నిమ్మగడ్డకు భద్రతలో సర్కారు వైఫల్యం

197

సీఆర్పీఎఫ్ రాకతో దానిని అంగీకరించినట్లేనా?
భద్రత కల్పిస్తామని గట్టి జవాబు ఇవ్వలేకపోయిన వైనం
మాకు రాజకీయాలతో సంబంధం లేదన్న డీజీపీ
దేశ  చరిత్రలో ఇదో అసాధారణ నిర్ణయం
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారి. రాష్ట్ర స్థాయిలో జరిగే అన్ని ఎన్నికలకూ ఆయనే బాసు. ఆ సమయంలో సీఎం సహా అంతా, ఆయన ఆదేశాల ప్రకారం నడచుకోవలసిందే. అంత పవర్‌ఫుల్ అధికారి.. తనకు ప్రాణభయం ఉందని కేంద్రానికి మొరపెట్టుకోవడం ఒక షాకయితే.. అందుకు స్పందించి,  కేంద్ర బలగాలు సదరు అధికారికి ఆ రాష్ట్రంలోనే భద్రత ఇవ్వడం.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మరో తలవంపు. దేశంలో ఇలాంటి అసాధారణ చర్య, చరిత్ర ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయింది.
ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వారి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఒక రాష్ట్ర ఎన్నికల అధికారి,  స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాయడం, దేశంలో ఉన్న అధికారులను విస్మయపరిచింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయాన్ని స్వయంగా సీఎం తప్పు పట్టారు. సీఎం ఆయనా? నేనా? అని కన్నెర్ర చేశారు. ఆయనకు కులాన్ని ఆపాదించారు. ఇక దానితో సలహాదారులు, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు రెచ్చిపోయి, ఆయనను కులం పేరుతో తిడుతూ  వ్యక్తిగత దూషణకు దిగారు. స్పీకర్ సైతం దానినే అనుసరించారు. అధికార పార్టీ నేతలంతా ఆయనను  వాడు, వీడు అనే స్థాయికి వెళ్లారు.
దీనితో తన కుటుంబసభ్యుల భద్రత పరిస్థితి గ్రహించిన రమేష్, రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితిని వివరిస్తూ, కేంద్రహోం శాఖకు లేఖ రాయడం పెను సంచలనం సృష్టించింది. తనకు కేంద్రమే రక్షణ కల్పించాలని, హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతించాలని కోరారు. దానితో కేంద్రం స్పందించి, ఆయనకు రక్షణ పెంచింది. 1+1 నుంచి  4+4 గన్‌మెన్లు కేటాయించింది. సీఆర్పీఎఫ్ బలగాలు, ఆయన కార్యాలయం చుట్టూ మోహరించాయి.
అయితే.. తనకు కేంద్రం రక్షణ కల్పించాలన్న రమేష్ కుమార్ అభ్యర్ధనను అడ్డుకుని, తామే ఆయనకు రక్షణ కల్పిస్తామని చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర అధీనంలోని సీఆర్పీఎఫ్‌తో  రక్షణకు అంగీకరించడం, ప్రభుత్వ వైఫల్యంగానే భావించాల్సి ఉంటుందని పలువురు అధికారులు చెబుతున్నారు. ఒక అధికారి నుంచి ఇలాంటి అభ్యర్ధన వెళితే.. తామే ఆయనకు రక్షణ కల్పిస్తామని, ఆ విషయంలో మీ జోక్యం అవసరం లేదని సహజంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి గట్టిగా జవాబు ఇస్తుంది. కానీ, రమేష్‌కుమార్ విషయంలో అందుకు భిన్నంగా.. సీఆర్పీఎఫ్ రక్షణ, గన్‌మెన్ల సంఖ్య పెంపునకు అంగీకరించడం అంటే, రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయినట్లే భావించాల్సి ఉంటుందని సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఒక రాష్ట్ర స్థాయి అధికారికి, ఆ రాష్ట్ర పోలీసులు కాకుండా కేంద్ర బలగాలు రక్షణ కల్పించడమంటే, అది పోలీసు వ్యవస్థకూ ఇరకాటమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనివల్ల రాష్ట్ర పోలీసులపై, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికే నమ్మకం లేదన్న సంకేతాలు వెళతాయంటున్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌కే భద్రత లేనప్పుడు, ఇక ఎన్నికలకు భద్రత ఎక్కడిద ’ని మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించారు. ఎస్‌ఈసీ లేఖపై స్పందించిన కేంద్రం.. రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి భద్రత పెంచింది. గన్నవరం 39వ బెటాలియన్ నుంచి సీఆర్పీపీఎఫ్ బలగాలు అక్కడకు చేరుకున్నాయి.
ఈ పరిణామాలపై డీజీపీ గౌతం సవాంగ్ స్పందిస్తూ.. రమేష్‌కుమార్ భద్రతా వ్యవహారాలపై, తాము తెలంగాణ డీజీపీని అప్రమత్తం చేశామని చెప్పారు. తమకు రాజకీయాల వ్యవహారాలతో సంబంధం లేదని, భద్రతాపరమైన అంశాలకే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

1 COMMENT