రేవంత్‌రెడ్డి ‘స్పీడు’కు కాంగ్రెస్‌లో అన్నీ ‘బ్రేకులే’
ఇప్పటికి తత్వం తెలుసుకున్న కొడంగల్ వీరుడు
కాంగ్రెస్‌లో రేవంత్‌ది ఒంటరి పోరాటమేనా?
(మార్తి సుబ్రహ్మణ్యం)
రేవంత్‌రెడ్డి.. రాజకీయాల్లో ఓ ఫిరంగి. ఓ తారాజువ్వ. మాటల మరాఠా. విషయ జ్ణానం చాలా ఎక్కువ. చిన్న వయసులోనే పెద్ద పెద్ద విషయాలు పుక్కిట పట్టిన యువనేత. తెలివితేటలు చాలా ఎక్కువ. అదే ఇప్పుడు ఆయన కొంపముంచుతోంది. ఆయనకు అన్ని పార్టీల నేతలతో సంబంధాలున్నాయి. ఎక్కడేం జరుగుతుందో వెంటనే సమాచారం వస్తుంది. సమాచార హక్కు చట్టాన్ని ఏవిధంగా వాడుకోవాలో ‘ఆయనకు తెలిసినంతగా’ మరెవరికీ తెలియదు. ప్రధానంగా.. ప్రగతిభవన్ విశేషాలు, టీఆర్‌ఎస్ అంత:పుర రహస్యాలు,  ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియవు. రేవంత్‌రెడ్డికి ఉన్న నెట్‌వర్క్ అలాంటిది. తెరవెనుక మతలబులు, తెరపై మెరుపులకు కారణాలేమిటో అయనకు కొట్టినపిండి. హరీష్‌రావు ప్రాధాన్యతను తగ్గించబోతున్నారని, కేటీఆర్‌ను అందలమెక్కించనున్నారని మొదట చెప్పింది రేవంత్‌రెడ్డే.  ఎవరు అవునన్నా, కాదన్నా తెలంగాణలో కేసీఆర్ తర్వాత, ఆ స్థాయిలో ఇమేజ్ ఉన్న నేత ఆయనే. తెలుగుదేశంలో ఆయన మాటే చంద్రబాబుకు వేదం. రాష్ట్ర విభజన త ర్వాత ఏపీలో ‘అనేక విషయాల్లో’ పలుకుబడి చూపిన నేత. నెల్లూరు వంటి జిల్లాల్లో.  స్థానిక నేతలను కూడా కాదని, రేవంత్ సిఫార్సు చేసిన పనులకు బాబు పెద్దపీట వేశారన్న చర్చ అప్పట్లో జరిగింది. కానీ కాంగ్రెస్‌లో చేరిన తర్వాతనే, రాజకీయాలంటే ఏమిటో తత్వం బోధపడుతోంది.
రాజకీయ వైకుంఠపాళిలో నిచ్చెనలతోపాటు, పాములూ ఉంటాయని, అవి ఎప్పుడు, ఏ రూపంలో బుసకొట్టి, కాటేస్తాయో రేవంత్‌రెడ్డికి,  కాంగ్రెస్‌లో చేరిన తర్వాత గానీ అర్ధం కాలేదు. కాంగ్రెస్‌లో జానారెడ్డి, జీవన్‌రెడ్డి, వి. హన్మంతరావు, సర్వే సత్యనారాయణ, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు  వంటి యోధానుయోధులు దశాబ్దాల నుంచి పార్టీకి సేవచేస్తున్నా, రేవంత్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కడమే పెద్ద ఆశ్చర్యం. నిజానికి ఆ పదవికి ఆయన అర్హుడే. ఎందుకంటే, తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకటి నుంచి పది వరకూ..  ఏ నాయకుడి పేరు చెప్పినా, వారి సభలకు వందమంది కార్యకర్తలు వస్తే మహా గొప్ప. అదే రేవంత్ సభలకు వందలు, వేలమంది విరగబడుతుంటారు. అదంతా రేవంత్ స్వయంకృషి అన్నది నిర్వివాదం. దానిని ఆయన కూడా ప్రమోట్ చేసుకుంటారు. చివరకు రాహుల్‌గాంధీ ప్రసంగానికి సైతం వినిపించని చ ప్పట్లు, ఈలలు రేవంత్‌రెడ్డి ప్రసంగానికి వినిపిస్తుంటాయి. దటీజ్ రేవంత్‌రెడ్డి. అంత రాజకీయ ఘనాపాఠీ అయిన రేవంత్, కాంగ్రెస్ రాజకీయాలను చాలా ఆలస్యంగా గ్రహించడమే వింత.
