కోర్టు తీర్పులూ.. ఖాతరు చేయరా?

656

ఒకేరోజు జగన్ సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు
హైకోర్టుకు వ్యతిరేకంగా సుప్రీంకు వెళతారా?
మరి అక్కడా ఎదురుదెబ్బలే కదా?
పాలనాభవం లేకనా?  సలహాదారుల లోపమా?
జగన్ సర్కారుకు ఎవరంటే జంకు మరి?
(మార్తి సుబ్రహ్మణ్య)

ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బహుశా.. బ్రహ్మం గారి మాదిరిగా అప్పుడే ఊహించారేమో. ఆ రాష్ట్రంలో జగన్  ప్రభుత్వానికి  వ్యతిరేకతంగా, వరస వెంట వస్తున్న కోర్టు తీర్పులు చూస్తుంటే, ఈ అనుమానం నిజమేననిపించక మానదు. దేశంలో ఒక వ్యవస్థ విఫలమయితే, మరో వ్యవస్థను రాజ్యాంగం ప్రత్యామ్నాయంగా ఏర్పాటుచేసింది. ఒక వ్యవస్థ తప్పు చేస్తే,  మరో వ్యవస్థ దానిని సరిదిద్దేలా చర్యలు తీసుకుంది. చివరకు సుప్రీంకోర్టు తప్పు చేస్తే, అభిశంసనకు పార్లమెంటుకు అధికారాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలేనితనంగా, బేఫర్వాగా కొనసాగిస్తున్న పాలనకు, చివరకు కోర్టులు ముకుతాడు వేసి నియంత్రిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ కోర్టులు కూడా లేకపోతే.. ప్రజలు, వ్యవస్థల బతుకు బస్టాండు అయ్యేదన్నది జనాభిప్రాయం. అందుకే అంబేద్కర్‌కు ప్రతి ఒక్కరూ కృతజ్ఞత చెబుతున్నట్టున్నారు.

గతంలో కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, హైకోర్టులు తీర్పులిచ్చాయి. అత్యంత సున్నితం, ప్రత్యర్ధి పార్టీలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన అంశాలు, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు వాటిలో ఉన్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్లు, ఇతర కీలక అంశాలపై హైకోర్టులలో వ్యతిరేక తీర్పులు వస్తే, అలాంటి వాటిని మాత్రమే సవాల్ చేస్తూ, ఆయా రాష్ట్రాలు సుప్రీం కోర్టుకు అపీలు కోసం వెళ్లేవి. హై కోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది కదా అని ప్రతి అంశంలోనూ సుప్రీం కోర్టుకు వెళ్లేవి కాదు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ తీరు అందుకు పూర్తి భిన్నంగా మారటం చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి..అబ్బా.. కోర్టులో జగన్ సర్కారుకు మరో దెబ్బ!

మరి అక్కడా ఎదురుదెబ్బలే కదా?

ఏపీలో జగన్ సర్కారు మాత్రం, ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని ఏపీ హై కోర్టు ఆక్షేపించగా, జగన్ సర్కారు దానిపై సుప్రీం కోర్టుకు వెళ్లింది. అయితే, అక్కడ కూడా  చుక్కెదురయి, హై కోర్టు నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. దేశంలో ఉన్న భవనాలకు కాషాయరంగు వేస్తే ఊరుకుంటారా? అని వేసిన ప్రశ్న జగన్ సర్కారు నిర్ణయలోపాన్ని ఎత్తిచూపింది. అసలు సర్కారు కార్యాలయాలకు పార్టీల రంగు వేయడమే నైతికంగా తప్పు. మళ్లీ దానిని సమర్థిస్తూ, సుప్రీం కోర్టుకు వెళ్లడం మరో తప్పు. ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై.. హై కోర్టు జడ్జి హోదాతో సమానమైన, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఇచ్చిన ఆదేశాన్ని కూడా, జగన్ సర్కారు విబేధించి సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అయితే, ఆ అంశంలో కూడా జగన్ సర్కారుకు తలబొప్పి కట్టింది.

ఒకేరోజు జగన్ సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు

తాజాగా హైకోర్టులో జగన్ సర్కారు నిర్ణయానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలో పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసేందుకు, సర్కారు ఇచ్చిన జీవోపై హై కోర్టు స్టే ఇచ్చింది. భూసమీకరణ విధానంకింద తీసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు సవాల్ చేయగా, హై కోర్టు రైతుల పక్షానే నిలిచింది. ఈ విధంగా ఒకేరోజు హై కోర్టు, సుప్రీం కోర్టులో జగన్ సర్కారు నిర్ణయాలకు వ్యతిరేక తీర్పులు రావడం బట్టి.. సహజంగానే ఆయనకు పాలనానుభవం లేకనో, సరైన సలహాదారులు లేకనో, ఉన్నా వారి మాటలు వినకపోవడం వల్లనో ఈ అవమానకర పరిస్థితి కొనసాగుతోందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

హై కోర్టుకు వ్యతిరేకంగా సుప్రీంకు వెళతారా?

ఎక్కడైనా,  కింది కోర్టుల్లో న్యాయం జరగకపోతే పై కోర్టుకు వెళ్లడం సహజమే. కానీ, స్వయంగా రాష్ట్రప్రభుత్వమే.. తన సొంత రాష్ట్రంలోనే,  గవర్నర్‌తో నియమింపబడిన  ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఇచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా, పై కోర్టుకు వెళ్లడమే విచిత్రం. తాజాగా రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములలో ఇళ్ల స్థలాల పంపిణీకి, జగన్ సర్కారు ఇచ్చిన జీఓపై రాష్ట్ర హై కోర్టు స్టే విధించడం, సర్కారుకు శరాఘాతంగా మారింది. మరి దీనిపైనా సర్కారు సుప్రీంకోర్టుకు వెళుతుందేమో చూడాలి. తన నిర్ణయాలను వ్యతిరేకించిన హై కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా,  జగన్ సర్కారు ఈవిధంగా ప్రతిసారీ సుప్రీం కోర్టుకు  వెళ్లడం వల్ల… రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును వ్యతిరేకిస్తోందన్న, సంకేతాలు వెళతాయని పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పాలనాభవం లేకనా?  సలహాదారుల లోపమా?

నిజానికి.. గత పది నెలల కాలంలో, జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలను హై కోర్టు తప్పుపట్టింది. బెంచ్ నుంచే అనేక వ్యాఖ్యలు చేసింది. అవన్నీ జగన్ ప్రభుత్వ పనితీరు, ఆయన పాలనానుభవం, పాలకుల సలహాదారుల అనుభవానికి అద్దం పడుతున్నాయి. గత పదినెలలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, చేసిన వ్యాఖ్యలేమిటో చూద్దాం..

         జులై

 1. ఎందుకీ తొందర- పీపీఏల సమీక్ష అధికారం మీకెక్కడిది? ధరలు నిర్ణయించేది ఈఆర్‌సీ – తగ్గించుకోవాలని బెదిరింపులా?
 2. మేం చెప్పినా ఇంతేనా? – విద్యుత్‌ కొనుగోలు చేయరా? – ఇది మా ఆదేశాల ఉల్లంఘనగా భావించాలి

  ఆగస్టు

 3. చంద్రబాబుకు భద్రత తగ్గించవద్దు – కాన్వాయ్‌లో జామర్‌ ఉండాల్సిందే
 4. పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు విషయంలో రివర్స్‌ చెల్లదు – కాంట్రాక్టు రద్దు కుదరదు – ఇది జెన్కో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు – రద్దు నిబంధనలు అనుసరించలేదు.

  సెప్తెంబరు

 5. స్విస్‌ ఛాలెంజ్‌పై మీ వైఖరింటి?
 6. బందరు పోర్టుకు భూముల్ని అప్పగించడంలో సర్కారు విఫలం – జీవో నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వండి- మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దన్న ఏజీ
 7. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలి
 8. మీ పద్దతి బాగోలేదు – ధరలు ఖరారు పిటీషన్లను త్వరగా తేల్చాలని ఏపీఈఆర్‌సీకి ఆదేశం

  అక్టోబరు

 9. పాలక మండలి ఇదేం పద్దతి?- విశ్వవిద్యాలయాల చట్టంకు విరుద్దంగా నిర్ణయాలు

  నవంబరు

 10. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?
 11. ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆక్షేపణ – ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు కేయించేందుకు ఓ విధానం అంటూ లేదా?
 12. రాజధాని కమిటీపై మీ వైఖరేంటి? బొత్సా, బుగ్గన్నలకు నోటీసులు
 13. కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? – పంచాయితీ ఎన్నికలు జరపరా?
 14. పాస్టర్లు, ఇమాం, మౌజన్‌లకు ఏ నిబంధన ప్రకారం పారితోషకం
 15. ఆలయ బోర్డుల రద్దు మీ ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు

  డిసెంబరు

 16. మద్య నిషేదమే లక్ష్యమైతే రిటైల్‌ను తగ్గించరేం? – బార్లను తగ్గించడంలో మతులబేంటి?
 17. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులా? – ప్రజాస్వామ్య దేశంలో ఇదేం పద్దతి? – ఎవరి అనుమతులతో చేస్తున్నారో నిలదీత
 18. సౌర, పవన, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు
 19. బార్ల సంఖ్యను తగ్గించాలనుకున్నప్పుడు ముందుగా గుర్తించి యజమానులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సింది
 20. విద్యుత్‌ బకాయిలు తక్షణం చెల్లించండి – సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ఇంత జాప్యమా
 21. అంతా ఆంగ్లం కుదరదు – విద్యా హక్కు చ్టానికి అది విరుద్దమే – ఇంగ్లీష్‌ జీవోకు బ్రేక్‌
 22. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉండగా ఇంచార్జ్‌ ఛైర్మన్‌ ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
 23. బార్‌ లైసెన్సుల ఉపసంహరణపై స్టే – కొత్త లైసెన్సుల మంజూరు ప్రక్రియ నిలిపివేత
 24. వీసీగా దామోదర్‌ నాయుడికి అర్హత ఉంది – నియమకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాఖ్యలు కొట్టివేత
 25. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ విధుల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు
 26. ఐపీఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెషన్‌పై ఘాటు వ్యాఖ్యలు – పాలించే పద్ధతి ఇది కాదు – హోదా మార్చి బదిలీ చేస్తారా.. ఎంత ధైర్యం?- ప్రభుత్వాన్ని తప్పుడు శక్తులు నడిపిస్తున్నాయి – రాజకీయ కక్షతో ఎంత వెంటాడారో అందరికి తెలుసు

  జనవరి 2020

 27. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిమిత్తం జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 2గంటల లోపు రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆదేశం
 28. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద 2019-20 సంవత్సరానికి సంబంధించి మొది విడత చెల్లింపుల్లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,845 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు జమ చేయకపోవడంపై హైకోర్టు సీరియస్‌. నెల రోజుల్లో వాటిని జమ చేయాలని ఆదేశం.
 29. రాజధాని గ్రామాలలో శాంతియుత నిరసనలపై 144 సెక్షన్‌ విధించడంపై హైకోర్టు సీరియస్‌.
 30. రాజధాని గ్రామాలలో 144 సెక్షన్‌ విధింపుపై మరోసారి హైకోర్టు ఆగ్రహం. రాజధాని ప్రాంతంలో పోలీసుల భారీ కవాతు, ఆందోళనలో పాల్గొన్న మహిళలను బూటు కాలుతో తన్నడం, మగ పోలీసులు మహిళలను అరెస్ట్‌ చేయడంపై సీరియస్‌.
 31. రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాల విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసిన హైకోర్టు. ఈలోపు కార్యాలయాల తరలింపునకు చర్యలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు బాధ్యులవుతారు. ఖర్చుచేసిన సొమ్మును అధికారుల జేబు నుంచి రాబడతాం.
 32. విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామివారి దేవస్థానం ఈవో నియామక జీవోను తప్పబట్టిన హైకోర్టు. ఆ జీవోను రద్దు చేయాలని ఆదేశం.
 33. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు తదితర చర్యలు చేపడితే ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచి రాబడతాం.
 34. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయడానికి వీల్లేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులేస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది..? రెండు వారాల్లోగా రంగులు తొలగించాలి.
 35. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరమేమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. జగన్మోహన్‌రెడ్డి విపక్షనేతగా ఉండగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ అభ్యర్థనపై వైఖరి ఏమిటో చెప్పాలి.
 36. జీవీఎంసీ (గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌) ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు..?

  ఫిబ్రవరి

 37. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. రాజధాని వ్యవహారంపై పిషన్లు కోర్టు విచారణలో ఉండగా కార్యాలయాల తరలింపుకు ఎందుకంత తొందర..?
 38. పార్లమెంట్లో పీఎం ఫో లేదు. హైకోర్టులపై సీజే ఫోలూ లేవు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలపై ముఖ్యమంత్రి బొమ్మ ఎందుకు..?
 39. సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థల బకాయిలు 4 వారాల్లోగా చెల్లిస్తామని హామీనిచ్చి.. ఇప్పివరకు ఎందుకు చెల్లించలేదు..? ఏపీఎస్పీడీసీఎల్‌ను ప్రశ్నించిన హైకోర్టు.
 40. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీ రంగులా..? దీనిపై కేంద్ర వైఖరి తెలపాలి.
 41. ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదు. డిప్యుటేషన్‌ పై ఉన్న అధికారిని సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబ్టింది. కృష్ణ కిశోర్‌ ను వెంటనే ఐటీ శాఖలో చేర్చుకోవాలని ఆదేశించింది.
 42. ఎమర్జెన్సీని తలపిస్తున్న పోలీసులు – బీహార్ కన్నా ఏపీలోనే అక్రమ నిబంధనలు ఎక్కువయ్యాయి
 43. జీఎన్ రావు బోస్టన్ కమిటీల ఫైళ్లన్నీ అప్పగించండి.
 44. వన్ సైడ్ గేమ్ కుదరదు, రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఎలా ఇస్తారు?

  మార్చి

 45. 2018-19 ఉపాధి పథకం కింద కేంద్ర పభుత్వం విడుదల చేసిన రూ 1134 కోట్లను ఎందుకు పంపిణీ చేయమని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది
 46. ఫిబ్రవరి 27న విశాఖలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి  , సెక్షన్ 151 కింద నోటీసులు ఎలా ఇస్తారు?
 47. పేదల భూములు గుంజుకుంటారా? అసైన్డ్ భూముల్లో ఇళ్ల పట్టాలా? ఒకరి వద్ద తీసుకొని మరొకరికిస్తారా? – కెవిపిఎస్ రిట్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
 48. రాజకీయ రంగులొద్దు, పంచాయితీ భవనాలకు వైకాపా జెండాను పోలిన రంగుల్ని తీసేయంది, పార్టీలతో సంబంధం లేని రంగు 10 రోజుల్లో వేయండి, ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం.
 49. విశాఖలో చంద్రబాబు గారికి 151 సీఆర్పీసీ నోటీసు ఇవ్వడంపై హైకోర్టు సీరియస్. ఏ నిబంధన కింద సీఆర్పీసీ 151 అమలు చేశారో చెప్పాలని డీజీపీని ప్రశ్నించిన ధర్మాసనం. నోటీసు ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన హైకోర్టు.
 50. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వైకాపా నేతలు వ్యవహరించాని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినా.. వార్డు కార్యదర్శులు, వాలంటీర్లను వైకాపా ప్రచారం కోసం వినియోగిస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) పట్టించుకోకపోవడంపై హైకోర్టు సీరియస్. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తక్షణం స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.
 51. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూముల్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వవద్దని హైకోర్టు ఆదేశం. సీఎస్‌ సహా పలువురికి నోటీసులు.

 

7 COMMENTS

 1. […] ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు,  హైకోర్టులో వరస వెంట వరస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలకమైన నిర్ణయాలపై  కూడా, హైకోర్టులో అక్షింతలు పడుతున్నాయి. చివరకు డీజీపీ కూడా హైకోర్టుకు రెండు సార్లు స్వయంగా హాజరుకావల్సిన దురదృష్టకర పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వేసిన కేసులు ఇప్పటివరకూ సంచలనం సృష్టిస్తున్నాయి. విధానమండలి రద్దుకు వ్యతిరేకంగా గళం విప్పిన జంధ్యాల.. తాజాగా నిమ్మగడ్డ తొలగింపుపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వేసిన కేసులోనూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదిస్తున్నారు. గత 11 నెలలో జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులు, చేసిన వ్యాఖ్యల వివరాలివి… కోర్టు తీర్పులూ.. ఖాతరు చేయరా? […]

 2. […] కానీ, ఏపీలో ప్రభుత్వం ప్రతిసారీ గతి తప్పుతుండటం, కోర్టు తీర్పులను కూడా సవాల్ చేసే స్థితికి చేరడం, చివరకు కోర్టుల విశ్వసనీయతపై బురద చల్లించే అడ్డదారి ప్రయత్నాలు జరుగుతుండంతో.. ప్రతిసారీ కోర్టులు జోక్యం చేసుకుని అక్షింతలు వే సి, సర్కారు నిర్ణయాలకు కళ్లెం వేస్తున్న అనివార్య పరిస్థితి  ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చూస్తున్నాం. ఇప్పటివరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో వరస వెంట వరస కోర్టుల్లో ఎదురుదెబ్బలు తిన్న పాలకులు ఎవరూ లేరు. చివరకు ఆరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, ప్రజాభిమానం సంపాదించుకుని మహానేతగా అందరి గుండెల్లో నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జమానాలోనూ, ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదు. సహజంగా.. ఇలాంటి అవమానకర పరిస్థితిలో, సీనియర్ రాజకీయ నాయకులెవరైనా ముఖ్యమంత్రుల స్థానంలో ఉంటే, నైతిక బాధ్యత వహిస్తూ, తీర్పులపై మనస్తాపంతో వెంటనే రాజీనామా చేసి ఉండేవారు. కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్‌రెడ్డి! ఇదికూడా చదవండి.. కోర్టు తీర్పులూ.. ఖాతరు చేయరా? […]

 3. […] అంతేతప్ప.. తమకు వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారనే అక్కసుతో, తీర్పులిచ్చిన న్యాయాధికారులపై తమ అనుచరులు, భజన బృందాలతో  బురద చల్లించే దిక్కుమాలిన చండాలపు చర్యలకు, ఎప్పుడూ దిగిన దాఖలాలు స్వతంత్ర భారతావనిలో కనిపించలేదు. కాకపోతే, కొన్ని రాష్ట్రాల్లో కొందరు న్యాయాధికారుల వ్యక్తిగత జీవితాలపై కరపత్రాలు విడుదల చేయడం ద్వారా, వారిని అప్రతిష్ఠపాలు చే సే ప్రయత్నాలు జరిగాయి తప్ప..ఏపీలో మాదిరిగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారన్న అక్కసుతో, సోషల్‌మీడియాను అడ్డు పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేయడం.. దేశంలో ఎక్కడా, ఎప్పుడూ  జరగలేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి.. కోర్టు తీర్పులూ.. ఖాతరు చేయరా? […]

 4. […] అంతేతప్ప.. తమకు వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారనే అక్కసుతో, తీర్పులిచ్చిన న్యాయాధికారులపై తమ అనుచరులు, భజన బృందాలతో  బురద చల్లించే దిక్కుమాలిన చండాలపు చర్యలకు, ఎప్పుడూ దిగిన దాఖలాలు స్వతంత్ర భారతావనిలో కనిపించలేదు. కాకపోతే, కొన్ని రాష్ట్రాల్లో కొందరు న్యాయాధికారుల వ్యక్తిగత జీవితాలపై కరపత్రాలు విడుదల చేయడం ద్వారా, వారిని అప్రతిష్ఠపాలు చే సే ప్రయత్నాలు జరిగాయి తప్ప..ఏపీలో మాదిరిగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారన్న అక్కసుతో, సోషల్‌మీడియాను అడ్డు పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేయడం.. దేశంలో ఎక్కడా, ఎప్పుడూ  జరగలేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి.. కోర్టు తీర్పులూ.. ఖాతరు చేయరా? […]