సర్కారు పనితీరుకు ఏపీ ప్రజల శెహభాషులు

70

సర్కారు  నిర్ణయాలు సరైనవే!
కరోనాపై ఫలిస్తున్న ఏపీ సర్కారు  నిర్ణయాలు

ఖాకీల కఠిన నిర్ణయాల వల్ల దారికొస్తున్న జనం
కాశీ, అరుణాచల్‌ప్రదేశ్ పర్యాటకులకు ఊరట
సీఎం జగన్ నిరంతర సమీక్షలతో అప్రమత్తం
విరాళాల వెల్లువతో మూర్తీభవిస్తున్న మానవత్వం 
సరిహద్దులపై జగన్ సర్కారు నిర్ణయం సరైనదే
ద్వారకా తిరుమలరావు వైఖరితో దారికొచ్చిన బెజవాడ
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా విపత్తును ఎదుర్కోనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న
మానవీయ చర్యలు, అందరి అభినందనలు అందుకుంటున్నాయి. ఇప్పటికే
తెల్లకార్డుదారులకు వెయ్యిరూపాయలు, బియ్యం, కందిపప్పు ఇస్తున్నట్లు ప్రకటించిన జగన్,
కింది తరగతి వర్గాల మనసు గెలుచుకున్నారు. దీనిని జగన్ సర్కారును రాజకీయంగా
విబేధించే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా అభినందించడం విశేషం.
ఎక్కడైనా లాక్‌డౌన్ పాటించకపోతే, వారికి మానవత్వంతో అవగాహన కల్పించేందుకు
ప్రయత్నించాలని జగన్ ఆదేశించారు.

కరోనాపై ఫలిస్తున్న ఏపీ సర్కారు  నిర్ణయాలు

కరోనా కల్లోలంపై తొలుత అవగాహన లేకుండా మాట్లాడినప్పటికీ, తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా అప్రమత్తమయిన జగన్.. దాని నివారణకు తీసుకుంటున్న చర్యలు, సత్ఫలితాలిస్తున్నాయి. ప్రతిరోజూ కరోనాకు సంబంధించి, ఆయన స్వయంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ మీడియా ముందుకు రాని జగన్, గత కొద్దిరోజుల నుంచీ మీడియా ముఖంగా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడిస్తున్నారు. అటు సీఎస్ నీలం సహానీ, ఇటు డీజీపీ గౌతం సవాంగ్ తమ శాఖలకు సంబంధించిన అధికారులతో, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. కేంద్ర అధికారులతో ప్రతిరోజు సమీక్షలతో, పరిస్థితి సమీక్షిస్తున్నారు.

ద్వారకా తిరుమలరావు వైఖరితో దారికొచ్చిన బెజవాడ

విజయవాడలో కరోనా కేసుల నేపథ్యంలో అటు, నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు నేత్వత్వంలో..  పోలీసు శాఖ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయి. ద్వారకా తిరుమలరావు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్ల బేఖాతర్ నగరంగా పేరున్న బెజవాడ ఇప్పుడు ఒక దారికి వచ్చిందన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఒకరకంగా, ఏపీ పోలీసులు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలే, రాష్ట్రం నియంత్రణలో ఉండటానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు మీడియా, వైద్యసిబ్బంది పట్ల అతిగా, దురుసుగా ప్రవర్తిస్తున్నప్పటికీ, మొత్తంగా వారి కర్తవ్య నిర్వహణ ప్రజలను రోడ్డెక్కకుండా చేస్తోందన్నది నిర్వివాదం.

కాశీ, అరుణాచల్‌ప్రదేశ్ పర్యాటకులకు ఊరట

కరోనా కల్లోలంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలకు, ప్రజల మద్దతు పెరుగతోంది. విశాఖలో ఉన్న అరుణాచల్ వాసుల సమస్యలను అక్కడి సీఎం పెమాఖండ్, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతం సావంగ్‌కు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. దానితో వారిద్దరూ తక్షణమే స్పందించడంపై, పెమాఖండ్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వారణాసిలో చిక్కుకుపోయిన, ఏపీ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని యుపీ సర్కారును, జగన్ ప్రభుత్వం అభ్యర్ధించింది. లేకపోతే వారి ఖర్చులను తామే భరించేందుకు సిద్ధంగా ఉందని చేసిన ప్రకటన కూడా వారిని మెప్పించింది.  నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని, ఏఎస్ పేట దర్గాను సందర్శించేందుకు వచ్చి లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన 329 మంది భక్తుల సమస్యలను, ఆ జిల్లాకు చెందిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలుసుకుని, శరవేగంగాతో స్పందించారు. వారికి భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించారు.

