కేసీఆర్‌కు టీడీపీ ప్రశంసలు

290

అభినందించిన సోమిరెడ్డి
పట్టు విడుపులుండాలని  వ్యాఖ్య
కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని జగన్‌కు హితవు
(మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన ప్రత్యర్ధి పార్టీ ప్రశంసించడం పెద్ద వార్తనే. తెలంగాణలో విపక్షాలన్నీ కేసీఆర్ నిర్ణయాలను దునుమాడుతుంటే, టీఆర్‌ఎస్ రాజకీయ ప్రత్యర్ధి అయిన తెలుగుదేశం పార్టీ మాత్రం, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించడం విశేషం. దీనికి కరోనా కేంద్రబిందువయింది.

అభినందించిన సోమిరెడ్డి

కరోనా వైరస్ నియంత్ర ణకు కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతోపాటు, ఆయన ప్రదర్శించే పట్టువిడుపుల విధానాన్ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఉమ్మడి రాష్ట్ర-ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్విట్టర్‌లో అభినందించడం చర్చనీయాంశమయింది. గతంలో కేసీఆర్ భాష నీచంగా ఉందని, తమ సీఎం చంద్రబాబు తెలంగాణకు ఏం అన్యాయం చేశారో చెప్పాలని  సోమిరెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్-చంద్రబాబు మధ్య పతాకస్థాయిలో యుద్ధం జరిగింది. ఆ సమయంలో బాబు పక్షాన నిలిచిన సోమిరెడ్డి,  తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శల దాడి చేశారు. అలాంటి సోమిరెడ్డి, ఇప్పుడు కరోనాపై యుద్ధప్రాతిపదికన తీసుకుంటున్న చర్యలను ప్రశంసించటం విశేషం.

కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని జగన్‌కు హితవు

ఈ సందర్భంగా పరోక్షంగా ఏపీ సీఎం జగన్ అనుసరిస్తున్న మొండివైఖరిని పరోక్షంగా ఎత్తిచూపి, కేసీఆర్‌ను నేర్చుకోవాలని హితవు పలికారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసైనా కొందరు నేర్చుకోవాలి. నేను.. నావల్లే జరగాలనుకునే ఇగోయిస్టులకు కేసీఆర్ పనితీరు కనువిప్పు కావాలి. ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే, పరిస్థితిని బట్టి సడలింపులు, పట్టువిడుపుల్లో ముందుంటారు. కరోనాను మొదట తేలిగ్గా తీసుకున్నప్పటికీ, ఆ తర్వాత దాని తీవ్రత తెలుసుకుని, ఎంత సీరియస్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారో చూస్తున్నాం. ప్రజల క్షేమం కోరుకునే ఏ నాయకుడికైనా ఈ లక్షణాలు ఉండాల్సిందే. కేసీఆర్ రాజకీయంగా ప్రత్యర్ధి అయినా, ఈ రెండు మాటలు చెప్పకతప్పడం లేదు’అని సోమిరెడ్డి మనస్ఫూర్తిగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ విషయంలో అటు సోమిరెడ్డి కూడా రాజకీయాలను పక్కకుపెట్టి మాట్లడినట్లే కనిపిస్తోంది.

నిజానికి కరోనాపై ముందు తేలిగ్గా మాట్లాడిన కేసీఆర్.. తర్వాత దాని తీవ్రత గ్రహించి, వెంటనే
యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.రాష్ట్రానికి ఆదాయం తెచ్చే బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు,
పబ్బులు, సినిమా థియేటర్లు మూసివేయించారు. ఇవన్నీ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరు.
మద్యం అమ్మకాలపై సీఎస్ స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే, కరోనా విపత్తు
రావడంతో, మద్యం ద్వారా ఖజానాకు ఆదాయం లభించే బార్లు, క్లబ్బులు, పబ్బులను ప్రజాక్షేమం కోసం మూసివేయలని నిర్ణయించడం, సాహసోపేత నిర్ణయమే.

తాను రాజకీయంగా ప్రత్యర్ధిగా భావించే బీజేపీ సారథి, ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూను,  బహిరంగంగా సమర్థించడం ద్వారా,
పట్టువిడుపులు ప్రదర్శించే నేతగా దర్శనమిచ్చారు. పైగా, ప్రధాని ఇచ్చిన పిలుపును ఎవరైనా విమర్శిస్తే, జైలుకు పంపిస్తామని హెచ్చరించడం
ద్వారా.. వ్యాధి నివారణ పట్ల ఉన్న చిత్తశుద్ధి, దానికోసం పోరాడుతున్న వ్యవస్థకు మద్దతు, రాజకీయాల్లో హుందాగా ఎలా ఉండాలో ఆచరించి మరీ
చెప్పటం అభినందనీయమే. నిజానికి రాజకీయంగా బీజేపీని వ్యతిరేకించే సీఎంలలో, మొదటి వరసలో ఉండే కేసీఆర్.. కావాలనుకుంటే, ప్రధాని
ఇచ్చిన పిలుపును పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేయవచ్చు. కానీ, కరోనాకు  తన రాష్ట్ర ప్రజలు బలికాకుండా ఉండేందుకు, ఆయన
ప్రధాని ఇచ్చిన పిలుపును స్వాగతించారు. బహుశా సోమిరెడ్డి కూడా..ఇలాంటి పట్టువిడుపులనే గుర్తించి, ట్వీట్ ద్వారా అభినందించి ఉండవచ్చు.

పట్టు విడుపులుండాలని  వ్యాఖ్య

ఇదే సమయంలో..  సీఎం జగన్ మొండి వైఖరిని కూడా ప్రస్తావించడం ద్వారా, కేసీఆర్ గొప్పతనాన్ని గుర్తుచేసినట్టయింది. ‘నేను. నా వల్లే జరగాలనుకునే ఇగోయిస్టులకు, కేసీఆర్ పనితీరు కనువిప్పు కావాలి. పరిస్థితులను బట్టి సడలింపులు, పట్టువిడుపుల్లో ముందుంటారు. ప్రజాక్షేమం కోరుకునే ఏ నాయకుడికైనా ఈ లక్షణాలు ఉండాల్సిందే’నని వ్యాఖ్యానించడం ద్వారా, జగన్‌లో అలాంటి లక్షణాలు లేవని సోమిరెడ్డి చెప్పకనే చెప్పినట్టయింది. జగన్ ఇగోయిస్టు అని సోమిరెడ్డి పరోక్షంగా దెప్పిపొడవం, ఆయన రాజకీయ మార్గదర్శి అయిన కేసీఆర్‌ను ప్రశంసించడం మరో విశేషం.

1 COMMENT

  1. […] కరోనాపై తమ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపైనా, నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వంటి విపత్తు సందర్భంలో, ప్రజల సౌకర్యాలపై డిమాండ్ చేయడం ఒక రాజకీయపార్టీగా  మంచిదేనంటున్నారు. అయితే, రాజకీయాలు పక్కకుపెట్టి ప్రభుత్వం ప్రకటించిన చర్యలను స్వాగతించి ఉంటే, హుందాతనంగా ఉండేదంటున్నారు. ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించకుండా, సాయంత్రం ఐదుగంటలకు చప్పట్లు కొట్టమన్న మోదీ నిర్ణయాన్ని అభినందించి, దానిని పాటించిన తాము.. ఎంతో కొంత సాయం ప్రకటించిన రాష్ట్ర  ప్రభుత్వాన్ని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాదిరిగా, తాము కూడా అభినందించి ఉంటే,  తమ గౌరవం పెరిగేదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో తమ రాజకీయ ప్రత్యర్ధి అయినప్పటికీ, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను సోమిరెడ్డి అభినందించడం ద్వారా, పార్టీ ప్రతిష్ఠ పెరిగిందని, అదే విధానాన్ని ఇక్కడ కూడా పాటిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు టీడీపీ ప్రశంసలు […]