కేటీఆర్ సార్……..కేటీఆర్ అంతే!

131

ఆపదలో ఉన్న వారి సమస్యలు తీరుస్తున్న కేటీఆర్
హాస్టళ్లు తిరిగి తెరిపించి ఆంధ్రా వారిని ఆదుకున్న వైనం
నాలుగు వేల ఫిర్యాదులకు సమాధానం
ట్విట్టర్‌తో సమస్యలు పరిష్కరిస్తున్న తారకరాముడు
(మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎంత అద్భుతంగా మాట్లాడగలరో.. అంతే వేగంగా, అంతే చురుకుగా పనిచేయగలరన్న విషయం, ఆయన పనితనం, కరోనా సంక్షోభ సమయంలో మరోసారి బయటపడింది. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు, ఆయన ఇస్తున్న ఆదేశాలు బాధితులకు మేలు చేస్తున్నాయి. ట్విట్టర్ ద్వారా తన సాయం కోరిన వారికి అభయమిస్తూ, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఆపదలో ఉన్న వారి సమస్యలు తీరుస్తున్న కేటీఆర్

కరోనా కల్లోల సమయంలో ఎక్కడి వారు అక్కడ
చిక్కుబడిపోయి, సాయం చేసే చేతుల కోసం
ఎదురుచూస్తున్న వారికి,  కేటీఆర్ ఆపద్బాంధవుడిలా
మారారు.  హైదరాబాద్‌లో నివసించే తమ
కుటుంబసభ్యులు, బంధు మిత్రుల సమస్యలను,  ఇతర
ప్రాంతాల్లో ఉంటున్న వారు ఎప్పటికప్పుడు
తెలుసుకుంటున్నారు. కరోనా సమయంలో వైద్యం,
ఆహారం, హాస్టళ్ల ఖాళీ వంటి సమస్యలతో సతమతమవుతున్న బాధితులు, ఉద్యోగులు, తమ
సమస్యలను కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా మొరపెట్టుకుంటున్నారు. సహజంగా ట్విట్టర్‌లో చురుకుగా
ఉండే  కేసీఆర్, కరోనా సంక్షోభ సమయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తన
దృష్టికి వచ్చిన సమస్యలను,  వివిధ విభాగాలతో ముడిపడిన  ఫిర్యాదులను ఎప్పటికప్పుడు
పరిష్కరించే పనిలో పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకూ ఆయన, కేవలం రెండు రోజుల్లో 3600
అత్యవసర ఫిర్యాదులకు స్పందించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారంటే..
కరోనా సమయంలో ఆయన ఎంత వేగంగా పనిచేస్తున్నారో స్పష్టమవుతుంది.

కేటీఆర్ సమీక్ష

కరోనా నేపథ్యంలో,  హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఆయన స్వయంగా సమీక్షిస్తున్నారు. నిత్యావసర వస్తువులపైనే ఆయన ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో బుద్దభవన్ వద్ద.. తుంగతుర్తికి వెళుతున్న కాలినడకన వెళుతున్న ఓ కుటుంబాన్ని చూసి, కేసీఆర్ మానవత్వంతో చేసిన సాయం అందరినీ కదిలించింది. లాక్‌డౌన్‌తో పనిలేకపోవడం, రవాణా సౌకర్యం లేనందున, తామంతా తుంగతుర్తి నడుచుకుంటూ వెళుతున్నామన్న వారి జవాబుకు, కేటీఆర్ చలించిపోయారు. దానితో అప్పటికప్పుడు ట్రాలీ ఆటో తెప్పించి వారిని స్వస్థలం పంపించారు. అయితే, వారిని ఉప్పల్ వద్ద విడిచిపెట్టారని, అక్కడి నుంచి వారు వేరే మార్గాల ద్వారా తుంగతుర్తి చేరారన్నది ఓ సమాచారం. అసలు ఈ కర్ఫ్యూ సమయంలో కనీసం ఉప్పల్ వరకూ చేర్చడమే గొప్ప. అది వేరే విషయం.

హాస్టళ్లు తిరిగి తెరిపించి ఆంధ్రా వారిని ఆదుకున్న వైనం

ఇక సంజీవరెడ్డినగర్, మియాపూర్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో హాస్టల్‌లో ఉంటున్న,  ఆంధ్రా ప్రాంతానికి చెందిన బ్యాచిలర్లను  కరోనా కారణంతో, ఖాళీ చేయాలని యజమానులు ఆదేశించారు. దానితో గత్యంతరం లేని వారంతా తమ రాష్ట్రానికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నం, జగ్గయ్యపేట చెక్ పోస్టు వద్ద ఫలించలేదు. ఫలితంగా కొందరు నూజివీడులో ఉన్న క్వారంటైన్‌కు వెళ్లేందుకు వెళ్లగా, అందుకు ఇష్టపడని వారు తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సమస్య మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్.. హాస్టళ్లను యజమానులు ఖాళీ చేయించకుండా వారితో మాట్లాడాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, మేయర్ బొంతు రామ్మోహన్‌ను ఆదేశించారు.

ట్విట్టర్‌తో నాలుగు వేల ఫిర్యాదులకు సమాధానం

ఏపీకి చెందిన చక్రధర్ అనే వ్యక్తి చేసిన ట్వీట్‌కు కేటీఆర్ వెంటనే స్పందించారు. ఏప్రిల్‌లో తన సోదరికి డాక్టర్లు డెలివరీ డేట్ ఇచ్చారని తెలిపి, ఆమెకు తన తల్లి సాయం అవసరం ఉన్నందున, ఆమెను అనుమతించాలని అభ్యర్ధించారు. దానికి స్పందించిన కేటీఆర్, తప్పకుండా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన, ఆశాజ్యోతి అనే గర్భిణి చేసిన ట్వీట్‌కు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ రెయిన్‌బో ఆసుపత్రిలో ఈనెల 28న తనకు స్కానింగ్ ఉన్నందున, అక్కడి వచ్చేందుకు తనకు అనుమతి ఇవ్వాలని చేసిన అభ్యర్ధనపై, కేటీఆర్ వెంటనే స్పందించారు. తనకు వివరాలు పంపాలని సూచించారు. ఈ విధంగా రెండు రోజుల నుంచి ఇప్పటివరకూ,  నాలుగువేల మంది సమస్యలకు ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్  ఓపికను అభినందించాల్సిందే.

1 COMMENT