ప్రజలు, మీడియాకు ఏదీ సామాజిక బాధ్యత?

333

కరోనా నియంత్రణ పోలీసులకే పట్టిందా?
వద్దన్నా వినకుండా రోడ్లపై విహారమా?
ఇంత బేఖాతరిజమైతే మూల్యం తప్పదు
ఐరోపా సమాజం కష్టాలు మనకు గుణపాఠమే
సెలవు లేకుండా పనిచేస్తున్న పోలీసులకు సెల్యూట్
ఏపీ-తెలంగాణలో పోలీసుల పనితీరుపై ప్రశంసలు
వైన్స్, ఉమ్ములపై మీడియా చిల్లర ప్రశ్నలు
ఈటల రాజేందర్  చెప్పింది నిజమే
(మార్తి సుబ్రహ్మణ్యం)

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు ఏమైపోనీ..
– జనంలోపాతుకుపోయిన లెక్కలేనితనం, చచ్చిపోయి, చచ్చుబడిన చైతన్యం గురించి సినీ కవి
సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాట.. ఇప్పటి సమాజానికి సరిగ్గా సరిపోతుంది. జనతా
కర్ఫ్యూ, లాక్‌డౌన్‌లో దారితప్పిన జనం అడుగులకు సిరివెన్నెల పాట అద్దం పడుతోంది.

ఓవైపు కరోనా వైరస్ కోరలుచాచి కబళించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకునేందుకు,
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తమ చర్యలను తీవ్రతరం చేస్తున్నాయి. ప్రధాని మోదీ, తెలంగాణ
సీఎం కేసీఆర్.. దీనిపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ, ప్రజలను అప్రమత్తం చేసే పనిలో
నిమగ్నమయ్యారు. నిజానికి మోదీ ప్రభుత్వ అప్రమత్తం వల్లనే, దేశంలో కరోనా మరణాలు
తగ్గిపోయాయి. ఇంత పెద్ద దేశంలో కేవలం 9 మంది మాత్రమే చనిపోయారంటే, మోదీ సర్కారు
ఏ స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకుంటుందో స్పష్టమవుతుంది.

ఇంత బేఖాతరిజమైతే మూల్యం తప్పదు

జనాలను
బయటకు
రాకుండా చేయడమే..
కరోనాకు
ప్రత్యామ్నాయమన్న
భావనతో, ప్రధాని
మోదీ ఇచ్చిన జనతా కర్ప్యూని ప్రజలు క్రమశిక్షణతో పాటించి, ఆయనకు నైతిక మద్దతునిచ్చారు.
తెలంగాణలో కూడా కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు, అనూహ్య మద్దతు లభించింది. అటు ఏపీలో
కూడా మోదీ పిలుపునకు సానుకూలంగా స్పందించారు. బాగానే ఉంది. కానీ ఆదివారం దాటి
సోమవారం వచ్చిన తర్వాతే జనం క్రమశిక్షణ తప్పారు. విచ్చలవిడితమనే జూలు విదిలించారు.
పనిలేకున్నా రోడ్లపైకొచ్చి, గాలి తిరుగుళ్లతో బేజారెత్తించారు. ఇది బాధ్యతారాహిత్యం. తమ
క్రమశిక్షణా రాహిత్యం, సామాజిక బాధ్యతారాహిత్యంతో ప్రమాదాన్ని కొని తెస్తున్నారు.ఇలాంటి
విచ్చలవిడితనమే,  ఐరోపా సమాజాన్ని మృత్యువు ముంగిట నిలబెట్టిన వైనాన్ని,  తెలుగు ప్రజలు
మర్చిపోతున్నారు. గీత దాటితే మూల్యం అనుభవించేది కూడా ప్రజలేనన్న విషయాన్ని
విస్మరించకూడదు.

కరోనా నియంత్రణ పోలీసులకే పట్టిందా?

