హేమిటో.. జగన్ పాలిట ఈ ‘నిమ్మగడ్డ’లు

177

సెర్బియా జైలు నుంచి బయటకొచ్చిన నిమ్మగడ్డ ప్రసాద్
ఆయన విడుదల కోసం నాడు వైసీపీ ఎంపీల పాట్లు
ఇప్పుడు జగన్‌ను కలవరపెడుతున్న నిమ్మగడ్డ రమేష్
ఇద్దరూ జగన్‌కు నచ్చని కమ్మవారే
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సీఎం జగన్‌కు కమ్మ వారంటే  మహా ద్వేషం. వారంటే అస్సలు గిట్టదు. ఆ విషయాన్ని ఆయన సహా, వైసీపీ నేతల విమర్శలు చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. మరి వైసీపీలో కమ్మవారు లేరా అంటే.. చాలామంది ఉన్నారు. అందులో ‘ఎవడమ్మమొగుడు మంత్రి’గా పేరున్న కొడాలి నాని కూడా ఒకరు. మరి కమ్మవర్గంపై జగనన్నకు ఎందుకంత కసి, కోపం అంటే ఆ కథ వేరు.
జగన్ సీఎం అయిన తర్వాత, రాష్ట్రంలో ఆయనకు ఎదురులేదు. ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టే వారు లేరు. అధికారులు కూడా ఆయన చెప్పింది వినడమే తప్ప, మునుపటి మాదిరిగా తమ అభిప్రాయాలు చెప్పే ధైర్యం లేదు. ఇక పాపం మంత్రుల సంగతి సరేసరి. ఆరకంగా 151 మంది ఎమ్మెల్యేల భారీ సంఖ్యతో గెలిచిన ఆయన ప్రభుత్వ నావకు ఉన్నట్టుండి.. జగనన్న సహచరుడైన నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా దేశంలో అరెస్టు కావడం పెద్ద కుదుపు. ఆయన కూడా  కమ్మ వర్గానికి చెందిన వారే. జగన్ మీడియాలో పెట్టుబడి పెట్టినవారే. వాన్‌పిక్‌లో ముద్దాయి.

నిమ్మగడ్డ ప్రసాద్ కమ్మ వర్గానికి చెందిన వారయినప్పటికీ, తన శిబిరంలో ఉన్నందున.. ఆయనంటే సహజంగా ప్రేమ, అభిమానం. అందుకే, నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు అరెస్టు చేసిన వెంటనే, వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రి వద్దకు బృందంగా వెళ్లి, ఆయనను విడుదల చేయించే ఏర్పాట్లు చేయమన్నారన్నది, అప్పట్లో సంచలనం సృష్టించిన వార్త. అన్నట్లు…తాఋగా, సదరు నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా కోర్టు విడుదల చేసింది. ఇది జగన్‌ను సంతోషకరమైన వార్తనే. అయితే  హైదరాబాద్‌కు వచ్చిన నిమ్మగడ్డ..  క్వాలంటైన్‌లో ఉండి, కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. రేపో, మాపో జగనన్నను కలిసినా కలవచ్చు.
ఇక ఇంకో ‘నిమ్మగడ్డ’ తన చర్యలతో గత నాలుగైదు రోజుల నుంచి, జగన్ననకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈయనా కమ్మ వర్గానికి చెందిన వారే. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్, స్థానిక సంస్ధలను ఆరువారాల పాటు వాయిదా వేస్తూ, తీసుకున్న సంచలన నిర్ణయం జగనన్నకు కోపం తెప్పించింది. తనకు ఎదురుచెబితేనే సహించలేని ఆయనకు, తనకు వ్యతిరేక నిర్ణయం ప్రకటించిన నిమ్మగడ్డపై కోపం కట్టలు తెంచుకుంది. దానితో అసలు మీడియా ముందుకే రాకూడదని మహావ్రతం పట్టిన జగన్, చివరాఖరకు మీడియా ముందుకు రావలసివచ్చింది. ఆరకంగా నిమ్మగడ్డ వారే ఆయనను మీడియా ముందుకు వచ్చేలా చేశారు.
జగనన్న అభీష్ఠానికి వ్యతిరేకంగా నిర్ణయం ప్రకటించిన ఈ నిమ్మగడ్డ సారుపై, వైసీపీ దళాలు మూకుమ్మడిగా బూతులతో దండయాత్ర ప్రారంభించాయి. దానితో హడలిపోయిన నిమ్మగడ్డ.. తనకు ప్రాణరక్షణ ఉందని కేంద్రానికి మొరపెట్టుకోవడం, ఆ లేఖపై వైసీపీ ఎమ్మెల్యేలు కన్నెర్ర చేసి, ఆ లేఖ వ్యవహారాన్ని తేల్చాలని డీజీపీని కోరడం, ఆ లేఖ రాసింది నిమ్మగడ్డ సారేనని తర్వాత బయటపడటం, వెంటనే కేంద్రం రంగంలోకి దిగి, ఆయనకు సీఆర్పీఎఫ్‌తో రక్షణ కల్పించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈరకంగా తన వ్యాపార సహచరుడైన ఒక నిమ్మగడ్డ, సెర్బియా ఊచల నుంచి బయటపడటం జగనన్నకు మోదం కలిగిస్తే, ఇంకో నిమ్మగడ్డ తనను సవాలు చేసి,  పరువు తీయడం ఖేదం కలిగించింది. అలాంటి నిమ్మగడ్డల తీరును  చూస్తోంది ఈ తెలుగుగడ్డ!

1 COMMENT