కరోనాపై.. కేసీఆర్ ఇలా.. జగన్ అలా!

417

ముందే ప్రమాద ఘంటిక మోగించిన కేసీఆర్
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు, పార్కులు, మాల్స్, థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు మూత
ఏపీలో అసలు కరోనా పెద్ద సమస్యే కాదన్న జగన్
ఆలస్యంగా స్కూళ్లు, థియేటర్లు, మాల్స్ మూత
బార్లు, రెస్టారెంట్లు మాత్రం యధాతథం
కరోనా ప్రభావం లేదని సీఎస్ లేఖ
మరి లేకపోతే ఇన్ని జాగ్రతె్తలెందుకన్న వ్యాఖ్యలు
తెలంగాణ సర్కారు చర్యలపై హర్షం
ఏపీలో కనిపించని వైద్య శాఖా మంత్రి
(మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా నివారణ-ప్రత్యామ్నాయ చర్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైఖరి, నిర్ణయాలు తలా ఒక రకంగా కనిపిస్తున్నాయి. తొలుత కరోనాపై అవగాహన లేక మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్, తర్వాత వాస్తవాలు గ్రహించి కరోనాపై యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న చర్యలు దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా మారాయి. ఆయన నిర్ణయాన్నే అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం.. అసలు కరోనా పెద్ద సమస్యనే కాదనడం, సీఎస్ కూడా నాలుగువారాల పాటు కరోనా ప్రభావం ఉండదని ధీమా వ్యక్తం చేయడం, విమర్శలకు దారితీసింది. కరోనాపై కలవరపడాల్సిన పనిలేదు, అసలు అది మా రాష్ట్రానికే రాదన్నట్లు మాట్లాడిన ఏపీ అధికారులు, ఆలస్యంగా మేల్కొని నివారణ చర్యలు ప్రారంభించడం బట్టి..కరోనాపై  ఏపీ సర్కారు వైఖరి ఏమిటో స్పష్టమవుతోంది.
కరోనా అనుమానిత కేసులు పెరగకుండా, తెలంగాణ సర్కారు యుద్ధ ప్రాతిపదిక న తీసుకుంటున్న చర్యలు ప్రజలను మెప్పిస్తున్నాయి. ఆదాయం కోల్పోతామని తెలిసినప్పటికీ..  బార్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, పబ్బులు, క్లబ్బులు, మాల్స్‌ను మూసివేయాలని నిర్ణయించింది. గచ్చిబౌలి, అమీర్‌పేట ప్రకృతి చికిత్సాలయాలను క్వారంటైన్లుగా మార్చింది. స్కూళ్లు, కాలేజీలను ఎప్పుడో మూసివేసింది. చివరకు భ ద్రాచలం రామాలయంలో వేడుకలను కూడా, కేవలం అర్చకస్వాములకే పరిమితం చేసింది. అవసరం ఉంటే తప్ప ప్రజలను బయటకు రావద్దని, కేసీఆర్ స్వయంగా పిలుపునిచ్చారు. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నిరంతరం వైద్యశాఖ పర్యవేక్షణ, ఆసుపత్రుల పరిశీలనలోనే మునిగిపోయారు.
కానీ ఏపీలో మాత్రం కరోనాపై, ముందు జాగ్రత్తల  విషయంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా సీఎం జగన్, కరోనాపై పానిక్ బటన్ నొక్కాల్సిన పనిలేదని, పారాసిట్‌మల్, బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందన్న వ్యాఖ్యపై దేశవ్యాప్తంగా  విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తాయి. మనం ఇంత ఆందోళన చెందితే, విదేశాల్లో ఉన్న మన వారిని వెనక్కి పంపిస్తారని సెలవిచ్చారు. అయితే, ఆయన గత రెండు రోజుల నుంచి వైద్యశాఖపై  సమీక్షలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ తరహాలో ఎక్కడా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నట్లు లేదు. క్వారంటైన్లు ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు.
గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కడప వంటి జిల్లాలకు చెందిన చాలామంది గల్ఫ్‌లో పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వారిలో కొంతమంది ఇటలీలో నివసిస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, ముందు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. తాజాగా ఒంగోలులో,  కరోనా పాజిటివ్ కేసు నమోదయిన వ్యక్తికి పహారా కాస్తున్నారు. తిరుమల నడక దారి, రెండు ఘాట్ రోడ్లు మూసివేయడంతోపాటు, దర్శనాలు రద్దు చేశారు. శ్రీశైలం దేవస్థానం కూడా అన్ని సేవలు రద్దు చేసింది. వాస్తవ పరిస్థితి ఇలా  ఉంటే.. నాలుగు వారాల పాటు కరోనా ప్రభావం ఉండదని, ఆ తర్వాత పరిస్థితి చెప్పలేమని స్వయంగా సీఎస్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం చూస్తే.. కరోనాపై ఏపీ సర్కారు, ఎంత సీరియస్‌గా ఉందో స్పష్టమవుతోంది. సీఎస్ రాసిన లేఖపై విపక్షాలు విమర్శలు కురిపించాయి.
అసలు కరోనా ప్రభావమే, నాలుగు వారాల పాటు ఉండదని సీఎస్ ధీమా వ్యక్తం చేస్తే.. మరి సర్కారు ఒక్క రోజులోనే ఇన్ని ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకుందన్నది ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కరోనాపై దేశం యావత్తూ కలవరపడుతోంది. ప్రధాని, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, తెలంగాణ సీఎం, వైద్యశాఖ మంత్రి రోజూ మీడియాముందుకొచ్చి, కరోనాపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. కానీ ఇప్పటివరకూ ఏపీ వైద్యశాఖ మంత్రి నాని మాత్రం ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం. దీనిపై విమర్శలు రావడంతో, ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చిన ఆయన.. తెలంగాణ తరహాలో బార్లు, క్లబ్బులు, రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు మాత్రం ప్రకటించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేశామని, ఈనెల 31 వరకూ థియేటర్లు, మాల్స్‌ను మూసివేయాలని ఆదేశించారు. ఏపీలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయని ప్రకటించారు. విజయవాడ, కాకినాడ, తిరుపతిలో ల్యాబ్‌లు, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు.
ఓ వైపు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసలు కరోనా ప్రభావమే లేదన్నట్లు మాట్లాడుతుండటం, మరోవైపు వైద్య శాఖ మంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం,  గందరగోళంగా మారింది. కరోనా నివారణ-ప్రత్యామ్నాయ చర్యలపై ఏపీ సీఎం జగన్.. తన రాజకీయ మార్గదర్శి, కేసీఆర్‌ను అనుసరిస్తే మంచిదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.