నిజానికి కరోనా వైరస్‌ను అరికట్టే బాధ్యత పోలీసుది కాదు. ప్రభుత్వానిది. వైద్య, ఆరోగ్య శాఖది. ప్రజల స్వీయనియంత్రణకు సంబంధించినది. కానీ, ప్రజలు రోడ్డెక్కితేనే సమస్యలు వస్తున్నాయి. వైరస్ జనసమూహంలో పాకితే అది యావత్ జాతికే నష్టం. అందుకే, పోలీసులు రంగంలోకి దిగి, జనాలను నియంత్రించే బాధ్యత స్వీకరించారు. నిజానికి పోలీసులు ఇప్పుడు చేస్తున్నది శాంతిభద్రతల బాధ్యత కాదు. సామాజిక బాధ్యత. మరి అలాంటి సామాజిక బాధ్యత ప్రజలు, మీడియాకు లేదా? మీ ప్రాణాలు కాపాడేందుకే మేం పనిచేస్తున్నామని చెప్పినా వినకుండా, రోడ్లపై బలాదూరు తిరుగుతున్న ప్రజలే, పరోక్షంగా వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు. సామాజిక  దూరం పాటించాలన్న హెచ్చరికను గాలికొదిలి, విరామ సమయంలో డజన్ల సంఖ్యలో బయటకొచ్చి, వీరవిహారం చేస్తున్న ప్రజల బాధ్యతారాహిత్యానికి ఏ పేర పెట్టినా తక్కువే.

ప్రజలు వద్దన్నా వినకుండా రోడ్లపై విహారమా?

ఏపీ రాజధాని నగరమైన విజయవాడ బేఖాతరిజానికి పేరు. అక్కడ మూమూలు రోజుల్లోనే, జనం ఎవరిమాటా లెక్కచేయరు. పోలీసులను పట్టించుకోరు. కండకావరం, పొగరు, ఎవరన్నా లెక్కలేనితనం, ధిక్కారస్వరం,  చట్టాలంటే గౌరవం లేని బేఖాతరిజం నరనరాన జీర్ణించుకున్న బెజవాడ జనం, కరోనానూ ఖాతరు చేయకుండా తమ సహజశైలిని ప్రదర్శించడం,  వారి అరాచక మనస్తత్వానికి నిదర్శనం. విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు, నిరంతరం తమ బృందాలతో కాస్తున్న పహారాకు జనం మద్దతునివ్వకపోగా, రోడ్లపై అడ్డగాడిదల మాదిరిగా సంచరిస్తూ, పౌర సమాజ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చివరకు డీజీపీ గౌతం సవాంగ్ కూడా రోడ్డెక్కి, ప్రజలకు సూచనలివ్వాల్సిన పరిస్థితి. డీజీపీ గౌతం సవాంగ్ గత రెండు రోజుల నుంచి వరసగా సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం విజయవాడ ప్రజల బేఖాతరిజం,  రాజమండ్రిలో యువకులు రోడ్లపై క్రికెట్ ఆడిన దృశ్యాలు, కడపలో పోలీసుల హెచ్చరికలు లెక్కచేయకుండా రోడ్డెక్కిన జనాల తీరు, గుంటూరులో గుంపులు గుంపులుగా చేరిన వారిని పరిశీలిస్తే.. ఇది సామాజిక బాధ్యత లేని జాతిగా అనిపించకమానదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, పోలీసులు ఎంత కష్టపడినా..  ప్రజలలో సామాజిక బాధ్యత, మార్పు రాకపోతే ప్రయోజనం సున్నా.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రజలు పోలీసులకు సహకరిసుండగా, ముషీరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు, పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో జనసంచారం యధావిథిగా కొనసాగడం కనిపించింది. నిర్మల్, జగిత్యాల, వంటి ప్రాంతాల్లో జనం లాక్‌డౌన్‌ను ఖాతరు చేయని వైనం చానెళ్లలో దర్శనమిచ్చాయి. దీనితో రంగంలోకి దిగన తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, కఠిన చర్యలు తీసుకోవడం అనివార్యమయింది. నిజానికి తెలంగాణ డీజీపీ మహేందర్, గత మూడు రోజుల నుంచి, నిరంతరం కరోనాపై సర్కారు చర్యలను అమలుచేసే పనిలో  తలమునకలయ్యారు. పోలీసులు అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు.

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జగన్నాధపురం జుజ్జూరు గ్రామాల మధ్య స్వచ్ఛందంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన కంచె.మా ఊరికి ఎవరు రావద్దు ఊరి నుండి మేము బయటికి రామంటూ స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటిస్తున్న గ్రామస్తులు.తాటి చెట్లు ముళ్ళ కంచెలు ఇరు గ్రామాల మధ్య రహదారి పైన అడ్డంగా వేసిన గ్రామస్తులు.కరోనా వైరస్ ప్రబలితే ఆపలేమని అందుకే మా ఊరిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపిన గ్రామస్తులు. స్వయం నియంత్రణ పాటిస్తున్న పల్లెజనాలకు ఉన్న బుద్ధి, పట్టణవాసులకు లేకపోవడం దౌర్భాగ్యం. ఈ సమాజ జీవచ్ఛవాన్ని ఎంత నిగ్గతీసినా దాని తీరు అంతే!

వైన్స్, ఉమ్ములపై మీడియా చిల్లర ప్రశ్నలు

ఇక తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు హాజరయిన,  మీడియా ప్రతినిధుల స్థాయి తక్కువ ప్రశ్నలు చూస్తే, మీడియాకు సామాజిక బాధ్యత లేదా? ఏ సమయంలో ఏ ప్రశ్న వేయాలో కూడా తెలియనంతగా మీడియా దిగజారిపోయిందా? అన్న అనుమానం రాకతప్పదు. ఓవైపు కేసీఆర్.. కరోనా నియంణ్రపై తీసుకుంటున్న చర్యల గురించి చెబుతుంటే, మరోవైపు కొందరు విలేకరులు.. వైన్‌షాపుల మూత, చాలామంది రోడ్లపై ఉమ్మివేస్తుంటే ఏం చేయాలి? అనే చిల్లర ప్రశ్నలు వేయడం విచారకరం. జాతీయ విపత్తు సమయాల్లో,  ప్రజలను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యల్లో మీడియా కూడా భాగస్వామి కావాలి. జర్నలిస్టులకు అదనంగా రెండు కొమ్ములు, నాలుగు కాళ్లు, రెండు తలలు, పది చేతులేవీ లేవు. మీడియా చట్టాలకు అతీతమేమీ కాదు. అది కూడా సమాజంలో భాగమే. అని గుర్తించకుండా, తామేదో ప్రత్యేక తరగతి వర్గానికి చెందిన వారమని భ్రమించడమే తప్పు.

ఏపీ-తెలంగాణలో పోలీసుల పనితీరుపై ప్రశంసలు

ప్రజలను రోడ్లపైకి రాకుండా నియంత్రించం ద్వారా, కరోనా వైరస్‌ను అరికట్టాలన్న లక్ష్యంతో, గత మూడురోజుల నుంచి తెలుగురాష్ట్రాల పోలీసులు చేస్తున్న కృషి ప్రశంసనీయం.పండుగ, సెలవు లేకుండా..కుటుంబాలకు దూరంగా ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్ర సరిహద్దులు, నడిరోడ్లపై పహారా కాస్తున్న పోలీసుల కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. సిబ్బంది తక్కువగా ఉన్నా, ఎండవేడిమి పెరుగుతున్నా, కనుచూపుమేరలో కనీసం తాగేందుకు టీ, మంచినీళ్లు లేకపోయినా, ఓపికగా భరిస్తూ విధినిర్వహణ చేస్తున్న పోలీసుల శ్రమను అభినందించకపోయినా.. అడ్డంకులు సృష్టించే జనం ఆకతాయితనం, నిర్లక్ష్య వైఖరే విమర్శల పాలవుతోంది. విజయవాడ రామవరప్పాడులో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను,  కారు గుద్దేసి వెళ్లడంతో ఆ కానిస్టేబుల్ గాయాలపాలయ్యాడు. ప్రజలను కరోనా కాటు నుంచి తప్పించేందుకు, తమ ప్రాణాలు పణంగా పెట్టి రోడ్డెక్కిన పోలీసులకు ప్రజలు ఇచ్చే ప్రతిఫలం, గౌరవం ఇదేనా?