అవును..వాళ్లిద్దరూ మారరు!

225

తీరు మారని జగన్-బాబు
తమ ఆలోచనల ప్రకారమే ఎదుటివారు మారాలన్న తపన
కరోనా లోనూ రాజకీయాలేనా?
రాజకీయాల జోలికి వెళ్లని కేసీఆర్
వైసీపీ-టీడీపీ వర్గాల్లో అంతర్మథనం
(మార్తి సుబ్రహ్మణ్యం)

తీరు మారని జగన్-బాబు

తమ అధినేత ఆలోచనా ధోరణి మారాలని వారు కోరుకుంటారు.
క్షేత్రస్థాయిలో పనిచేసే తమ ఆలోచనల ప్రకారమే,  నిర్ణయాలు
తీసుకోవాలని ఆశిస్తుంటారు. ఏ సమయంలో ఏ నిర్ణయం
తీసుకోవాలో, దానిని వెంటనే పాటించాలని ఆకాంక్షిస్తుంటారు.
ప్రజల మనోభావాలు, మారుతున్న కాల పరిస్థితులు, మారుతున్న
తరం ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని
కోరుకుంటారు. జనం ఏమనుకుంటారోనన్న జాగ్రత్త ఉండాలని
అనుకుంటారు. కానీ.. అధినేతలు  మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. తమ ఆలోచనల
ప్రకారమే అందరూ పనిచేయాలని భావిస్తారు. తమ కళ్లతో ప్రపంచాన్ని చూడాలనుకుంటారు.
తాము చేసేదే సరైనదనుంటారు. ఫలితం.. క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి-పైస్థాయిలో ఆదేశాలిచ్చే
అధినేతల మధ్య మానసిక-సైద్ధాంతిక, రాజకీయ ఘర్షణ. ఆంధ్రప్రదేశ్‌లో అచ్చంగా
జరుగుతున్నది ఇదే. అది వైసీపీ అధినేత-సీఎం జగనన్న అయినా, టీడీపీ అధినేత-మాజీ సీఎం
చంద్రబాబునాయుడయినా ఒకటే. రెండు పార్టీల జెండాలు మోసే సగటు కార్యకర్త అభీష్టానికి
విరుద్ధంగా, జగన్-బాబు ప్రభుత్వ-పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు ఆయా
పార్టీల శ్రేణులను అసంతృప్తికి కారణమవుతున్నాయి.ఇది కూడా చదవండి: ఆ ఇద్దరిదీ స్వయంకృతమే!

తమ ఆలోచనల ప్రకారమే ఎదుటివారు మారాలన్న తపన

పదేళ్లు కఠోరంగా శ్రమించి, ప్రాణాలను పణంగా పెట్టి చేసిన పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన
జగన్‌లో గానీ.. పది నెలల క్రితం చేసిన తప్పుల మూలంగా అధికారం కోల్పోయిన చంద్రబాబు
నాయుడులో గానీ, ఎలాంటి స్వాభావిక మార్పు లేదన్న భావన ఆ రెండు పార్టీ వర్గాల్లో
వ్యక్తమవుతోంది. ఇద్దరూ ప్రజలు-కార్యకర్తలు, నేతల మనోభావాలకు అనుగుణంగా కాకుండా,
ఇంకా తమ సొంత ఆలోచనలతోనే అడుగులు వేస్తున్నారన్న అసంతృప్తి కనిపిస్తోంది. తాము
అనుకున్నట్లే కార్యకర్తలు పనిచేయాలన్న ధోరణి ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా తాము ఐదేళ్లు విపక్షంలో ఉండి, అనుభవించిన
కష్టాలు అధికారంలోకి వచ్చిన తర్వాత, పోతాయన్న వైసీపీ
నేతల అంచనాలు దారుణంగా తప్పుతున్నాయి. తమ
అధినేత జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై,
ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను చూసి వారు ఇప్పటినుంచే
భయపడుతున్నారు. ఎవరితో సంప్రదించకుండా, తనకు
నచ్చినట్లు వ్యవహరిస్తున్న జగన్ తీరు మంచిదికాదని..
ఆయనకు చెప్పే ధైర్యం పార్టీ-ప్రభుత్వంలో ఎవరికీ
లేకపోవడం వారిని బాధిస్తోంది. తొలినాళ్లలో ఎన్టీఆర్ కూడా ఇలాగే శాసించారని, తర్వాత
ఏమయిందో తెలుసుకోవాలని మరికొందరు సీనియర్లు సూచిస్తున్నారు. ఈ విషయంలో
చంద్రబాబు కొద్దిగానయినా మెరుగంటున్నారు. ఆయన తమ మాట అమలు చేయకపోయినా,
కనీసం మండల స్థాయి నుంచి, ఎమ్మెల్యేల వరకూ చెప్పింది వినేవారని గుర్తు చేస్తున్నారు.
అలాంటి పరిస్థితి తమ వ్యవస్థలో లేదని, మంత్రులు-ఎమ్మెల్యేలకే జగన్‌ను కలిసే దిక్కులేకపోతే,
ఇక తమ సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

వైఎస్ హెలికాప్టర్ దుర్ఘటనకు అంబానీలే కారణమని, గతంలో
ఆరోపించిన తామే.. ఇటీవల ముఖేష్ అంబానీని జగన్ ఇంటికి
పిలిపించి మాట్లాడం వల్ల పార్టీ శ్రేణులకు ఏం సంకేతాలు ఇస్తారన్న
ఊహ, అంచనా కూడా తమ నాయకత్వంలో లేకుండా పోయిందని
సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబానీ సిఫార్సు చేసిన
నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడంతో, తమ నేత జగన్‌పై సాధారణ
ప్రజల్లో ఉన్న ఇమేజ్ చెరిగిపోవడంతోపాటు.. జగన్ కూడా మామూలు అవకాశవాద రాజకీయ
నాయకుడిగానే మిగిలిపోయేందుకు, వారి కలయిక కారణమయిందంటున్నారు. ఆరోజు వారి
కలయిక తర్వాత, సోషల్‌మీడియాలో వచ్చిన వైఎస్ మృతికి సంబంధించి వచ్చిన కథనాలు,
వ్యంగ్యాస్త్రాలు తమను నైతికంగా కలచివేశాయంటున్నారు. ఇలాంటి మనోభావాలు
గమనించకుండా, జగన్ తీసుకునే నిర్ణయాలు తమకు నష్టమేనని అంగీకరిస్తున్నారు.ఇది కూడా
చదవండి:
వైఎస్ మృతిలో రిలయన్స్ హస్తం లేనట్లేనా?

వైసీపీ-టీడీపీ వర్గాల్లో అంతర్మథనం

అన్నక్యాంటీన్ రద్దు, పెన్షన్-రేషన్‌కార్డుల కోత, ఇసుక రద్దు వంటి నిర్ణయాలు, తమ
ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు తెచ్చాయని అంగీకరిస్తున్నారు. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి
నిర్ణయంపై కోర్టులు ఇస్తున్న వ్యతిరేక తీర్పులు, ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తున్నాయంటున్నారు.
ప్రతిభ ప్రాతిపదికన కాకుండా, కులం-విధేయత ఆధారంగా ఎంపికలు చేస్తే ఫలితాలు ఇలాగే
ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఎంపికలపై చేసిన ఇలాంటి
విధానాలనే ఇప్పుడు తమ అధినేత అనుసరిస్తే, పరిణామాలు ఎలా ఉంటాయో గత ఎన్నికల
ఫలితాలే చెప్పాయని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై జగన్ అనవసర ప్రతిష్ఠకు పోయారని, అసలు జగన్ జోక్యం
చేసుకుని ప్రజాప్రతినిధులకు లక్ష్యాలు నిర్దేశించకపోతే,  90 శాతం ఫలితాలు తమకే అనుకూలంగా
ఉండేవని చెబుతున్నారు. జగన్ పట్టుదల వల్ల, ప్రభుత్వ ప్రతిష్ఠ దేశస్థాయిలో దెబ్బతిందని
వ్యాఖ్యానిస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలతో వచ్చిన అధికారాన్ని, 30 ఏళ్లు కాపాడుకునే
విధానాలేవీ కనిపించడం లేదన్నది మెజారిటీ నేతల అభిప్రాయం. దీనిపై ఓ సీనియర్ జర్నలిస్టు
మాట్లాడుతూ ‘అవును. నీకు నచ్చకపోవచ్చు. అవి జగన్‌కు నచ్చవచ్చు. నీకు నచ్చనివి ఆయనకూ
నచ్చాలని ఏముంది? నీకు కరెక్టు కాదన్నది, ఆయనకు కరెక్టనిపించింది’ అని వ్యాఖ్యానించారు.

మీడియా సంస్థలను బహిష్కరించుట

జగన్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా, ఆయన మనస్తత్వం, విధానాలు ఇంకా ప్రతిపక్షంలో
ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విపక్షంలో ఉండగా, ఆయన-పార్టీ
నేతలు నిర్వహించే సమావేశాలకు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలను బహిష్కరించారు.
సీఎంగా ఉన్న చంద్రబాబు-ఆయన పార్టీ  కూడా, టీడీపీ కార్యక్రమాలకు సాక్షిని బహిష్కరించారు.
దీనిపై జర్నలిస్టు సంఘం ఒకటి ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది. కానీ బాబు, ప్రభుత్వ
సమావేశాలకు మాత్రం సాక్షిని ఏనాడూ బహిష్కరించలేదు. అలాగే అడ్వర్టైజ్‌మెంట్ల విషయంలో
.. ఈనాడు-ఆంధ్రజ్యోతి స్థాయిలో కాకపోయినా, తగినన్ని ప్రకటనలు ఇచ్చేవారు. అప్పట్లో
ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాసే ప్రజాశక్తికి కూడా బాగానే ప్రకటనలు ఇచ్చారు.

ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆంధ్రజ్యోతికి ప్రకటనలు నిలిపివేశారు. ఆ
మీడియా సంస్థలకు సీఎం ప్రెస్‌మీట్లకు పిలవకుండా బహిష్కరించారు. ఎంపిక చేసుకున్న
మీడియానే పిలిచే విచిత్ర సంప్రదాయం మొదలయింది. స్థలాభావం, కరోనా వల్ల వైద్యశాఖ
సూచనల మేరకు, పరిమితంగానే మీడియాను పిలిచామని విడుదల చేసిన ప్రకటన కూడా
అసంబద్ధమే. తర్వాత నిర్వహించిన వైద్యశాఖ మంత్రి ప్రెస్‌మీట్‌కు మరి అందరినీ ఎలా
ఆహ్వానించారు? అంటే వైద్యశాఖ మంత్రికి ఏమైనా ఫర్వాలేదన్న సంకేతం ఇస్తున్నారా? అన్న
ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయినా దీనిని అడిగేవారు గానీ, జగన్‌కు నచ్చచెప్పేవారు గానీ
ఎవరూ లేరు. అంతా జగన్ వంటి మనస్తత్వం ఉన్న వారే కావడమే బహుశా దీనికి కారణం
కావచ్చన్నది పార్టీ నేతల అభిప్రాయం.

ఇప్పుడు జగన్ వల్ల ప్రయోజనం పొందుతున్న
జర్నలిస్టులు కూడా.. వాస్తవాల ప్రాతిపదిక కాకుండా,
వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులను  విమర్శించటం,
బలహీనపరచమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని విశ్లేషించి, తప్పు-
ఒప్పులను వేలెత్తిచూపకుండా, గుడ్డిగా సమర్థించడం,
అందులో లోపాలు ఎత్తిచూపే జర్నలిస్టులను,  ఎల్లో మీడియాగ్రూపులో చేర్చడం వంటి, స్థాయి
తక్కువ వ్యవ హారం కనిపిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీని సమర్ధించే జర్నలిస్టులు కూడా,
ఇదే వైఖరి ప్రదర్శించారు. ఇప్పుడు ఆ పాత్ర జగన్ మీడియా పోషిస్తోంది.  తిరుగులేని
మెజారిటీతో వచ్చిన అధికారాన్ని  నిలబెట్టుకునేలా జగన్ గానీ, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు
చంద్రబాబు గానీ వ్యవహరించడం లేదన్న వ్యాఖ్యలు, ఆయా పార్టీల నేతల్లో వినిపిస్తున్నాయి.

కరోనా లోనూ రాజకీయాలేనా?

jagan-nimmagadda rameshతాజాగా కరోనా వైరస్ నష్టంపై జగన్ నిర్వహించిన
ప్రెస్‌మీట్‌లో, రాజకీయాలు మాట్లాడటం ఆయన స్థాయిని
తగ్గించిదన్నది పార్టీ నేతల మనోగతం. అందులో కరోనా
గురించి తక్కువగా, నిమ్మగడ్డ రమేష్-ఆయన కులంపై
ఎక్కువగా మాట్లాడి, విమర్శించడం ద్వారా.. తాను
మారలేదని జగన్ నిరూపించుకున్నారు. ఇక ప్రపంచమంతా
కరోనాను ఎదుర్కొనేందుకు సమీక్షలు, ప్రత్యామ్నాయ
ఏర్పాట్లలో మునిగిపోతే.. ఇంత క్లిష్ట సమయంలో కూడా జగన్ ప్రభుత్వం.. అమరావతి
భూములపై, సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయడం ఆశ్చర్యపరిచింది. అంటే ఈ
విపత్తు సమయంలో కూడా జగన్.. రాజకీయాలు, ప్రత్యర్ధి పార్టీల గురించే ఆలోచిస్తున్నారని
మెదడుపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. ఆ ప్రకారంగా జగన్‌లో ఏమాత్రం మార్పు
రాలేదన్నది సుస్పష్టం.

ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యవహారశైలిలో, ఏమాత్రం మార్పు కనిపించడం
లేదన్నది ఆ పార్టీ సీనియర్ల వాఖ్య. ఇంకా అధికారంలోనే ఉన్నామన్నట్లు.. గంటలకు గంటల
మీటింగులు, టెలీకాన్ఫరెన్సులు, సమీక్షలు, సందర్శకులను గంటలపాటు వెయిటింగ్‌లో ఉంచే
పద్ధతిలో ఏమాత్రం మార్పు రాలేదంటున్నారు. అపాయింట్‌మెంట్ల విషయంలో, ఇప్పటికీ
అధికారంలో ఉన్నప్పటి తీరునే ప్రదర్శిస్తున్నారని సీనియర్లు చెబుతున్నారు. ఇటీవల అమరావతి
ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన వైద్య బృందాన్ని, గంటలపాటు వేచి ఉంచిన
సందర్భంలో, వారు విసుగుపుట్టి వెనక్కివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు కూడా ఆయన..
ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారో, ఎవరు అవకాశం కోసం పనిచేస్తున్నారో అంచనా
వేయలేకపోతున్నారంటున్నారు.

ఈ పదినెలల కాలంలో అధికారం కోల్పోవడానికి దారితీసిన వాస్తవాలను, క్షేత్రస్థాయి నేతలను
అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించని వైనాన్ని సీనియర్లు విమర్శిస్తున్నారు. పార్టీలో
సీనియర్లు ఎందుకు ఉండలేకపోతున్నారో, తన వల్ల వారికేమైనా గతంలో ఇబ్బందులు,
అవమానాలు  తలెత్తాయా అన్న ప్రయత్నం కూడా చేయకపోవడం బాధాకరమంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారు, కార్పొరేట్ శక్తులు.. ఇప్పుడు మాయమవగా,
కష్టపడిన వారే మిగిలిపోయారని, కనీసం వారిని కూడా గౌరవించే వ్యవస్థ లేదన్న విమర్శలు
వినిపిస్తున్నాయి. ఏ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఆ సమయంలో తీసుకోకపోవడం,
ఏది చేయలో అది చేయని విధానం ఇంకా అమలవుతోందని చెబుతున్నారు. ఏపీ
తెలుగుయువత అధ్యక్షుడిగా ఉన్న  అవినాష్ రాజీనామా చేసి ఇన్నాళ్లయినా, ఇప్పటిదాకా
మరొకరిని నియమించలేదు. సతె్తనపల్లికి ఇంతవరకూ ఇన్చార్జిని నియమించలేదు. ఇంకా
ఇలాంటి నియోజకవర్గాల్లో చాలావరకూ ఇన్చార్జులను నియమించలేదు.

