెయ్యి మర్డర్లు..కబ్జాలు…మానభంగాలు…దుర్మార్గాలు చేసి మనం సంపాదించిన వెయ్యి కోట్ల కోట్ల ఆస్తులు…ఈ ప్రెస్టీజిలు… రేబాన్ కళ్ల జోళ్ళు.. నైక్ బూట్లు …అధికార హోదాలూ… వ్యాపార సామ్రాజ్యాలూ…ఇలాకాలూ…ఏమై పోతాయ్?! మన టూ టౌన్ లు…త్రీ టౌన్ లు ఏమై పోతాయ్..!!?
కాల గమనం లో ఈ సందేహమూ తీరవచ్చు.

-భోగాది వేంకట రాయుడు.

1 COMMENT