పోప్.. బాబా.. ముల్లాలు.. కరోనా నుంచి కాపాడరేం?

278

బాబా రాధామనోహర్ ఇదేం పని
ఏమయ్యాయి వీరి మహిమలు.. శక్తులు?
నోటి నుంచి కరోనా యాంటీ వైరస్ సృష్టించరేం?
చనిపోతున్న వారికి  స్వస్థత  ఇవ్వడం లేదేం?
ఏమయ్యాయి ఆ  హోమాలు, తాయత్తులు, స్వస్థత సభల ప్రభావం?
చివరకు రక్షించింది వైద్యులు, పోలీసులే
వాళ్లిద్దరే ఇప్పుడు కనిపించే దేవుళ్లు
అయినా మారని కొందరి అభి‘మతం’

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏమయ్యాయి బాబా మహిమలు.. శక్తులు?

ఆ బాబా లు  వేలాదిమంది సమక్షంలో చేతిని గాల్లో లేపి, నోటి నుంచి శివలింగం తీస్తారు. గాల్లో నుంచే గోల్డ్ చైన్ తీసి, భక్తుడికి బహుమానం ఇస్తారు. ఆ స్వాములోర్లు చేయి వేయగానే, రోగాలు మాయవుతాయి. మామూలోడిని  కూడా ముఖ్యమంత్రిని చేయగల తపోశక్తివంతులు.ఆ పాస్టరు గారు పూనకం పూని చేసిన ప్రార్ధనతో, కుంటుకుంటూ స్టేజీ మీదకు వచ్చిన వికలాంగుడిపై, తెల్లటి పౌడరు, కల్వరి నూనె చల్లితే.. సదరు వికలాంగుడు విరాట్‌కోహ్లీ మాదిరిగా పరుగు తీస్తాడు.ఆ ముల్లా గారు  కట్టిన తాయత్తుతో.. మనిషిని ఆవహించిన భూత- ప్రేత- పిశాచాలన్నీ పోలోమని కట్టకట్టుకుని పారిపోతాయి. ఆ అంత్రాలతో కష్టాలన్నీ తీరిపోతాయి. తావీజు మహిమ అలాంటిది.

నోటి నుంచి కరోనా యాంటీ వైరస్ సృష్టించరేం?

మరి ఇన్ని అనిర్వచనీయ శక్తులు, అద్భుత మహిమలు, అనన్య సామాన్యమైన వరాలిచ్చే మహా మహిమాన్వితులైన స్వాములు, పాస్టర్లు, ముల్లాలు.. దేశాన్ని- ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను, తమ మంత్ర, తంత్ర శక్తులతో ఇప్పటి వరకూ ఎందుకు తరిమికొట్టడం లేదన్నది బుద్ధిజీవుల ప్రశ్న.   మన దేశంలో స్వస్థత కూటముల వేదికలపై.. కాళ్లు లేని వారికి కాళ్లు, కళ్లు లేని వారికి కళ్లు తెప్పిస్తూ.. తమ ప్రార్ధనలతో గుండెజబ్బులు కూడా మాయం చేసే పాస్టర్లు కనీసం ఇటలీ వరకూ వెళ్లకపోయినా, మన దేశంలోనే కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడలేకపోతున్నారు. మరి స్వస్థత కూటమిలో రోగులపై చల్లే కల్వరీ నూనెలు ఏమయ్యాయి?  మరి క్రైస్తవమతం పుట్టిన ఇటలీలో.. పోప్ కొలువుదీరిన వాటికన్ సిటీలో,   పాస్టర్లు కరోనా నుంచి దేశాన్ని ఎందుకు కాపాడటం లేదన్నది హేతువాదుల ప్రశ్న.

చనిపోతున్న వారికి  స్వస్థత  ఇవ్వడం లేదేం?

స్వయంగా పోప్ కొలువుదీరిన ఇటలీలోనే గంట గంటకూ మరణమృదంగం మోగుతోంది. ఈ పరిస్థితిలో తానేమీ చేయలేనని ఇటలీ ప్రధానమంత్రే చేతులెత్తి, బిందెలకొద్దీ కన్నీరు కార్చేశారు. కరోనాతో కూలిపోయిన మనుషుల శవాలను పూడ్చిపెట్టే స్థలం లేక, రోడ్లమీదనే పడి ఉన్న శవాల గుట్టలు పర్వతాల్లా పేరుకుపోతున్నాయి. అసలు ఐరాపా సమాజమే కరోనాకు తల్లడి ల్లిపోతోంది. వయసుమీరిన వారిని, రోగ పీడితులను విధిలేక చంపేస్తున్నారు.

ఇక ఇరాన్, ఇరాక్, సౌదీ, పాకిస్తాన్ వంటి ముస్లిం దేశాలలో.. కరోనా కల్లోలానికి అక్కడి దేశ ప్రజలు తలవాలుస్తున్నారు. ఇరాన్‌లో అయితే పరిస్ధితి మరింత భయానకంగా మారింది. సౌదీలో భారతీయులను వెనక్కి పంపేస్తున్నారు. మరి ముల్లాలు ఆ దేశ ప్రజల ప్రాణాలను ఎందుకు రక్షించడం లేదు? మన దేశంలో వారు కట్టే తాయత్తుల మహిమ ఏమైందన్నది హేతువాదుల రెండో ప్రశ్న.

ఏమయ్యాయి బాబా ఆ  హోమాలు, తాయత్తులు, స్వస్థత సభల ప్రభావం?

ఆధ్మాత్మిక దేశంగా పేరున్న భారత్‌లో.. బాబా లు, స్వాములు, పీఠాలు, మఠాథిపతులకు లెక్కలేదు. గాల్లోంచి అద్భుతాలు సృష్టించే బాబా లు, తమ హోమాలతో పీడను వదిలించే శక్తి ఉన్న స్వాములు, సాధారణ నాయకుడిని కూడా ముఖ్యమంత్రిని చేయగలిగే పీఠాథిపతులు, తమ తపోశక్తితో దీర్ఘకాలిక రోగాలు, కుటుంబసమస్యలు మాయం చేసే మఠాథిపతులు, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పగల దివ్యశక్తులున్న జ్యోతిషులు, దేశంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతాయో ముందే భవిష్యవాణి వినిపించే వారంతా… కరోనా బారి నుంచి దేశాన్ని ఎందుకు కాపాడలేకపోతున్నారన్నది హేతువాదులు సంధిస్తున్న మూడో ప్రశ్న. దీనికి జవాబు ఇచ్చే  మహామహిమాన్వితులు, తపోశక్తివంతులెవరో చూడాలి.

బాబా రాధామనోహర్ ఇదేం పని?


ఇస్కాన్ బాబా రాధామనోహర్ అనే ఆయన.. కరోనా హెచ్చరికలు పట్టించుకోకుండా, ఒంటిమిట్టలో జరిగే శ్రీరావమనవమి వేడుకులకు వెళదామని, అక్కడికి కరోనా వచ్చే సాహసం చేయకుండా పారిపోతుందంటూ,  వందలాది మంది భక్తును పోగేసి  బాధ్యతారాహిత్యంగా ఇస్తున్న ప్రసంగం వీడియో ఒకటి,  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెదక్‌లో ఒక ముస్లిం కౌన్సిలర్.. ఆటోవారిని పిలిచి, మోదీ ఇచ్చిన పిలుపును ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేసి, హాయిగా ఎంజాయ్ చేయాలన్న వీడియో మతప్రచారకుల సామాజిక బాధ్యతకు అద్దం పట్టింది.  ప్రపంచమంతా వణికిస్తున్న కరోనాకు మందులేక, యాంటీ వైరస్ కోసం చకోర పక్షుల్లా యావత్ ప్రపంచమే ఎదురుచూస్తుంటే.. ఇలాంటి  మతప్రచారకుల చర్యలు, ప్రజలను మరింత ప్రమాదంలోకి నెట్టడం విచారకరం, విషాదకరం.

చివరకు రక్షించింది వైద్యులు, పోలీసులే

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో మృత్యుకౌగిలిలో ఒరిగిపోతున్న విషాద సమయంలో, సామాజిక దూరం పాటించడం ద్వారా,  వైరస్ వ్యాప్తి నిరోధించవచ్చన్నది వైద్యుల సలహా. ప్రధాని మోదీ కూడా జాతికి అదే సందేశం ఇచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్, డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా అదే పిలుపునిచ్చారు.  బయట తిరగకుండా ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నారు.ఇది చదవండి:‘ షూట్‌ ఎట్‌ సైట్‌ పరిస్థితి తెచ్చుకోవద్దు ‘.కానీ వివిధ మత ప్రచారకులు అందుకు విరుద్ధంగా చేస్తున్న చర్యలు, ఇస్తున్న ప్రకటనలు.. సమాజాన్ని ఇంకా, పాతరాతియుగంలోనే మగ్గిపోయేలా చేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వాళ్లిద్దరే ఇప్పుడు కనిపించే దేవుళ్లు

ఇప్పుడు ప్రపంచానికి
పోప్‌లు, పీఠాథిపతులు,
ముల్లాలు, సంత్‌లు
కనిపించడం లేదు. అందరికీ ఏకైక దిక్కు  వైద్యులు, పోలీసులే. వారే కరోనా కల్లోలం నుంచి బయటపడవేసే కనిపించే దేవుళ్లు!  కరోనా భయానికి గుళ్లూ, మసీదులు, చర్చిలే మూతబడ్డాయి. ఒక్క కరోనా హెచ్చరికలు.. కరోనా బాధితుల ఆర్తనాదాలు  తప్ప, ఎవరి ప్రార్ధనలూ ప్రపంచంలో వినిపించడం లేదు. వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి కరోనా అనుమానితులకు వైద్యం చేస్తున్నారు. పోలీసులు కంటి మీద కునుకు లేకుండా, రోడ్లపై గస్తీలు కాస్తున్నారు. జనాలు రోడ్డెక్కితే వైరస్ వ్యాపిస్తుందన్న ప్రజాప్రయోజన లక్ష్యంతో, రోడ్డెక్కిన వారిని లాఠీలతో ఇళ్లకు పంపిచేస్తున్నారు. ఫలితం.. ఇండియా మొత్తం ఇంట్లోనే ఉంది.

అయినా మారని కొందరి అభి‘మతం’

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ.. వాట్ టు డు? వాట్ నాట్ టు డు? మతాలు వింటారా? మన హితం కోరే వారి మాట వింటారా?!