ఆదుకుని ప్రాణం పోసే వైద్యుల కే అవమానం

305

కరోనా బాధితులకు వైద్యం చేసే వైద్యుల కష్టాలు
మానవత్వం మూర్తీభవించని మనుషులు
వారి  ఇళ్లను ఖాళీ చేయించే అమానవీయ చేష్ఠలు
అలాంటి వారి తోలు తీయాలని ఆదేశించిన మోదీ
(మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా బాధితులకు వైద్యం చేసే వైద్యుల కష్టాలు

ఆ రోగులకు  భయంకరమైన కరోనా వైరస్ సోకిందని తెలుసు. ముట్టుకున్నా, వారి శ్వాస పీల్చినా, వారిని తాకినా,  తామూ ఆ మంచం పక్కనే చేరాల్సి వస్తుందని కూడా తెలుసు. అయినా.. తప్పని కర్తవ్యం. విధినిర్వహణ. వృత్తిధర్మమే ఆ చేతులు,  రోగులను  కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. తమ ప్రాణాలు పణంగా పెట్టి, రోగులను కాపాడేందుకు చేస్తున్న ధన్వంతరీలకు సహకరించాల్సిన  చేతులు.. ఇప్పుడు ఇళ్లుఖాళీ చేసేయమని చూపుడువేలుతో హెచ్చరిస్తున్నాయి. అభినందించాల్సిన నోళ్లు ఖాళీ చేయమని గద్దిస్తున్నాయి. చప్పట్లు చరచి స్వాగతించాల్సిన సహచరులు చీదరించుకుంటున్నారు. ‘మీరు మాకొద్దంటూ’ మూకుమ్మడి ఈటెల లాంటి మాటల దాడి చేస్తున్న, అమానవీయ పాషాణ హృదయాలను చూసి జాతి నివ్వెరపోతోంది. ప్రాణాలు నిలబెట్టే వైద్య నారాయణులకు  వచ్చిన ఈ కష్టం ఎక్కడో కాదు.. నవ నాగరికత నలభై నాలుగు పాదాల నడిచి, అభ్యుదయం అడుగులేసే సాక్షాత్తూ మన దేశ రాజధాని ఢిల్లీలోనే కావడం సిగ్గుచేటు!

 మానవత్వం మూర్తీభవించని మనుషులు

నిజంగా ఇది నిజం. కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న రోగులకు, ప్రాణాలు పణంగా పెట్టి  వైద్య సేవలందిస్తోన్న ఆ వైద్యులు.. ఇప్పుడు నిలువ నీడ కోసం  బెంగపడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. ఢిల్లీ ఎయిమ్స్‌లో కరోనా రోగులు, అనుమానితులకు వైద్య చికత్సలు అందిస్తున్న వైద్యులకు పెద్ద కష్టమే వచ్చింది. నిరంతరం వారికి సేవలందిస్తున్న వైద్యులు,  విరామ సమయంలో ఇళ్లకు వెళితే.. యజమానులు వారిని, తక్షణమే మూటా ముల్లె సర్దుకుని వెళ్లిపోవాలన్న హుంకరింపులు ఎదురవుతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన కాలనీవాసులు, అపార్టుమెంటు అసోసియేషన్లు కూడా వారికి జత కలసి, ఇళ్లను ఖాళీ చేయాలని వంతపాడుతున్న వైచిత్రితో.. వైద్యులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మీ వల్ల మాకూ వైరస్ సోకుతుంది కాబట్టి, మీరు మాకొద్దని నిర్మొహమాటంగానే చెబుతున్నారు. దీనితో ఏం చేయాలో దిక్కుతోచని వైద్యులు, ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్‌కు మొరపెట్టుకున్నారు. దానికి స్పందించిన సంఘం నేతలు ప్రధాని, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు.

అలాంటి వారి తోలు తీయాలని ఆదేశించిన మోదీ

ఈ అమానవీయ చర్యకు కన్నెర్ర చేసిన, హోం మంత్రి అమిత్‌షా ఢిల్లీ నగర పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేశారు. ఇళ్లు ఖాళీచేయాలని ఒత్తిడి చేస్తూ, స్థానికంగా వైద్యులను వేధిస్తున్న వారిని అరెస్టు చేయాలని ఆదేశించారు. ఇళ్ల యజమానులతో మాట్లాడి, వారిని హెచ్చరించాలన్నారు. అటు ప్రధాని మోదీ కూడా రంగంలోకి దిగి, ఖాళీ చేయాలని ఒత్తిడి చేసే వారి తాట తీస్తామని హెచ్చరించారు. ఒక్క ఢిల్లీనే కాకుండా, ఈరకమైన ఇబ్బందులకు గురి చేసే, ఇంటి యజమానుల సంగతి చూడాలని,  అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించారు. ఈ విషయం తెలిసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా, ఇళ్ల యజమానులకు క్లాసు పీకారు.

జాతీయ విపత్తు లాంటి ఈ సమయంలో.. ప్రాణాలతో పోరాడుతున్న రోగులను బతికించేందుకు,
వైద్య నారాయణులు చేస్తున్న సాయానికి సహకరించాల్సింది పోయి.. వైద్యుల నైతిక స్థైర్యాన్ని
దెబ్బతీసే ఇలాంటి అమానవీయ జాతిని,  సామాజిక బహిష్కరణ చేసినా తప్పులేదేమో?! వైద్యుల
నైతిక స్థైర్యం దెబ్బతినకుండా, వారికి బాసటగా  రంగంలోకి దిగినందుకు హేట్సాఫ్ మోదీ!