వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ హాస్టళ్లు మూసేయొద్దు

215

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలోని వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ హాస్టళ్లను మూసివేయాల్సిన అవసరంలేదని ‘కోఆర్డినేషన్‌ కమిటీ ఆన్‌ కోవిడ్‌-19’ వెల్లడించింది. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆధ్వర్యంలోని ఈ కమిటీలో సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, హైసియా, నాస్కామ్‌, జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఐఐసీ, ఐటీ, ఆరోగ్య విభాగాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. అధిక శాతం ఐటీ ఉద్యోగులు వర్కింగ్‌ హాస్టళ్లల్లో నివసిస్తున్నారు. రాత్రికి రాత్రే ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేయడంతో వీరంతా ఆందోళన చెం దారు. ఈ క్రమంలో కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తో కలిసి డీజీపీతో బుధవారం సమావేశమయ్యారు. అనంతరం, డీజీపీ మహేందర్‌రెడ్డి వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ హాస్టళ్లను మూసివేయకూడదని ఆదేశించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా యజమానులు తగిన శ్రద్ధ తీసుకొనేలా చర్యలు చేపట్టాలని పోలీస్‌ కమిషనర్లకు ఆదేశాలిచ్చారు. బలవంతంగా హాస్టళ్లనుంచి పంపిస్తే 100కు డయల్‌ చేయాలని లేదా వాట్సప్‌ చేయాలని సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదులా తెలిపారు