మోదీ చెప్పారు..కేసీఆర్ పాటించారు!

296

మంత్రంలా పనిచేసిన మోదీ పిలుపు
ఇళ్లకే పరిమితమైన జనం
రెండు రాష్ట్రాల్లో రోడ్లన్నీ ఖాళీ
కుటుంబంతో గడిపిన మంత్రులు, ప్రముఖులు
రోడ్లలపై పోలీసుల పహారా
సంఘీభావం చాటిన తెలుగుప్రజలు
కేసీఆర్ పిలుపునకు అనూహ్య స్పందన
జయహో.. పోలీస్
(మార్తి సుబ్రహ్మణ్యం)

మంత్రంలా పనిచేసిన మోదీ పిలుపు

ఒక్క పిలుపు.. ఒకే ఒక్క పిలుపు.. ఉదయం నుంచి రాత్రి వరకూ బయటకు రావద్దన్న, ప్రధాని మోదీ పిలుపునకు యావత్ దేశం స్పందించింది. కరోనాపై యుద్దం చేస్తున్నాం. సహకరించమని ఆయన చేసిన అభ్యర్ధన ప్రభావం జనజీవితంపై పనిచేసింది. దండం పెడుతున్నా, దయచేసి ఇళ్లు కదలవద్దన్న తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునకు, తెలంగాణ సమాజం స్వచ్ఛందంగా స్పందించింది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. జనాలను రోడ్డెక్కనీయకుండా, పాపం పోలీసులు రోడ్డెక్కారు. ఆదివారం తమ కుటుంబాలకు దూరంగా, విధినిర్వరణ చేసిన పోలీసులను అభినందించాల్సిందే. అడ్డగోలుగా మాట్లాడే  వారికి, ఓపికగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన దృశ్యాలు హైదరాబాద్‌లో అనేక చోట్ల దర్శనమిచ్చాయి.

రెండు రాష్ట్రాల్లో రోడ్లన్నీ ఖాళీ

మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు ప్రభావం, జనాలపై పెను ప్రభావం చూపింది.  అటు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం, వరసగా మీడియా ద్వారా చేస్తున్న అభ్యర్ధనలకు, తెలంగాణ రాష్ట్రం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా నిత్యం కిటకిటలాడే ప్రాంతాలు, జనసమ్మర్ధంతో హడావిడిగా కనిపించే బస్తీలు కూడా, జనం లేక నిర్మానుష్యంగా కనిపించాయి. ఆదివారం కావడంతో జనం కూడా ఇంటిపట్టునే ఉండిపోయారు. ఎప్పుడూ జనం సమస్యలు, సమీక్షలు, విలేకరుల సమావేశాలు, పార్టీ సమావేశాలతో బిజీగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు, అధికారులు కూడా కుటుంబసభ్యులతో గడిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మనవడికి పాఠాలు చెప్పే మాస్టారు అవతారం ఎత్తారు. మంత్రి హరీష్,  తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్, ఎంపి సుజనాచౌదరి, ఎల్.రమణ, బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వంటి నేతలు.. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవటం, మహిళా మంత్రులు ఇంట్లో వంటలతో బిజీ అవటం  కనిపించింది.

ఒక ప్రధాని ఇచ్చిన పిలుపునకు దేశం ఈ స్థాయిలో స్పందించడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు కూడా, ఆయనను అనుసరించడం మరో విశేషం.
కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు, ప్రజలు స్వచ్ఛంద నిర్బంధం పాటించడమే మందన్న సందేశాన్ని.. జాతి మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి పాటించడం నిజంగా అద్భుతమే.
జనతా కర్ఫ్యూని విజయవంతం చేయడం ద్వారా, తెలంగాణ సమాజమంతా కలసికట్టుగా ఉందన్న సంకేతం పంపాలన్న కేసీఆర్ పిలుపునకు, ప్రజలు సానుకూలంగా స్పందించారు.
అవసరం ఉంటే తప్ప, ఎవరూ బయటకు వచ్చిన దృశ్యాలు కనిపించలేదు.

ఇదిలాఉండగా.. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో, మరో వారం రోజుల పాటు జనతా కర్ఫ్యూ పొడిగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అటు ఏపీ సీఎం జగన్ సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు. పొడిగింపుపై  సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా అనుమానితుల కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఏపీకి వెళ్లే మార్గాలు మూసివేయడం ద్వారా, మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమవుతోంది.[metaslider id=2209]