స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చే ఏడాదే!

259

-భోగాది వేంకట రాయుడు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వాయిదా పడిన స్థానిక సంస్థలు ఎన్నికలు.. ఇక 2020 లో జరగక పోవచ్చు. ఇప్పుడు ఉన్న స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పదవిలో ఉండగా ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించక పోవచ్చుననేది ఒక అంచనా. ఈ ఎన్నికల ఈసారి నిర్వహణ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తో చర్చించిన అనంతరమే నిర్ణయించాలని సుప్రీం కోర్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించిన నేపథ్యం లో….ఈ సారి ఎన్నికల షెడ్యూల్ ను ఏకపక్షం గా నిర్ణయించలేదు.
దీనికి తోడు, కరోనా పేరిట ఈ ఎన్నికలు వాయిదా పడినందున…దేశానికి కరోనా ముప్పు తొలిగిందని కేంద్రం ప్రకటించేవరకు స్థానిక ఎన్నికలు ఉండకపోవచ్చు. అయితే..కరోనా అనేది ఇప్పట్లో సమసిపోయే అవకాశం లేదని ప్రధాన మంత్రే స్వయంగా ప్రకటించారు. అందువల్ల…ఆరు వారాలకే వాయిదా అనుకున్న స్థానిక ఎన్నికల పోరు…ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడినట్టుగా భావించవచ్చు.
ఈలోగా….మొన్నటి ఎన్నికల విధ్వంసకాండ ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటుకు తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోమ్ శాఖ కార్య దర్శికి రాసిన లేఖను ప్రతిపక్షాలు గట్టిగా వాడుకుంటున్న వాతావరణం కనిపిస్తున్నది. గవర్నర్ వ్యవస్థ లో గత రెండు, మూడు రోజులుగా కనిపిస్తున్న చలనం కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నది. పగటిపూటకూడా నిశ్చలంగా ఉన్నట్టు కనపడే రాజభవనం… 19 వ తేదీన రాత్రి పొద్దుపోయేవరకు కూడా రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కాస్తంత హడావుడిగా ఉండడం విశేషమే.ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందం అటు వెళ్ళగానే…ఇటు డీజీపీకి, సీ ఎస్ కు, ముఖ్యమంత్రికి కళ్ళూ..చెవులుగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ కు రాజభవన్ నుంచి కబురు వెళ్లడం…నిముషాలలో వారు వాలిపోవడం లో ఏదో విశేషం ఉంది. అది ఏమిటనేది తెలియడానికి కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది.
ఇక స్థానిక ఎన్నికల విషయానికి వస్తే, 2020 లో ఇవి ఉండక పోవచ్చునని భావించడానికి బలమైన కారణమే ఉంది. ఆ మాటకు వస్తే, 2021 ఏప్రిల్ లోపు కూడా జరగక పోవచ్చు.
1.ప్రస్తుత ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్; ప్రభుత్వం కూడా కత్తులు దూసుకుని ఎదురెదురు నిలబడ్డారు. 2. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించలేదు.
3. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికలకు ముందు నెలరోజుల పాటు ఎన్నికల కమిషన్ నియంత్రణలోకి వెళ్లడాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే రాజకీయ నాయకత్వం అంగీకరించే అవకాశమే లేదు.
4. ఈ కారణాలు అన్నీ ఒక ఎత్తు అయితే…ప్రస్తుత ఎన్నికల కమీషనర్ 2021 మార్చ్ 31 న పదవీ విరమణ చేయాల్సి ఉంది. 2016 ఏప్రిల్ 1 న ఆయన ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
2021 ఏప్రిల్ 1 న కొత్త కమీషనర్ పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి విశ్వాసం లోకి తీసుకోదగిన ఓ ఐ ఏ ఎస్ అధికారే ఈ పదవి చేపడతారనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.
అప్పుడు,’తాపీగా’ఎన్నికలు నిర్వహించుకోవచ్చునన్న అభిప్రాయానికి రాష్ట్రప్రభుత్వం రావచ్చుననేది ఒక అంచనా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేసిన తరువాత…ఈ పదవిలోకి ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న పదవీ విరమణ చేసిన ధనుంజయ రెడ్డి అయినా రావచ్చు, లేదా- ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్న అజయ్ కల్లామ్ అయినా రావచ్చు.
అలాగ జరిగితే, స్థానిక ఎన్నిక నిర్వహణ కోసం ఏర్పాటైన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు తొలి కమీషనర్ గా నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ఎలక్షన్ కూడా నిర్వహించకుండా పదవీ విరమణ చేసే కమీషనర్ గా మిగిలిపోతారు. ఆయన ఈ పదవిలోకి రావడానికి ముందుగానే…రాష్ట్రంలో ఎన్నికలు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిపోయాయి.అందువల్ల, నిమ్మగడ్డ రమేషకుమార్ కు ‘అసలైన పని’పడలేదు.
అలా కాకుండా ,ఆయన హయాం లోనే స్థానిక ఎన్నికలు జరగాలి అనుకుంటే…రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలి.ఈ క్షణాన అది సాధ్యం అని అనిపించడం లేదు.ఎందుకంటే…కూడికలు, తీసివేతలలో కేంద్రం లెక్కలు కేంద్రానికి ఉంటాయి కదా! మన లెక్కల్లో… రెండు రెళ్లు నాలుగే కానీ…; కేంద్రం లెక్కల్లో అయిదైనా కావచ్చు. మూడైనా కావచ్చు. చూద్దాం…కేంద్రం లెక్కలు ఎలా ఉంటాయో..!!

1 COMMENT