కోవిడ్‌–19 నివారణ, నియంత్రణకు చేపట్టిన చర్యలు

297

కోవిడ్‌–19 (కరోనా వైరస్‌) నివారణ, నియంత్రణ ప్రక్రియలో పురపాలక –పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన చర్యలు:

దేశంలో కోవిడ్‌–19 వైరస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే మున్సిపల్‌ శాఖ అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీ), అధికారులను అప్రమత్తం చేస్తూ, తగిన సూచనలు, సలహాలు ఇచ్చింది.

రోజువారీగా టెలి కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించిన పురపాలక పరిపాలన కమిషనర్‌–డైరెక్టర్‌ మున్సిపాలిటీలలో కమిషనర్లు తీసుకున్న చర్యలను సమీక్షించారు.

కోవిడ్‌–19 వైరస్‌ను సమర్థంగా అదుపు చేయడం కోసం జిల్లా స్థాయిలో నోడల్‌ అధికారులను నియమించి, వారి ద్వారా మున్సిపాలిటీల్లో కమిషనర్లకు సహాయ సహకారాలు అందించారు.

పక్కాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, పట్టణ స్థానిక సంస్థలు, అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
ఆ కార్యాచరణ ప్రణాళిక వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రజల్లో కోవిడ్‌–19 పై అవగాహన కల్పించడం:

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 66,126 మంది వార్డు వలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్లలో ప్రతి ఇంటికి వెళ్లి, కోవిడ్‌–19 వైరస్‌ రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు వివరిస్తున్నారు. బ్రోచర్లు, కరపత్రాలతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఏమేం చేయాలన్న దానిపై ప్రజలకు ఈ కింది వాటిపై అవగాహన కల్పిస్తున్నారు.

– వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం
– సబ్బు లేదా శానిటైజర్‌తో తరుచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం
– బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయడం, ముక్కు చీదడం, తుమ్మడం వంటివి చేయకపోవడం
– దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తప్పనిసరిగా ముక్కు, నోరును చేయి లేదా రుమాలుతో అడ్డుపెట్టుకోవడం. తద్వారా ఎదుటివారిపై ఆ తుంపర్లు పడకుండా చూడడం.
– జలుబు, జ్వరం, దగ్గుతో పాటు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారికి దూరంగా ఉండడం.
– ఇంట్లోంచి బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం.
– ఒకేచోట సమూహంగా చేరకుండా ఉండడం.

వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి చేస్తున్న ప్రచారం, ప్రజల్లో కల్పిస్తున్న అవగాహనను వార్డు శానిటేషన్‌–ఎన్నిరాన్‌మెంటల్‌ కార్యదర్శులు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు ఎప్పటిప్పుడు పరిశీలిస్తున్నారు.

ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న సూచనలు, సలహాలను వార్డు వలంటీర్లుకు తెలియజేస్తున్న వార్డు కార్యదర్శులు, తద్వారా ఆ సమాచారం ప్రజలకు చేరవేయడంలో కృషి చేస్తున్నారు.

పాఠశాలలు, మార్కెట్లు, కాలనీల్లో అసోసియేషన్‌ భవనాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

లోకల్‌ టీవీ, కేబుల్‌ టీవీ, ఎఫ్‌ఎంలు, మైక్‌ల (పబ్లిక్‌ అడ్రస్‌) ద్వారా కూడా కోవిడ్‌–19 వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

కోవిడ్‌–19 వైరస్‌ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమేం చేయకూడదు? అన్న వాటిపై వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన వాటిని ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

పర్యావరణ పారిశుద్ధ్యం:

నివాస ప్రాంతాలు, రహదారులు, బహిరంగ ప్రదేశాలు.. ఇంకా మార్కెట్లు, రైతు బజార్లు, మున్సిపల్‌ పాఠశాలలు, పబ్లిక్‌ టాయిలెట్లు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజలు సమూహంగా చేరే లేదా ఎక్కువగా సంచరించే అన్ని ప్రదేశాలలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు.

అందుకు అవసరమైన బ్లీచింగ్‌ పౌడర్, సోడియమ్‌ హైపో క్లోరైడ్, క్రెసాల్‌ను పూర్తిస్థాయిలో సరఫరా చేశారు. భవిష్యత్‌ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు వాటిని అందించారు.

–2.48 లక్షల కిలోల బ్లీచింగ్‌ పౌడర్‌
– 1.48 లక్షల లీటర్ల సోడియమ్‌ హైపో క్లోరైడ్‌ ద్రావణం
– 12,47 లీటర్ల క్రెసాల్‌
ఇప్పటికే స్థానిక మున్సిపాలిటీలలో అందుబాటులో ఉంది.

వ్యక్తిగత ఆరోగ్య భద్రత–ఉపకరణాలు:

కోవిడ్‌–19 వైరస్‌ అదుపు చర్యల్లో పాల్గొంటున్న వార్డు వలంటీర్లు, ప్రజా ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బందికి వ్యక్తిగతంగా ఆరోగ్య భద్రత కల్పించడంలో కూడా మున్సిపల్‌ శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఆ మేరకు వారికి అవసరమైన గ్లౌజ్‌లు, మాస్క్‌లు, ఆప్రన్స్‌ (తెల్ల కోటు), షూస్, కళ్లజోళ్లను ఇప్పటితో పాటు, భవిష్యత్‌ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని సరఫరా చేశారు.

– 1,57,141 మాస్క్‌లు
– 90,013 గ్లౌజ్‌లు
– 11,082 షూస్‌
– 21,869 ఆప్రన్స్‌ను మున్సిపల్‌ శాఖ సరఫరా చేసింది.

వీటితో పాటు, నాణ్యతతో కూడిన మంచినీటి సరఫరాతో పాటు, అన్ని చోట్ల, అన్ని స్థాయిల్లో తగిన క్లోరినేషన్‌ ఉండాలని నిర్దేశించారు.

ఒకవేళ కోవిడ్‌–19 ను గుర్తిస్తే?

ఎక్కడైనా కోవిడ్‌–19 వైరస్‌ను గుర్తిస్తే ఏం చేయాలన్న దానిపై స్పష్టంగా కొన్ని సూచనలు చేశారు.ఆ మొత్తం ప్రాంతాన్ని బఫర్‌జోన్‌గా గుర్తించి, సత్వరమే పూర్తి క్లోరినేషన్‌ చేపట్టడం.ఆ చోట ఇంకా ఏ మాత్రం ఇన్ఫెక్షన్‌ వ్యాపించకుండా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య, వైరస్‌ నివారణ చర్యలు చేపట్టడం.ఇతరులు ఆ ప్రాంతంలోకి రాకుండా, అక్కడ సంచరించకుండా నిరోధించడంతో పాటు, ఐసొలేషన్‌ చేయడం.కోవిడ్‌–19 వైరస్‌ గుర్తించిన ప్రదేశాలు, ఆ అనుమానాస్పద ప్రాంతాల్లో శానిటేషన్‌ పనులు చేస్తున్న వారికి శిక్షణనిచ్చేందుకు ప్రత్యేకంగా 1315 బృందాలు ఏర్పాటు చేశారు.

క్వారంటైన్‌–ఐసొలేషన్‌ కేంద్రాలు:

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన 298 భవనాల్లో 4292 పడకలతో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఐసొలేషన్‌లో ఉన్న కుటుంబంలో ఆ వ్యాధి ఇంకా వ్యాపించకుండా, వారికి అవసరమైన గృహోపకరణాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కోవిడ్‌–19 సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు:

– వస్త్రాలు, మొబైల్‌ షాప్స్‌ వంటి అత్యవసరం కానటు వంటి (నాన్‌ ఎస్సెన్షియల్‌) షాపుల మూసివేయాలని ఆదేశించారు.

– ఇంకా నాన్‌ ఎస్సెన్షియల్‌ కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, వర్క్‌షాప్‌లు, గోదాముల వంటివి తప్పనిసరిగా పని చేయాల్సి వస్తే, నామ మాత్ర సిబ్బంది మాత్రమే ఉండాలని, వారు కూడా ఆరోగ్యపరంగా పూర్తి భద్రతా చర్యలతో పని చేయాలని నిర్దేశించారు.

– విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 14 రోజుల పాటు లేదా వైద్యులు సూచించినంత కాలం హోం క్వారంటైన్‌లో ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

– ప్రజలంతా తప్పనిసరిగా ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలని, నిత్యావసరాల కోసం బయటకు వచ్చినప్పుడు మాస్క్‌ ధరించడంతో పాటు, తప్పనిసరిగా 2 మీటర్ల సామాజిక దూరం (సోషల్‌ డిస్టెన్స్‌) పాటించేలా చూడాలని నిర్దేశించారు.

నిరంతర పరిశీలన–సత్వరం స్పందించే బృందాలు:

24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా టోల్‌ ఫ్రీ నెంబరుతో సహా, అన్ని మున్సిపాలిటీలలో ప్రత్యేక బృందాల ఏర్పాటు.
తద్వారా ప్రజల నుంచి ఎప్పుడైనా సమాచారం పొందడం లేదా ఫిర్యాదు స్వీకరించే వీలు.

కోవిడ్‌–19 వైరస్‌ అదుపునకు తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించడంతో పాటు.. ఆరోగ్య శాఖ, జిల్లా అధికారులు, జిల్లా నోడల్‌ అధికారులు, రాష్ట్ర నోడల్‌ అధికారి మధ్య సమన్యయకర్తగా ప్రతి మున్సిపాలిటీలో ఒక సీనియర్‌ అధికారిని పట్టణ స్థానిక సంస్థ (యూఎల్‌బీ) నోడల్‌ అధికారిగా నియమించారు.

మొత్తం 406 సత్వర స్పందన బృందాలు (ఆర్‌ఆర్‌టీ) ఏర్పాటు:

మున్సిపల్‌ కార్పొరేషన్లలో 50 మందితో కూడిన రెండు బృందాలు.
జీవీఎంసీ, వీఎంసీలలో జోనల్‌ వారీగా ప్రత్యేక బృందాలు.
జిల్లా స్థాయిలో మానిటరింగ్‌ కోసం యూఎల్‌బీలో ఒక బృందం.
సెలక్షన్, స్పెషల్, గ్రేడ్‌–1 మున్సిపాలిటీలలో 30 మందితో ఒక బృందం.
గ్రేడ్‌–2, గ్రేడ్‌–3 మున్సిపాలిటీలలో 15 మందితో కూడిన బృందాలు.

రాష్ట్రస్థాయిలో టోల్‌ఫ్రీ నెంబరు:

ఫిర్యాదుల స్వీకరణతో పాటు, తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌లో ఒక టోల్‌ఫ్రీ నెంబరు
1800–5992–4365. ఏర్పాటు

ఇంకా జూమ్‌ వీడియో కాల్‌ యాప్‌ ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న అన్ని పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.