సర్వోన్నత..  సగౌరవ.. సంఘీభావ సంకేతం!

401

శబ్ధఘోషతో ప్రతిధ్వనించిన భారత్
సిబ్బందికి సలాం కొట్టిన జనత
ఏపీ,తెలంగాణలో పబ్లిక్ సెల్యూట్
ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్, ముంబయి
(మార్తి సుబ్రహ్మణ్యం)
సాయం ఐదుగంటల వేళ.. కర్ఫ్యూ వాతావరణంలో సేదదీరుతున్న దేశంలో ఒక్కసారిగా శబ్ద ఘోష! చప్పట్లు, ఘంటానాదం, శంఖారావాలతో భారతజాతి ప్రతిధ్వనించింది. చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ ఏకమై.. వయో-లింగ-కుల-మత-జాతి విబేధాలన్నీ ఆ శబ్దఘోషలో మాయమై.. సమైక్య సర్వోన్న సంఘీభావ స్వరాభిషేకం చేశారు. కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న సిబ్బందికి సంఘీభావం ప్రకటించారు.  ప్రధాని మోదీ పిలుపు మేరకు సర్వజనులు ఇళ్లపైకెక్కి, సిబ్బంది త్యాగానికి సెల్యూట్ చేశారు. ఇది భారతావనిలో నవశకం. యావత్ జాతి ఒక్కతాటిపైకొచ్చి.. సమైక్యరాగాన్ని, సమైక్య గళాన్ని ఆవిష్కరించిన తొలి దృశ్యంగా చరిత్రలో నిలిచిపోయింది.

కరోనాపై పోరాటం చేస్తున్న సిబ్బందికి బాసటగా నిలిచేలా.. ప్రధాని పిలుపు మేరకు, సాయంత్రం ఐదు గంటలకు యావత్ భారతదేశం చప్పట్లు, శంఖారావాలతో సర్వోన్నత సంఘీభావ సంకేతం ఇచ్చిన దృశ్యం, దేశచరిత్రలో తొలిసారిగా ఆవిష్కృతమయింది. ప్రధాని మోదీ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరకూ కొట్టిన చప్పట్లు.. అదే సమయానికి దేశం నలుమూలలా కోట్లాది చేతుల నుంచి వచ్చిన చప్పట్ల శబ్దాలతో, దేశం ప్రతిధ్వనించింది. ఈ శబ్దఘోష, ఈ సమైక్య శంఖారావం కరోనాపై క్షేత్రస్థాయిలో యుద్ధం చేస్తున్న వైద్య, పోలీసు సిబ్బందికి సంఘీభావం ప్రకటించాయి.
ప్రధానంగా తెలంగాణ సమాజం.. తామంతా ఒక్కటే. ఒకరికి ఒకరం. మనకోసం మనం.. జనం కోసం జనం.. అందరి కోసం  అందరం..అన్న సంకేతమిచ్చింది. కేసీఆర్ పిలుపును సగౌరంగా పాటించింది. ఇది జన విజయం.. ప్రభుత్వం సాధించిన ఘన విజయం! ఈ చప్పట్లే కరోనాకు కలవరం కలిగించే నిర్భయ హెచ్చరిక సంకేతం!!

1 COMMENT

  1. […] ప్రతి ఇంట్లో9 గంటల, తొమ్మిది నిమిషాల, తొమ్మిది సెకన్లకు 9 దీపాలు వెలిగిస్తే, ప్రతి దీపపు వెలుగు ఆకాశంలోకి విడుదల అవుతుంది. అప్పుడు నవగ్రహాలన్నీ  ఒకదానితో ఒకటి కలసి, ప్రయాగ అనే కక్ష్యలోకి వస్తాయి. దానివల్ల నవగ్రహాలు అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. అవి ప్రయాగ కక్ష్యలో తిరగటం వల్ల, ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగుల వల్ల, 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుంచి విముక్తులయి..  ఆ ఫోటాన్ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి అటామిక్ ఎనర్జీగా మారుస్తారు. అదే కరోనాను చంపుతుందన్నది శాస్త్రజ్ఞుల ఉవాచ. ఈ భావన నిజమయినా.. అబద్ధమయినా.. నమ్మకం లాంటిదయినా..  మూఢత్వమనుకున్నా.. ప్రజలు దీనిని త్రికరణశుద్ధితో పాటించి సమైక్యతను ప్రదర్శించటమే గొప్పతనం. జాతిజనులను ఏకం చేసిన ఘనత మాత్రం నరేంద్రుడిదే! శహభాష్ మోదీ!!ఇది కూడా చదవండి: సర్వోన్నత..  సగౌరవ.. సంఘీభావ సంకేతం! […]