ఇండిపెండె ంట్‌గా రాజకీయాల్లో ఎల్‌కేజీ ప్రారంభించిన రేవంత్, తెలుగుదేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ వరకూ ఎదిగి, రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. చంద్రబాబుకు ఇష్టుడిగా, ఏం మాట్లాడితే ఆయనకు నచ్చుతుందో తెలిసి మాట్లాడి,  తెలుగుదేశం స్కూల్‌లో నెంబర్‌వన్ విద్యార్థిగా ఎదిగిన రేవంత్‌కు, కాంగ్రెస్‌లో చేరిన తర్వాతనే కష్టాలు ప్రారంభమయ్యాయి. తన సహచరుడైన వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకు, ఓటుకు నోటు కేసులో పట్టుబడి, ప్రధాన ముద్దాయిగా మారిన నాటి నుంచి.. నిన్నటి డ్రోన్ కేసులో అరెస్టవడం వరకూ అన్నీ సంచలనాలే. ఓటుకు నోటు కేసు నుంచి, డ్రోన్ కేసు వరకూ ఆయన జైలు జీవితం అనుభవించినా, రేవంత్ ఇమేజ్ చెక్కు చెదరలేదు. సూటిగా చెప్పాలంటే, కాంగ్రెస్‌లో ఇప్పుడు ఆయనే నె ంబర్ వన్ నేత.

అయితే, ఎటోచ్చీ కాంగ్రెస్‌లోనే ఆయనకు చుక్కెదురు.

మహామహులు, మహా ముదురు నేతలున్న కాంగ్రెస్‌లో, రేవంత్ అంటే పడని నేతల సంఖ్యనే ఎక్కువ. రాజకీయాల్లో చంద్రబాబు మాదిరిగా.. సెల్ఫ్ ప్రమోషన్‌లో నిష్ణాతుడైన రేవంత్ చేసుకునే, అతి ప్రచారమే దానికి కారణమని నేతల మాటల బట్టి స్పష్టమవుతుంది. తనను తాను ప్రమోట్ చేసుకోవటం, తాను తప్ప కాంగ్రెస్‌కు మరో గతి లేదన్న ప్రచారం చేసుకోవడం సీనియర్లకు రుచించడం లేదు. ఉదాహరణకు ఇటీవల జైలు నుంచి విడుదలైన తర్వాత,  రేవంత్‌ను సింహం, పులితో పోలుస్తూ విడుదలైన ఒక పాట, మిగిలిన వారికి మింగుడుపడటం లేదు. ఓటుకు నోటు కేసులో అరెస్టయి, విడుదల తర్వాత కూడా ఇలాంటి ప్రచారమే చేసుకున్నారు. అందుకే కేటీఆర్ ఫాంహౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించిన వ్యవహారంలో, అరె స్టయిన ఆయనకు సీనియర్ల మద్దతు కరవయింది. చివరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హన్మంతరావు, జగ్గారెడ్డి వంటి సీనియర్లు.. అదంతా రేవంత్‌రెడ్డి వ్యక్తిగత వ్యవహారంగానే తప్ప, పార్టీ వ్యవహారంగా తేల్చలేకపోయారు. రేవంత్‌రెడ్డి, పీసీపీ చీఫ్‌పై కన్నేయడమే దీనికి కారణమన్నది సుస్పష్టం.
చివరకు జైలులో సహచర ఖైదీలు కూడా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరామర్శకు ఎందుకురాలేదని, తనను ప్రశ్నించిన విషయాన్ని రేవంత్ బహిరంగంగానే వ్యక్తీకరించారు. నిజానికి సొంత పార్టీ ఎంపీ, అధికార పార్టీపై పోరాడుతుంటే దన్నుగా నిలవాల్సిన నైతిక బాధ్యత పార్టీ అధ్యక్షుడిదే. కానీ, ఆయన కూడా జైలులో ఉన్న నేతను పరామర్శించకపోవడమే కాంగ్రెస్ రాజకీయం, దౌర్భాగ్యం. దీన్నిబట్టి, రేవంత్ కాంగ్రెస్‌లో ఏ పరిస్థితిలో ఉన్నారో స్పష్టమవుతుంది. రేవంత్ జైలుకు కారణమయిన డ్రోన్ ఘటనను వీహెచ్, జగ్గారెడ్డి వంటి అగ్రనేతలు స్వాగతించలేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా, సహచరఎం.పీ అయిన రేవంత్‌ను అరెస్టు చేసిన వైనాన్ని, తమిళనాడు మహిళా ఎం.పీ మినహా.. ఉత్తమ్‌తో సహా, ఏ ఒక్క తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ప్రస్తావించలేదంటే, రేవంత్ కాంగ్రెస్‌లో ఎన్ని కష్టాలు పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
నిజానికి, రేవంత్‌కు కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ వద్ద పలుకుబడి ఉన్నా, రాజకీయ వైకుంఠపాళిలో ఆయన నిచ్చెనను లాగేసి, కాటేసే రాజకీయ సర్పాలు చాలా ఉన్నాయన్నది,  జైలుకు వెళ్లి తర్వాత గానీ గ్రహించలేకపోయారు. అనుభవమైతేగానీ, తత్వం బోధపడదంటే ఇదే. చాలాకాలం క్రితం.. టీడీపీలో ఉన్న రేవంత్, త్వరలో కాంగ్రెస్‌లో చేరుతున్నారని వార్త వస్తే, ఆయన నాపై అలిగారు. చివరకు అదే నిజమయింది కూడా. ఇలాంటి బలహీనతలు, మితిమీరిన అంచనాలే ఆయన వైఫల్యానికి ఓ కారణం.
సమర్ధులైన కాంగ్రెస్ నేతలు లేక, పట్టుమని పదిమంది జనాలను పోగుచేయలేని నాయకులు లేకపోయినా, ఇంట్లోనే ఓటేయని వారు లేకపోయినా.. కాంగ్రెస్‌లో అంతా నాయకులే. తెలంగాణలో చెల్లని రూపాయికి, ఢిల్లీలో గీతలెక్కువ. ఆ విషయం తెలిసి కూడా, అతిగా వెళ్లడమే రేవంత్ తప్పిదమని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. అతి చిన్న వయసులో వచ్చిన అవకాశాన్ని, అత్యుత్సాహంతో ఆయనే పోగొట్టుకుంటున్నారన్నది మెజారిటీ నేతల అభిప్రాయం. తెలంగాణలో ఇప్పటికీ కేసీఆర్‌కు ఏకైక ప్రత్యామ్నాయ నేత రేవంత్‌రెడ్డి అన్న విషయం ప్రజల్లో బలంగా ఉందన్నది బహిరంగ రహస్యం. కానీ, సొంత పార్టీలో సమన్వయం సాధించడం బదలు, తనను తాను ప్రమోట్ చేసుకునే తొందరలో, తాను తప్ప మిగిలిన వారు పనికిమాలిన వారన్నట్లు రేవంత్ వేస్తున్న తప్పటడుగులే, ఆయన కష్టాలకు కారణమని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner