జగన్ వెంటే జనం!

582

మాస్‌కు పట్టని నిమ్మగడ్డ వ్యవహారం
కోర్టుల్లో ఎదురుదెబ్బలు పట్టించుకోని పల్లెజనం
విద్యావంతులు, పట్టణప్రాంతాల్లోనే ప్రభావం
తటస్థుల్లోనూ పెరుగుతుతున్న వ్యతిరేకత
మీడియా, సోషల్ మీడియా ప్రభావం పట్టణాలకే పరిమితం
పట్టణాల్లో బీజేపీకి పెరుగుతున్న సానుకూలత
నిమ్మగడ్డ వ్యవహారంలో బీజేపీ  పాత్ర ఉందన్న చర్చ
ఇళ్ళ పట్టాలిస్తే ఇక జగన్‌కు ఎదురే ఉండద న్న భావన
పథకాల లబ్థిదారులంతా జగన్ వైపే
 (మార్తి సుబ్రహ్మణ్యం)
ఒకవైపు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకూ వరస వెంట వరస అక్షింతలు. ఇంకోవైపు కేంద్రంలో రహస్య మిత్రుడిగా ఉన్న బీజేపీ, రాష్ట్రంలో శత్రువుగా మారిన తీరు. తెలుగుదేశం రాజకీయ పోరాటం, ఆరోపణలు సంగతి సరేసరి. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న వైనం. అయినా ఎవరినీ లెక్కచేయకుండా, రేషన్‌కార్డులు, పెన్షన్లు, పాత పథకాలన్నీ రద్దుల మీద రద్దుల నిర్ణయాలు. మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్‌పై,  బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు. దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. విపక్షాల మూకుమ్మడి దాడి. గవర్నర్‌కు ఫిర్యాదులు. మధ్యలో కేంద్ర హోం శాఖ జోక్యం. ఇంత ఉక్కిరిబిక్కిరిలోనూ, ఇన్ని వ్యతిరేక పరిణామాల్లోనూ జనం జగన్ వెంటే ఉండటమే ఆశ్చర్యం. అదెలాగో చూద్దాం..

చెక్కు చెదరని జగన్ ఓటు బ్యాంకు

ఇది ఆశ్చర్యమైనా నిజం. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఇదే. గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రద్దు చేసినా, స్వయంగా తన తండ్రి ఇచ్చిన పట్టాలను స్వాధీనం చేసుకుని మరొకరికి ఇస్తున్నా, రేషన్-పెన్షన్లకు కోత విధించినా..  గ్రామీణ ప్రజానీకంతోపాటు, రెడ్డి-దళిత, క్రైస్తవ-ముస్లిం వర్గాలన్నీ ఇప్పటికీ జగన్‌కు జైకొడుతుండమే ఆశ్చర్యం. ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం, యావత్ దేశాన్ని కుదిపివేయగా, దానిని కింది స్థాయి ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రధానంగా, వైసీపీ ఓటు బ్యాంకయిన దళిత, రెడ్డి, ముస్లిం వర్గాలు ఆ అంశానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీన్నిబటి, జగన్ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని స్పష్టమవుతోంది.  నిమ్మగడ్డ వ్యవహారంపై, జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన అంశంతోపాటు, హైకోర్టులో వస్తున్న వ్యతిరేక తీర్పులు కూడా ఆ వర్గాలకు ఏమాత్రం పట్టడం లేదు.

జగన్‌పై సానుకూలతకు ఇదీ కారణం..

జగన్ ప్రభుత్వం.. గత చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసినా, వ్యక్తిగతంగా ఆర్ధికంగా లాభించేలా ప్రవేశపెట్టిన  కొత్త పథకాలతో, ప్రజలు జగన్ సర్కారు పట్ల ఆకర్షితులవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా 2225 రూపాయల పెన్షన్‌ను వాలంటీర్లు,  ఇళ్లకు వెళ్లి మరీ ఇస్తుండటం, రేషన్‌షాపుల్లో గతంలో మాదిరిగా అవకతవకలు లేకపోవడం, ఇళ్ల పట్టాలకు అర్హుల పేర్లను ఇంటికి వచ్చి మరీ నమోదు చేసుకోవడం వంటి చర్యలు వారిని మెప్పిస్తున్నాయి. వీటికిమించి, అమ్మఒడి పథకం కింద మహిళలకు, నేరుగా డబ్బులిస్తున్న వైనం వారిని సంతృప్తిపరుస్తోంది. అయితే ఆ పథకం అందని వారు విమర్శలు కురిపిస్తున్నా, లబ్థిదారులు మాత్రం జగన్‌ను కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.  ఇవన్నీ జగన్ సర్కారుకు సానుకూల అంశాలే. కాగా త్వరలో 25 లక్షల ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు.. ప్రయత్నం ఫలిస్తే.. ఇక ఆయనకు తిరుగు ఉండదన్న భావన కూడా వ్యక్తం అవుతోంది.

జగన్‌కు దూరమవుతున్నది వీరే..

అయితే.. కేవలం పట్టణ ప్రాంతాలు, పత్రికలు, టీవీ చానెళ్లు చూసే వర్గాలతోపాటు, విద్యాధికులు, గత ఎన్నికల్లో ‘ఒకసారి జగన్‌కు అవకాశం ఇచ్చి చూద్దామని’ ఓటేసిన తటస్తులు మాత్రం.. జగన్ పరిపాలన, తీసుకుంటున్న నిర్ణయాలు, కొందరు మంత్రుల ప్రకటనలు, వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నట్లు ఉన్నట్లు కనిపిస్తోంది. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కూడా జగన్ సర్కారును ఆయా వర్గాలను దూరం చేస్తున్నాయి. ప్రధానంగా మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచక ప్రకటనలపై ఏవగింపుతో ఉన్నారు. అధికార పార్టీల నేతల విచ్చిల విడితనానికి సంబంధించిన వార్తలు, వీడియోలు వైసీపీని అప్రతిష్ఠ పాలుచేస్తున్నాయి. స్థానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా మాచర్లలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు చేసిన బహిరంగ దాడి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయింది. ఫలితంగా, రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలంటే వీధిరౌడీలన్న ముద్ర పడిపోయింది.  ఈ విషయంలో వారంతా గత ప్రభుత్వాలతో, జగన్ ప్రభుత్వాన్ని పోల్చుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఈ వర్గాలన్నీ టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం.
అంటే ఈ వర్గాలన్నీ ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఒకరకంగా తెలుగుదేశం పార్టీకి సానుకూల అంశంగానే అర్ధం చేసుకోవచ్చు.  వైఎస్ హయాంలో కూడా కాంగ్రెస్ నేతలు, ఈవిధంగా వ్యవహరించలేదన్న ఈ వర్గాల్లో భావన కనిపిస్తోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, శ్రీకాకుళం  వంటి జిల్లాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల విచ్చలవిడి ప్రవర్తన చూసి, గత ప్రభుత్వమే బాగుందనే అభిప్రాయానికి వస్తున్నట్లు క నిపిస్తోంది.

పట్టణాల్లో మెరుగవుతున్న బీజేపీ పరిస్థితి


కాగా, జగన్ సర్కారు పనితీరుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వర్గాలు.. బీజేపీ వైపు కొంతమేరకు మొగ్గు చూపిస్తుండటం  విశేషం. రాజధాని మార్పు,  రేషన్‌కార్డులు, పెన్షన్లలో కోత వంటి అంశాలపై, ఆ పార్టీ చేసిన పోరాటమే దానికి కారణ ంగా కనిపిస్తోంది. ప్రధానంగా, రాజధాని మార్పు, జగన్ సర్కారు ప్రజావ్యతిరేక నిర్ణయాలు, ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల పరిణామాలపై.. రాష్ట్ర అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలోని బీజేపీ చేసిన పోరాటాలు, పట్టణ ప్రాంతంలో ఆ పార్టీకి సానుకూలంగా మారుతున్నాయి. అసలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో, కేంద్రమే కీలకపాత్ర పోషించిందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడేవి కావని, నిమ్మగడ్డకు కేంద్ర బలగాల ర క్షణ లభించేది కాదన్న చర్చ పట్టణప్రాంతాల్లో  జరుగుతోంది. రాజధాని తరలింపులో టీడీపీ పోరాటాన్ని సమర్థిస్తున్న వారంతా, బీజేపీ పోరాటం ఫలిస్తేనే తమకు ఉపయోగమన్న భావనతో ఉండటం విశేషం.

జగన్ పట్టుదల వల్లే అప్రతిష్ఠ

అటు స్థానిక సంస్థల వాయిదాపై, జగన్ ఆవేశపూరిత వ్యవహారమే ఇంత రచ్చకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ వర్గాలు కూడా, ఇదే అభిప్రాయంతో ఉండటం విశేషం. కింది స్థాయి ప్రజలు, జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో లాభం చేకూరిన లబ్థిదారులు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే, తమకు పథకాలు అందవన్న భయంతోనయినా, వైసీపీకే ఓటు వేసే పరిస్థితి ఉంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్న ఆందోళన కూడా వారిలో ఉంది. అసలు తెలుగుదేశం పార్టీకి స్థానికంగా.. ఆర్ధిక, రాజకీయ లోపం, వైసీపీ ఎమ్మెల్యేల భయం కారణంగా చాలా ప్రాంతాల్లో, అభ్యర్ధులు కూడా లేని పరిస్థితి నెలకొంది. అలాంటిది అన్ని స్థానాలు గెలవాలన్న మొండి పట్టుదలతో, జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు లక్ష్యాలు నిర్ణయించడం వల్ల.. సానుకూల పరిస్థితి కాస్తా, ప్రతికూలంగా మారిందన్న అభిప్రాయం సొంత పార్టీలోనూ వ్యక్తమవుతుండటం విశేషం. అసలు జగన్ స్థానిక సంస్థలను పట్టించుకోకుండా, స్థానిక నేతలకు విడిచిపెట్టి ఉంటే, 90 శాతం విజయం వైసీపీకి అవలీలలగా సొంతమయ్యేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకు విరుద్ధంగా జగన్ ప్రతిష్ఠకు పోయి, తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టి..ప్రభుత్వం అప్రతిష్ఠ పాలయ్యే వరకూ వచ్చిందంటున్నారు.