విరాళాల వెల్లువతో మూర్తీభవిస్తున్న మానవత్వం

రాజకీయాలకు అతీతంగా.. కరోనా నివారణకు, వైసీపీ-టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ
వేతనాలను విరాళంగా ప్రకటించడం అభినందనీయం. జగన్ భార్య భారతి తమ సంస్థల పక్షాన
20 కోట్లు సీఎం సహాయనిధికి ప్రకటించి పెద్ద మనసుచాటుకోవడం ప్రశంసనీయం.  టీడీపీ
అధినేత చంద్రబాబు నాయుడు పది లక్షలు ప్రకటించారు. కరోనా వైద్య పరికరాల కొనుగోలుకు,
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 10 లక్షలు విరాళం ప్రకటించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా
తమ నెలరోజుల వేతనాన్ని సీఎం సహాయనిధికి ప్రకటించి, ఈ విపత్తు సమయంలో తమ
సామాజిక బాధ్యత  నిర్వర్తించారు. మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి కరోనా బాధితుల కోసం 5
కోట్ల రూపాయలను సీఎం సహాయనిధికి అందించారు.

అయితే, ఆయనను హైదరాబాద్ నుంచి ఎలా అనుమతించారన్నది వేరే విషయం. సిద్ధార్ధ సంస్థల యాజమాన్యం, వారి సిబ్బంది కూడా 1.30 కోట్ల విరాళం ప్రకటించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 1.65 కోట్లువిరాళంగా ప్రకటించగా, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తన రెండు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా కోటి రూపాయలు సీఎం సహాయనిధికి, 50 లక్షలు కడప కలెక్టర్‌కు ఇస్తున్నట్లు ప్రకటించడం అభినందనీయం. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్ లక్ష రూపాయల విరాళం ప్రకటించగా, వైసీపీ ఎమ్మెల్సీలు తమ నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఉమ్మారెడ్డి వెంకటేళ్లర్లు ప్రకటించారు. అటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా,  100 కోట్ల విలువైన తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. జగన్‌తో రాజకీయంగా విబేధించినా, జనసేన అధినేత పవన్..  కరోనా యుద్ధ సమయంలో, ఏపీ సర్కారుకు 50 లక్షల రూపాయల విరాళంప్రకటించడం ద్వారా, తన మానవత్వం చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహష్‌బాబు  చెరో కోటి రూపాయ ప్రకటించగా,ప్రభాస్ 4 కోట్లు, రాంచరణ్ 70 లక్షలు, నితిన్ 10 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షలు ప్రకటించారు. ఈ విధంగా కరోనాపై చర్యలు తీసుకుంటున్న జగన్ సర్కారుకు, ప్రముఖులు విరాళం ఇవ్వడం ద్వారా, సర్కారు చేతులను బలపరిచినట్టయింది.

సరిహద్దులపై జగన్ సర్కారు నిర్ణయం సరైనదే

ఇక సరిహద్దుల వద్ద, జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయం సమంజసమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఉంటున్న ఏపీ వాసులకు అనుమతి పత్రాలు ఇవ్వవద్దని, వారు ఉంటున్న హాస్టళ్లను ఖాళీ చేయించవద్దని ఏపీ సీఎం నీలం సహానీ, తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్‌ను కోరారు. దానితో  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ రంగంలోకి దిగి, హాస్టళ్ల యజమానులతో చర్చించడంతో ఆ సమస్య పరిష్కారమయింది. తలసాని చొరవతో తెలంగాణలో హాస్టళ్ల సమస్యకు తెర!  ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వల్ల ఏపీవాసుల మనసు గాయపడినా, అంతిమంగా అది వారి ప్రాణాలకే రక్షణ కల్పిస్తుందంటున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఏపీవాసులను రాష్ట్రానికి అనుమతించటం వల్ల, తమకేమీ నష్టం లేకపోయినా.. వారిలో ఎవరైనా కరోనా పాజిటివ్ రోగులుంటే, అలాంటి వారి వల్ల తమ ప్రాణాలకే ప్రమాదం ఉందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.విశాఖ వంటి ప్రాంతాల్లో ఉన్న ఉత్తరాంఖండ్ వాసులకు రక్షణ కల్పించిన ప్రభుత్వానికి.. ఏపీ వాసులను అనుమతించడానికి అభ్యంతరాలు ఉండనక్కర్లేదని చెబుతున్నారు. కాకపోతే, వారికి వైద్యపరీక్షలు చేయకుండా అనుమతించడం అంటే, రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.