అద్దంకి వైసీపీ ఇన్చార్జిగా కరణం వెంకటేష్?

620

గరటయ్య కుటుంబానికి కార్పొరేషన్ చైర్మన్ పదవి?
ఆమంచికి చీరాలలో పలుకుబడికి ఢోకా లేనట్టే
(మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు  చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం  బలరాం.. అత్యంత ఆప్తమిత్రుడు, సహచరుడు. అలాంటి కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకువచ్చి, బాబుకు షాక్ ఇచ్చిన వైసీపీ నాయకత్వం.. బలరాం కుమారుడైన వెంకటేష్‌కు, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.  రాజకీయాల్లో సమకాలికులు-మిత్రులైన చంద్రబాబునాయుడు-కరణం బలరాం బంధాన్ని విడగొట్టడంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో అద్దంకి సీటు ఆశించింన బలరామ్‌కు, చీరాల టికెట్ ఇవ్వడంతో పాటు, ఆర్ధికంగా పూర్తి స్థాయిలో దన్నుగా నిలిచిన టీడీపీకి, ఆయన కుటుంబం గుడ్‌బై చెప్పడం చర్చనీయాంశమయింది.స్వయంగా బాబు స్నేహితుడే పార్టీని వీడితే, ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటని పార్టీ సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాంకేతికంగా బలరాం వైసీపీ కండువా కప్పుకోకపోయినా, జగన్‌ను కలిశారు. ఆయన కుమారుడు వెంకటే ష్ మాత్రం కండువా కప్పేసుకున్నారు. అయితే, ఇప్పటివరకూ బలరాం తెలుగుదేశం పార్టీపైగానీ, వ్యక్తిగతంగా చంద్రబాబును గానీ విమర్శించకపోవటం గమనార్హం. వెంకటేష్ కూడా టీడీపీపై విమర్శలు చేయడం సరికాదని, నియోజకవర్గ అభివృద్ధి, వ్యక్తిగత కారణాలతోనే వైసీపీలో చేరినట్లు వెల్లడించారు. అయితే, కేవలం కొడుకు వెంకటేష్ రాజకీయ భవిష్యత్తు కోసమే బలరాం ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
నిజానికి..  కరణం కుటుంబం వైసీపీలో చేరడాన్ని, ఆపార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జీర్ణించుకోలేకపోతున్నారు.  ఆయనను పార్టీలో చేర్చుకుంటే, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆయనకే ఇస్తారన్నది ఆమంచి అసలు ఆందోళనగా కనిపిస్తోంది. బలరామ్‌కు ప్రజల్లో పట్టు, పలుకుబడి, మాస్ ఇమేజ్ ఉండటమే దానికి మరో కారణం. గత ఎన్నికల్లో ఆయన బలరాం చేతిలో ఓడిపోయినప్పటికీ, అధికారం వైసీపీది కావడంతో, నియోజకవర్గంలో పెత్తనం ఆమంచిదే. ప్రభుత్వం కూడా ఆమంచి సూచించిన అధికారులనే నియమించింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో, అభ్యర్ధులను కూడా ఆయనే ఖరారు చేశారు. తనపై విజయం సాధించిన కరణం బలరాంపై, ఆమంచి అనర్హత కేసు వేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కరణం చేరికపై ఆమంచి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికలిగించాయి. తాను ఉన్న పార్టీలో కరణం బలరాం చేరారని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై ఆగ్రహంతో ఉన్న ఆమంచిని.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శాంతింపచేసి, ఆయనను సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్లారు. ఆ సందర్భంగా తాను బలరాంను అద్దంకి నాయకుడిగానే భావిస్తానని, ఆ విషయంలో ఆందోళన చెందవద్దని జగన్ స్పష్టం చేసినట్లు ఆమంచి అనుచరులు చెబుతున్నారు. చీరాల విషయంలో ఇప్పటి మాదిరిగానే, ఆమంచి సిఫార్సులు కొనసాగుతాయని అభయం ఇచ్చినట్లు చెబుతున్నారు. అందుకే బయటకు వచ్చిన తర్వాత,  మీడియాతో మాడ్లాడిన ఆమంచి.. తాను-బలరాం కలసి పనిచేస్తామని వ్యాఖ్యానించడం విశేషం.
అయితే.. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా తాను ఉండగా, పోతుల సునీతకు ఎలా ఇన్చార్జి ఇస్తారని, ఆమంచి చేసిన వ్యాఖ్యను ఇప్పుడు బలరాం అనుచరులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి చీరాలకు సంబంధించి చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే తగిలింది. తన మిత్రుడైన బలరాం కుటుంబంతోపాటు, అంతకుముందు ఎమ్మెల్సీ పదవితోపాటు, రాష్ట్ర తెలుగుమహిళ అధ్యక్ష పదవి ఇచ్చిన పోతుల సునీత, గత ఎన్నికల ముందు టీడీపీలో ఉన్నప్పుడు అన్ని రకాల ఆదుకున్న ఆమంచి కృష్ణమోహన్.. అందరూ వైసీపీలో చేరడం బాబుకు శరాఘాతంగానే భావిస్తున్నారు.
కాగా, కరణం బలరాం కుటుంబం వైసీపీలో చేరిన నేపథ్యంలో, జిల్లాలో సమీకరణలు మారే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కమ్మ వర్గంతోపాటు, జిల్లాపై పట్టున్న బలరామ్‌ను పార్టీలో తీసుకుంటే, జిల్లాలో టీడీపీని బలహీనం చేయవచ్చన్న వైసీపీ నాయకత్వ వ్యూహం అనుగుణంగానే నిర్ణయాలు ఉండవచ్చంటున్నారు. ప్రకాశం నుంచి పార్టీలో ఇమేజ్ ఉన్న కమ్మ వర్గ నేత లేనందున, ఆ లోటును కరణం బలరాంతో భర్తీ చేయవచ్చన్నది నాయకత్వ వ్యూహమంటున్నారు. అందులో భాగంగానే.. కరణం వెంకటేష్‌కు, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను, సమర్ధవంతంగా ఎదుర్కొనే శక్తి కరణం కుటుంబానికే ఉందని, నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. గతంలో గొట్టిపాటి తొలుత వైసీపీ, తర్వాత టీడీపీలో చేరిన సందర్భంలో కూడా, బలరాం కుటుంబమే ఆయనను నేరుగా ఎదుర్కొంది. అయితే, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి.. ప్రస్తుతం పార్టీ ఇన్చార్జిగా ఉన్న గరటయ్య కుటుంబానికి, కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా, ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
కాగా.. వెంకటేష్‌కు అద్దంకి కంటే,  పర్చూరు ఇన్చార్జిగా ఇవ్వవచ్చని పార్టీలో మరో వర్గం చెబుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిష్క్రమణ తర్వాత, పర్చూరులో పార్టీ బలహీనపడిందని, నడిపించే నేతలు లేకుండా పోయారన్న ఆందోళన లేకపోలేదు. అక్కడ కరణం బలరామ్ అనుచర వర్గం, ఎక్కువ సంఖ్యలో ఉన్నందున.. పార్టీ పటిష్టత కోసం,  వెంకటేష్‌కు పర్చూరు ఇన్చార్జి ఇవ్వవచ్చని విశ్లేషిస్తున్నారు.