ఐఏఎస్ సంఘం పనిచేస్తోందా? పడకేసిందా?

615

అధికారుల అవమానాలపై నిరసన ఏదీ?
అహ్మద్‌బాబు ఘటన మాదిరి స్పందన ఏదీ?
సీఎస్‌ను మార్చినా, ఎస్‌ఈసీని దూషించినా మాట్లాడరా?
జగన్ కు సంఘం భయపడుతోందా?
                  (మార్తి సుబ్రహ్మణ్యం)
ఆర్ట్ ఆఫ్ లివింగ్.. అంటే బతకనేర్చిన విద్యలో, రవిశంకర్‌నే మించిపోయిన ఏపీ ఐఏఎస్ అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది.సమస్య, అవమానాల ప్రాతిపదికన కాకుండా.. సందర్భం, పాలకులు, వారి మనస్తత్వం బట్టి స్పందిస్తున్న తీరే దానికి కారణం. ఏపీలో గత పది నెలల నుంచి ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వం చేతిలో ఎదుర్కొంటున్న అవమానాలపై వారు ఏర్పాటుచేసుకున్న.. ఐఏఎస్ అసోసియేషన్ ఇప్పటిదాకా, ఒక్క సందర్భంలో కూడా స్పందించకుండా, మొద్దునిద్ర పోతున్న వైఫల్యం చూస్తే, ఆ సంఘం జగన్‌కు భయపడుతున్నట్లు స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న వ్యక్తుల బట్టి స్పందిస్తున్న వారి ‘బతకనేర్చిన కళ’ విమర్శల పాలవుతోంది.

ఐఏఎస్‌ల పట్ల జగన్ సర్కారు అవలంబిస్తున్న లెక్కలేనితనం, సీనియర్ అధికారి, సాత్వికుడిగా పేరున్న   ఎల్వీ సుబ్రమణ్యంతో ఆరంభమయి, నిమ్మగడ్డ రమేష్ వరకూ చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీని, అర్ధాంతరంగా తొలగించిన వైనం విమర్శలకు దారితీసింది. ఆయనను తొలగిస్తూ ఒక జూనియర్ అధికారి ఇచ్చిన ఉత్తర్వులపై, ఇప్పటిదాకా ఐఏఎస్ సంఘం పెదవి విప్పలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరిట విడుదల కావలసిన ఉత్తర్వులన్నీ, సీఎస్ కంటే జూనియర్ అయిన మరో అధికారి ఇస్తూ, సీఎస్ హోదాను అవమానిస్తున్నా.. ఇంతవరకూ ఒక్కసారి కూడా,  ఈ విధానాన్ని సంఘం ఖండించిన పాపాన పోలేదు. తాజాగా జరిగిన రెండు ఘటనల్లోనూ, ఇద్దరు సాటి ఐఏఎస్ అధికారులకు నిర్నిరోధంగా అవమానం జరుగుతున్నా.. మునుపటిలా సంఘం ఒక్కసారి కూడా సమావేశమయి, దానిని ఖండించే ధైర్యం చేయలేదు.

ఏపీపీఎస్‌సీ చైర్మన్ భాస్కర్, మరో  అధికారి జాస్తి కృష్ణకిశోర్, తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ విషయంలో.. ప్రభుత్వం అవలంబిస్తున్న కక్ష సాధింపు ధోరణి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. కానీ, ఐఏఎస్ సంఘం మాత్రం దానిపై కనీసం ప్రభుత్వానికి, తమ అసంతృప్తి వ్యక్తం చేసే ధైర్యం కూడా చేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నిమ్మగడ్డ రమేష్‌ను స్పీకర్ తమ్మినేని సీతారాం నుంచి ఎమ్మెల్యే శ్రీనివాసులు వరకూ వాడు, వీడు,  కమ్మ వైరస్, కులగజ్జి వెధవ అనే పరుషపదజాలం వాడినా, ఐఏఎస్ సంఘం ఖండించకపోవడం బట్టి.. జగన్ సర్కారుకు ఐఏఎస్ సంఘం ఎంతగా వణికిపోతుందో స్పష్టమవుతోంది. తమ సంఘంలో ఇంత పిరికితనం  ఇప్పుడే చూస్తున్నామని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు.. సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు..  ఎల్వీ సుబ్రమణ్యం, ద్వివేదీపై విరుచుకుపడ్డారు. ఎల్వీ జగన్ కేసులో ఉన్నారని, ఆయన ఒక కోవర్టని ఆరోపించారు. ద్వివేదీ వద్దకు వెళ్లి, ధర్నా చేసిన సందర్భంలో,  ఆయనపైనా విరుచుకుపడ్డారు. దీనికి స్పందించిన ఐఏఎస్ అధికారుల సంఘం పెద్ద సంఖ్యలో కాకున్నా, కొద్దిమందితో సమావేశమయింది. బాబు తీరును ఆక్షేపించింది బాబుకు అనుకూలంగా ఉన్న అధికారులెవరూ, నాటి భేటీకి హాజరుకాలేదు.  అయితే, కోరం లేపోవడంతో ఆ సమావేశం అధికారికంగా రద్దయింది. ఐఏఎస్ సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఎల్వీని,  బాబు తూలనాడిన సందర్భంలో నాటి ఐఏఎస్ అధికారులెవరూ స్పందించకపోగా, అది తమకు సంబంధం లేని వ్యవహారంగా తేలిగ్గా తీసుకున్నారు. దానితో, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, అజయ్‌కల్లం వంటి అధికారులు తెరపైకి రావలసి వచ్చింది. అప్పుడు కూడా ఐఏఎస్ అధికారుల సంఘం, ఇదే భయంతో వెనుకంజ వేసింది.

తిరిగి అదే ఎల్వీని సీఎస్‌గా ఒక్క కలం పోటుతో తొలగించినా, సంఘం నోరు మెదపలేదు.అంతకుముందు, దివాకర్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో అక్కడికి వచ్చిన కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబును, నాటి  విపక్ష నేత జగన్ హెచ్చరించిన వైనంపై మాత్రం సంఘం ఒక్క తాటిపైకొచ్చింది.‘నేను సీఎం అయితే నీ అంతు చూస్తానని’ హెచ్చరించిన జగన్ తీరును ఖండించింది. ప్రజాప్రతినిధులు బాధ్యతగా మాట్లాడాలని కోరింది. బాధ్యత గల అధికారిని తూలనాడితే, రేపు సదరు అధికారి ఏవిధంగా పనిచేయగలరని ప్రశ్నించింది.కలెక్టర్‌పై నోరుపారేసుకున్న జగన్‌పై, తగిన చర్యలు తీసుకోవాలని నాటి ఐఏఎస్ సంఘం అధ్యక్షుడు పరీడా మీడియా సమక్షంలోనే డిమాండ్ చేశారు. ఆ ఘటనపై జగన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదయినా, దానిని కోర్టు వరకూ తీసుకువెళ్లకుండా సంఘం లౌక్యం పాటించింది.

ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్.. స్వయంగా తనకు ప్రాణహాని ఉందని, కేంద్రరక్షణ కల్పించాలని కేంద్రానికి లేఖ రాసిన వైనం సంచలనం సృష్టించింది. చివరకు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సైతం.. సివిల్ సర్వీస్ అధికారులను బెదిరిస్తే, కేంద్రం కూడా సహించదని స్పష్టం చేశారు. ఆయనను వేధించడం తప్పని తేల్చారు. ఒక కేంద్రమంత్రే ఆ విధంగా, ఏపీ అధికారికి జరుగుతున్న అవమానాలపై స్పందిస్తే… ఐఏఎస్ సంఘం మాత్రం, ఇప్పటివరకూ బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండటం విమర్శలకు దారితీస్తోంది.

అటు ఏపీపీఎస్సీ చైర్మన్ భాస్కర్‌ను సైతం, జగన్ సర్కారు వేధిస్తున్న వైనం తాజాగా మీడియా దృష్టికి వచ్చింది.ఆయన తనకు చాంబర్ ఇవ్వలేదని, కనీసం అటెండరు కూడా లేరని, తన పనులన్నీ కార్యదర్శి చేస్తున్నారంటూ, గవర్నర్‌కు లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది.ఇక కేంద్ర సర్వీసులకు వెళతామని చెప్పినా, వారిని పంపించకుండా, ఇక్కడ పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్న వైనంపై ఐఏఎస్ సంఘం ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నకు జవాబు లేదు.అహ్మద్‌బాబు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐఏఎస్ అధికారుల సంఘం.. ఎల్వీ సుబ్రమణ్యం, జాస్తి కృష్ణకిశోర్, నిమ్మగడ్డ రమేష్, భాస్కర్‌కు జరిగిన అవమానంపై నిరసన వ్యక్తం చేయకపోవడం బట్టి, సంఘం బతకనేర్చిన కళలో ఆరితేరిపోయిందని అర్ధమవుతోంది.సహజంగా ఐపీఎస్‌ల కంటే.. ఐఏఎస్‌లలోనే ఐక్యత ఎక్కువ అన్న ప్రచారం ఉంది. కానీ, రాష్ట్ర విభజన తర్వాత ఐఏఎస్ సంఘం కూడా రెండుగా చీలిపోయింది. అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా ఒక వర్గం, సరైన పోస్టింగులు దక్కని వారంతా ప్రభుత్వ వ్యతిరేకవర్గంగా చీలిపోయారన్న ప్రచారం ఉంది.

ఐపీఎస్ అధికారుల సంఘం సరేసరి..

ఇక ఐపీఎస్ అధికారుల సంఘం కూడా,  సాటి అధికారుల పట్ల సర్కారు అవలంబిస్తున్న తీరుపై స్పందిస్తున్న దాఖలాలు లేవు.కొంతమంది ఐపీఎస్‌లకు ఇప్పటివరకూ పోస్టింగులు, జీతాలు ఇవ్వని వైనాన్ని ప్రభుత్వం వద్దకు, ప్రతినిధి బృందంగా వెళ్లే ఆలోచన ఇప్పటివరకూ చేయలేదు.పోస్టింగుల వ్యవహారం పూర్తిగా ప్రభుత్వ ఇష్టమే అయినప్పటికీ..  ఐపీఎస్‌లు సంఘం ఏర్పాటుచేసుకున్నందున, వారి సమస్యలు ప్రభుత్వానికి విన్నవించే అవకాశం ఉంది.  దానిని  వినియోగించుకునే సంప్రదాయం కనిపించలేదు. ఈ విషయంలో ఐఏఎస్, ఐపిఎస్ సంఘాల కంటే.. ఎన్జీఓ, రెవిన్యూ, సచివాలయ సంఘాలే మెరుగుగా పనిచేస్తున్నాయన్న భావన ఉంది. వారిలో కూడా అనేక చీలికలు, విభేదాలు ఉన్నప్పటికీ.. బదిలీలు, పోస్టింగులు, ఇతర సమస్యలైపై కలసికట్టుగా వ్యవహరిస్తారు.అలాంటి ఐక్యత ఐపీఎస్ సంఘంలో,  కొన్ని దశాబ్దాల నుంచీ క నిపించడం లేదు. డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఎస్పీ స్థాయి అధికారి కోయ ప్రవీణ్‌తోపాటు మరికొందరికి ఇప్పటివరకూ పోస్టింగులు ఇవ్వకపోగా, ఏబీవీని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.‘సివిల్ సర్వీసెస్ అధికారుల జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిది. ఒక్క బాల్ సరిగ్గా ఆడకపోయినా అవుట్ కావల్సిందే’ అని గతంలో సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం చెప్పిన మాట నిజమేనేమో?!

1 COMMENT

  1. […] ఒక ఐఏఎస్ అధికారిణి తనకు పోస్టింగు ఇవ్వలేదన్న మానసిక ఆవేదనతో మృతి చెందిన వైనం, ఐఏఎస్ సంఘానికి కనువిప్పు కావాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమ సహచరులకు ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా అన్యాయం చేస్తుంటే, సీఎస్ వద్దకు వెళ్లి కనీసం నిరసన చెప్పే ధైర్యం కూడా లేకపోతే ఇక సంఘాలు పెట్టుకుని ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమ సహచర ఐపిఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా అవమానిస్తుంటే ఐపిఎస్ సంఘం కూడా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐఏఎస్-ఐపిఎస్‌లు ప్రభుత్వానికి కళ్లు చెవులు. మరి అలాంటి ప్రధాన అంగాలకే దిక్కులేకపోతే, వారికి ప్రాతినిధ్యం వహించే ఈ సంఘాలు ఎందుకు? మారోజుల్లో ఐఏఎస్‌లకు అన్యాయం జరిగితే ధైర్యంగా సీఎస్‌కు వద్దకు వెళ్లి నచ్చచెబితే, వారు వినేవాళ్లు. అవసరమైతే సీఎం దగ్గరకు వెళ్లి విషయం వివరిస్తే వాళ్లూ వినేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ సంఘాలు, సభ్యులు ఏదైనా పార్టీల్లోనే మాట్లాడుకుంటున్నార’ని ఐఏఎస్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఓ రిటైర్డ్ అధికారి  వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి.. ఐఏఎస్ సంఘం పనిచేస్తోందా? పడకేసిందా? […]