జగన్.. కేసీఆర్.. ఒక పారాసిటమల్

314

సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు
(మార్తి సుబ్రహ్మణ్యం)

విశ్వాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ప్రపంచ దేశాలు యుద్ధం ప్రకటించాయి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాయి. ప్రత్యామ్నాయ చర్యల్లో మునిగిపోయాయి. ఇటలీ వంటి దేశాలయితే ప్రజలను గృహనిర్బంధం చేశాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే.. నివారణ లేని కరోనా జనజీవితంలో చిచ్చు పెట్టింది.

భారత్ కూడా కరోనాపై అప్రమత్తమయింది. మోదీ సర్కారు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రైళ్లు, విమానాల్లో రద్దీ తగ్గించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో చర్యలు తీసుకుంది. మహారాష్ట్ర, బెంగాల్, ఏపీ వంటి రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయగా, తెలంగాణ సహా మూడు రాష్ట్రాలు అసెంబ్లీ సమావేశాలను కుదించుకున్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యశాఖను అప్రమత్తం చేశాయి. హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన, బహిరంగసభను కూడా రద్దు చేశారు. రాజకీయ పార్టీలు కూడా సభలు, సమావేశాలను రద్దు చేసుకుంటున్నాయి. పెళ్లిళ్లు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్న వైచిత్రి. ఇన్ని చర్యల ఫలితంగా మన దేశంలో కరోనా మహమ్మారి అంతగా విస్తరించలేదు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ వంటి అగ్రనేతలు కరోనాపై సకల చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి-తెలంగాణ సీఎం కేసీఆర్.. కరోనాపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనం సృష్టించడంతోపాటు, అవి సోషల్‌మీడియాలో జోకులుగా పేలుతున్నాయి. చివరకు ఏపీ సీఎం చేసిన వ్యాఖ్యలపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కూడా వెలువడుతున్న వ్యంగ్యాస్త్రాలు నెటిజన్లను నవ్విస్తున్నాయి. పాకిస్తాన్ జాతీయ మీడియాలో కూడా జగన ప్రకటన ప్రముఖంగా వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనాపై అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ.. దీనిపై పెద్దగా కలవరపడాల్సిన పనిలేదని, ఒక పారసిటమల్ గోలీ వేసుకుంటే సరిపోతుందన్నారు. దీనిపై సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు మొదలయ్యాయి. ‘ డాక్టర్ కేసీఆర్ వంటి సైంటిస్ట్ చెప్పిన తర్వాత పారసిటమల్ వేసుకోవలసిందే’నంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

అయితే..  పెరుగుతున్న తీవ్రతను గుర్తించిన, అదే కేసీఆర్ తీసుకున్న చర్యలు కూడా ప్రజలను మెప్పించాయి. సినిమా థియేటర్లు, బార్లు, పబ్బులు, క్లబ్బులు,  ఫంక్షన్‌హాళ్లు, స్కూళ్లను మూసివేస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం.. మిగిలిన రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచింది. ఇది ఆయన విమర్శకులను సైతం మెప్పించింది. అయితే, ఏపీలో జగన్ సర్కారు మాత్రం ఇప్పటివరకూ ఇలాంటి చర్యల్లో ఏ ఒక్కటీ తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.


కానీ, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసిన ఇదే తరహా వ్యాఖ్య, ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కూడా స్థానం సంపాదించింది. ‘కరోనా అంటే పానిక్ బటన్ నొక్కాల్సిన పనిలేదు. పారసిటమల్ టాబ్లెట్ వేసుకుని, బ్లీచింగ్ చల్లితే సరిపోతుంద’ని చేసిన వ్యాఖ్య.. ఇప్పుడు సోషల్‌మీడియాలో నెటిజన్లు సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలు, షేర్ చేస్తున్న కామెడీ వీడియోలతో కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ‘డాక్టర్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కరోనాకు మందు అని చెప్పి, చైనీయుల కళ్లు తెరిపించారు. కరోనాకు మందు తెలియక ఇన్నాళ్లూ మనం పానిక్ అయ్యాము. ఇప్పుడు  డాక్టర్ జగన్మోహన్‌రెడ్డి  చెప్పిన టాబ్లెట్ కోసం చైనా ఎదురుచూస్తుంది’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘జగన్‌కు చైనా ఆహ్వానం. ఇంతపెద్దమేధావి చైనాలో లేకపోవడం మా దురదృష్టమని చైనా ప్రకటన’ అంటూ మరో సెటైర్ పేల్చారు. ‘చైనాలో అందరికీ చెప్పండి. అన్న వస్తున్నాడని చెప్పండి. పారసిట్‌మల్, బ్లీచింగ్ పౌడర్ తెస్తున్నాడని చెప్పండి. కరోనానను పూర్తిగా తరిమేస్తాడని చెప్పండి’ అంటూ జగన్ ఇమేజ్‌ను షేర్ చేస్తున్నారు. ‘పారసిటమల్ సీఎం-బ్లీచింగ్ జగన్’ అని కూడా కామెంట్లు పెడుతున్నారు. హాస్యనటుడు బ్రహ్మానందం డైలాగును, జగన్-కేసీఆర్ చేసిన పారసిటమల్ వీడియోకు మిక్స్ చేసిన తీరు కూడా సోషల్‌మీడియాలో నవ్వులు కురిపిస్తున్నాయి. జగన్ చేసిన పారాసిటమల్ కామెంట్‌తో గూగుల్ సెర్చిఇంజన్‌లో దానికి ఇప్పుడు చాలా పేరు వచ్చింది.

రోజా గాలి తీసిన కరోనా వీడియో

వైసీపీ ఎమ్మెల్యే రోజా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రెండుసార్లు, రెండు రకాలుగా మాట్లాడిన వీడియో ఒకటి, సోషల్‌మీడియాలో ఆమె గాలి తీసేలా మారింది. తొలుత ఎన్నికల వాయిదాపై, ఎన్నికల సంఘం కమిషనర్ చేసిన ప్రకటనకు అనుకూలంగా మాట్లాడిన ఆమె, టీడీపీపై విరుచుకుడ్డారు.  వాయిదాపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత, నాలిక్కరుచుకుని అందుకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తొలుత ఎన్నికల వాయిదాకు మద్దతుగా మాట్లాడిన రోజా.. ‘పక్కరాష్ట్రాల్లోనే కాదు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌వల్ల చాలామంది చనిపోతున్నారు. దానితో భయపడి పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. షాపింగ్ కాంప్లెకులు, స్కూళ్లు మూసివేశారు. ఎన్నికలప్పుడు ప్రజలంతా ఒకచోట గుమిగూడితే ఈ వైరస్ వస్తుందన్న ముందుచూపుతో, ఎన్నికలు వాయిదా వేసిన విషయాన్ని టీడీపీ నాయకులు తెలుసుకోవాలి’ అని ఆవేశపడ్డారు.

తర్వాత ఎన్నికల వాయిదాపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి, నిమ్మగడ్డ రమేష్‌పై విరుచుకుపడిన తర్వాత,  రోజా మళ్లీ నాలిక మడతేశారు. అంతకుముందు మాట్లాడిన దానికి భిన్నంగా విమర్శలు చేయడం ఆశ్చర్యపరిచింది. ‘ఎన్నికల్లో ఓటమి భయంతో ఎన్నికలు వాయిదా వేయడానికి, చంద్రబాబు తన మనిషైన నిమ్మగడ్డ రమేష్‌తో కలసి ఎన్ని నాటకాలు ఆడారో మనం చూశాం. కరోనా వైరస్ పేరుతో ఎన్నికలు వాయిదా వేయడం మంచిది కాదు’ అని రోజా మాట్లాడిన రెండు వీడియోలు, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రాజకీయ నాయకులు తమ పొలిటికల్ మైలేజీ, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చేసే ఇలాంటి వ్యాఖ్యలు.. వీడియోల రూపంలో  వచ్చి, తమను నవ్వులపాలు చేస్తున్నాయని గ్రహించకపోవడమే  ఆశ్చర్యం.