ఇక తెలంగాణలో ఇప్పటివరకూ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటి ంచలేకపోతున్నారు. కాంగ్రెస్ కూడా
తమ అధ్యక్షుడిని మార్చనుంది. బీజేపీ, సీపీఐ ఇప్పటికే కొత్త నేతలను ప్రకటించాయి. బాబు
మాత్రం రమణను మార్చే ధైర్యం చేయలేకపోవడం, విమర్శలకు దారితీస్తోంది. ఇక మరో ఆరు
నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలున్న హైదరాబాద్‌లో కూడా, కొత్త కమిటీని
నియమించలేకపోతున్నారు. ఇలా జాగు నిర్ణయాలతో పార్టీ ఎలా మనుగడ సాగిస్తుందన్న
ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

హుందాతనంగా ఉండేది

కరోనాపై తమ పార్టీ
అనుసరిస్తున్న వైఖరిపైనా,
నేతలు విస్మయం వ్యక్తం
చేస్తున్నారు. కరోనా వంటి
విపత్తు సందర్భంలో, ప్రజల
సౌకర్యాలపై డిమాండ్
చేయడం ఒక
రాజకీయపార్టీగా  మంచిదేనంటున్నారు. అయితే, రాజకీయాలు
పక్కకుపెట్టి ప్రభుత్వం ప్రకటించిన చర్యలను స్వాగతించి ఉంటే, హుందాతనంగా
ఉండేదంటున్నారు. ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించకుండా, సాయంత్రం ఐదుగంటలకు చప్పట్లు
కొట్టమన్న మోదీ నిర్ణయాన్ని అభినందించి, దానిని పాటించిన తాము.. ఎంతో కొంత సాయం
ప్రకటించిన రాష్ట్ర  ప్రభుత్వాన్ని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాదిరిగా, తాము
కూడా అభినందించి ఉంటే,  తమ గౌరవం పెరిగేదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణలో తమ రాజకీయ ప్రత్యర్ధి అయినప్పటికీ, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను సోమిరెడ్డి
అభినందించడం ద్వారా, పార్టీ ప్రతిష్ఠ పెరిగిందని, అదే విధానాన్ని ఇక్కడ కూడా పాటిస్తే
బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు టీడీపీ ప్రశంసలు

రాజకీయాల జోలికి వెళ్లని కేసీఆర్

ఇక వీరిద్దరి కంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహారశైలి
బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా
సమయంలో జగన్ రాజకీయాలు మాట్లాడి, సీబీఐ
విచారణకు లేఖ రాస్తే.. కేసీఆర్ అసలు రాజకీయాల
ప్రస్తావనే చేయకుండా, హుందాతనం పాటించారని గుర్తు
చేస్తున్నారు. కేసీఆర్ కరోనాపై తీసుకుంటున్న చర్యలు
వివరించేందుకు, మూడుసార్లు అన్ని మీడియా సంస్థలనూ
ఆహ్వానించడంతోపాటు, జర్నలిస్టులకు దూరదూరంగా కుర్చీలు కూడా ఏర్పాటుచేశారు. విలేకరుల
సమావేశం తర్వాత జర్నలిస్టుల ప్రశ్నలన్నింటికీ కేసీఆర్ ఓపిగా జవాబులిచ్చారు. కానీ జగన్
మాత్రం, కేవలం ఎంపిక చేసుకున్న మీడియాను మాత్రమే ఆహ్వానించి, ప్రశ్నలకు అవకాశం
లేకుండా.. చెప్పాల్సింది చెప్పి నిష్క్రమించారు. తాము సీఎంను చూశామన్న తృప్తి తప్ప,
అంతదూరం వెళ్లిన జర్నలిస్టులకు ఒరిగిందేమీ లేకుండా పోయింది.

1 COMMENT