నాడు సీబీఐ విచారణ కోరిన విజయమ్మ
రిలయన్స్‌పై ఆరోపణలు కురిపించిన జగన్, వైసీపీ నేతలు
మొన్ననే రిలయన్స్ నత్వానీకి రాజ్యసభ సీటు
ఇప్పుడు రిలయన్స్‌పై దాడుల కేసు ఎత్తివేత
అందుకు అంబానీ అంగీకరించారా?
 రిలయన్స్ స్పందిస్తుందా? లేదా?
మరి వైఎస్‌ది ప్రమాద ఘటనేనా?
                      (మార్తి సుబ్రహ్మణ్యం)
మహానేత, జనహృదయ నేత, కోట్లాదిమంది బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్యమైన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకస్మిక మృతి వెనుక, వైఎస్ కుటుంబం గతంలో ఆరోపించినట్లు రిలయన్స్ హస్తం లేనట్లేనా? సీబీఐ, సిట్టింగు జడ్జితో విచారణ అవసరం లేదా? ఆయన ప్రమాద ఘటనలోనే మృతి చెందినట్లు, ఇప్పుడు ఆయన కుటుంబం భావిస్తోందా? రిలయన్స్ కంపెనీ ప్రముఖుడు పరిమళ్ నత్వానీకి, రాజ్యసభ సీటుతో వారిద్దరి మధ్య పాత పగలు చల్లారినట్లేనా? అందుకే రిలయన్స్ షాపులపై నాటి కేసులను జగన్ సర్కారు తొలగించిందా? మరి దానిపై రిలయన్స్ స్పందించి కోర్టుకెక్కుతుందా? లేక వ్యూహాత్మక మౌనం పాటిస్తుందా? ఇటీవల రిలయన్స్‌కు సంబంధించి చోటు చేసుకున్న  కీలక ఘటనలు ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలనే తెరపైకి  తెస్తున్నాయి.

హెలికాప్టర్ దుర్ఘటనలో అశువులు బాసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక  మరణం, కోట్లాదిమంది అభిమానులను శోకసముద్రంలోకి నెట్టింది. ప్రత్యర్ధులు సైతం ఆయన మృతి పట్ల ఖిన్నులయ్యారు. ఆయన నిర్ణయాల వల్ల లబ్థిపొందిన కోట్లాదిమంది బడుగు,బలహీన, గిరిజన, దళిత, మైనారిటీ వర్గాలు.. ఆయన ఫొటోను ఇళ్లలో పెట్టుకుని పూజిస్తున్నారు. అలాంటి మహానేత మరణం వెనుక  సోనియాగాంధీ, రిలయన్స్ హస్తం ఉందని, దానిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఆయన భార్య విజయమ్మ అప్పట్లో డిమాండ్ చేశారు. తన తండ్రి వెనుక రిలయన్స్ హస్తం ఉందని జగన్ కూడా ఆరోపించి, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. గ్యాస్ నిక్షేపాల్లో ఆంధ్రరాష్ట్ర వాటా అడిగినందుకే వైఎస్‌ను కాంగ్రెస్-అంబానీలు కుట్ర చేసి హత్య చేశారని భూమన కరుణాకర్‌రెడ్డి ఆనాడు బహిరంగ వేదికపైనే ఆరోపించారు. జగన్ మీడియా కూడా రిలయన్స్‌పై,  పుంఖానుపుంఖాల కథనాలు రాసింది. వైఎస్ మృతి వెనుక రిలయన్స్ హస్తం ఉందంటూ ఒక వెబ్‌సైట్‌లో వార్త వెలువడిన నేపథ్యంలో, వైఎస్ అభిమానులు ఆగ్రహించి,  పెద్ద సంఖ్యలో రియలన్స్ షాపులను తగులబెట్టారు. వాటిపై అప్పటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమే కేసులు పెట్టింది. ఫలితంగా వైసీపీలో ఉన్న ఆ కార్యకర్తలు  ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇదంతా పదేళ్ల క్రితం మాట. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రిలయన్స్ కంపెనీ ప్రముఖుడైన నత్వానీని, అదే కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ వెంటబెట్టుకుని, ముఖ్యమంత్రి జగన్‌ను కలవడం పెను సంచలనమే సృష్టించింది. ప్రధానంగా, వైఎస్ మృతి కారణంగా వారిద్దరి మధ్య.. పాత పగలు ఇంకా రగులుతున్నాయని అనుకుంటున్న వైఎస్ అభిమానులను, వారిద్దరి కలయిక, నత్వానీకి వైసీపీ నుంచి ఎంపీ సీటు ఇవ్వడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనను బీజేపీ నాయకత్వమే రాజ్యసభ సీటు కోసం, జగన్ వద్దకు పంపిందన్న ప్రచారం కూడా జరిగింది. నత్వానీకి బీజేపీ అభ్యర్ధిగా వైసీపీ సీటు ఇస్తే, తర్వాత కేసులకు సంబంధించి, జగన్ తమపై ఒత్తిళ్లు చేస్తారన్న ముందుచూపుతో.. బీజేపీ నాయకత్వమే తెలివిగా అంబానీని ముందుపెట్టి, కాగల కార్యం తీర్చిందన్న విశ్లేషణలు కూడా వినిపించాయి.

తాజాగా.. వైఎస్ మృతి చెందిన మరుసటి రోజు, ఆయన అభిమానుల చేతిలో తగులబడిన రిలయన్స్ షాపుల కేసులను తొలగిస్తూ, జగన్ సర్కారు ఇచ్చిన ఉత్తర్వు చర్చనీయాంశమయింది. వారం క్రితమే రిలయన్స్ నత్వానీకి, పార్టీ టికెట్ ఇచ్చి రాజ్యసభకు పంపిన జగన్, అదే రిలయన్స్ షాపులపై జరిగిన దాడు కేసులను, ఎత్తివేస్తూ ఉత్తర్వులివ్వడమే ఆ చర్చకు  కారణం. తుని కేసులో కూడా ఇలాంటి ఉత్తర్వులిచ్చినా, అది వ్యక్తులకు-ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. ఆ కేసులో కాపులు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు, పోలీసులు కేసులు పెట్టారు. దానిపై సీఐడి విచారణ కూడా జరిపారు.

అయితే..రిలయన్స్ షాపుపై దాడి పక్కా ప్రైవేటు వ్యవహారం. అక్కడ దుండగులు, ప్రైవేటు ఆస్తులకు నష్టం చేశారు. ఈ ఘటనలో నష్టపోయింది రిలయన్స్ సంస్థ. అప్పుడు ఆ సంస్ధపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి, పోలీసు కేసులు కూడా పెట్టారు. మరిప్పుడు రిలయన్స్‌పై దాడి కేసులను ఎత్తివేస్తూ సర్కారు నిర్ణయం తీసుకోవడాన్ని రిలయన్స్ సంస్థ ఏవిధంగా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఒకవేళ నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చినందున, తమ షాపులపై దాడి చేసిన కేసులను తొలగించినా, రిలయన్స్ సంస్థ మౌనంగా ఉండిపోతుందా? అదే నిజమైతే, అసలు అంబానీ-జగన్- నత్వానీ భేటీలో, ఆ మేరకు లోపాయకారీ ఒప్పందం జరిగినట్లు భావించాల్సి ఉంటుంది. లేకపోతే..  ఏ లెక్క దానిదే అన్న గుజరాతీయుల వ్యాపార సూత్రం ప్రకారం, వ్యక్తుల దాడులతో ఆర్ధికంగా నష్టపోయిన సంస్థగా, ఆ ఉత్తర్వుపై కోర్టుకు వెళుతుందా? అన్నదే చూడాలి. ఉత్తర్వు వెలువడి ఇన్ని గంటలయినా, ఇప్పటివరకూ రిలయన్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నేడు,రేపు కూడా స్పందించకపోతే..  మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనన్న మార్క్స్ మాటనే నిజమయి తీరాలి. చూడాలి. ఏం జరుగుతుందో?

By RJ

One thought on “వైఎస్ మృతిలో రిలయన్స్ హస్తం లేనట్లేనా?”
  1. […] వైఎస్ హెలికాప్టర్ దుర్ఘటనకు అంబానీలే కారణమని, గతంలో ఆరోపించిన తామే.. ఇటీవల ముఖేష్ అంబానీని జగన్ ఇంటికి పిలిపించి మాట్లాడం వల్ల పార్టీ శ్రేణులకు ఏం సంకేతాలు ఇస్తారన్న ఊహ, అంచనా కూడా తమ నాయకత్వంలో లేకుండా పోయిందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబానీ సిఫార్సు చేసిన నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడంతో, తమ నేత జగన్‌పై సాధారణ ప్రజల్లో ఉన్న ఇమేజ్ చెరిగిపోవడంతోపాటు.. జగన్ కూడా మామూలు అవకాశవాద రాజకీయ నాయకుడిగానే మిగిలిపోయేందుకు, వారి కలయిక కారణమయిందంటున్నారు. ఆరోజు వారి కలయిక తర్వాత, సోషల్‌మీడియాలో వచ్చిన వైఎస్ మృతికి సంబంధించి వచ్చిన కథనాలు, వ్యంగ్యాస్త్రాలు తమను నైతికంగా కలచివేశాయంటున్నారు. ఇలాంటి మనోభావాలు గమనించకుండా, జగన్ తీసుకునే నిర్ణయాలు తమకు నష్టమేనని అంగీకరిస్తున్నారు.ఇది కూడా చదవండి: వైఎస్ మృతిలో రిలయన్స్ హస్తం లేనట్లేన… […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner