రోజువారీ బతుకులకు ఆర్ధికభరోసా ఇవ్వరేం?
ఆర్ధిక ప్యాకేజీ ఇంకా  ప్రకటించని కేంద్రం
ఆదుకోవడంలో కేంద్రం కంటే రాష్ట్రాలే మిన్న
గంట-చప్పట్లు కొట్టడం ఆరోగ్యానికి మించిదే
(మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణకు, ప్రజలు ఒకరోజు స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడం, సాయంత్రం వరండాలోకి వచ్చి చప్పట్లు కొట్టాలని సూచించడం వంటి చర్యలు ప్రజలను చైతన్యవంతులను చేసేవే.  భారతదేశం కరోనా బారిన పడకూడదన్న ఆయన  చిత్తశుద్ధిని, అభినందించి తీరాల్సిందే. బీజేపీ రాజకీయ ప్రత్యర్ధి కేసీఆర్ సైతం మోదీ ఇచ్చిన పిలుపును త్రికరణ శుద్ధిగా పాటిస్తున్నారు. పైగా ప్రధానిని ఆక్షేపిస్తున్న వారిపై కన్నెర్ర చేసి, కేసులు పెట్టమని ఆదేశిస్తున్నారు.  వైరస్ వ్యాప్తిని అరికట్టడం, నియంత్రించడంలో భాగంగా మోదీ ఇచ్చిన పిలుపును ఆక్షేపించాల్సిన అవసరం గానీ, దానిపై రంధ్రాన్వేషణ గానీ చేయాల్సిన పనిలేదు. ఆయన ప్రసంగంలో కరోనా వైరస్ దేశానికి సోకకూడదన్న తపన, చిత్తశుద్ధి కనిపిస్తూనే ఉంది.

రోజువారీ బతుకులకు ఆర్ధికభరోసా ఇవ్వరేం?

అయితే, ప్రపంచంలో అతి పెద్ద రెండవ దేశమైన భారత్ పేదది. సంపన్న వర్గాల కంటే, మధ్య-దిగువ తరగతి ప్రజల సంఖ్యనే ఎక్కువ. అంటే ఏ రోజుకారోజు పొట్టపోసుకుని బతికే జీవులే అధికం. సరిగ్గా చెప్పాలంటే దేశంలో పావు భాగం తోపుడుబండ్లపై జీవిస్తోంది. భారత్ మార్కెట్లు అతి పెద్దవి. అదే భారత్ బలం.  వాటిపై ప్రత్యక్షంగా బతికే వర్గాలు కోట్ల సంఖ్యలోనే ఉంటారు. ప్రభుత్వం హటాత్తుగా ప్రకటించే ఇలాంటి  కర్ఫ్యూలు, అప్పటికప్పుడు తీసుకునే మూసివేత నిర్ణయాలు, వారి జీవనోపాథికి గొడ్డలిపెట్టు. ప్రత్యామ్నాయాలు చూపించిన తర్వాత  తీసుకునే ఎలాంటి నిర్ణయాలనయినా ప్రజలు కచ్చితంగా స్వాగతిస్తారు, సహకరిస్తారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఇప్పుడు, ప్రతి ప్రాంతంలో లోకల్ కూరగాయల మార్కెట్లు ‘మండీ’లుగా వెలిశాయి. అంటే రోజుకో చోట ఈ మండీలు పెడుతుంటారు.  సగటు జీవి మోండా వంటి పెద్ద మార్కెట్ల వరకూ వెళ్లకుండా, స్థానికంగా వ్యాపారులు పెట్టే కూరగాయల బండ్లమీద వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా, బోలెడు సమయం, డబ్బు ఆదా అవుతుంటుంది. ఈ చిల్లర కూరగాయల వర్తకులంతా, గ్రామాల నుంచో, పెద్ద మార్కెట్ల నుంచో వాటిని సేకరించి అమ్ముకుంటారు.

ఆదుకోవడంలో కేంద్రం కంటే రాష్ట్రాలే మిన్న

ఈ కరోనా ప్రభావం అలాంటి వారిపైనా పడుతోంది. పోలీసులు హటాత్తుగా మార్కెట్లకు వచ్చి,
తొలగించాలని ఆదేశించడంతో వారు కూరగాయలు అమ్ముకోకుండానే, అద్దెకు తీసుకువచ్చిన
వాహనాలతో వెనక్కి వెళ్లిపోతున్నారు. ఫలితంగా, చిన్న చిన్న చిల్లర దుకాణాల్లో లభించే
కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి. ఇది వారి జీవనోపాథికి పెను విఘాతంగా మారుతోంది.
అయితే, తెలంగాణ వరకూ అవసరమైతే ప్రభుత్వమే ఇంటింటికీ వెళ్లి రేషన్ ఇస్తుందని కేసీఆర్
చెప్పడం ప్రజలకు గొప్ప ఊరట.యుపిలోని యోగి సర్కారు,నేరుగా ప్రజల ఖాతాలకు నగదు
బదిలీని ప్రకటించింది. కేరళ ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, రేషన్ పంపిణీ, నిరుద్యోగ
భృతి అమలు కోసం 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ అమలు చేసింది. నిజానికి
కేంద్రమే, దిగువ తరగతి జీవుల ఆర్ధిక పరిస్థితి దెబ్బతినకుండా దేశవ్యాప్తంగా
ఒక ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తే బాగుండేది. కనీసం ఆ పని, కొన్ని రాష్ట్ర
ప్రభుత్వాలయినా చేస్తున్నందుకు సంతోషించాలి. అటు ప్రైవేటు కంపెనీ అయిన
హెచ్‌యుఎల్. కరోనాపై యుద్ధంలో భాగంగా.. వందకోట్ల రూపాయల సాయంతోపాటు,
2 కోట్ల విలువైన సబ్బులను ఉచితంగా అందిస్తోంది. శానిటైజరు, మాస్కులపై 15 శాతం రాయితీ ఇచ్చింది.

ఆర్ధిక ప్యాకేజీ ఇంకా  ప్రకటించని కేంద్రం

ఈ కరోనా కలకలం ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మరి అధికారులు
హటాత్తుగా తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల, వారు ప్రత్యక్షం-పరోక్షంగా కోల్పోయే ఆదాయం
మాటేమిటి? అన్న ప్రశ్నకు పాలకులు సమాధానం ఇచ్చి తీరాల్సి ఉంది. కరోనా వైరస్ సోకకుండా
ప్రభుత్వాలు తీసుకుంటున్న ముందు జాగ్రత్తలు తప్పుపట్టకపోయినా, దానివల్ల బడుగు జీవులు,
చిల్లర వర్తకులు కోల్పోతున్న ఆదాయానికి ప్రత్యామ్నాయం ఏమిటన్న దానిపై,కేంద్రం
ఇంతవరకూ ఆలోచించకపోవడమే విమర్శలకు దారితీస్తోంది. కరవు సమయాల్లో  ప్రత్యేక సాయం
చేస్తున్నట్లే,కరోనా వల్ల బడుగు జీవులు కోల్పోతున్న ఆదాయాన్ని,కేంద్రమే భర్తీ చేసే మంచిదన్న
సూచన వ్యక్తమవుతోంది. అంటే.. ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించి ఉంటే, బడుగు జీవులకు ఆసరాగా ఉండేదన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం.

ఈ విషయంలో పొరుగు దేశాలను అనుసరిస్తే మంచిదన్న సూచన వ్యక్తమవుతోంది. చైనాలో
వారం క్రితం వరకూ ఉన్న అతి పెద్ద టైర్ల ఫ్యాక్టరీ,  ఇప్పుడు మాస్కులు తయారుచేసే ఫ్యాక్టరీగా
మారిపోయింది. స్పెయిన్ తన దేశంలో ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను, జాతీయం చేసింది.
క్యూబా దేశం..  వైరస్ బాధితులు ఉన్న ఓడను తన దేశానికి చేర్చి, వారికి ఉచిత వైద్య
సేవలందించింది. అమెరికాలో కూడా ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే, పెయిడ్
హాలిడేస్ ఇచ్చేందుకు కావలసిన రాయితీ బిల్లును ఆమోదించింది. ఫ్రాన్స్ తమ ప్రజలకు చేతులు
కడుక్కునే శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేసింది.


నిజానికి వూహాన్ తర్వాత  రెండు నెలలకు, మన దేశంలో కరోనా అడుగుపెట్టింది. ఆలోగా మన
సర్కారు అప్రమత్తమయి ఉంటే బాగుండేది. అప్పుడే ముందు జాగ్రత్తలు తీసుకుంటే, ఈ పరిస్థితి
తలెత్తేద కాదన్నది మెజారిటీ ప్రజల అనిప్రాయం. అధిక జనాభా ఉన్న ఇంత పెద్ద దేశంలో
బాధితులకు గానీ, అనుమానితులకు గానీ చికిత్స చేసేందుకు, కనీసం పరీక్షలు చేయడానికి..
అవసరమైనన్ని ఆసుపత్రులు, ల్యాబ్‌లు ఉన్నాయా అన్నది ప్రశ్న. ఇప్పుడు ఏపీ వంటి రాష్ట్రాల్లో
పరీక్షలు చేసే నిపుణులు లేక, వాటిని ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. అలాంటి సౌకర్యాలు
ముందస్తుగా సమకూర్చితే, జనతా కర్ఫ్యూ మరింత అర్ధవంతంగా ఉండేది. అలా అని సర్కారు
సంకల్పాన్ని, విమర్శించడం కూడా సరికాదు. ప్రయత్నమనేది ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి.

గంట-చప్పట్లు కొట్టడం ఆరోగ్యానికి మించిదే

అన్నట్లు.. సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టడంపై, సోషల్ మీడియాలో రకరకాలుగా
వస్తున్న వ్యాఖ్యలు, వ్యంగ్యాలు పక్కకుపెడితే.. పెద్దలు చెబుతున్న ప్రకారం, ఆ సమయంలో
చంద్రుడు రేవతి అనే కొత్త నక్షత్రానికి వెళుతున్నాడు. గంట-చప్పట్లు  కొట్టడం వల్ల సంచిత
కంపనం శరీరంలో రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది. అందుకే దేవాలయాల్లో కూడా గంటలు
కొడుతుంటారు. 22న అమావాస్య. ఒకనెలలో చీకటిరోజు. అన్ని బ్యాక్టీరియా, వైరస్‌లు ఆరోజున
గరిష్ఠ సామర్ధ్యం, శక్తితో ఉంటాయి. ఒకేసారి కోట్లాదిమంది ప్రజలు ఆ సమయానికి చప్పట్లు
కొట్టడం వల్ల, షాంక్ నాడా మొదలైనవి వైబ్రేషన్లు సృష్టిస్తాయి. వైరస్ అన్ని శక్తులు కోల్పోతుంది.
పెద్దలు చెప్పిన ఈ మాటలు ఇప్పుడు అదే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

సందట్లో సడేమియా గాళ్లు ఎప్పుడూ ఉంటారు. పైగా మన దేశంలో కార్పొరేట్ నేరగాళ్ల సంఖ్య
ఎక్కువ. ఏదైనా ఉపద్రవం వస్తే దాన్ని సొమ్ము చేసుకోవడమే వారి పని. కరోనాపై ఎంత ప్రచారం
వస్తే, ఈ బాపతుగాళ్లకు అంత లాభం. అందుకే నకిలీ శానిటైజర్స్, మాస్కుల తయారీదారులు
తామరతంపరగా పుట్టుకొస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.  ఇక
కార్పోరేట్ ఆసుపత్రుల దోపిడీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా మహమ్మారి చికిత్స,
నివారణ బాధ్యత ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వాలనుకుంటున్న  సర్కారీ కొత్త ఆలోచన పెను
ప్రమాదం. అత్యంత పేదలున్న రెండో అతి పెద్ద దేశంలో, ఇప్పుడు కావలసింది ఉచిత వరాలు
కాదు. ఉచిత  వైద్యం, మందులు. అందుకే.. స్పెయిన్ తరహాలో మనదేశంలో కూడా అన్ని
ప్రైవేటు ఆసుపత్రులను జాతీయం చేస్తే సరి.  ఏదేమైనా కరోనాపై జాతీయ స్థాయిలో ప్రధాని
మోదీ, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ చేస్తున్న యుద్ధంలో కరోనా ఓడిపోతుందనే ఆశిద్దాం.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner