దశల వారీగా కరోన వైరస్ నియంత్రణకు చర్యలు

0
2

* సీఎం సూచన మేరకు వైద్యఆరోగ్య శాఖ పటిష్ఠ చర్యలు
* విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 12 వేల మందికి పరీక్షలు
* గత నెలలో ముందస్తు చర్యలు వలన కరోనా కేసుల నియంత్రణ
* డిప్యూటి సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని)
అమరావతి: రాష్ట్రంలో కరోన వైరస్ నియంత్రణకు ఇక నుంచి దశల వారీగా చర్యలు తీసుకుంటామని డిప్యూటి సిఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. సచివాలయంలోని ప్రచార విభాగంలో గురువారం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కరోన వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాలు కరోన వైరస్ వల్ల ప్రజలు మృతి చెందడాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. కరోన వైరస్ ఇతర దేశాల నుంచి వచ్చి రాష్ట్రంలోకి ప్రవేశించిన ఇద్దరికి సోకడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత నెలలో కరోన వైరస్ విస్తరిస్తున్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా ఏపీలో తక్కువగా కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికీ 13 కేసులు నమోదు అయిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కరోనా విషయంలో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అదుపులో ఉందన్నారు. దశలవారీగా వైరస్ వ్యాప్తిని నిరోధించే కార్యక్రమంలో భాగంగా విస్తృతచర్యలు తీసుకోవాల్సిన అవసరం గుర్తించి ఇప్పటికే అన్ని విద్యాసంస్ధలు మూసివేశామని, చర్యల కొనసాగింపులో భాగంగా సీఎం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. తొలి విడతలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. జనసమూహాలు అధికంగా ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చర్చిలు, మసీదులు (చిన్నచిన్నవి మినహాయిస్తూ) ఈనెల 31 వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గుళ్ళలో నిత్య పూజాకార్యక్రమాలు కొనసాగుతాయని, భక్తులను మాత్రమే అనుమతించమని, ఈ నిబంధన టీటీడీతో సహా అన్నింటికి వర్తిస్తుందన్నారు. కొన్ని రెస్టారెంట్లు, బార్లు, హోటల్స్, వ్యాపార సంస్ధలకు సేఫ్టీరూల్స్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కనీసం టేబుల్‌ కు టేబుల్‌కు మీటర్‌ దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రతను పాటించేలా అవసరమైన శానిటైజర్లు, హ్యండ్‌వాష్‌లు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవద్దన్నారు. పుణ్యక్షేత్రాలు సందర్శన, శుభకార్యాలు, ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదని, తప్పని సరిగా జరపుకోవాల్సిన కార్యక్రమాలైతే నిరాడబరంగా తక్కుమందితో చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు ఇళ్ళకే పరిమితమై ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవాలని కోరారు. రవాణాశాఖ కూడా మరీ ఓవర్‌ లోడ్‌ లేకుండా పరిమితమైన సంఖ్యలో ప్రయాణికులను చేరవేయాలని సూచించామన్నారు. ఐటీ ఎంప్లాయిస్‌ ఇంటివద్ద నుంచే పనిచేసేలా ప్రాధాన్యతనిస్తే బావుంటుందని వారికి కూడా సలహానిచ్చారు. అంతకు ముందు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులతో సిఎం జగన్ సమీక్షను నిర్వహించారని మంత్రి వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన సహకారం అందించాలని పిలుపునిచ్చారు.ప్రజలు తొలుత వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ సమాజ పరిరక్షణకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ప్రభుత్వం పూర్తిస్ధాయిలో చర్యలు తీసుకోవడం వల్లే ఏపీలో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రజల నుంచి సహకారం కూడా అవసరమని ఈ సందర్భంగా కోరారు. ప్రజలెవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ చర్యలకు ప్రజలందరూ సహకరిస్తే ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. వైరస్‌ వ్యాప్తిచెందకుండా విజయవాడలో ప్రత్యేకంగా ఎన్‌టీఆర్‌ యూనివర్శిటీలో నోడల్‌సెంటర్‌ ఏర్పాటుచేశామని వెల్లడించారు. ప్రతీ జిల్లాకు సంబందించి 360 మంది నోడల్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వస్తున్న జాబితాలో పేర్లు ఉన్న వారిని జిల్లా నోడల్‌ సెంటర్‌కు పంపిస్తూ 94 శాతం మందిని ఇప్పటికే గుర్తించామని తెలిపారు. ఇటీవల కేంద్రం అందించిన సమాచారంతో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన సుమారు 6 వేలమంది వివరాలతో పాటు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 6 వేల మందిని అదనంగా గుర్తించిందని మొత్తం 12వేల మందిని ఇప్పటిదాకా గుర్తించి వారికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్ పరిశీలనలో ఉంచామని తెలిపారు. గ్రామాల వారీగా 80 శాతంపైగా సర్వే చేసి, ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారా అని సర్వే చేశామని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించకపోతే ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. అవసరమైతే నిర్భందించడానికి కూడా వెనకాడం అని చెప్పడంతో సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో ఐసోలేషన్ వార్డులను విదేశాల నుంచి వచ్చిన వారికోసం ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాలనుంచి వస్తున్న వారికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడంతో పాటు 14రోజులు పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు తెలిపారు.ఎప్పటికప్పుడు విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారి వివరాలను అక్కడికక్కడే సేకరించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 90శాతం మందికి ఈ పరీక్షలు చేశామని ప్రకటించారు. రాష్ట్రంలో కోటి 34 లక్షల కుటుంబాలను గ్రామవాలంటీర్ల ద్వారా సర్వే చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఆశావర్కర్లు, ఏఎన్ఎం, గ్రామ సచివాలయ, వార్డు వాలంటీర్లు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో విజయవాడ, కాకినాడ, తిరుపతిలో ల్యాబ్‌లు పెట్టామని, రానున్న కొద్దిరోజుల్లో అనంతపురంలో కూడా పెడుతున్నామని తెలిపారు. జిల్లా ఆసుపత్రులు, టీచింగ్‌ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు, రూంలు కూడా ఏర్పాటు చేశామన్నారు, విశాఖ, తిరుపతి, గుంటూరులో కూడా మిగిలినచోట్ల కూడా ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. 85 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని దాదాపు 100 వెంటిలేటర్లు సిద్దం చేస్తున్నామని వివరించారు. ప్రచార ఆర్భాటం లేకుండా క్రమపద్దతిలో ప్రజలను ఆందోళనకు గురిచేయకుండా ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రణాళికబద్దంగా ప్రతీరోజు సీఎంఆదేశాల మేరకు సమీక్ష చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులంతా ముందుకెళుతున్నామన్నారు. ఈ క్రమంలో లేనిపోని అపోహలను, అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజలను భయాందోళనలకు గురిచేయద్దని ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సలహాలు, సూచనలు ఇవ్వాలని అంతే తప్ప బురదచల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. గతంలో ఆరోగ్యశ్రీ కి రూ.800 కోట్లు బకాయిలు ఉంటే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.500 కోట్లు బకాయిలను చెల్లించిందని గుర్తుచేశారు. కరోనా వైరస్‌ మాట వినపడినప్పటి నుంచి ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకున్నారని ప్రజలంతా జాగ్రత్తలు పాటించి సహకరించాలని కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మీడియా, ప్రజలు, రాజకీయ పక్షాల నాయకులు సహకారం అందించాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికే సినిమా థియేటర్లు, మాల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్ లు, భారీ వ్యాపార సంస్థలు, పార్కులు వంటి వాటిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామని ప్రకటించారు. ఆరోగ్యశాఖలో పని చేస్తున్న సిబ్బందికి ఎటువంటి అదనపు బాధ్యతలు అప్పగించవద్దని ప్రకటించామని పేర్కొన్నారు. ప్రచార ఆర్భాటం కన్నా ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి ముఖ్యమని డిప్యూటి సిఎం అన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డా.పీవీ రమేష్‌, సీఎంవో ప్రత్యేక అధికారి ఎం.హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here