తెలంగాణ వరమిచ్చినా కనికరించని ఆంధ్రా సర్కార్

420

ఏపీ వారికి పాసులిచ్చి పెద్ద మనసుచాటిన సీపీ అంజన్‌కుమార్
ఏపీ సరిహద్దుల్లో వారిని రానీయని ఏపీ సర్కారు
ఆంధ్రా సరిహద్దులో నిలిచిపోయిన తెలంగాణ వాసులు
మంత్రి కేటీఆర్‌కు బొత్స ఫోన్
వాళ్లు వస్తే ఇబ్బందులంటున్న మంత్రి బొత్స
నడుమ నలుగుతున్న ఏపీ వాసులు
చెక్ పోస్టు వద్ద పడిగాపులు కాస్తున్న మహిళలు
సరి’హద్దు’మీరిన సమస్య

        (మార్తి సుబ్రహ్మణ్యం)

పక్షం రోజుల పాటు ఎక్కడికీ
కదిలే వీలు లేదు. పనిచేసే
కంపెనీలన్నీ
సెలవులిచ్చేశాయి. అటు
బ్యాచిలర్లు ఉంటున్న
హాస్టళ్ల యజమానులు
కూడా, వారిని ఖాళీ చేయమని హుంకరిస్తున్నారు. దీనితో దిక్కుతోచని వారంతా పోలీసుస్టేషన్ల
తలుపు తట్టారు. ఈ కష్టాలు మేం పడలేం. మా రాష్ట్రానికి మేం వెళ్లిపోతాం. అనుమతించండని
అభ్యర్ధించారు. దానితో కరుణించిన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనుమతి
పత్రాలిచ్చారు. దానితో చచ్చీ చెడీ ఆంధ్రా సరిహద్దుకు చేరారు.  కానీ, ఏం లాభం? దేవుడు
వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు.. అక్కడ ఏపీ సర్కారు వారిని రానీయకుండా
అడ్డుకుంది. అటు.. ఆంధ్రా నుంచి తిరిగి తెలంగాణకు వెళదామనుకుని, సరిహద్దుల వరకూ
వెళ్లిన తెలంగాణ వాసులదీ అదే పరిస్థితి. ఫలితం.. అటు సొంత రాష్ట్రానికీ వెళ్లలేక, ఇటు తిరిగి
వెనక్కీ వెళ్లలేక అగమ్యగోచర పరిస్థితిలో చిక్కుకున్న తెలంగాణలోని ఏపీవాసులు, ఆంధ్రాలో ఉన్న
తెలంగాణ వాసుల దుస్థితి ఇది. తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల వద్ద వినిపిస్తున్న గోడు ఇది.

పాసులిచ్చి పెద్ద మనసుచాటిన సీపీ అంజన్‌కుమార్

కరోనా వైరస్ కారణంగా వచ్చే నెల 15వ తేదీ వరకూ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో, హైదరాబాద్ లోని అన్ని కంపెనీలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి. ఐటి కంపెనీలు కూడా, ఉద్యోగులకు ఇంటి నుంచే  పనిచేసుకునే వెసులుబాటు కల్పించాయి. దీనితో ఒక్కరే బిక్కుబిక్కుమని కూర్చున్న ఏపీ వాసులు, తమ రాష్ట్రానికి వెళ్లిపోవాలని భావించారు. అయితే, రాష్ట్ర సరిహద్దులు మూసివేయడం, కర్ఫ్యూ కారణంగా స్థానికంగా తిరిగే అవకాశం లేకపోవడంతో.. వారంతా పోలీసులను ఆశ్రయించారు. దీనితో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజన్‌కుమార్, మానవత్వంతో స్పందించారు. ఏపీకి వెళ్లాలనుకున్న వారికి అనుమతి పత్రాలు ఇవ్వాలని ఆదేశించారు. ఫలితంగా సంజీవరెడ్డినగర్, మాదాపూర్, దుండిగల్, పంజాగుట్ట పోలీసుస్టేషన్ల వద్దకు ఏపీ వాసులు వందల సంఖ్యలో వచ్చి, అనుమతి పత్రాలు తీసుకున్నారు. పోలీసులు కూడా ఓపికగా వారికి అనుమతిపత్రాలు ఇచ్చి, వారిని గమ్యాలకు చేర్చేందుకు సాయపడ్డారు.

ఆంధ్రా సరిహద్దులో నిలిచిపోయిన తెలంగాణ వాసులు

కానీ, ఆ తర్వాతనే ఏపీ వాసులకు సినిమా కష్టాలు మొదలయ్యాయి. అనుమతి పత్రాలయితే వచ్చాయి గానీ, ఏపీ వరకూ వెళ్లాలంటే కావలసిన వాహనాలు అందుబాటులో లేవు. అయినా, ఏదోలా తంటాలు పడి, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఉన్న, తెలంగాణ ఆఖరి చెక్‌పోస్టు వరకూ చేరుకోగలిగారు. మరికొద్దిసేపయితే, తమ రాష్ట్రంలో అడుగుపెడతామని ఆనందించిన వారి ఆశలను, ఆంధ్రా సర్కారు ఆవిరి చేసింది. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని, అక్కడున్న కృష్ణా జిల్లా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే తమవద్ద తెలంగాణ సర్కారు ఇచ్చిన అనుమతిపత్రాలు ఉన్నాయని వాదించి, వాటిని చూపించినా ఆంధ్రా పోలీసుల వైఖరిలోమార్పు లేదు.

చెక్ పోస్టు వద్ద పడిగాపులు కాస్తున్న మహిళలు

ఈలోగా జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అక్కడికి చేరుకున్నారు. దానితో ఏపీవాసులంతా ఆయనకు తమ బాధ మొరపెట్టుకున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానంతవరకూ తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. దీనితో ఇంకా వారంతా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ సమీపంలో మరుగుదొడ్లు కూడా లేకపోవడం, గ్రామాల నుంచి వెళదామనుకుంటే, అక్కడ గ్రామస్తులు కూడా కంచెలు వేయడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. పోనీ వెనక్కి వచ్చేద్దామంటే, తిరిగి వెళ్లేందుకు వాహన సౌకర్యం కూడా లేదు.

ఏపీ సరిహద్దుల్లో వారిని రానీయని ఏపీ సర్కారు

అయితే, ఏపీ సరిహద్దు వద్ద నెలకొన్న ఈ తక్షణ సమస్యను పరిష్కరించాల్సిన ఏపీ సర్కారు.. హైదరాబాద్‌లో హాస్టళ్లను యజమానులు ఖాళీ చేయిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు, ఏపీ సీఎస్ తెలంగాణ సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. దానికి స్పందించిన కేటీఆర్.. హాస్టళ్ల యజమానులతో మాట్లాడాలని మేయర్, అధికారులను ఆదేశించారు. ఈ చర్యలు బాగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం సరిహద్దు దగ్గర వేచి ఉన్న వేలాదిమంది ఏపీ-తెలంగాణ  వాసుల సమస్యకు పరిష్కారం మాత్రం, ఆంధ్రా సర్కారు చూపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పైగా, వారు ఆంధ్రాకు వస్తే ప్రమాదమన్న తరహాలో మంత్రి బొత్స తెలంగాణ సర్కారుకు చెప్పడం మరో ఆశ్చర్యం. అటు ఆంధ్రా సరిహద్దులో ఉన్న తెలంగాణ వాసులను కూడా హైదరాబాద్ వైపు వెళ్లనీయకుండా ఆపిన పరిస్థితి నెలకొంది.

ఏపీ సర్కారు స్పందించదేం?: సంకినేని

తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళుతున్న వారికి తెలంగాణ పోలీసులు అనుమతించినా, ఏపీ సర్కారు స్పందించకపోవడం ఏమిటని బేజీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరావు ప్రశ్నించారు. అలాగే తెలంగాణకు వెళ్లేందుకు జగ్గయ్యపేట వద్ద వందలాది మంది నిలిచిపోయారన్నారు. జగ్గయ్యపేట సరిహద్దు ఉన్న వారి సమస్యలు తెలుసుకునేందుకు, ఏపీ ప్రభుత్వం ప్రయత్నించకపోవడం విచారకమన్నారు. ఇకపై ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ.. ప్రస్తుతం సరిహద్దుల వద్ద ఉన్న, ఆంధ్రా-తెలంగాణ వారిని వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన ఏపీ బీజేపీ నేతలతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లారు.

హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించొద్దు: తెలంగాణ డీజీపీ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఉన్నందున ఎవరూ ఇళ్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు.