జగన్ విజ్ఞానంపై సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు
ఇప్పటికే పారాసిటమల్, బ్లీచింగ్‌పై పేలుతున్న వ్యంగ్యాస్త్రాలు
నోరెళ్లబెడుతున్న వైసీపీ నేతలు
నాడు వైసీపీ.. నేడు టీడీపీ
(మార్తి సుబ్రహ్మణ్యం)
‘అభ్యాసము లేని రెడ్డి అందలమెక్కితే అటు ఇటు అయిందన్నది’ తెలుగు సామెత. ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమన్నట్లు…
ఏపీలో అధికార పార్టీలో ఉన్న ఏకైక మహా విజ్ఞాన ఖని, ఆ పార్టీ అధినేత- సీఎం జగన్మోహన్‌రెడ్డి విజ్ఞాన ప్రవాహం చూసి.. ఆ పార్టీ నేతలే నోరెళ్లబెడుతున్నారు. కరోనా అసలు ఎక్కడ నుంచి వచ్చిందో, శాస్త్ర పరిశోధన చేసి మరీ కనుగొన్న జగనన్న తెలివితేలు చూసి, తెలుగునేల పులకించిపోతోంది. ప్రపంచాన్ని ప్రమాదంలో పడేసి, వేల సంఖ్యలో శవాల గుట్టలను పడేస్తున్న కరోనా మహమ్మారి.. చైనా నుంచి పాకిందని, వూహాన్ నగరం నుంచి ప్రపంచానికి విస్తరించిందన్నది ఇప్పటివరకూ ప్రపంచ మేధావులు, శాస్త్రజ్ఞులకు ఉన్న అధికారిక సమాచారం. నమ్మకం కూడా. అసలు ఆ విషయాన్ని చైనానే అంగీకరించింది.

కానీ, 151 సీట్ల అద్భుత మెజారిటీతో అధికారం కైవసం చేసుకుని, సీఎం నేనా? ఎన్నికల సంఘమా? అని ప్రశ్నించిన ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. కరోనా అసలు, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందనే అంశంపై చేసిన పరిశోధనలో తేలిన నిజాలు విని, ప్రపంచమే నివ్వెరపోయింది. ఆ వైరస్..  సౌత్ కొరియా నుంచి వచ్చిందని జగనన్న ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన వైనంతో, ప్రపంచ దేశాల నేత్రాలు విప్పారాయి. ఇన్నాళ్లూ తాము ఆ వైరస్, చైనా, ఇటలీ నుంచి వచ్చిందన్న భ్రమలో ఉన్నామని…అయితే, జగనన్న చేసిన పరిశోధనలో, కరోనా వైరస్ సౌత్ కొరియా నుంచి పాకిందని చెప్పిన తర్వాత.. చైనా కూడా తాను పొరపాటున, తప్పు చేశానని తెగ మథనపడుతోందట.

కరోనాపై యుద్ధం ప్రకటించిన భారతదేశం.. అందులో సిపాయిల్లా పనిచేస్తున్న వైద్య, పోలీసు సిబ్బందికి సంఘీభావం ప్రకటించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు, యావత్ జాతి స్పందించింది. ఆ సందర్భంగా ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా, కరోనాపై కఠిన చర్యలే తీసుకుంది. వారం రోజుల పాటు జనాలను ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చింది. రోజువారీ ఆదాయంపై జీవించే బడుగు జీవులను ఆదుకునేందుకు..  వారికి ప్యాకేజీ కూడా ప్రకటించించి, అందరి అభినందనలు అందుకుంది. తెల్లరేషన్‌కార్డుదారుకు బియ్యం, కందిపప్పుతోపాటు, వెయ్యి రూపాయల ఆర్ధిక సాయం కూడా ప్రకటించింది. ఇది బక్క జీవులకు ఆర్ధికంగా చేయూతనిచ్చేదన్నది నిర్వివాదం. ఇన్ని రోజులు ఆదాయం కోల్పోయి, ఇంటిపట్టున ఉండే, అల్పాదాయ వర్గాలను ఆదుకున్న జగనన్నకు ఆయా వర్గాలు జేజేలు కొట్టారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు కూడా ఇలాంటి చేయూతనే ఇచ్చి, బడుగు జీవులను మెప్పించింది.

ఇప్పటికే పారాసిటమల్, బ్లీచింగ్‌పై పేలుతున్న వ్యంగ్యాస్త్రాలు

అయితే ఎటొచ్చీ, కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని, పరిశోధించి మరీ వెల్లడించిన వైనమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మొన్ననే.. పారాసిట్‌మల్, బ్లీచింగ్ పౌడర్‌తో కరోనాను తరిమివేయవచ్చన్న, జగన్ సూత్రీకరణపై సోషల్ మీడియాలో ఇంకా జోకులు పేలుతూనే ఉన్నాయి. ఇప్పుడు..కరోనా సౌత్ కొరియా నుంచి పాకిందన్న ఆయన వ్యాఖ్య, అంతకుమించిన స్థాయిలో పేలుతోంది.‘కేవలం కొరియాలో, సౌత్ కొరియాలో ఒక్కరికి వచ్చింది. ఆడ్నుంచి ప్రపంచమంతా ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది.సో ఎక్కడనుంచి స్టార్టయింది, ఒక్కడి నుంచి ఎలా ఎలా పోతా ఉందనేది ఈరోజు కూడా కతలు కతలుగా చూసుకుంటా ఉన్నాం. సూపర్‌కారియర్ అని చెప్పి రకరకాలుగా ఈపొద్దుటిక్కూడా చెబుతా ఉన్నాం…కొరియానా? చైనానా’ అని ప్రెస్‌మీట్‌లోనే వ్యాఖ్యానించిన జగనన్న వ్యాఖ్యలు, ఇప్పుడు సోషల్‌మీడియాలో బాంబుల మాదిరిగా పేలుతున్నాయి.

నాడు వైసీపీ.. నేడు టీడీపీ

గత అసెంబ్లీ ఎన్నికల ముందు.. వైసీపీ సోషల్ మీడియా విభాగం…నాటి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహా మంత్రులపై ఇలాంటి వ్యంగ్యాస్త్రాలే సంధించి, నెటిజన్లకు నవ్వులు పండించింది.
మంత్రుల ప్రమాణస్వీకారంలో దొర్లిన పొరపాట్లను పట్టుకుని,ఫుట్‌బాల్ ఆడింది.
ఇప్పుడు సేమ్ టు సేమ్.. టీడీపీ సోషల్ మీడియా వింగ్ కూడా, వైసీపీ విషయంలో  అదే పనిచేస్తోంది. హేమిటో.. ఈ కౌంటర్, ఎన్‌కౌంటర్లు?

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner