నీలం జీ… కరోనా ఉందని ఒప్పుకుంటారా ?

671

కరోనా ప్రభావం నాలుగు వారాల వరకూ లేదన్నారే?
ఆ వాదనతో స్థానిక ఎన్నికలు పెట్టమని ఎస్‌ఈసీకి లేఖ
రాజ్యసభ ఎన్నికలు కూడా వాయిదా
బడ్జెట్ సమావేశాలూ అనుమానమే
తొలుత మూడు జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రం
సీపీఐ రామకృష్ణ డిమాండ్‌కు స్పందిస్తారా?
(మార్తి సుబ్రహ్మణ్యం)


ఒక్కోసారి పాలకుల అత్యుత్సాహం ఉన్నతాధికారులను నైతిక సంకటంలో పడేస్తుంటుంది.
అత్యున్నత పదవి ఇచ్చేముందు పాలకులు వందరకాలుగా ఆలోచిస్తారు. సదరు అధికారి తాము
చెప్పినట్లు వింటారా? తమ మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తారా లేదా? అన్నదే వారి
నిర్ణయానికి కొలమానం. అలాంటి వారిని, ఏ రాష్ట్రంలో ఉన్నా ఏరి కోరి మరీ తెప్పించుకుంటారు.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చేసే పని ఇదే. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. గతంలో
చంద్రబాబు నాయుడు కూడా చేసింది ఇదే. డీజీపీ,సీఎస్ పదవులకు అర్హులైన అధికారులున్నా,
వారిని కాదని ఆయన తనకు కావలసిన వారిని ఆ పదవులలో నియమించుకున్నారు. సీఎస్
కావలసిన ఎల్వీ సుబ్రమణ్యానికి బదులు పునేఠా, డీజీపీగా నియమితులు కావలసిన గౌతం
సవాంగ్‌కు బదులు ఠాకూర్‌ను నియమించడం అప్పట్లో విమర్శలకు దారితీసింది.
అంతకుముందు, ఎల్వీకి రెండుసార్లు సీఎస్ వచ్చే అవకాశం పోయింది. ఫలితంగా తమ కంటే
జూనియర్ల ముందు, సీనియర్లు చేతులు కట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది.

అయితే,   ఆ తర్వాత సదరు అధికారులు తీసుకునే నిర్ణయాల ఆధారంగానే వారి వ్యక్తిత్వం,
హుందాతనం, పనితనం, నిష్పక్షపాతం బయటపడుతుంది. ఏపీలో ఇప్పుడు ఉన్నతాధికారులు
పాలకుల మనసెరిగి తీసుకుంటున్న నిర్ణయాలు చివరికి.. అటు కోర్టుల్లో, ఇటు ప్రజాకోర్టులలో
నవ్వులపాలవుతున్నాయి. ఉన్నతహోదాలో ఉన్న వ్యక్తులు కోర్టు ముందు నిలబడాల్సిన
దురదృష్టకర పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా సదరు అధికారులు.. ఎంతో అధికారులు
కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ కరిగిపోయి, ఆరోపణలు, విమర్శలకు గురవుతున్న పరిస్థితి.
గతంలో వైఎస్ హయాంలో సర్కారు చెప్పినవాటికి తలూపిన ఫలితంగా, కేంద్రంలో క్యాబినెట్
కార్యదర్శిలో ఉండాల్సిన శ్రీలక్ష్మి అకారణంగా జైలు పాలు కావలసి వచ్చింది.

 

ఆ వాదనతో స్థానిక ఎన్నికలు పెట్టమని ఎస్‌ఈసీకి లేఖ

కొద్దిరోజుల క్రితమే..  ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను,  కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆరు వారాలు వాయిదా వేస్తూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయంపై,  అధికారపార్టీ భగ్గుమంది. ముఖ్యమంత్రి జగన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారుల వరకూ.. నిమ్మగడ్డపై వ్యక్తిగత దాడికి దిగి, ఆయనకు కులం ఆపాదించి అపఖ్యాతి పాల్జేశారు. ముఖ్యమంత్రి మనోభావాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ కూడా రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మూడు, నాలుగు వారాల వరకూ కరోనా వచ్చే అవకాశం లేదని, కేంద్ర నిధులు ఆగిపోయే ప్రమాదం కూడా ఉన్నందున, ఎన్నికల వాయిదాపై తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, ఎన్నికలు నిర్వహించాలని మార్చి 15న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. ఒక ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి, ఆవిధంగా లేఖ రాయడం తప్పని అధికార వర్గాల్లో చర్చ జరిగింది.

అయితే, తాను కేంద్ర ఆరోగ్య శాఖను సంప్రదించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని, బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేశారని నిమ్మగడ్డ, ప్రధాన కార్యదర్శి సహానీకి తిరుగు లేఖ రాశారు. నిమ్మగడ్డకు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పినట్లుగానే, కరోనా ప్రమాద ఘంటికలను కేంద్రం ఏపీకి సైతం మోగించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన జిల్లాల్లో ఏపీకి చెందిన మూడు జిల్లాలు ఉన్నాయి. అంటే దీన్నిబట్టి, రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమయింది. ఇక నిధులను కారణంగా చూపించిన నేపథ్యంలో, కేంద్రం ఎన్నికలు జరగని రాష్ట్రాలకు సైతం నిధులు విడుదల చేసింది. ఆ ప్రకారంగా ప్రధాన కార్యదర్శి నీలం సహానీ వాదన వీగిపోయినట్లు స్పష్టమయింది.

కరోనా ప్రభావం నాలుగు వారాల వరకూ లేదన్నారే?

కాగా, ఏపీలో మూడు, నాలుగు వారాల వరకూ కరోనా వచ్చే అవకాశం లేదని సహానీ లేఖ రాసిన కొద్దిరోజులకే, కేంద్రం జనతా కర్ఫ్యూ విధించింది. ఒకరోజు విరామం తర్వాత మళ్లీ ఏప్రిల్ 15 వరకూ నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు స్వయంగా మోదీనే ప్రకటించారు. ఆ ప్రకారంగా… రాష్ట్రంలో కరోనా లేదని సీఎస్ సహానీ మార్చి 15న లేఖ  రాస్తే, మార్చి 18న.. అంటే మూడురోజుల తర్వాత, రాష్ట్రంలో యూనివర్శిటీలు, కాలేజీలు, స్కూళ్లు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని, మీటరు దూరం కచ్చితంగా పాటించాలని, పదిమందికి మించి జమకావద్దని ఆదేశించింది. మార్చి 19న రాష్ట్రంలో దేవాలయాలు, మాల్స్, సినిమా థియేటర్లు, జిమ్, పబ్, వేసవి  శిబిరాలు మూసివేస్తున్నట్లు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించాల్సి వచ్చింది. మార్చి 22న కేంద్రప్రభుత్వం, దేశంలోని 80 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించింది.

అందులో ఏపీ నుంచి విజయవాడ, ప్రకాశం, విశాఖ జిల్లాలు కూడా ఉండటం గమనార్హం.  మార్చి  కేంద్రం 22న జనతా కర్ఫ్యూ విధించింది. అదేరోజు సీఎం జగన్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో, ఈనెల 31 వరకూ లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తెల్లకార్డులు ఉన్న వారికి బియ్యం, కందిపప్పు, వెయ్యి రూపాయల నగదు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ-ప్రైవేటు రవాణా నిలిపివేస్తున్నామని, అంతర్రాష్ట సరిహద్దులు కూడా మూసివేస్తున్నామని చెప్పారు. మార్చి 23న మెడికల్, నిత్యావసర వస్తువులు మినహా.. మిగిలినవన్నీ బంద్ చేస్తున్నామని, రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకూ అన్నీ బంద్ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 24న పదవ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోసారి ఆరోగ్యసర్వే నిర్వహిస్తామని, లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరించాలని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ కూడా సమీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నారు.

తొలుత మూడు జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రం

దీన్నిబట్టి.. ఎన్నికల కారణంగా, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకూడదనే వాయిదా వేశామన్న నిమ్మగడ్డ వాదన నిలిచినట్టయింది. కానీ అదే అంశంపై లేఖ రాసిన సీఎస్ సహానీ చూపిన కారణాలు, నాలుగు వారాల వరకూ కరోనా ప్రభావం రాష్ట్రంలో ఉండదని చేసిన వీగిపోయినట్టయింది. సీఎస్ సహానీ, రాష్ట్రంలో నాలుగు వారాలపాటు కరోనా ప్రభావం ఉండదని కమిషనర్‌కు లేఖ రాసిన  18వ తేదీ నుంచి, రాష్ట్ర ప్రభుత్వమే కరోనాకు ప్రత్యామ్నాయ చర్యలు ప్రకటించింది.  అసలు కేంద్రమే రంగంలోకి దిగి, రాష్ట్రంలో మూడు జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించడం బట్టి.. సహానీ ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగయినా ఆ లేఖ రాసి ఉండాలి, లేదా కరోనాపై వైద్యశాఖ సరైన సమాచారం ఇవ్వకుండా త ప్పుదారి పట్టించయినా ఉండాలన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.  కరోనాపై సీఎస్ అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ.. అసెంబ్లీ సమావేశాలకు బదులు ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అసలు రాజ్యసభ ఎన్నికలనే ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. దీన్నిబట్టి, నాలుగు వారాల వరకూ కరోనా ప్రభావం లేదన్న సహానీ వాదనకు కనీస ఆధారం కూడా లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.   ఏదేమైనా ఇప్పుడు నైతిక సంకటంలో పడింది మాత్రం సహానీనే. ఒత్తిళ్లు చేసిన పాలకులు గానీ, కరోనాపై వివరణ పంపించిన వైద్యశాఖ అధికారులు గానీ, ఈ వ్యవ హారంలో లౌక్యంగా తప్పుకుంటే.. పాపం సీఎస్ సహానీ ఒక్కరే కరోనా లేదని లేఖ రాసి ఇరుక్కున్నట్టయింది.

కాగా, సహానీ లేఖ రాసిన తర్వాత కూడా,  కరోనా కల్లోలం పెరిగిన నేపథ్యంలో.. ఆమె లేఖను తప్పుపడుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన విమర్శలు, సహానీని నైతిక సంకటంలో పడేశాయి. నాలుగువారాల పాటు కరోనా రాదని లేఖ రాసిన సహానీ ఇప్పుడేమంటారని, ఆమెకు నైతిక విలువులుంటే తన పదవికి రాజీనామా చేయాలని రామకృష్ణ చేసిన డిమాండ్‌పై సహానీ ఎలా స్పందిస్తారో చూడాలి.ఇది చదవండి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలి